Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sree satya sai devotional points

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

free free free

Excuse లు రెండు రకాలు. రెండో రకం-Excuse me .. లు. ఈ రెండో రకానివి Sorry, Pardon me జాతిలోకి వస్తాయి. కాల మాన దేశ పరిస్థితులని బట్టి ఎక్కడ కావలిసిస్తే, అక్కడ నిస్సిగ్గుగా ఉపయోగించేసికోవచ్చు ! ఇంగ్లీషోళ్ళు మనకిచ్చిన వెల కట్టలేని ఆస్థి !

   మా చిన్నప్పుడు ఓ "Sorry" చెప్పేస్తే పనైపోయేది. చేసింది ఎంత వెధవ పనైనా, ఓసారి "సారీ" అనేస్తే 'తూ నా బొడ్డూ.." అన్నమాట. దానర్ధం అడక్కండి Sorry! ఎక్కడో విన్నాను! కాలక్రమేణా, మన మేధస్సు పెరిగి, ఆ మాటను ఎక్కడెక్కడ, ఉపయోగించుకోవాలో తెలిసేసింది. ఎంతైనా ఇంగ్లీషోళ్ళకంటే, మన బుర్రలు గట్టివి కదా!ఇంక Excuse me ని, ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చో అంటే నేను విన్నవీ, చూసినవీ....
1.అవతలివాడు బోరు కొట్టేస్తూంటే ఓసారి Excuse me అనేసి,ఇంకోచోటకి జంపైపోయేటప్పుడు.....
2.బస్సులోనో, ట్రైనులోనో చెప్పులేసికున్న నాలాటివాడి కాలు తొక్కినప్పుడు ( అవతలివాడివి నాడాలేసికున్న బూట్లు!), ఓ Excuse me తో క్షమించేయాలిట...
3.అవతలివాడు,మనవైపు చూడాలంటే ఓ సారి మనవైపు చూస్తాడు Excuse me అంటే. ఛస్తాడా ?
4. తెలిసో తెలియకో ( చాలా సార్లు తెలిసే అనుకోండి) బస్సుల్లో వెళ్ళేటప్పుడు,ఏ ఆడాళ్ళకో మన చెయ్యో కాలో తగిలినప్పుడు, "Sorry.." తో పనైపోతుంది, అదృష్టాన్నీ, మనం
లేచిన వేళను బట్టీ...
5.అవతలివాడు మాట్లాడింది, మనకు అర్ధం అవకపోతే "Pardon me " అనాలిట. మనకు అర్ధం అవకూడదనేగా, వాడు అవాకులూ చవాకులూ పేలేదీ ! ఓసారి అలా అనేస్తే, మళ్ళీ
రిపీట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గిరపెట్టుకుని చెప్తాడు! ఇది ఉభయతారకం ఇద్దరికీ ఉపయోగిస్తుంది!
6. తుమ్మినప్పుడల్లా ఓసారి excuse me అనేస్తే సరిపోతుందిట.

    ఇంక ఇప్పుడు మొదటిది అదేనండి Excuse లు. వినే వెధవుంటే కావలిసినన్ని చెప్పొచ్చు!
1. అస్తమానూ మనమే ఫోన్లు చేస్తున్నామూ, అవతలివాడు ఒక్కసారైనా చేయడం లేదూ అని, వాడు ఉన్నాడో ఊడేడో తెలిసికుందామని,(ఎంతైనా ఇంటావిడ వైపు చుట్టం) ఇంక ఇదే ఆఖరుసారి వాడికి ఫోను చేయడం అని, (ఇంటావిడ దగ్గర ఎనౌన్స్ చేసి) చేయగానే, ఓ రెండు మూడు రింగులైన తరువాత, ఫోనెత్తి, "అర్రే సుబ్బారావుగారా, ఇప్పుడే మీకు ఫోను చేసి ఎలా ఉన్నారో కనుక్కుందామనుకున్నానండీ, ఇదిగో ఇంతలో మీరే ఫోను చేశారు" అనడం. దీనంత పచ్చబధ్ధం ఇంకోటుండదు. అసలు వాడెవరికీ ఫోననేది చెయ్యడు, బిల్లెక్కువవుతుందని, బయటకి వెళ్ళేటప్పుడు ఎస్.టి.డి లాక్ చేసి, కోడ్ పెళ్ళానికి కూడా చెప్పకుండా ఉండే రకం !ఇలాటి Excuse గాళ్ళని ఆ భగవంతుడు కూడా బాగుచేయలేడు!
2. ఎప్పుడూ మనమే వాళ్ళింటికి వెళ్తున్నామూ, ఒక్కసారైనా మనింటికి రావడానికి తీరికే లేదూ,వెధవ్వేషాలూ అని, పోనీ ఈ ఒక్కమాటూ మనమే వాళ్ళింటికి వెళ్ళి, ఈసారి చెప్పేయాలీ, మళ్ళీ మీరు మాఇంటికి వస్తేనే, మేము మీ ఇంటికి వచ్చేదీ అనుకుని వెళ్ళడం. వాడి కొంప చేరీ చెరడంతో మనకి కనిపించే అపురూప దృశ్యం ఏమిటయ్యా అంటే, వాడూ, పెళ్ళాం, పిల్లాడూ బయటకెళ్ళడానికి వేషం వేసికునుండడం. అంత పెద్దమనిషీ, మనల్ని చూడగానే " అర్రే సుబ్బారావుగారా, చాలా రోజులయిందీ మిమ్మల్ని కలిసీ, ఇప్పుడే మీ ఇంటికనే బయలుదేరామూ... blah..blah.." అంటాడు. ఇంతలో వాళ్ళ పిల్లాడు , పాపం అమాయకుడు ఇంకా లౌక్యాలూ అవీ తెలియదు, " అదేమిటి నాన్నా, సర్కసుకని కదా బయలుదేరామూ, వీళ్ళింటికీ అంటావేమిటీ.." అని ఆ "excuse" అనే " పిల్లి" ని బయటెట్టేస్తాడు (cat out of the bag.. అనో ఏదో అంటారుట!). అప్పుడు మాత్రం తగ్గుతాడా ఆయనా- "అదేరా సర్కస్ నుంచి, దగ్గరలో ఉండే ఈ అంకుల్ వాళ్ళింటికి వెళ్దామనుకున్నాము, నీతో చెప్పేదేమిటిలే అని చెప్పలేదూ" అని తప్పించేసికుంటాడు.అసలు విషయ మేమిటంటే, సర్కస్ కెళ్ళి, భోజనం టైముకి, వీళ్ళింటికి ఓసారి వెళ్ళొచ్చెస్తే, హొటల్ ఖర్చూ ఉండదూ, వెళ్ళినట్లూ ఉంటుందీ అని! కానీ flop show అయిపోయింది! అందుకే అంటారు, ఈ excuse ల్ని ఇష్టం వచ్చినట్లల్లా వాడకూడదూ అని. అలాగని వాడడం మానుతారా, అబ్బే తప్పించుకోడానికి మన చేతిలో ( అదే నోట్లో ) ఉన్న ఏకైక  ఉచిత సాధనం కదా…ఏదో పరిమితంగా వాడాలి, మరీ ఎక్కువైతే అందరి నోళ్ళలోనూ పడ్డం ఖాయం.. “ తనదాకా వస్తే ఏదో వంక పెట్టి తప్పించుకుంటాడండీ బాబూ… “

సర్వేజనా సుఖినోభవంతూ…

   

 

మరిన్ని శీర్షికలు
weekly horoscope 27th january to 2nd febuary