Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> అన్నయ్య మనసు

annayya manasu

"హర్షా... కాఫీ ఇచ్చింది తాగడానికే కానీ అలా చేతిలో కప్పు పట్టుకుని ఆలోచిస్తూ కూర్చోవడానికి కాదు!" సోఫాలో కూర్చున్న భర్తతో చెప్పింది హరిణి.

​"ఓ అయాం సారీ హరీ... తాగేస్తాను." అని నిశబ్దంగా కాఫీ సిప్ చేస్తూ ఉండిపోయాడు హర్ష.

"ఏమయింది హర్షా... రోజూలా హుషారుగా లేవు ఇవాళ. ఏం జరిగింది? ఆఫీసులో ఏదైనా ప్రోబ్లెమా?" 

"అబ్బే అదేమీ లేదు హరీ... అంతా బాగానే ఉంది." మామూలుగా ఉండటానికి విఫల త్నం చేసాడు హర్ష.

"నీకు నా దగ్గర నటించడం రాదులే హర్షా! అసలు విషయం ఏమిటో చెప్పు." భర్త కనుల్లోకి సూటిగా చూస్తూ అడిగింది హరిణి. ఒక్క సారిగా హర్ష ముఖమంతా దిగాలుగా మారిపోయింది. "మనం ఊళ్ళోనే ఉండి ఉంటే బావుండేది కదా!" ఉద్వేగంగా చెప్పాడు హర్ష.

"వచ్చి అప్పుడే మూడేళ్ళు దాటిపోయింది. సడన్ గా ఏమయింది హర్షా?!" భర్త బాధపడుతూ చెప్పే సరికి కంగారుగా అడిగింది హరిణి.

"కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు హరీ... ఇది చదువు." అంటూ జేబులోంచి కవర్ తీసిచ్చాడు హర్ష. కవర్ తెరిచి అందులోని కాగితం మడతలు విప్పి చూసింది హరిణి.

"హాయ్ చిన్నీ!

ఎలా ఉన్నావురా! నువ్వూ హరిణీ అక్కడ కులాసాగా ఉన్నారని తలుస్తాను. నేనూ వదినా పిల్లలూ బావున్నాము. 

చిన్నీ! ఈమధ్య నువ్వు బాగా గుర్తుకొస్తున్నావురా! మీరెళ్ళిపోయి మూడు కాదురా ముప్ఫై ఏళ్ళు దాటిపోయినట్టుగా అనిపిస్తోంది నాకు.  ప్రతిరోజూ ఏదో ఒక సందర్భంలో నువ్వు నాకు గుర్తుకొస్తూనే ఉంటావు. ఇంటి వెనుక పెరట్లో నేను ముఖం కడుక్కుంటున్నప్పుడు నువ్వు నా మీద నీళ్ళు చల్లి ఏడిపించడం గుర్తుకొస్తూ ఉంటుంది. మామిడిచెట్టును చూసినప్పుడల్లా నిన్ను నేను ఉయ్యాల ఎక్కించి దింపకుండా చాలాసేపు ఏడిపించడం కళ్ళలో మెదులుతుంది. మన బడి వైపు వెళ్ళినప్పుడల్లా మనిద్దరం జట్టు కట్టి కబడ్డీ ఆటలో శ్రీనుగాడి గ్యాంగును చిత్తుచిత్తుగా ఓడించడం గుర్తొచ్చినప్పుడల్లా గర్వంగా అనిపిస్తుంది.

ఇంట్లోని షోకేసులో మనిద్దరమూ ఆటల్లో గెలుచుకున్న కప్పుల్ని చూస్తుంటే మనం పోటీలు పడి ఆ కప్పులను గెలుచుకున్నామని సంబరంగా ఉంటుంది. నీకూ నాకూ అయిదేళ్ళ తేడా ఉన్నా ఒకే ఈడు పిల్లల్లా మనం ఆడిపాడిన రోజులన్నీ గుర్తుకొచ్చి మనసు ఆనందంతో గంతులేస్తూ ఉంటుంది. అంతలోనే నువ్వు లేవన్న వెలితి గుండెను దేవేస్తూ ఉంటుంది.

పెద్ద పండుగ దగ్గరికొచ్చేస్తుంది కదా! అమ్మకు అరిసెలు వండటానికి సాయం చేస్తుంటే నా చేతిలోని అపక జారి బాణలిలోని వేడి వేడి నూనె నా కాలి మీద పడి నేను ఏడుస్తుంటే "ఏ అరిసెలు చెయ్యకపోతేనే కానీ పండగ పూర్తవ్వదా?! అంటూ అమ్మను కోప్పడి, "ఏడవకన్నయ్యా!" అంటూ నువ్వు నా కాలికి నవనీతం రాసి, అటుపై అమ్మకు అరిసెలు వండటంలో సాయానికి వెళ్ళడం గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయిరా చిన్నీ! 

భోగిమంటల్లో వెయ్యడం కోసం ఊరంతా మనం కట్టెల కోసం గాలించేటపుడు, సుబ్బయ్యగారి తోటలో త్రాచుపాము కనిపిస్తే కట్టెలన్నీ వదిలేసి మనం పరుగు పరుగున ఇంటికి చేరుకోవడం నీకు జ్ఞాపకం ఉందా? నాకైతే అది ఇంకా తాజాగా గుర్తుందిరా చిన్నీ!

ఈ సారి సంక్రాంతి పండుగ మనం కలిసి చేసుకోవాలని చాలా కోరికగా ఉందిరా చిన్నీ! హరిణిని తీసుకుని ఒక వారం రోజులు సెలవు పెట్టి రారా! మనమిద్దరం కలిసి ఊళ్ళో తిరుగుతూ "రామలక్ష్మణులు!" అని అందరిచేతా అనిపించుకుని ఎన్నాళ్ళో అయిపోయిందిరా!

వస్తావు కదూ?

హరిణికి నా ఆశీస్సులు. తనకు కూడా బావ తప్పకుండా రమ్మన్నాడని చెప్పు. ఎంతసేపూ ఫోన్లే కానీ ఇలా ఆప్యాయంగా ఉత్తరాలు రాసుకుని చాన్నాళ్ళయింది కదూ?! అయినా నువ్వు ఈ అన్నయ్య పైన కోపంతో పూర్తిగా తెగతెంపులు చేసుకుని మాట్లాడటమే మానేసావుగా?! మన ఓఒళ్ళోని నీ ప్రాణమిత్రుడి ద్వారా నీ అడ్రస్ తెలుసుకోగలిగానురా!

నీకు ఈ ఉత్తరం రాస్తోంటే ఎందుకో చేతులు వణుకుతున్నాయిరా చిన్నీ! తప్పకుండా వస్తావు కదూ?!

ప్రేమతో...

నీ అన్నయ్య రవీంద్ర."

ఉత్తరం చదవడం పూర్తి చేసిన హరిణి కనులు కూడా సజలమయ్యాయి. తనతో పాటు ఉత్తరం మళ్ళీ చదివిన హర్ష కన్నుల్లో కూడా నీళ్ళూరడం గమనించి, "బాధపడకు హర్షా!" అంది.

"ఆ రోజు నేనే ఆవేశపడ్డాను." హర్ష గొంతు బాధగా ధ్వనించింది. వాళ్ళిద్దరి ఆలోచనలూ మూడేళ్ళ వెనక్కు వెళ్ళాయి.

***

"వీల్లేదన్నయ్యా! నాన్నగారు చెమటోడ్చి సంపాదించిన పొలం. దాన్ని నువ్వు అమ్మడానికి నేనొప్పుకోను." ఖరాఖండీగా చెప్పాడు హర్ష.

"చిన్నీ మొత్తం పొలం అమ్మెయ్యడంలేదురా! ఉన్న ఇరవై రెండెకరాల్లోనూ ఆరు సెంట్లు మాత్రమే అమ్ముతున్నా!" శాంతంగా చెప్పాడు రవీంద్ర.

"ఆరు సెంట్లు కాదు కదా అంగుళమంత భూమిని అమ్మినా నేనొప్పుకోను." కోపంగా అన్నాడు హర్ష.

"కొంచెం నా పెద్దరికానికి కూడా విలువ ఇవ్వాలి నువ్వు." రవ్వంత కోపం రవీంద్ర కంఠంలోనూ ధ్వనించింది.

"పెద్దవాడివని నీ ఇష్టమొచ్చిన నిర్ణయాలు నువ్వు తీసేసుకుంటే నేను ఊరుకోవాలా?" హర్ష అరిచాడు.

"చిన్నీ... అన్నయ్య ఏది చేసినా ఆలోచించే చేస్తాడు. నాన్నగారు చనిపోయి ఇప్పటికి పదేళ్ళయింది. అప్పటినుండీ కుటుంబ బాధ్యత తీసుకున్న అన్నయ్య తీసుకున్న నిర్ణయమేదీ తప్పవలేదు." హర్షకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది తల్లి కామేశ్వరి.

"ఆహా! అయితే అంతా కలిసే ఇదంతా చేస్తున్నారన్నమాట! మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొంటూ మీరే ఈ ఇంట్లో ఉండండి. ఒక్క క్షణమైనా ఈ ఇంట్లో ఉండేది లేదు." 

ఎవరెంత చెప్పినా వినిపించుకోకుండా భార్యను తీసుకుని సుదూరప్రాంతమైన ఈ పట్టణంలోకి వచ్చేసాడు హర్ష. రాగానే మంచి ఉద్యోగం కూడా దొరకడంతో అక్కడే ఉండిపోయారు హర్ష, హరిణి దంపతులు.

***

"అమ్మా! ప్రభా... త్వరగా రండి!" ఇంట్లోకి అరుస్తూ వచ్చాడు రవీంద్ర.


"ఏంట్రా హడావిడి? ఏం జరిగింది?" అంటూ కొడుకుకు ఎదురొచ్చింది కామేశ్వరి. మరో వైపునుంచి వచ్చిన ప్రభ కూడా భర్త వైపు చూస్తూ అదే భావాన్ని వ్యక్తం చేసింది.

"చాలా పెద్ద విశేషమే అమ్మా! ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా మీకు? ఇదిగో ఇది పైకి చదివి వినిపించు ప్రభా!" అంటూ నవ్వాడు రవీంద్ర.

 భర్త అందించిన ఉత్తరాన్ని పైకి చదవడం ప్రారంభించింది ప్రభ.

"ప్రియమైన అన్నయ్యకు,

నీ ఉత్తరం చదవగానే నా కన్నుల్లో నీళ్ళు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. ఈ ఉత్తరం రాస్తుంటే కూడా! చిన్నప్పటి నుండి మనం కలిసి మెలిసి గంతులు వేస్తూ పెరిగిన రోజులు, ఊరంతా సందడి చేస్తూ ఆడిపాడిన రోజులు గుర్తుకొచ్చాయి.

సంక్రాంతి రోజుల్లో మనం గాలిపటాలు చేసి అందరు పిల్లలతో పాటుగా ఎగరేసేవాళ్ళం.

నాకు గాలిపటం తయారుచెయ్యడం వచ్చేది కానీ దాని సూత్రం ముడి వచ్చేది కాదు. నేనెప్పుడు గాలిపటం తయారుచేసి ఎగరేసినా అది పల్టీలు కొడుతూ కిందకు పడిపోయేది. ఎప్పుడూ అలాగే జరుగుతుందని నేనోసారి బాగా ఏడ్చాను. అప్పుడు నువ్వొచ్చి ముడి ఎలా వెయ్యాలో నేర్పావు. నీకది నాన్నగారు నేర్పారని కూడా చెప్పావు. ఇప్పుడూ అంతే కుటుంబానికి మనం ఎలా ముడిపడి ఉండాలో కూడా నువ్వే చెప్పావు. అందుకే అన్నయ్యా, హరిణీ నేనూ శాశ్వతంగా మన ఊరికొచ్చేస్తున్నాం. నువ్వు కాదనవనే ధైర్యంతో వచ్చేస్తున్నా. దయచేసి నన్ను వెళ్ళిపోమనకు అన్నయ్యా! 

అమ్మను, వదినను, పిల్లలనూ కలుసుకోవాలని ఎంతో ఆత్రుతగా ఉంది.

ఇక ఉంటాను.

ప్రేమతో...

నీ తమ్ముడు హర్ష. 

***

ఇల్లంతా సందడిగా ఉంది. పిల్లలిద్దరూ "బాబాయ్ బాబాయ్! మాకు గాలిపటం చెయ్యడం నేర్పవూ?!" అని హర్ష వెంటపడి తిరుగుతున్నారు. 

"మీ నాన్నకొచ్చు కదరా? తననడగండి." అన్నాడు హర్ష.

"నీ గాలిపటమెలా ఉంటుందో కూడా మాకు తెలియాలి కదా బాబాయ్!" ముక్తకంఠంతో పలుకుతూ ముద్దులొలుకుతున్న పిల్లలను దగ్గరకు తీసుకుని, "అలాగే నేర్పిస్తానర్రా!" అని చెప్పాడు హర్ష. 

వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తున్నారు మిగతా కుటుంబ సభ్యులు. 

"ఒరేయ్ రవీంద్రా, హర్షా మీ ఇద్దరిలో నాకు అరిసెలు వండటానికి ఎవరు సాయం చేస్తారు?" అడిగింది కామేశ్వరి.

"నేను..." అంటూ ఇద్దరూ ఒకేసారి పరుగు పెట్టారు రవీంద్ర, హర్ష! 

"ఆగండాగండి. అన్నీ మీరే చేసేస్తే మేమున్నదెందుకు?" అంది ప్రభ. ఆ మాటలకు అంతా హాయిగా నవ్వుకున్నారు.

ఆ రాత్రి...

హర్ష, హరిణి పడుకుని మాట్లాడుకుంటున్నారు.

"చాలా సంతోషంగా ఉందిరా నాకు." చెప్పాడు హర్ష.

"నాకూ చాలా ఆనందంగా ఉంది. ఇంతకూ ఓ విషయం తెలుసా నీకు?!"

"ఏంటి"

"మీ అన్నయ్య అప్పట్లో అమ్మిన ఆ ఆరు సెంట్ల పొలమూ మనకెందుకూ పనికిరాని మెరకనేలట. అవతలి రైతు కూడా తనకు వాస్తు కోసమని కొనుక్కున్నాడట!" చెప్పింది హరిణి.

"అవునా? విషయం సరిగ్గా తెలుసుకోకుండా ఎంత ఆవేశపడ్డానో నేను." బాధగా చెప్పాడు హర్ష.

"తమ్ముడికి ఆవేశం ఎక్కువమ్మా! నేనూ కోపాన్ని తగ్గించుకోవాలనుకో... నువ్వు బెంగ పడకు వాడిని ఊరికి రప్పిస్తానుగా అంటూ తనే చాలా కష్టపడి మన అడ్రస్ సంపాదించి ఉత్తరం రాసారట!"

"నిజంగా అన్నయ్య మంచితనం ముందు నేనెందుకూ పనికిరాను హరీ!" హర్ష గొంతులో సన్నని జీర!

"నేను మీ ఇంట్లో అడుగు పెట్టిన తొలిరోజుల్లో ఒకసారి పొలానికి బావగారితో కలిసి వెళ్ళాను. ఆ పచ్చదనానికి నేను పొంగిపోయి ఇలా ఊరికి దూరంగా ఓ పచ్చని తోట కొనుక్కుని అందులోనే ఉండిపోతే చాలా బావుంటుంది కదా బావగారూ అన్నాను."

"ఓహో!"

"ఆ ఆరు సెంట్లు అమ్మగా వచ్చిన డబ్బులకు ఇంకొంచెం డబ్బులు వేసి, ఒక పెద్ద తోట కొన్నారట బావగారు. పైగా దాన్ని..." హరిణి స్వరం వణికింది.

"ఊ... దాన్ని?" అడిగాడు హర్ష.

"నా పేరుతో రిజిష్టర్ చేయించారట!" హరిణి కన్నుల్లో తడి గొంతులో తెలుస్తూనే ఉంది!

*** 

మరిన్ని కథలు
maa akka muggu lekka