Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atadu-aame-oka rahasyam

ఈ సంచికలో >> సీరియల్స్

మీరజాలగలడా నీ యానతి

meerajalagalada nee anati

గతసంచికలో ప్రారంభమయిన మీరజాలగలడా నీయానతి చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి: http://www.gotelugu.com/issue195/563/telugu-serials/meerajaalagaladaa-neeyaanati/meerajaalagaladaa-neeyaanati/


(గతసంచిక తరువాయి)అప్పగింతల వేళ చిన్న పిల్లలతో సహా అందరికీ అప్పగించి ఇంటిల్లి పాదీ కంట తడి పెట్టడం ఎంతో కదిలించింది భవేష్ ని. రేపు తన చెల్లెళ్ళని యిలాగే ఎవరికో అప్పగించాలా? ఇంక  ఎంత ..శావీ  డిగ్రీ రెండో సంవత్సరం అయిపోవచ్చింది. దాని చదువు పూర్తవ గానే మంచి సంబంధం చూసి పెళ్లి చేసెయ్యాలి. పెద్దచెల్లెలు శాంభవి మీద వున్న అతని చూపుల భావం ఆ తల్లికి అర్ధం అయి, ఆమె మనసు ఆర్ద్రమయ్యింది. తన బిడ్డ బంగారం, తల్లి, చెల్లెళ్ళని వదిలి తన స్వార్ధం తను చూసుకునే టంత స్వార్ధ పరుడు కానే కాడు. గుండెల్లో ఏ మూలో వున్నఅనుమానం పటా పంచలయ్యింది.

"రావాలి... త్వరగా కానివ్వాలి,  మళ్లీ  వర్జ్యం, దుర్ముహూర్తం వచ్చేస్తాయి. అబ్బాయికి సెలవు లేదని. యిటు నించి ఇటే కాపురానికి తీసుకెళ్ళి పోతాం అంటే అలాగేనంటూ ఒప్పేసుకున్నారుగా, మరి త్వరగా బయలు దేరాలి..." కాస్తంత బాధ, కొంచెం నిష్టూరం...కల గలిసాయి భవ్య తల్లి శాంత గొంతులో.

పిల్లతో బాటు పిల్ల పిన్నీ, మేనత్త వస్తారని ముందు గానే చెప్పడంతో పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో బాటు అతని చెల్లెళ్ళు ఒక కారు లోనూ, మిగతా వాళ్ళు మరొక దానిలో బయలు దేరి స్టేషన్ వరకు, ఆ పై ఏ.సీ టూ టైర్ బుక్ చేసాడు భవేష్., అన్ని ఏర్పాట్లు ఎంతో ముందు చూపుతో, చక్కని ప్లానింగ్ తో చేసిన భవేష్ తీరు పెద్దాయన రామచంద్రం గారికి, భవేష్ అత్తా మామలకి ఎంతో ముచ్చట గొలిపింది... అతని మాట తీరు, చక్కగా నవ్వుతూ కలుపు గోలుగా వుండే అతని ప్రవర్తన, తల్లి, చెల్లెళ్ళపై అతను చూపే ఆత్మీయత అన్నీ ఎంతో బాగా అనిపించాయి వారికి... కానీ భవ్యకే..అతను అలా వుండటం కొంచెం అసంతృప్తిని కలిగించింది. 

"చూద్దాం....అన్నింటికీ అతీతంగా అతనిని తన వాడిగా, పూర్తిగా తన వాడిగా చేసుకోవడం ఎంతలో పని.." ఈ ఆలోచన మదిలో మెదలగానే అలవోకగా అందమైన చిరు నవ్వు భవ్య పెదాలపై మెరిసింది.

"ఏంటి? అమ్మాయి గారు తనలో తనే నవ్వేసుకుంటున్నారు.. చెబితే కాస్త మేం కూడా నవ్వుతాం కదా...”  గోరింటాకుతో పండి పగడాల్లా మెరిసి పోతున్న గోళ్ళతో, అందంగా, కోమలంగా ఉన్న ఆమె చేతిని మెత్తగా తన చేతి లోకి తీసుకున్నాడు ప్రేమగా.
"ఊహూ ... ఏం లేదు, అవునూ,  మన ఇంట్లో  పూల మొక్కలున్నాయన్నారు కదా, పూల మొక్కలంటే నాకు చాలా ఇష్టం. ఇంతకీ...  ఏం పూల మొక్కలున్నాయ్?" తెలివిగా మాట మార్చింది.

" అన్ని రకాలూ వున్నాయ్...వాటి సంరక్షణ అంతా మా శావీదే. ఎంత బాగా చూసుకుంటుందని “  అంటూ  వెనక్కి తిరిగి ప్రేమగా చెల్లెళ్ళను చూసుకుంటున్న భవేష్ ని గుర్రుగా చూసింది,  తను అనుకున్నంత సులువుగా తన దారికి వస్తాడా అన్న అనుమానం  మొదటి సారిగా మనసులో మెదలగా.

రైలు ఎక్కగానే'  నేను అన్నయ్య దగ్గర  కూర్చుంటా'  అంటూ  కిటికీ పక్క చేరిన చాముండేశ్వరిని  కొర కొరా చూసింది భవ్య.
"చిన్నతల్లీ ఇటు నా వైపు రా ఇక్కడ కిటికీ పక్క చాలా బాగుంది" కోడలి మనసు తెలిసినట్లు పిలిచింది తల్లి. 
"ఉహూ.. నే రాను నేనిక్కడే అన్నయ్య దగ్గరే కూర్చుంటా "
"అక్కడ వదిన కూర్చుంటుంది నువ్వు రా...."
"వదిన నే అక్కడ కూర్చోమను...వదినా నువ్వు అక్కడ కూర్చో...చాలా బాగుందిట...." ఠకీమని చెప్పింది అన్న గారి చెయ్యి గట్టిగా పట్టుకుని.
"అరె ... ఇటు రమ్మంటుంటే" కొంచెం గట్టిగా పిలిచింది శాంభవి... పరిస్థితి కొంచెం అర్ధం అయి...   
"ఉహూ"
"ఫర్వా లేదు... కూర్చోనీ, భవ్య ఇటు కూర్చుంటుంది.” నిల్చుని ఎర్రగా చూస్తున్న భవ్య చెయ్యి పట్టి తనకి ఇటు వైపు లాగాడు కూర్చో అన్నట్లు.  చేసేదేం లేక ముఖం గంటు పెట్టుకు కూర్చున్న భవ్యని చూస్తే జాలేసింది జానకమ్మకి... కొత్తగా పెళ్ళయిన కోడలి ఆశ మరీ పేరాశ కాదు కదా...   తనూ తన భర్తా అనుకోవడం సహజం ...   కానీ చిన్నతనం ... అన్నయ్య దగ్గర మితి మీరిన చేరిక ...ఈ చాముండికి ఎలా చెబితే అర్ధం అవుతుంది.., ఇక రోజూ ఇలాటివి ఎన్ని ఎదురవుతాయో....ఆలోచనలో పడింది. 

"అన్నయ్యా...   రైలు ముందుకెడుతుంటే ఆ చెట్లు చూడు ఎలా వెనక్కి పరిగెడుతున్నాయో....ఎందుకలా..." మొదలు పెట్టింది.
 సహజంగా వాగుడు ఎక్కువ...  దానికి తోడు కొత్తగా వచ్చిన వదిన కంటే అన్నయ్య తనకే ఎక్కువ అవ్వాలి అనుకుని తెరిపి లేకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తూ హడావుడి చేస్తున్న చాముండిని,  ఆ ప్రశ్నలన్నింటికి ఓపికగా జవాబులిస్తున్న భర్తని చూసి మండి పోయింది భవ్య మనసు.   

అడిగి అడిగి అలిసి పోయి పడుకున్న చెల్లెలిని రెండు చేతులతో ఎత్తుకుని పై బెర్తు పై పడుకో పెట్టి కింద బాగ్ లోనుంచి దుప్పటి తీసి కప్పిన భర్తని కోపంగా చూసింది ... అది  కూడా తనే చెయ్యాలా? అన్నట్లు.... 

అదేమీ గమనించనట్లు  “రా, ఇటు కూర్చుంటావా?" కిటికీ పక్క చూపిస్తూ అడిగాడు.
"అక్కర లేదు"  కొట్టినట్లే వచ్చింది జవాబు.   
"సరే ..." తను సర్దుకు కూర్చున్నాడు. 
అంతా పెళ్ళిలో బాగా అలసి పోయారేమో...   కూర్చునే కునికి పాట్లు పడుతున్నారు
నెమ్మదిగా భార్య చేతిని తన చేతి లోకి తీసుకుని ప్రేమగా అడిగాడు
"అలసటగా ఉందా? కాసేపు పడుకుంటావా?"
మాట్లాడకుండా తన కేసి గుర్రుగా చూసిన భార్య కళ్ళలో అసూయ స్పష్టంగా కనబడింది. ఏదో చెప్ప బోయి ఎదురుగా చెల్లెళ్ళు, తల్లిని చూసి ఆగి పోయాడు. 
నెమ్మదిగా చెవి పక్కగా సుతారంగా మాట్లాడుతూ జోక్స్ చెప్పి నవ్వించి ప్రసన్నం చేసుకున్నాడు. 
మర్నాడు ఉదయాన్నే బెంగుళూరు చేరిన వెంటనే రెండు కార్లతో భవేష్ స్నేహితులు వీళ్ళకి చక్కటి స్వాగతం చెప్పి చక్కగా ఇంటికి తీసుకు రావడమే కాక అక్కడ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకోవడం  మర్నాడు సత్యనారాయణ స్వామి వ్రతం, భోజనాలు అన్నీ చక్కగా చక చకా పద్దతిగా  చేస్తున్న ఆ స్నేహితులనీ, అతనినీ ముచ్చటగా చూసారంతా.

" భలే స్నేహితులయ్యా మీరు..  చాలా బాగా చేస్తున్నారు పెళ్లి పనులు " అంటూ మెచ్చుకుంటున్న రామచంద్రయ్య గారితో
"అసలు మా కిలాటివన్ని నేర్పిన వాడు మా భవేష్.   మా ఇళ్ళలో ఎవరి ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మేం అందరం ఇలాగే చేసుకుంటాం" ఆనందంగా చెప్పేరు వాళ్ళు.

అందరి కబుర్లతో, నవ్వులతో హోరెత్తి పోతోంది ఆ ఇల్లు, అచ్చంగా పెళ్ళి వారిల్లంటే ఇదీ అన్నట్లే.

భవ్య ముఖంలో మారుతున్న రంగులూ, మనసులో రేగుతున్న అసంతృప్తి స్పష్టంగా తెలిసి పోతున్నాయ్ అందరికీ. నవ్వుతూ నవ్వుతూ ఉన్నదల్లా, అతని చెల్లెళ్ళెవరైనా దగ్గర కొస్తే చాలు ముఖం మాడ్చుకుంటోంది. పెద్ద పిల్లలు కాబట్టి శాంభవీ, భైరవీ వదినకి తామంటే ఇష్టం వుండటం లేదని గ్రహించి దూరంగా ఉంటున్నా, చిన్న పిల్ల చాముండి మాత్రం అన్నయ్యా, వదినా అంటూ కూడా కూడా తిరుగుతూనే వుంది.
వ్రతం అయిన మర్నాడే భవ్య తాత గారు, అత్తయ్య, పిన్ని అంతా బయలు దేరారు. 

తాత గారు బయలు దేరే ముందు భవ్యని పిలచి చెప్పేరు..
"నీభర్త, అత్తగారు...   ఆడ పడుచులు చాలా మంచి వాళ్ళు... వాళ్ళని ప్రేమించు, గౌరవించు అప్పుడే వాళ్లకు నీ మీద గౌరవం, ప్రేమ కలుగుతాయి మన ఇంట్లో మనమంతా ఎలా కలిసి మెలిసి ఉంటామో అలాగే ఇక్కడ వీళ్ళతో కూడా కలిసి మెలిసి వుండు.... భర్త  ఒక్కడే నావాడు అనుకోవడం తప్పు తల్లీ. నా పెంపకంలో పెరిగిన నీకు ఇలా చెప్పాల్సి వస్తుందనుకో లేదు కానీ నీ ముఖం నీ మనసుకి అద్దం పడుతోంది, అందుకే చెప్పాల్సి వస్తోంది. మీ చిన్నాన్న పెద నాన్న పిల్లలందరితో కలిసి మెలిసి పెరిగిన నీకు వీళ్ళతో  సఖ్యంగా వుండటం కష్టం కాదు ఇబ్బంది అంత కంటే కాదు...  కాక పొతే నీ భర్త నీకు మాత్రమే స్వంతం అనుకోవడం, అతని ప్రేమాభిమానాలు నీకు మాత్రమే దక్కాలను కోవడమే సమస్య అది తప్పు. నీకంటే ముందు నుంచీ వాళ్ళు అతని జీవితంలో వున్నారు, ఇక ముందూ వుంటారు.  అతను విజ్ఞత కలవాడు ఎవరికిచ్చే విలువ, అభిమానం వాళ్లకి ఇస్తాడు నువ్వు కూడా కాస్త విజ్ఞత కలిగి వుంటే నీ కాపురం నందన వనం అవుతుంది. అతని మనసెరిగి మసులు కుంటే నీకూ మాకూ గౌరవం. నే చెప్పాలనుకున్నది అర్ధం అయ్యిందనే అనుకుంటా. నీకు మేమెంతో అతనికి వాళ్ళూ అంతే.. జాగ్రత." భవ్యని దగ్గరకు తీసుకు ఆమె నుదిటి మీద ముద్దు పెట్టుకున్నారు.

”జాగ్రత్త నీ కాపురం నందన వనం చేసుకున్నా నరకం చేసుకున్నా నీ చేతుల్లోనే వుంది..అర్ధం చేసుకునే తెలివీ నేర్పూ ఉన్న పిల్లవనే నా నమ్మకం.  అమ్మా నాన్నా పదహారు రోజుల పండుగ నాటికి వస్తారు...బెంగ పెట్టుకోకు మీ అత్త గారు చాలా మంచిది, నీతో ప్రేమగానే వుంటారు. నీ ఆడ పడుచులూ మన కావ్య, దివ్యల లాంటి వాళ్ళే, నువ్వు ప్రేమగా, అభిమానంగా వుంటే వాళ్ళూ వుంటారు, సరేనా ఇంక మేం వెళ్ళి వస్తాం.”

తాత గారి మాటలకు బుద్ధిగా తల వూపింది.
ఎంత నిగ్రహించుకున్నా వాళ్ళు వెడుతూంటే కళ్ళ నీళ్ళు తిరిగాయి భవ్యకి.
కళ్ళ నీళ్ళతో బేలగా నిల్చున్న భవ్యని చూసి వాళ్ళకీ కళ్ళ నీళ్ళు తిరిగాయి. భవ్య పిన్ని శ్రీలక్ష్మి “వదిన గారు మా భవ్య ఇంక మీ పిల్లే, ఎలా చూసుకుంటారో, గారంగా పెరగడంతో కొంచెం మంకు తనం, తొందర పాటు తనం ఉన్నా మనసు మంచిదే, తెలియక ఏదైనా తప్పు చేస్తే మీ పిల్లే అనుకుని కడుపులో దాచుకోండి" గద్గద స్వరంతో అంటూ జానకమ్మ చేతులు పట్టుకుంది.

" భలే వారే మా భవ్య బంగారం. అదీ నా పిల్లల లాంటిదే గుండెల్లో పెట్టుకు చూసుకుంటాం.. మీరేం దిగులు పడకండి వదినా.. మరీ అంత బెంగ పెట్టుకుంటే ఏమంత దూరం అనీ రాత్రి రైలెక్కితే పొద్దున్నకి దిగుతాం. అయినా మనం ఇంత కంటే చిన్నప్పుడే అమ్మా నాన్నలనీ, ఇంటినీ వదిలేసి వచ్చాం .. మరచి పోయారా? ముందు దాని కంటే మీరే ఎక్కువ బెంగ పెట్టుకున్నట్లున్నారు." అంటూ చనువుగా భుజం తట్టింది.

****
సెలవు లేదంటూ ఆ మర్నాడే ఆఫీస్ కు వెళ్ళి పోయాడు భవేష్.
భర్త ఇంట్లో ఉన్నంత సేపూ ఏం ఉంటోందో బయట, అతనూ అలా వెళ్ళగానే తమ గది లోకి వెళ్ళి తలుపు వేసుకునే కోడలిని ఎలా అర్ధం చేసుకోవాలో, ఏం అనాలో అర్ధం కాలేదు జానకమ్మకి.

చక్కగా వదిన గారు తమతో కలిసి పోయి స్నేహంగా వుంటుందనుకున్న శాంభవి, భైరవి చిన్నబోయారు  కానీ కొంచం పెద్ద పిల్లలు అవడంతో మౌనంగా వుండి పోయారు కానీ, చాముండి అభం శుభం తెలియని చిన్నపిల్ల, కల్లాకపటం తెలియని పసిది. “అమ్మా ఈ వదిన నాకేం నచ్చలా.. ఎప్పుడూ 'ఓ’ అని కూర్చుంటుంది ముఖం ముడుచుకుని" అన్నా, వదినా, అక్కలూ అంతా టిఫిన్ తింటుంటే అంది గట్టిగా.
నవ్వుతూ భవేష్ తో  కబుర్లు చెబుతున్నదల్లా చివాల్న తల తిప్పి చూసింది కోపంగా, అంతా కంగారు పడి పోయారు..
ఏం జరుగుతుందిరా దేముడా అనుకుంటూ.
"ఏయ్, చాము నువ్వెళ్ళు స్కూలు టైం అవుతోంది" గట్టిగా కోప్పడింది జానకమ్మ.
"అమ్మా... ఈ వేళ సెలవు...ఆదివారం" గట్టిగా నవ్వుతూ అంది.
"అమ్మా ... దాన్నెందుకు కోప్పడతావు.. చిన్నపిల్ల..వున్న మాటే అంది...అవునురా చిన్న తల్లి మీ వదిన క్రిందటి జన్మలో ముంగిస అందుకే అలా..." నవ్వుతూ అంటున్న మొగుడిని తినేసాలా చూస్తూ తింటున్న టిఫిన్ వదిలేసి గది లోకి వెళ్ళి పడుకుంది.

"అయ్యొ కోపం వచ్చిందిలా వుంది...తింటూ తింటూ అలా వెళ్ళి పోయింది...నువ్వు కూడా ఏమిటిరా..అదేదో చిన్న పిల్ల బుద్ది లేకుండా వాగితే..." కంగారుగా అంది.
"మరేం ఫర్వా లేదమ్మా.. తనకూ తెలియాలి అలా ఉండ కూడదని... ఇక్కడ తనకు ఏం కష్టం కలిగిందని అలా ఉండటం....మీ అందరితో చక్కగా కలసి మెలసి వుండచ్చు కదా, తన ఈడు పిల్ల శాంభవితో అయినా కలవచ్చు కదా" బలవంతంగా నవ్వుతు అన్నా అతని ముఖంలో వ్యధ ఆ తల్లిని కలవర పరచింది.

"ఉంటుంది లేరా ఏదో కొత్త కదా... నాలుగు రోజులు పోతే తనే అలవాటు పడుతుంది" నెమ్మదిగా, అనునయంగా అంది.
"వెళ్ళు...తింటూ తింటూ వెళ్ళి పోయింది.. తీసుకెళ్ళి ఇవ్వు...  ఎటూ ఈ వేళ సెలవే కనుక కాస్త ఎటైనా తిరిగి రండి కాసేపు, సరదాగా, నవ్వుతూ ఉండు.. మనసు కష్ట పెట్టుకోకు..." మరో మారు హెచ్చరించింది.

తను బాధ పడుతున్నట్లు తెలిస్తే తల్లి ఇంకా బాధ పడుతుందని ఏలాగో ముఖం లోకి నవ్వు తెచ్చుకుంటూ లేచాడు.
"అలాగే అమ్మా..ఆ ప్లేట్ ఇలా యియ్యి ఆ సత్య భామకు తినిపించి వస్తా" అంటూ.
మనసులో బాధని అణుచు కుని పైకి నవ్వుతూ గది లోకి వెడుతున్న కొడుకుని దిగులుగా చూసింది.
"ఏమిటో తను భయ పడినంతా అయ్యేలా వుంది... ఈ కాలం ఆడ పిల్లలకి ఒక్క మొగుడు మాత్రమే తనవాడు, అతని కుటుంబం వాళ్ళకి ఏమీ కాదు.. పెళ్ళి అయిన మరు క్షణం ఆ మొగుడి తాలూకా వాళ్ళూ అంతా అతనికి దూరం కావాలి,  అసలు వాళ్ళు అలా ఆలోచించడానికి  కారణం ఎవరు? ఆ పిల్ల తల్లి తండ్రులు కాదూ...  ఇది వరలో ఆడ పిల్లని ఇచ్చేటప్పుడు పది మంది వున్న చోటు చూసి మరీ ఇచ్చేవారుట,  ఆ పది మంది కంచాల దగ్గర ఏరుకున్న మెతుకులతో అయినా కడుపు నిండా తిని బతుకుతుందని....అలా అని మా అమ్మ చెప్పేది......  అలా అంటే అప్పట్లో సరిగ్గా అర్థం అయ్యేది కాదు...  ఛ ...  అసహ్యంగా అలా అంటుందేమిటీ?...   అంత ఖర్మ కాలి ఎంగిళ్ళు ఏరుకు తినేటట్లయితే ఆ పెళ్ళి చేసుకోవడం ఎందుకూ అనిపించేది...  కానీ దాని అర్థం ఎంగిళ్ళు తిని బతకడం కాదుట, ఇంట్లో పది మందిలో కనీసం కొందరయినా ఆప్యాయంగా ఆదరిస్తారని దాని అ అర్థం అట, కానీ మరి ఇప్పుడో, పది మంది కాదు కనీసం ఆ పిల్లాడి అమ్మా బాబూ పొడ కూడా గిట్టడం లేదు...   మరీ కొందరయితే పెళ్ళికి ముందే విడిగా వుండాలనే షరతులు. అసలు మనిషి పొడే మనిషికి గిట్టనంత స్వార్థం మనిషిలో ఎందుకొస్తోందో? అలా అని మళ్ళీ తన తల్లి తండ్రుల పొడ.

"అమ్మా ... అన్నయ్యా వదినా బయటకు వెడుతున్నారు...స్కూలుకి సెలవేగా నేనూ వెడతా “  పెళ్ళికి కొన్న కొత్త గౌను వేసుకు తయారయి పోయింది చాముండేశ్వరి.
"చిన్నతల్లీ... నువ్వు ఇంట్లో..."
తల్లి మాట ఇంకా పూర్తి అవకుండానే ఏడుపు మొదలెట్టింది...   "ఉహు....నేనూ వెడతా" అంటూ.
"మనం మళ్ళీ ఇంకోసారి...."
"ఉహూ......నే వెడతా...." కాళ్ళు నేలకేసి బాదుతూ గట్టిగా రాగం మొదలు పెట్టింది....
" చిన్న తల్లీ ... నేను ఇప్పుడు గోరింటాకు పెడతా... వస్తావా?" మెల్లిగా అడిగింది ... అక్కడే వంటింట్లో సామాను సర్దుతున్నశాంభవి చెల్లితో.
గోరింటాకు అనగానే ఒక్క సారిగా ఎగిరిన చాముండీ ... అంతలోకే బయటకు వెళ్ళడం మాట గుర్తు వచ్చి,
'అయ్యో ...ఇప్పుడెలా?బయటకెళ్ళాలే...పొనీ వచ్చాకా పెడతావా అక్కా?"   
"ఉహూ..మళ్ళీ నాకు పనుంది...ఇప్పుడయితేనే..." వూరించింది.
"మరీ... అక్కా నాకు డొనాల్డ్ బొమ్మ వేస్తావా?" కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అంది.
"ఊ...మరయితే వెళ్ళు, వెళ్ళీ ఆ గౌను మార్చుకుని...పాతది వేసుకునిరా....త్వరగా...." చిన్నగా నవ్వుతూ అంది శాంభవి.
నొప్పించ కుండా చిన్న చెల్లిని ఏ మార్చిన శాంభవిని చూసి సంతోషించాలో...ఇలా దిన దిన గండంగా గడపాల్సి వచ్చే రోజుల్ని తలుచు కుని బాధ పడాలో అర్ధం కాలేదు ఆ తల్లికి.

"అమ్మా ...  మేము అలా ఇస్కాన్ టెంపుల్ కు వెళ్ళి వస్తాం, కాస్త ఆలస్యం అయినా కంగారు పడకు...మా కోసం ఎదురు చూడక మీరు భోజనాలు చేసెయ్యండి..."
"అలాగే జాగ్రత్తగా వెళ్ళిరండి" చిన్న కూతురు చూస్తే కూడా వెడతానని ఎక్కడ వెంట పడుతుందో అని అటూ ఇటూ చూస్తూ కంగారుగా అంది.
ఏడ్చి ఎర్ర బడ్డ కళ్ళు, కొంచెం నవ్వుతున్న ముఖం...మొత్తానికి ఏం చెప్పి ప్రసన్నం చేసుకున్నాడో కానీ కాస్త నవ్వుతూ వున్న భవ్య వెళ్ళి వస్తాం అన్నట్లు అత్త గారి కేసి చూసింది.  ఆ మాత్రానికే  సంబర పడ్డ ఆ తల్లి అలాగే అన్నట్లు తల వూపింది.

"ఆన్నయ్యా బై...బై... వచ్చేటప్పుడూ నాకు కామిక్స్ తేవడం మరచి పోకే" పాత  గౌను తగిలించుకుని గుమ్మం దాకా వచ్చి అరచి మరీ చెప్పింది.

" అలాగేరా తల్లీ" నవ్వుతూ బైక్ స్టార్ట్ చేసాడు, తమ కేసి చూస్తూ చెయ్యి ఊపుతున్న చాముండికి బదులుగా తనూ చెయ్యి ఊపింది అసంకల్పితంగా భవ్య .. .సశేషం …..

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్