Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గతసంచికలో నాదైన ప్రపంచం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండిhttp://www.gotelugu.com/issue207/589/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

( గతసంచిక తరువాయి )..... తండ్రి చేతి మీద తట్టి తలూపాడు.

కీర్తన తీసుకుని చదివింది.

మనసుని మెలి పెట్టినట్లు ఏదో బాధ. ఏడుపు రాబోయింది.  కానీ ఆపుకుంది.

‘‘మీరు బాధ పడకండి నాన్న గారూ! మీరున్నారు. అన్నయ్య....నానమ్మ, పిన్ని, అందరూ వున్నారు. పిన్నికి క్రమ శిక్షణ అంటే యిష్టం. అందకే కంట్రోల్ చేస్తుంది. లేక పోతే నన్ను బాగానే చూసుకుంటుంది. మీరు బాధ పడకండి నాన్నగారూ!’’మెల్లగా స్పష్టంగా విడమర్చి చెబుతున్నట్లు అంది.

మంచి హైట్, కలర్, పర్చనాలిటీతో యువ రాజు, యువ రాణిల్లా వుండే పిల్లలిద్దరినీ చూస్తుంటే ఆయన హృదయం ఉప్పొంగి పోతూంటుంది.
ఇద్దరు పిల్లలూ హాల్లో తన కళ్ళెదురుగా కిలకిల్లాడుతూ నవ్వుతూ తిరుగుతుంటే కనుల పండువగా వుంటుంది.

ఆ అదృష్టం కోసం మృదులా దేవి ఎల్లప్పుడూ పుట్టింట్లో వుంటే బావుండుననిపిస్తుంది.

కోడలు ఇంట్లో లేక పోతే తల్లి కూడా పగలల్లా తన మంచం పక్కనే కూర్చొని, కాసేపు నడుం వాల్చి, కాసేపు ఏదో లోకాభిరామాయణం మాట్లాడ్తూనే వుంటుంది.

భోజనాలు అయ్యాక తండ్రి మూగన్నుగా నిద్ర లోకి జారుకోవడం చూసి కీర్తనని తన గది లోకి పిలిచాడు అశోక్

‘‘ప్రాక్టీస్ఎలా సాగుతోంది....?’’ ఫైల్స్ చూసుకుంటూనే అడిగాడు. ‘‘ఊ....బాగానే సాగుతోంది. కానీ మా ఫ్రెండ్సే సరిగా కాన్సన్ ట్రేట్ చెయ్యటం లేదు. వాళ్ళ కింకా మూడ్ రావడం లేదు.  అయినా ఫర్లేదు’’ చెప్పింది.

‘‘మరి స్టడీస్?’’

తల అటు ఇటూ తమాషాగా తిప్పి ‘‘నాట్ బాడ్’’ నవ్వింది.

‘‘డిగ్రీ చేతికి వస్తుందిగా!’’

‘‘ఊ! అందులో డౌట్ లేదు’’ నిశ్చయంగా అంది.

‘‘ప్రాక్టీస్ కి గానీ ఇంకేవన్నా అవసరాలున్నాయా? డబ్బు కావాలా?’’ ఆప్యాయంగా అడిగాడు.

ఆడ పిల్లలకి పెల్ళి చేసి పంపేస్త.. మిగతా ఆస్థిని తల్లి దండ్రులు తలలు వంచైనా సొంతం చేసుకో వచ్చని మగపిల్లలు ఆలోచిస్తున్న రోజుల్లో అశోక్ లాంటి అన్నయ్య తనకుండటం తన అదృష్టంగా భావించింది కీర్తన.

‘ఊహూ! నాకేం అవసరం లేదు. అడగక్కర్లేకుండానే అన్నీ నువ్వే అమర్చి పెట్టేస్తున్నావుగా! కానీ....’

‘‘ఊ! కానీ...’’ ప్రశ్నార్థకంగా చూశాడు.

‘‘మా టీమ్ లో దీప్తి తెలుసుగా... చాలా పూర్ పాపం. స్పోర్ట్స్ షూకి కూడా డబ్బులు లేవు’’ జాలిగా అంది.

‘‘ఓ.కె. ఎంతివ్వనూ?’’ హేంగర్ కి తగిలించిన పాంట్ జేబు లోంచి వాలెట్ తీస్తూ అడిగాడు.

‘‘నీ యిష్టం...’’

మూడు వేలు తీసి ఆమె చేతికిచ్చి..‘‘సరి పోతాయా?’’ అడిగాడు.

ఆమె ముఖం వికసించింది.

‘‘చాలు...చాలు. దీప్తి చాలా సంతోషిస్తుంది. వాళ్ళ ఫామిలీ బ్లెస్సింగ్స్ కూడా నీకుంటాయి’’ ఆరిందాలా అంది. అశోక్ నవ్వాడు. ఆమె రూమ్ నుంచి కదల బోయింది.

‘‘అయిదు నిమిషాలు ఉండు చిట్టీ...’’ చెప్పాడు. వచ్చి మళ్ళీ కుర్చీలో కూర్చుని అన్నవంక చూసింది. అతను ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ మధన పడుతున్నాడు.

కీర్తనకి ఏమీ అర్ధం కాలేదు.

తామిద్దరి మధ్యా ఎప్పుడూ మాట్లాడుకోడానికి మొహ మాట పడే విషయాలు ఏమీ లేవు. అన్న ఏం చెప్పాలని సందేహిస్తున్నాడు?
‘‘ఏంటన్నయ్యా?’’ ఆసక్తిగా అడిగింది.

‘‘నువ్వు...ఇక నుంచీ కాస్తంత లోక జ్ఞానాన్ని నేర్చుకోవాలి....’’ తడ బడుతూ అన్నాడు. అదేదో పద్యం బట్టీ పట్టినంత సులభంగా అన్నాడు.
చెల్లెలులొ మరింత అయోమయం అయిపోయింది.

‘‘లోక జ్ఞానం అంటే....’’ బుర్ర గోక్కుని ‘‘లోకం...జ్ఞానం....

ఆ!.....లోకం గురించి నువ్వు బాగా తెలుసుకోవాలన్న మాట’’ అన్నాడు అశోక్.

‘‘ఎందుకు?’’ వెంటనే అంది కీర్తన. తెల్ల మొహం వేశాడు అశోక్. ఎందుకు... అంటే ఏమని వెంటనే సమాధానం చెప్పగలడు?
‘‘లోక జ్ఞానం వుంటేనే మనం సుఖంగా బతక గలం’’ చెప్పాడు.

‘‘లోకం అంతటి గురించీ తెలుసుకుని నేనేం చెయ్యాలి...

అన్నయ్యా!? నా లోకం ఈ ఇల్లూ, మీరూ, కాలేజీ, వాలీ బాల్ వీటి గురించి బాగానే తెలుసు నాకు, నా పరిధి యింతకు మించి పెరగదు. యింకా ఏం తెలుసు కోవాలి నేను?’’ అమాయకంగా అంది కీర్తన.

ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్ధం కాలేదు అశోక్ కి.

‘‘చెప్పన్నయ్యా!’’ రెట్టించింది

‘‘అది కాదు చిట్టీ!....నీ జీవితమంతా యిలాగే వుండదు. అందులో

చాలా మలుపులుంటాయి. రెండేళ్ళకో, మూడేళ్ళకో నీకు పెళ్ళి జరుగుతుంది.’’

‘‘పెళ్ళా....? నాకా....?’’ కొత్త మాట విన్నట్లు ఆశ్చర్య పోయింది.

‘‘అవును కదూ....! అందరి లాగే తనూ పెళ్ళి చేసుకోవాలి. పిల్లల్ని కనాలీ!....విచిత్రంగా యింత వరకూ తనకి అలాంటి వూహలే రాలేదు.
ఇపుడు అన్నయ్య గుర్తు చేస్తుంటే వింతగా వుంది.

‘‘పెళ్ళి చేసుకుంటే ఏం మార్పు వస్తుంది?’’ తనని తనే ప్రశ్నించుకుంటూ అప్రయత్నంగా పైకి అనేసింది

ఏం జరుగుతుందో చెప్పడానికి మనసు బాధ పడుతున్నా వాస్తవం చెప్పక తప్పడం లేదు.

‘‘మొట్ట మొదట నువ్వు వేరే యింటికి వెళ్ళాలి’’ చెప్పాడు.

షాక్ తిన్నట్లు నమ్మ లేనట్లు అన్న వంక చూసింది.

ఆ చూపుల్ని భరించ లేక తల దించుకున్నాడు.

‘‘నీకు పెళ్ళయిన తర్వాత నీ భర్తతో కసి ఇక్కడే వుండటం ప్రస్తుత కుటుంబ వ్యవస్థ అనుసరిస్తున్న విధానానికి విరుద్ధం. ఏమీ లేకుండానే పిన్ని ఎన్నో సూటి-పోటీ మాటలు అంటుంది. దాన్ని మనమే భరించ లేక పోతున్నాం. అలాంటిది నిన్ను చేసుకోబోయే వాడు ఆవిడ మాటల్ని ఎందుకు భరిస్తాడు? అందుకే నీకంటూ వేరే సంసారం వుంటుంది. అందులో నువ్వూ, నీభర్తా, పిల్లలూ, వాలీ బాలూ....’’ చివరి మాట నవ్వుతూ అనబోయాడు. బలహీనంగా వచ్చింది నవ్వు.

కళ్ళు విప్పార్చి అతను చెప్పింది వింది.

‘‘మరి నాన్న గారు....’’ బాధగా అంది.

‘‘నేనున్నాను....’’

తల అడ్డంగా ఆడించింది. ‘‘‘నా వల్ల కాదు. అసలు ఆ వూహే అందడం లేదు. నాకెపుడూ ఈ వూహలు రాలేదు. దయ చేసి నా నేషనల్ గేమ్స్ అయ్యే వరకూ ఇలాంటి మాటలు చెప్పి నన్ను యిబ్బంది పెట్టద్దు. పెళ్ళే జీవితం కాదు. నన్ను క్షమించు అన్నయ్యా!....యివి తెలుసుకోవటమే లోక జ్ఞానమైతే అది యింత బాధా కరంగా వుంటే నాకు యిలాంటివి చెప్పకు’’ ఆవేదనగా అంది.

అశోక్ మనసు బాధగా తయారయింది. యిలాంటి అమాయకు రాలిని చేసుకుని ఎవరు ఓపికగా మార్చుకుంటారు? అతనికి తన ప్రాణస్నేహితుడు గుర్తొచ్చాడు.

తన కోసం ప్రాణాలిచ్చే తన స్నేహం గుర్తొచ్చింది. కానీ, స్నేహాన్ని స్వార్ధానికి ఎపుడూ వుపయోగించుకో కూడదు. జాలి తోనో ఎదుటి మనిషి కోసమో బంధం కలిపితే అది నిల బడుతుందా?

అశోక్ మొహం చూసి అతను తన కోసం దిగులు పడుతున్నట్లు గ్రహించింది కీర్తన.

తను సరిగ్గా మాట్లాడి వుండదు. అందుకే అన్నయ్య బాధ పడుతున్నాడు. ఈసారి కొంచెం తెలివిగా మాట్లాడాలి అనుకుంది. ‘‘అన్నయ్యా! నేషనల్ గేమ్స్ అయ్యాక నువ్వు చెప్పినట్లే లోకజ్ఞానం నేర్చుకుంటాను’’ బుద్ధిగా అంది.

అశోక్ కి నవ్వొచ్చింది. ‘‘ప్రామిస్’’ చెయ్యి చాపాడు.

‘‘ప్రామిస్’’ అతని చేతిలో చేయి వేసింది.

‘‘వెళ్ళి పడుకో!’’ చెప్పాడు. తలూపి బైటకి నడిచిందామె.

వెళుతున్న ఆమె వంక ప్రేమగా చూశాడు అశోక్.

*******

కీర్తన ఆ రోజు స్టేడియం కి వెళ్ళే సరికి అందరూ డిస్టర్బ్డ్ గా కనిపించారు.

కోచ్ కి కనిపించని హడావిడి చేస్తున్నారు.

‘‘ఏమయింది?’’ డ్రస్ బ్యాగ్ పక్కన పెడుతూ అంది.

‘‘చెబుతాం...గానీ ముందు నీ చుడీదార్ చూడ లేక ఛస్తున్నాం...

అప్పమ్మ లాగా ఆ చారల డ్రస్సేంటి?’’ అంది ఓ అమ్మాయి.

‘‘మనం ఛస్తామే!....కానీ ఆ హీరోకి మాత్రం ఎంజాయ్ మెంట్!’’ కళ్ళెగరేస్తూ అంది మరో అమ్మాయి.

‘‘ఎవరు?’’ అయోమయంగా అంది కీర్తన.

కళ్ళెగరేస్తూ ప్రేక్షకులు కూర్చునే వైపు చూపించింది ఆ అమ్మాయి.

అక్కడ ఒక అబ్బాయి. మెట్ల మీద కూర్చుని యిటే చూస్తున్నాడు.

బ్లాక్ ఫాంట్ లైట్ గ్రీన్ ప్లెయిన్ కాజువల్ షర్ట్ తో చూడగానే మది దోచే అందగాడిలా కనిపిస్తున్నాడు.

‘‘ఎవరతను?’’ మొహం చిట్టించుకుంటూ అంది కీర్తన. అందరూ పగల బడి నవ్వారు.

‘‘ఎందుకు?’’ కోపంగా అంది కీర్తన.

‘‘అయ్యో పిచ్చి మొహమా!... నిన్న అతను అంత సేపు చూశాడు. మర్చి పోయావా....? అంత హాండ్సమ్, కారు మెయిన్ టెయిన్ చేసే రిచ్ ఫెలో, నావైపు అంత సేపు చూసుంటే నేను రాత్రంతా ఈస్ట్ మన్ కలర్ లో ఒ సినిమానే వూహించేసుకునే దాన్ని....ఛ! బాడ్ లక్...అయినా నిన్నని ఏం లాభం...? అతనిది చాలా బ్యాడ్ టేస్ట్ అంతే!!’’ ఓరగా అతని వైపు చూస్తూ అంది ఆ అమ్మాయి.

********

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu aame oka rahasyam