Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sirasri  question

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉత్తరాఖండ్ ( తీర్థ యాత్రలు ) - కర్రానాగలక్ష్మి

uttarakhand

మాతా చంద్రబదని

దేవ ప్రయాగ చూసుకొనే సరికి మద్యాహ్నం ఒక్కగంట అవడం వల్ల బజారులో వున్న ఓ పాటి హోటల్ లో భోజనం చెయ్యడానికి కూర్చున్నాం ఇక్కడ చెప్పుకో వలసిన ముఖ్య విషయం యేమిటంటే మేము చార్ధామ్ యాత్రలు నిర్వహించే యే టూరు ఆపరేటర్ ద్వారా మా టూర్లు బుక్ చేసుకోము , మాకు మేమే టూర్ ఆపరేటర్స్ మి . సాధారణంగా నలుగురు నుంచి ఆరుగురం టూరు ప్లాను చేసుకుంటాం . అంటే మా దంపతులం కాక మరో కుటుంబం కాకపోతే మరో రెండు జోడీలతో ప్రయాణం ప్లాను చేసుకుంటాం . అందరూ ఒకే మాట మీద నడవాలండోయ్ అప్పుడే మనం యాత్రలను యెంజాయ్ చెయ్యగలం .

దేశ రాజధాని వరకు ట్రైనులో గాని ముందుగా బుక్ చేసుకుంటే మూడు నాలుగు వేలకి ఫ్లైట్ టికెట్స్ లభిస్తాయి అలా ప్లైటులో గాని చేరి అక్కడనుంచి మేము దిగిన ప్రదేశం నుంచి టాక్సీ లో హరిద్వార్ చేరి ( అంటే టాక్సీ హరిద్వార్ వరకే మాట్లాడు కుంటాం ) అక్కడ యేదో ఒక ఆశ్రమం లో వుండి రెండురోజులు హరిద్వార్ , ఋషికేశ్ లలో చూడవలసినవి చూసుకొని హరిద్వార్ లో ఉత్తరాఖండ్ లో తిరగడానికి టాక్సీ మాట్లాడుకొని ప్రయాణం రోజు పొద్దుట యేడుకల్లా బయలుదేరుతాం , సాయంత్రం వెలుగుండగానే రూములలో చేరుతాం అది మా అలవాటు ఉత్తర భారత యాత్రలలో మనకు సరైన భోజనసదుపాయాలు దొరకవు , వారువాడే పదార్ధాలు మన శరీరాలకు పడక ఆరోగ్యం దెబ్బతినడం తరచూ జరుగుతూ వుంటుంది . ఇవన్నీ అనుభవించిన తరువాత మేం పోర్టబుల్ కిచెన్ మాతో తీసుకు వెళుతూ వుంటాం . అందులో ఒకటి లేక రెండు రైసు కుక్కర్స్ , హాట్ వాటర్ కెటిల్ టీ , కాఫీ , పంచదార పేకెట్లు , మేగీ , యిన్స్టెంటు ఉప్మా ప్యాకెట్ల , పులిహోర మిక్స్ యింట్లో చేసుకున్నది , ఊరగాయలు , పొడులు , పులుసు మిక్స్ యింట్లో చేసుకున్నది . స్పూన్స్ , ప్లేట్స్ , నేప్కిన్స్ మొదలయినవి అందులో వుంటాయి . రకరకాల యెలట్రికల్ ప్లగ్ పిన్స్ కూడా పట్టుకోవాలండోయ్ . సూపు పేకెట్స్ పట్టుకుంటే ఉత్తరాంచల్ చలిలో వేడివేడి సూపు తాగుతూ వుంటే ఆ మజావే వేరు . బియ్యం , వుల్లిపాయలు కూడా పట్టుకోవాలి . బియ్యం మనకి యెక్కడైనా దొరకుతాయి కాబట్టి రెండు రోజులకు సరిపడా పట్టుకుంటే చాలు . వీటితో పాటు గిన్నెలు తోముకొనే సామగ్రి మరచిపోకండి .

ముందుగా స్నానం చేసిన వాళ్లు రైసుకుక్కర్లో బియ్యం పడేస్తే రెండో వారు తయారయేసరికి మన భోజనం తయారు . ఉడికిన అన్నంలో మనకి కావలసిన పొడులతో ఊరగాయలో పులిహోర పోపో కలుపుకొని డబ్బాలలో మూతవేసుకొని బయలుదేరేమంటే మన భోజనం మనవెంటే , ఎప్పుడు కావాలంటే అప్పుడు వడ్డించుకు తినెయ్యడమే .

సాయంత్రం బస చేరేక ముందు సూపు చేసుకు తాగడం తరవాత అన్నం పడేసుకుంటే మనం కాళ్లు చేతులు కడిగే సరికి డిన్నర్ రెడీ . దేశం లో అయినా విదేశాలలో అయినా మా వంటిల్లు మాతోనే వుంటుంది . అలా మేము తెచ్చుకున్న భోజనాలు చేసి తిరిగి ప్రయాణం సాగించేం .దేవప్రయాగ నుంచి కీర్తనగర్ వైపు వెళ్లే రోడ్డుమీద  మా ప్రయాణం సాగింది . సన్నని రోడ్డు  , దట్టమైన అడవి , చాలా కోతులు కనబడుతూ వుంటాయి . సుమారు 35 కిలో మీటర్ల ప్రయాణం తరువాత ' కాంది ఖల్  ' చేరుతాం , అక్కడనుంచి సుమారు ఓ కిలోమీటరు దూరం కొండ యెక్కి యీ మందిరం చేరుకుంటాం . ఉత్తరాఖండ్ లో యే మందిరం దర్శంచాలన్నా కనీసం ఒకటిరెండు కిలోమీటర్లు కొండ యెక్కడమో దిగడమో చెయ్యాలి . కాబట్టి యిటువైపు ప్రయాణాలు చెయ్యాలనుకొనే వారు వారి ప్రయాణానికి ఆరు నెలల ముందు నుంచి బ్రిస్క్ వాకింగు చేసుకుంటూ వుంటే మంచిది .

సరే యిక ప్రస్తుతం లోకి వస్తే ఓ కిలో మీటరు కొండ యెక్కాక చిన్న సిమెంటుతో కట్టిన మందిరం వస్తుంది . కొండ కు మూడు వైపులా కట్టిన మందిరం . లోపల వున్న కొండకు బట్ట కట్టి వుంటుంది . బట్ట వెనుక వున్నది యేమిటి అనేది యెవ్వరికీ తెలియదు . పూజాది కార్యక్రమాలు పొద్దుట ఒక్కసారి విగ్రహానికి జరుగుతాయి . అప్పుడు ముఖ్య పూజారి కళ్లకు గంతలు కట్టుకొని పూజ నిర్వహిస్తారు . కొండమీద నుంచి చూస్తే కను చూపు మేర వరకు ఆకుపచ్చని తివాసి కప్పుకున్నట్లు వున్న నేల కనువిందు చేస్తుంది . చల్లని గాలి శరీరాన్ని సేద తీరుస్తుంది  ఇక్కడ వున్న బోర్డు  మీద స్థలపురాణం రాయబడింది .

స్థలపురాణం చెప్పుకుందాం .

దక్షయజ్ఞం లో పతికి జరిగిన అవమానం సహించలేని సతీదేవి ప్రాణత్యాగం చేసుకుంటుంది .  సతీదేవి పార్థివశరారాన్ని భుజాన వేసుకొని తిరుగుతున్న శివుని మోహవిముక్తుడను చేయదలచి విష్ణుమూర్తి తన చక్రం తో సతీ దేవి శరీరాన్ని ఖండించగా ఆశరీరఖండాలు 54 గా ఖండించబడి హిందూ దేశం లో విరజిమ్మ బడ్డాయి , సతీదేవి నగలు 54 ప్రదేశాలలో విరజిమ్మబడ్డాయి . అవే శక్తి పీఠాలుగా తరవాత శంకరాచార్యుల వారు గుర్తించేరు .

ఈ ప్రదేశం లో సతీదేవి యొక్క ' అంగం ' పడిందట . అందుకే యెప్పుడూ బట్టతో కప్పి వుంచుతారు . ప్రతీరోజూ పూజారి కళ్లకు గంతలు కట్టుకొని నిత్యపూజాది కార్యక్రమాలు నిర్వహించి తిరిగి బట్టతో కప్పెస్తారు . కొందరి స్థానికులు బట్ట వెనుక శ్రీయంత్రం వున్నదని అంటారు , కొందరు సతీదేవి అంగం వున్నదని అంటారు . ఈ ప్రదేశంలో యెన్నో లోహపు త్రిశూలాలు కనిపిస్తాయి . ఇక్కడ అమ్మవారిని పూజించుకొని శక్తులను పొందిన వారు అమ్మవారికి లోహపు త్రిశూలాలు బహూకరిస్తారని అంటారు .

చంద్రబదనీ దేవిని దర్శించుకొని శ్రీనగరు వైపు పయనమయేం . ఉత్తరాఖండ్ లో ఓ శ్రీనగరు వుంది . దేవప్రయాగ బదరీనాథ్ దారిలో దేవప్రయాగ కి సుమారు 35 కిలో మీటర్ల దూరంలో వుంది శ్రీనగరు .

శ్రీనగరు లోయ కావడంతో నగరం చేరడానికి ముందు సుమారు పది కిలో మీటర్లు మైదానంలో ప్రయాణిస్తాం . అలాగే యిక్కడ వుష్ణోగ్రతలు కొండలలో కన్నా యెక్కువగా నమోదవుతూ వుంటాయి . ఈ ప్రాంతాలలో వరి , గోధుమ పంటలు మామిడి , నిమ్మ లాంటి పండ్ల తోటలు యెక్కువగా కనబడతాయి . చాలా రకాల కూరలు కూడా పండుతాయి . ఈ కొండలలో యెక్కువగా తియ్యగుమ్మడి కాయడం చూసేం , సాయంత్రం అయేటప్పటకి రోడ్డు మలుపులలో గుట్టలు గుట్టలుగా గుమ్మడి పళ్లు పోసి ట్రక్కులలోకి చేరవేయడం గమనించేం .

పౌరీ ఘరేవాల్ జిల్లాలో వుంది శ్రీనగరు . హరిద్వార్ తరువాత యాత్రీకులకు కావలసిన అన్ని వస్తువలు దొరికే ప్రదేశం కూడా యిదే యిక్కడ అన్ని తరగతులవారికి అందుబాటులో వుండేటట్టుగా భోజనవసతి సౌకర్యాలు లభిస్తాయి .

శీతాకాలపు దుస్తులు మరచిపోయినవారు యిక్కడ దుస్తులు కొనుగోలు చేసుకోవచ్చు . ఇక్కడినుంచి పైకి వెళుతున్నగొద్దీ చలి పెరుగుతూ వుంటుంది . చలిబట్టలు పట్టుకోని వారు , తెచ్చినవి సరిపోని వారూ యిక్కడకొనుగోలు చేసుకోవచ్చు .

ఈ వూరు తరువాత అన్నీ యేదో నిత్యావసర వస్తువలు దొరికే వూర్లేతప్ప పెద్ద మార్కెట్టు వున్నవి మనకి దారిలో రావు . శ్రీనగరులో 420 పడకలుగల సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ వుంది యిక్కడ పిజి కోర్స్ లు బోధించే వైద్య విశ్వవిద్యాలయం 2010 లో నిర్మించేరు . అలాగే పోలిటెక్నిక్ కాలేజీ  వుంది . అలాగే యితర స్కూల్స్ కాలేజీలు వున్నాయి .

శసశ్త్ర సీమా బల్ వారి కేడట్ ట్రైనింగు సెంటరు వుంది . ఇక్కడ ఉత్తరాఖండ్ గవర్నమెంటువారిచే నడపబడుతున్న గెస్ట్ హౌసులో వసతి భోజన సదుపాయాలు బాగుంటాయి  . ఇది బదరీనాథ్ రోడ్డుని ఆనుకొని వుంటుంది .

యాత్రీకులకు మరో చిన్న సూచన యేమిటంటే యే హోటల్ లో వుండదలచుకున్నా ముందుగా రూములు , బాత్రూములు చూసుకొని నచ్చితేనే రెంటు బేరమాడుకోండి . బేరం అన్నాకదా ! బేరం బాగా చెయ్యాలి , సుమారుగా సగానికి సగం తగ్గిస్తారు .

ఆ రాత్రి శ్రీనగరులో బస చెయ్యాలనుకున్నాం . అందుకే శ్రీనగరు ప్రవేశించగానే రూములు వెతకడం మొదలుపెట్టేం ( బేరం కూడా ) నచ్చిన రూము నచ్చిన రేటుకి బజారులో దొరకడం తో మగాళ్లను బియ్యం , పాలు , పెరుగు తేవడానికి పంపి కుక్కర్లో బియ్యం పడేసుకున్నాం . కెటిల్ లో నీళ్లు మరిగించి సూపు కలుపుకున్నాం .

ప్రయాణపు బడలిక , కొండలలో నడక వల్ల కలిగిన అలసట సూపు తాగడంతో తగ్గి కొత్త ఉత్సాహం వచ్చింది .

అరుదైన మందిరాలను దర్శించుకున్నాం అన్న తృప్తితో వేడివేడి అన్నం తిన కమ్మగా నిద్రపోయాం .

మరునాడు మరో అధ్బుతమైన మందిరం చూడబోతున్నామని తెలియదు అప్పటికి , మళ్లీ వారం ఆ వివరాలు తెలుసుకుందాం అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
chamatkaram