Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> ఆ పాపే స్ఫూర్తి

aa pape  spoorti

ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా వుండడం వల్ల నాకు కాస్త విశ్రాంతి కావాలన్న వుద్దేశ్యంతో నేను ఓ రెండు వారాలు సెలవు పెట్టుకొని ఇంట్లోనే వున్నాను.కాని నా దినచర్యల్లో ఒకటైన మా పాపకు యూనిఫాం వేసి,బ్యాగులో పుస్తకాలు సర్ది బైకులో స్కూలుకు తీసుకువెళ్ళడం నాకు తప్పలేదు. అలాగే చేస్తున్నాను.అయితేపాపను స్కూల్లో దిగబెట్టి ఇంటికొచ్చి టిఫన్ తిన్న తరువాత చక్కగా దినపత్రిక చదవడం, టీవి చూడ్డం, నా శ్రీమతితో పిచ్చాపాటి మాట్లాడ్డం, హాయిగా ఓ రెండు గంటల పాటు నిద్ర పోవడం రెండు రోజుల్లోనే అలవాటు చేసుకున్నాను.
మాపాప చదువు తున్నది ఓ కార్బోరేటు  స్కూలు. బోలెడు డబ్బు పోసి అందులో మూడవ తరగతి చదివిస్తున్నాం. మాపాప తెలివి కలది.కాని కాస్త బధ్ధకస్తురాలు.తనకు అన్నం కూడా నేనో లేక నా శ్రీమతో దగ్గరుండి తినిపించాలి.లేకుంటే అలాగే అన్నం తినకుండా రోజంతా వుండి పోతుంది.అందుకని తనకు స్కూలుక్కూడా లంచ్ తీసుకు వెళ్ళడానికి మాకు నమ్మకమైన ఓ పని మనిషిని పెట్టుకున్నాం.ఆమే పాపకు లంచ్ తినిపిస్తుంది.సాయంత్రం ఇంటికి తీసుకువస్తుంది.

ఓ రోజు నా శ్రీ మతి బాగా తినగలిగిన ఓ మనిషికి సరిపడేంత పాసి పోయిన అన్నాన్ని,కూరల్ని చెత్త బుట్టలో వేస్తోంది గమనించాన్నేను. వెంటనే ఆమెతో "అంత మితిమీరి వండుకోవడమెందుకూ?అది అలా పాసి పోయిన తరువాత పడేయడమెందుకూ?"అని కాస్త కొపంగా అడిగాను. అందుకావిడ సాధారణంగా నా ముఖంలోకి చూస్తూ "పాప రాత్రి మీరు బజారు నుంచి తెచ్చిన జంక్ ఫుడ్డును తిని భోంచేయకుండా పడుకొందండి. అందుకే ఆ భోజనం మిగిలి పోయింది. పాసి పోయిన భోజనం తినలేముగా!అందుకే పడేస్తున్నాను “అంది.

నాకు కోపం కట్టలు తెంచుకొంది. ఎలాగోలా తమాయించుకొని "అయినా అంత ఫుడ్డును చెత్త బుట్ట పాలు చెయ్యక పోతే పనిమనిషికి యవ్వలేక పోయావా? “అడిగాను నా ముఖంలో కోపాన్ని కనుబరుస్తూ.

"పని మనిషికి ఇవ్వడం నాకు ఇష్టం వుండదు.అందుకే అలా చేశాను"అని తెగేసి చెప్పింది నా శ్రీమతి. ఇక ఆమెతో మాట్లాడ్డం వ్యర్థమనుకొని కోపాన్ని దిగమింగు కున్నాను.అయినా మనసు వూరుకోలేక "అలా అంతంత ఫుడ్డును పడేయడంలో నష్టం మనకే తెలుసుకో!నిర్ణయం నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను"అనిమౌనంగా పడగ్గదికెళ్ళి దిన పత్రిక చదవడంలో నిమగ్నమైయ్యాను.

ఆ ఘటన మా యిద్దరికి ఓరెండు రోజులపాటు మాటలు లేకుండా చెసింది.మరో రెండు రోజుల్లో మా మధ్య వున్న ఆ కోప తాపాలు సర్దుకొని మామూలు పరిస్థితులు నెలకొన్నాయ్.

ఓ నాలుగు రోజులు గడిచిన తరువాత నా శ్రీమతి నాతో "ఏమండీ!సెలవుల్లో వున్నారని అలా తిని మంచానికి అడ్డం పడి నిద్ర పోకపోతే వంట, ఇంటి పనుల్లో నాకు కాస్త సహాయం చెయ్యొచ్చుగా!"చతురుగానే అడిగింది.

"ఇదిగో! నేను ఆఫీసుకు సెలవు పెట్టింది రెస్టు తీసుకోవడానికి కానీ నీకు పనులు చేయటానికి కాదు"అనిచెప్పి మారు మాటకు చోటివ్వకుండా గట్టిగా కళ్ళు మూసుకొని ముసుగు తన్ని పడుకున్నాను. అయితే నా మనసేమో ఆమె అన్న మాటల్లో న్యాయముందనుకొని రేపటి నుంచి తను చేసుకొంటున్న పనుల్లో సహాయ పడాలని నిర్ణయం తీసుకొంది.

అందుకే అనుకున్నట్టే మరుసటి రోజు ఉదయం నేను లేచిన దగ్గరి నుంచి నా శ్రీమతికి వంట, ఇంటి పనులతో పాటు మార్కెట్టుకు వెళ్ళడాలంటూ అన్నిటిలో సహాయ పడుతూ,అప్పుడప్పుడు ఆమెతో చతుర్లాడుతూ,చిన్నచిన్న చిలిపి చేష్టలతో స్వల్పమైన ఆనందం పొందుతూ హాయిగానే వున్నాను.

నేను అలా హాయిగా నా సెలవులను ఎంజాయ్ చేస్తున్న సమయంలో మా పాపకు లంచ్ తీసుకువెళ్ళే పని మనిషి వాళ్ళ బంధువుల పెళ్లని చెప్పి వారం రోజులు సెలవు తీసుకొని వూరెళ్ళింది.దాంతో మా పాపకు లంచ్ తీసుకు వెళ్ళడం,ఆమెను సాయంత్రం ఇంటికి తీసుకు రావడమన్న ఆ రెండు పనులను కూడా నాకే అప్ప చెప్పింది నా శ్రీమతి. అది మా పాపతో కూడికొన్న విషయం కనుక నేనూ తప్పదన్నట్టు వెంటనే ఒప్పేసుకొన్నాను.

మరుసటి రోజు పాపకు లంచ్ తీసుకొని స్కూలుకు వెళ్ళాను.రోజూ మా పాప లంచ్ తినే చెట్టు క్రింద కూర్చొన్నాను. కాస్సేపటికి లంచ్ బెల్ మోగింది. పిల్లలందరూ బిలబిలమంటూ డైనింగ్ హాలుకు వెళ్ళారు.కొందరెమో చెట్లక్రిందకొచ్చి కూర్చొని లంచ్ బాక్సులు విప్పుకొని తినసాగారు.

మా పాప కూడా వచ్చింది. నేను తయారుగా వుంచుకున్న లంచ్ బాక్సును విప్పి మా పాప ముందుంచి స్పూను చేతికందించి నీళ్ళ బాటిల్ను ప్రక్కనుంచాను.పాప అన్నంలో చారు కలుపుకొని స్పూనుతో అటూ ఇటూ కెలుకుతూ అప్పుడప్పడూ ఓస్పూను అన్నం నోట్లో పెట్టుకొంటూ నాతో కబుర్లు చెబుతూ తింటోంది.అప్పుడు నేను' మాపాప అన్నం మొత్తం తినాలిరా భగవంతుడా!'అని మనసులో అనుకొంటూ ఆమె కబుర్లను వింటూ అటుగా చూస్తుండగా మా పాపలా ఇంకో సెక్షన్లో మూడవ తరగతి చదువుతున్న ఓ పాప లంచ్ బాక్సుతో వచ్చింది. మా పాప వద్దకొచ్చి'హాయ్ 'చెప్పి కాస్త దూరంలో మ్యాటును పరచుకొని చక్కగా బాసింపట్లు వేసుకొని లంచ్ బాక్సు విప్పుకొంది. చిన్న ప్లేటులో తను తినగలిగినంత అన్నం పెట్టుకొని చారుతో కలుపుకొని దుంప వేపుడును నంజుకొంటూ పది నిముషాల వ్యవధిలో చక్కగా తింది. దాదాపు సగం అన్నం,చారు,దుంప వేపుడును బాక్సులోనే వుంచుకొని సర్దుకొని లేచి చేతులు కడుక్కొంది.మా పాపేమో ఇంకా అన్నాన్ని కెలుకుతూ మరో మూడూ స్పూనులు మాత్రమే తింది.అప్పుడు ఆ పాపతో మా పాపను పోల్చుకోవడం తప్పని సరైంది నాకు.

"ఇక అన్నం వద్దు డాడీ! అన్నాన్ని పడేయండి.నేను మంచి నీళ్ళు తాగి చేతులు కడిగేసుకొంటాను “అంది మా పాప బధ్ధకంగా.

"కాస్త తినమ్మా! నీకు చాక్ లెట్లు కొని పెడతాగా “బ్రతిమాలాను.

"నో డాడీ! నేను రోజూ తినేంతే తిన్నాను. ఇక తినలేను “అంటూ భీష్మించుక్కూర్చొంది.

"సరే నీ యిష్టం" అన్నాను.అంటే ప్రతి రోజూ మా పని మనిషి వద్ద కూడా ఇలాగే చేస్తుందనుకొన్నాను.వాళ్ళ అమ్మ అంత కష్టపడి వండి బాక్సులో పెట్టి పంపుతుంటే మా పాప దాన్ని చెత్త బుట్ట పాలు చేస్తోందని అప్పుడు గ్రహించాను.మా పాప విషయంలో కూడా నాకు కాస్త కోపంతో కూడికొన్న బాధ కలిగింది. సర్దుకోక తప్పలేదు.

ఇక అవతలి పాపయొక్క క్రమశిక్షణతో కూడికొన్న మంచి పధ్ధతులు నన్ను ఆకట్టుకొన్నాయ్ .అయితే అదే సమయంలో తను తిన్న అన్నం పోను ఎక్కువ అన్నాన్ని బాక్సులో ఎందుకు దాచుకొందో అర్థంకాక ఒకవేళ మిగిలిందని ఇంటికి తీసుకు వెళుతుందేమోనన్న సందేహం నాకు రాగా, ఆ సందేహాన్ని అప్పుడే నివృత్తి చేసుకోవాలన్న వుద్దేశ్యంతో

"పాపా! అంత అన్నాన్ని పక్కన పెట్టావే...దాన్ని తీసుకొచ్చి ఈ చెత్త బుట్టలో పడేస్తావా?"అడిగాను మా పాప కెలికి వదలి పెట్టిన అన్నాన్ని అక్కడే వున్న చెత్త బుట్టలో వేస్తూ.

"లేదంకుల్ !గేటుకు వెలుపల ఓ ముసలి భిక్షగత్తె వుంది. ఆమెకు పెడపతాను"అంది ఆ పాప. ఆశ్చర్య పోయాన్నేను. ‘మూడవ తరగతి చదువుతున్న ఆ చిన్న పాపకు ఇంతటి గొప్ప మనసా!?'పాప తన ఆకలి తీర్చుకోవడం మామూలే! కాని ఇంకొకరి ఆకలి తీర్చాలనుకోవడంలో ఆమెలోని జాలి,దయలకు అద్దం పట్టి నట్టుంది.

"ఏమ్మా! ఆ భిక్షగత్తెఎంగిలి పడ్డ అన్నం తినదా?” సందేహంతో అడిగాను.

"ఆమెకు ఎలా పెట్టినా తింటుందంకుల్ !కాని ఎంగిలి పడ్డది ఏదైనా సరే ఇంకొకళ్ళకు తినమని యివ్వకూడదట.అది పాపమని మా డాడీ చెప్పారు.” ఈ సారి షాక్ తిన్నాన్నేను.

కారణం నేనెప్పుడు నా పాపకు అలాంటి మంచి మాటలు చెప్పన పాపాన పోలేదు.

కొద్దీ క్షణాల తరువాత "అంటే ఇలా రోజూ ఆవిడకు అన్నం పెడుతుంటావా? “ప్రశ్నించాను.

"అవునంకుల్ ముసలావిడ నన్ను నమ్ముకొనే వస్తుంది.మా డాడీ చెప్పారూ...ప్రపంచంలోనే ఫుడ్డును వేల టన్నుల కొద్ది వేస్టు చేసేది మన దేశమట. అలాగే అన్నం లేక ఆకలితోనే ఎక్కువ మంది ప్రాణాలను కోల్పోయేది కూడా మన దేశంలోనేనట. అందుకని మనకు ఎక్కువ అనిపించే అన్నాన్ని వ్యర్థం చేయకుండా ఆకలితో వున్న మరొకళ్ళకు పెట్టాలని మా డాడీ చెప్పారు. ఆ పనే నేను చేస్తోంది. రండి మీ కాముసలావడను చూపుతాను “అంటూ నా చేయి పట్టుకొని గేటుకు బయట చెట్టుక్రింద కూర్చొని వున్న ఆ భిక్షగత్తె వద్దకు తీసుకొని వెళ్ళి నేను చూస్తుండగానే ఆమె బాక్సులోని అన్నం, చారు, దుంప వేపుడు భిక్షగత్తె పళ్ళెంలో వేసింది ఆపాప. ఆ భిక్షగత్తె ఆవురావురంటూ అన్నాన్ని కలుపుకొని తినసాగింది. చలించి పోయాన్నేను.

ఇంత చిన్న వయస్సులో ఈ పాపకు అంతటి గొప్ప మనసునిచ్చిన ఆ భగవంతుడికి, పధ్ధతిగా తీర్చి దిద్దుతున్న ఆమె తల్లి,తండ్రికి మనసులోనే దణ్ణం పెట్టుకొన్నాను.అదే సమయాన ఆ పాప చెప్పినట్టు మన దేశంలో టన్నుల కొద్ది ఆహారాన్ని వ్యర్థం చేస్తున్నారని, అన్నము లేకుండా చనిపోయే జనం కూడా మన దేశంలోనే ఎక్కువ మంది వున్నారని అప్పుడు తెలుసుకున్న నేను అదః పాతాళానికి కృంగి పోయాను.ఆపాప చెప్పిన మాటల్ని అస్సలు వూహించ లేక పోయాను,ఆ పాప ఎప్పుడు తన క్లాసుకు వెళ్ళి పోయిందో కూడా నేను గమనిచలేదు,ఇక నా మనసు పదే పదే అదే...ఆ పాప మాటల్ని ఆలోచింప సాగింది.ఆ పాప చెప్పిన ఆ మాటల్ని ఇంకాస్త వివరణతో నా ఇంట్లో నా పాపకు వాళ్ళమ్మకు చెప్పాలనుకొన్నాను.చెప్పడమేకాదు ఆ పాలసీని వెంటనే మా ఇంట్లో కూడా అమలు పరచాలనుకున్నాను .ఇందు వల్ల నా ఇంట మిగిలిపోయే ఫుడ్డు వ్యర్థంగా చెత్త బుట్టకు పోకుండా ఆ ఫుడ్డును సంపాయించుకునేందుకు శక్తి లేని వికలాంగులకు, వృధ్ధులకు,అనాధలకు చేరేలా చేయాలనుకున్నాను.అవును.'నో ఫుడ్డు వేస్టు' అన్నమాటను నా మనసులో రాసుకొని దాన్ని రేపటినుంచే అమలుపరచాలని నిర్ణయం తీసుకొని నా పాపను క్లాసుకు పంపించి నేను బైకు వద్దకు నడిచాను.                     

 

 

 

 

 

మరిన్ని కథలు
padava sivudu