Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

మీకు మీరుగా డిజిటల్‌ ఆర్టిస్టులైపోవచ్చిలా!

digital artist

టెక్నాలజీ చేతిలో ఉంటే, ప్రపంచమంతా మన చేతిలో ఉన్నట్టే. ఇది ఇప్పటి మాట. ఒకప్పుడు అలా కాదు. కార్టూనిస్ట్‌ అవడమంటే ఓ యజ్ఞం. పెన్సిల్‌ పట్టుకుని, స్కెచెస్‌ వేసుకుంటూ వేసుకుంటూ ఏళ్ళ తరబడి అనుభవం సాధిస్తే తప్ప కార్టూనిస్ట్‌గా ఎదిగే అవకాశం వచ్చేది కాదు. కార్టూనిస్ట్‌ అంటే లైన్‌ ఆర్ట్‌ డ్రాయింగ్‌ మాత్రమే కాదు. 'టూన్స్‌' తయారు చేయడం దాకా వెళ్ళింది. 2డి కార్టూన్స్‌ నుంచి 3డి కార్టూన్స్‌ దాకా ఏదైనా చేసెయ్యొచ్చు. డిజిటల్‌ ఆర్టిస్టులుగా ఇప్పుడు చాలామంది రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ రంగంలో విపరీతమైన అవకాశాలు కన్పిస్తున్నాయి. సినీ రంగంలో గ్రాఫిక్స్‌కి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు. ఆ గ్రాఫిక్స్‌ విభాగానికీ ఈ డిజిటల్‌ ఆర్టిస్టుల అవసరం చాలా ఎక్కువే. ఇంతకీ డిజిటల్‌ ఆర్టిస్ట్‌ అవడమెలా? సులభతరమైన మార్గాలున్నాయిగానీ, ఇది మరీ అంత తేలికైనదేమీ కాదు. దీన్ని ఓ ఛాలెంజ్‌గా భావించాలి. ప్యాషన్‌గా స్వీకరించాలి. అప్పుడే డిజిటల్‌ ఆర్టిస్టులు ఈ రంగంలో రాణించగలరు.

ముందుగా ఆర్ట్‌ మీద బేసిక్స్‌ తెలుసుకోవడం ముఖ్యం. ఆ తర్వాత అందుబాటులో ఉన్న టెక్నాలజీ వైపు అడుగులేయొచ్చు. మొబైల్‌ ఫోన్లలో లభ్యమవుతోన్న యాప్స్‌తో క్రియేటివ్‌ ఆలోచనలు పెరుగుతాయి. ఆన్‌లైన్‌లో దొరుకుతోన్న అనేక అప్లికేషన్లు డిజిటల్‌ ఆర్టిస్ట్‌గా మీలోని టాలెంట్‌కి మరింత మెరుగులు పెట్టుకోడానికి ఉపయోగపడ్తాయి. ప్రాక్టీస్‌ మేక్స్‌ ఏ మ్యాన్‌ పెర్‌ఫెక్ట్‌ అన్నట్లుగా ఎంత ఎక్కువ ప్రాక్టీస్‌ చేస్తే మీలోని డిజిటల్‌ ఆర్టిస్ట్‌ అంత పెర్‌ఫెక్ట్‌గా మారతాడు. సినిమాలు, టీవీ ఛానళ్ళు, షార్ట్‌ ఫిలింస్‌ కంటే ముందుగా, యూ ట్యూబ్‌ ఛానల్‌ని మీరు ఆశ్రయించొచ్చు. మీ క్రియేటివిటీని ప్రదర్శించడానికి ఇప్పుడు యూ ట్యూబ్‌ చాలా మంచి వేదిక. అక్కడ మీరు సక్సెస్‌ అయితే, అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే ఆన్‌లైన్‌లో దొరికే కంటెంట్‌ని కాపీ కొట్టకుండా, మీదైన టాలెంట్‌ని దానికి ఇంకాస్త క్రియేటివిటీని జోడిస్తే అద్భుతాలు చేయొచ్చు. డిజిటల్‌ ఆర్టిస్ట్‌గా మీ ప్రయాణం మొదలయ్యాక, మీ క్రియేటివిటీని బట్టి మీ ఎదుగుదల ఆధారపడి ఉంటుందనే విషయం మర్చిపోకూడదు.

ప్రధానంగా యంగ్‌ తరంగ్‌ ఈ ఫీల్డ్‌ వైపు చాలాకాలంగా అడుగులేస్తోంది. కొత్త కొత్త ఆలోచనలతో అందుబాటులో ఉన్న టెక్నాలజీని కాలేజీ రోజుల్లోంచే యువతరం వాడేసుకుంటుండడం అభినందించదగ్గది. సాధారణ విద్య పూర్తి చేసిన తర్వాత, ఆర్ట్‌ విభాగంలో కొత్త కొత్త కోర్సులు వివిధ యూనివర్సిటీలు అందిస్తున్న నేపథ్యంలో అటువైపుగా చాలామంది దృష్టి సారిస్తున్నారు. ఈ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలూ మెండుగా ఉంటుండడంతో ఉన్నత చదువులతోపాటుగా దీన్ని హాబీగానే కాకుండా సంపాదనా మార్గంగా కూడా ఎంచుకుంటున్నారు. మీలోనూ అలాంటి క్రియేటివిటీ ఉంటే వయసుతో సంబంధం లేదు, ట్రై చేసి చూడండి.

మరిన్ని యువతరం
be carefull