Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagaloka yagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు ... ఆమె.. ఒక రహస్యం

గతసంచికలో ఏం జరిగిందంటే .... http://www.gotelugu.com/issue194/561/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

 

(గతసంచిక తరువాయి).. “సర్, ఎవరైనా ఆత్మహత్య చేసుకుని మరణిస్తే పోలీసులకి సమాచారం అందించాలి.  పోలీసులు వచ్చి  మరణం గురించి ఎంక్వయిరీ  చేసి పోస్టుమార్టమ్ జరిపించి అది ఆత్మహత్యేనన్న నిర్ధారణ వచ్చాక ఆ మరణాన్ని ఆత్మహత్యగా ధృవీకరిస్తూ సర్టిఫికెట్ ఇస్తారు.  ఆ ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా అనుమానాలు తలెత్తితే పోలీసులు ఫరదర్‍గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇది ప్రొసీజర్”  సహనంగా చెప్పింది ఇంద్రనీల.

“మీరు వచ్చారు, ఎంక్వయిరీలు చేసారు. పోస్టుమార్టమ్ కూడా చేసారు. ఏమని తేలింది?”

ఆమెకి ఏమని సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు. “రాజేంద్రగారిది ఆత్మహత్యేనని మాకు దొరికిన ఆధారాలు చెబుతున్నాయి. కానీ ఇంకా దీని వెనుక ఏదైనా మిస్టరీ ఉందేమోనన్న అనుమానంతో... మరింత ముందుకు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం”  అంది నీరసంగా.

అసలు రాజేంద్ర మరణించిన పరిస్థితి చూస్తే, ఎవరికైనా అతడిది హత్యా ఆత్మహత్యా అన్న అనుమానం వస్తుంది. మరి ఆ ముసలాయన అలా ఎందుకంటున్నాడు?!  తమంతట తామే ఇన్వెస్టిగేట్ చేస్తామంటే ఎందుకు వద్దంటున్నాడు?  అతగాడి చాదస్తం ఏమిటో  ఆమెకి అర్ధం కావడం లేదు.

నరేంద్ర వర్మ వదల్లేదు. “అమ్మా, అసలు మా రాజమహల్లోకి ఇంత వరకూ పోలీసులు అడుగు పెట్టలేదు.  దురదృష్ట వశాత్తూ ఇప్పుడు రావల్సి వచ్చింది. వచ్చారు, శవ పంచనామా జరిపించారు.  ఇది చాలు.  ఈ విషయంలో ఎవరెన్ని కూపీలు లాగినా,  చనిపోయిన నా వారసుడ్ని వెనక్కి తీసుకు రాలేరు.  జరిగిన నష్టం ఎలాగూ జరిగింది.  ఇంక  మనం ఎన్ని చేసినా చనిపోయిన తన మనవడు తిరిగి రాడు కదా?  ఇంకా పరువు పోగొట్టుకోవడం ఎందుకని నా ఉద్దేశం”

“ఈ వయసులో మీకిది రాకూడని కష్టం అని నాకు తెలుసు.  మీ బాధని నేను అర్ధం చేసుకోగలను. కానీ పోలీసులుగా మా కర్తవ్యాన్ని మేము కూడా నిర్వహించాలి కదా?  కేసు పోలీస్ స్టేషన్ లో క్లోజయ్యే వరకూ ఆత్మహత్య చేసుకుని మరణించిన వారి కుటుంబ సభ్యులకి  ఇలాంటి ఇబ్బందులు తప్పవు.   మా పరిశోధన వల్ల మీకు మేలు కలుగుతుందే కానీ హాని జరగదు.  మా వల్ల మీకు పెద్దగా ఇబ్బంది లేకుండా చూసే పూచీ నాది.  మా డి.ఎస్పీ గారి తో మాట్లాడి బంగాళాని సీజ్ చేయించకుండా చూస్తాను. మా వాళ్ళు ఎప్పుడు వచ్చినా మీ అనుమతి తోనే ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తారు.  అనుమానించదగ్గది మరేదీ లేదని తేలితే సాధ్యమైనంత తొందరగా కేసు మూసేట్టు చూస్తాము. సరేనా? ” అందామె.

నరేంద్ర వర్మ ఏదో ఆలోచిస్తున్నట్టుగా రెండు క్షణాలు ఆమె వంకే చూస్తూ ఆగిపోయాడు.  ఆ రెండు క్షణాలూ రెండు యుగాలుగా గడిచాయి ఇంద్రనీలకి. అతడు మళ్ళీ ఇంకేం అభ్యంతరం లేవనెత్తుతాడోనని బిక్కు బిక్కుమంటూ అతడి వైపు చూస్తుంటే ఆయన చిన్నగా తలపంకిస్తూ,  “ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్క విషయం. ఇది రాజమహల్ పరువుకి సంబంధించిన విషయం కనుక మాకు తెలియకుండా మీరు ఎటువంటి ప్రెస్ స్టేట్‍మెంట్లూ, పబ్లిక్  అనౌన్సుమెంట్లూ ఈ కేసు విషయంలో ఇవ్వడానికి వీలు లేదు.” అనడంతో ‘బతుకు జీవుడా’ అనుకుంది మనసులో.

“తప్పకుండా సర్.  మీకే ఇబ్బందీ కలుగ చేయకుండా ఇన్వెస్టిగేషన్ హోమ్లీగా జరిగేలా చూడమని ఇప్పుడే మా వాళ్ళకి చెప్పి వస్తాను” అని గబగబా చెప్పేసి మరో మాటకి ఆస్కారం ఇవ్వకుండా పరుగులాంటి నడకతో అక్కడి నుంచి బయట పడింది.

ఏదో పని మీద  వెడుతున్నట్టుగా పక్క గది లోకి వెళ్ళింది. ఆ పెద్దాయన్ని తప్పించుకోవడానికి అక్కడి నుంచి బయటికి వచ్చేసింది కానీ, ఆమెకి బయట చేయాల్సిన పనింకేం కనిపించలేదు.  తను వెదుకుతున్న సమాచారం అక్కడ అంత సులువుగా దొరికేటట్టు కనిపించడం లేదు.

ఆ గదిలోకి వెళ్ళి   ఏం  చెయ్యాలా అని ఆలోచిస్తున్న ఆమె  మెదడు లోకి ఒక చిలిపి ఆలోచన వచ్చింది.  ఆ ఆలోచన వచ్చిందే తడవుగా ఇంక ఆమె ఆగలేక పోయింది.  తనని ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకున్నాక  వెనక్కి వెళ్ళి  గది తలుపు గడియ వేసి,  జేబు లోంచి తన సెల్ ఫోన్ని బయటకి తీసింది.

గదిలో  చక్కటి  వెలుతురు పడుతున్న చోటికి వెళ్ళి  సెల్ ఫోన్ని చేతితో  దూరంగా పెట్టుకుని,  తన పోలీస్ డ్రెస్ నిండుగా పడేలా ఒక సెల్ఫీ తీసుకుంది.   ఆ తరువాత ఆమె పరిసరాలని మర్చిపోయింది.  అసలు ఫోటోలు తీసుకోవడానికే  తను ఆ రాజమహల్ కి వచ్చానన్నట్టుగా గబ గబా  నాలుగు  సెల్ఫీలని తీసుకుంది.  

‘పోలీస్  డ్రెస్‍లో నువ్వు మరీ అందంగా ఉన్నావు’ అని తనని తనే మెచ్చుకుని,  ఒక్క సారి ఊపిరి గట్టిగా పీల్చి వదిలి, పొట్టని లోపలకి  పెట్టి మూతిని సున్నాలా చుట్టి,  నడుము ఒంచి సైడ్ యాంగిల్లో  మరో సెల్ఫీ తీసుకుంటుండగా,  గది తలుపు తెరుచుకుని ఎవరో లోపలకి రావడం కనిపించింది.

హఠాత్తుగా జరిగిన ఆ పరిణామానికి ఏదో లోకంలో ఉన్న ఆమె ఈ లోకం లోకి  వచ్చినట్టుగా బిత్తర పోయినట్టు చూస్తూ ఉండిపోయింది.

****

“అదిగో ఆ  కనిపించేదే పెద్ద రాజా వారి గది. మీరు వెళ్ళి రాజా వారిని కలవండి”   పాణి వెంట వస్తున్న నౌకరుకి దారిలో ఎవరో కనిపించి  మరో పని చెప్పడంతో దూరం నుంచే పెద్దరాజా వారి గదిని చూపించి  వెనక్కి వెళ్ళిపోయాడు.

పాణి  నేరుగా నడుచుకుంటూ అతడు చూపించిన గది వైపు వెళ్ళి, దగ్గరగా వేసి ఉన్న తలుపులని తోసుకుని లోపలకి వెళ్ళాడు. లోపలకి వెళ్ళిన రెండు క్షణాలకి గానీ అతడికి తను సరైన గదిలోకి వెళ్ళలేదని అర్ధం  కాలేదు.  అతడు వెళ్ళినది పెద్దరాజా వారి గది లోకి కాదు.  ఆ గదికి పక్కనే ఉన్న  ఇంద్రనీల వెళ్ళిన గది లోకి !  

ఖంగారులో తను  తలుపు గడియ సరిగ్గా వెయ్యలేదని ఆమెకి  పాణి తలుపు తెరుచుకుని లోపలకి వచ్చాక కానీ అర్ధం కాలేదు ఇంద్రనీలకి. తన ఎదురుగా నిలుచుని నడుము వంచి ఫోజు పెట్టి సెల్ఫీ తీసుకుంటున్న ఆమెని  చూసిన పాణికి నోట మాట రాలేదు.   ఆమె అందం అతడ్ని ఒక్క క్షణం  కళ్ళు తిప్పుకోనివ్వలేదు. మరుక్షణం లోనే తేరుకుని  కళ్ళు దించుకున్నాడు.  

(ఆ ఆకర్షణ  పాణిని ఎటువంటి ఇబ్బందులలోకి నెట్టింది? వచ్చేవారం...)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్