Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
how to skill development

ఈ సంచికలో >> యువతరం >>

ఆన్‌లైన్‌లో అంతా నిజమేనా?

online is true?

చేతిలో ఓ స్మార్ట్‌ గ్యాడ్జెట్‌ ఉంటే సరి, అదే ప్రపంచాన్నంతా మీ ముందుంచేస్తుంది. ఇదీ ఈనాటి యువత మాట. విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల సమాచారం తెలుసుకోవాలన్నా, అక్కడి ఉద్యోగావకాశాల గురించి వాకబు చేయాలన్నాసరే 'స్మార్ట్‌ ఫోన్‌' సరిపోతోందిప్పుడు. దాంతో 'స్మార్ట్‌' అన్న పదం యువతరానికి అంత బాగా కనెక్ట్‌ అయిపోయింది. ఎప్పటికప్పుడు మార్కెట్‌లో వస్తోన్న స్మార్ట్‌ ఫోన్లను అప్‌డేట్‌ చేసుకుంటూ వెళుతోంది నేటి యువతరం. స్మార్ట్‌ ఫోన్‌లో సోషల్‌ మీడియా వినియోగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇదివరకటితో పోల్చితే ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్లలోనే ఎక్కువగా సోషల్‌ మీడియాని వినియోగిస్తున్నారట. ఈ వినియోగం పల్లెటూళ్ళలో కూడా బాగా పెరిగిపోయింది. కొన్నాళ్ళు ఆగితే పర్సనల్‌ కంప్యూటర్ల సంఖ్య బాగా తగ్గిపోతుందనే అభిప్రాయాలు వినవస్తున్నాయి.

ఇప్పటికే పర్సనల్‌ కంప్యూటర్ల వినియోగం తగ్గిపోయిందట కూడా.  వన్‌ టచ్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌, పేటీఎం వంటి సౌకర్యాలు విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌ కొనుగోళ్ళు మొబైల్‌ ఫోన్లతోనే ఎక్కువగా జరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌ కొనుగోళ్ళు, ఆన్‌లైన్‌ విద్య, ఆన్‌లైన్‌ ఉద్యోగాలు ఇలా అంతా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతోంటే కంప్యూటర్ల వైపు ఎవరు చూస్తారు? అయితే అన్ని చోట్లా చెడు ఉన్నట్లే ఈ ఆన్‌లైన్‌లోనూ చెడు కనిపిస్తుంటుంది. నిజానికి ఆన్‌లైన్‌లో కనిపించేదంతా నిజం కాదు. కన్పించే వాస్తవం కొంత, కన్పించని అవాస్తవం ఎక్కువ అని ఈ మధ్యకాలంలో నిపుణులు 'ఇంటర్నెట్‌' గురించి విశ్లేషిస్తున్నారు. సాధారణ మోసాలతో పోల్చితే ఆన్‌లైన్‌ మోసాలు చాలా చాలా ఎక్కువగా జరుగుతుండడం నిపుణుల్ని షాక్‌కి గురిచేస్తోంది. ప్రధానంగా తప్పుడు సమాచారమే ఈ అన్ని అనర్ధాలకూ కారణమవుతోందని గుర్తించారు. విదేశీ యూనివర్సిటీల్లో సీట్లు, నియామకాల పేరుతో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ నేరాలు వెలుగు చూస్తున్నాయి. ఆన్‌లైన్‌లో సమాచారాన్ని చూపించి, అమాయకులకు వలవేసేవారెక్కువైపోయారు. ఆన్‌లైన్‌ అద్భుతమైన భవనాల్ని చూసి, విదేశాలకు వెళ్ళాలనుకునేవారు తీరా, మోసపోయాక అదంతా 'క్రియేషన్‌' అని తెలుసుకుని కన్నీరుమున్నీరవ్వాల్సి వస్తోంది. 

అతి సర్వత్ర వర్జయేత్‌ అని పెద్దలు ముందే చెప్పారు. అందుకే, దేన్ని అయినా వాడే ముందు, దానికి సంబంధించి మంచి చెడులను పరిగణనలోకి తీసుకోవాలి. ఆన్‌లైన్‌ ఓ వెసులుబాటు మాత్రమే. సమాచారాన్ని సేకరించిన తర్వాత, అది నిజమో కాదో సమీక్షించుకుని, ఆ తర్వాత అధికారిక వెబ్‌ ఛానల్స్‌ ద్వారా విద్య, ఉద్యోగ ప్రవేశాలపై ముందడుగు వేయడం మంచిది. అలాగే సోషల్‌ మీడియాలో కన్పించే చాలా వార్తల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఇలా అన్నింటికీ ఆన్‌లైన్‌ని ఆశ్రయిస్తున్నవారు ఏది నిజం? ఏది అబద్ధం? అని తెలుసుకోగలిగితే ఆన్‌లైన్‌ అద్భుతమే. అందుకే ఆన్‌లైన్‌తో అప్రమత్తత అత్యంత అవసరం.

మరిన్ని యువతరం