Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
yabhai ella pellaaniki premalekha

ఈ సంచికలో >> కథలు >> రచయిత రాంబాబు

rachayita rambaabu

భార్య భానుమతి మీద పోటి పడి రచయిత కావాలనుకొంటున్న రాంబాబు గత నెల్లో   తన ముప్పై రెండవ కధను రాసి పత్రికాఫీసుకు పంపాడు. ఆ కధ ఎంపికైందని,  ఈ మాసమే ప్రచురింపబడి పత్రికలో వస్తుందని  ఆ పత్రికాఫీసులో పని చేసే కుర్రాడొకడు చెప్పగా దాని తాలూకు పత్రిక  ఈ రోజే తనకు పోస్టులో వస్తుందని  ఇంటి వసారాలో అటూ ఇటూ తిరుగుతూ నిముషానికోమారు పోస్టుమ్యాన్ కోసం  రోడ్డు వేపు చూస్తూ వున్నాడు.     అంతలో వంటింట్లోనుంచి అట్లకాడ చేతుంచుకొని అలాగే పరిగెత్తినట్టు భర్త రాంబాబు వద్దకొచ్చింది భార్య భానుమతి.

"ఏంటీ....భోజనానికి రమ్మని మిమ్మల్ని ఎన్ని సార్లు పిలవాలి?"యుధ్ధవీరుడిలా  అట్లకాడను అటూ ఇటూ తిప్పుతూ అడిగిందిాభానుమతి.

"అట్లకాడ పాతదైపోతే ఇంకొకటి కొనుక్కొస్తాను లేవే!అంత మాత్రానికే యుధ్ధానికి దిగాలా? లోనికెళ్ళు. అసలే నేను టెన్షనుగా వున్నా."అన్నాడు రాంబాబు.

భానుమతి అటు తిరిగి తనలో తానే'అయ్యోరామ సరైన చెవిటి మేళం మొగుడ్రా బాబోయ్ అనుకొని "ఇదిగో! నేను మిమ్మల్ని పిలుస్తోంది భోజనానికి రమ్మని.అవతల నాకు సగానికి రాసుంచిన కధను పూర్తి చేసి  పత్రిక్కు పంపాల్చిన అవసరముంది.రండి" .

"ఏమిటీ...నేను  రానంటే  భోజనం మొత్తం నువ్వే మెక్కేస్తావా!? ఏమైనా చేసుకో...వెళ్ళు! పోస్టుమ్యాన్ను చూసే వరకు నేను లోనికి రాను "

'అయ్యోరామ!ఎంతగా అరిచినా వినిపించి  చావదు ఈ మనిషికి.ఏమండీ!జేబులో వున్నఆ చెవిటి మిషన్ను చెవికి పెట్టుకొండి. హుఁ... ఆ పనీ నేనే చేసి పెట్టాలిగా.ఇదిగో! నిద్ర పోయేటప్పుడు తప్ప తతిమ్మా వేళల్లో మీ చెవికి దాన్ని తగిలించుకునే వుండాలి  "అంటూ జేబులో వున్న చెవిటి మిషన్ను తనే తీసి చెవికి తగిలించి" రండి భోజనానికి"చెయ్య పట్టుకు లాగింది.

"అది కుదరదమ్మాయ్ !ఈ రోజు పోస్టుమ్యాన్  నాకు సంతోషకరమైన సందేశాన్ని పోస్టులో మోసుకొస్తున్నాడు.అది తీసుకొని కాని లోనికి రాను..నువ్వెళ్ళు" అన్నాడు చెయ్య విడిపించుకొని.

"అమ్మో!అంటే కొంపతీసి తమరూ  రచయితై పోవాలని రాసిన  మీ ముప్పై రెండవ కధను వాళ్ళ పత్రికలో వేసుకున్నారా ఏంటి"పుసుక్కున నవ్వింది  భానుమతి.

"నవ్వుతావేంటి!నవరసాల కలగలుపుతో ఉత్కంఠభరితంగా సాగిన ఆ నా కధ అందులో వస్తుందమ్మా!ఇదిగో... కాస్త క్లోజుగా ఇటురా...మొన్నే పత్రికాఫీసులోని  పనబ్బాయిని  చూసి ఓ వంద కొట్టా!వాడే విషయాన్నిమొత్తం చెప్పాడు.నువ్వే కాదమ్మా రచయిత్రివి.మేమూ

రచయితలమే.ఉత్తరాల శీర్షికకు  మేము రాసిన వుత్తరాలు  పత్రికల్లో ఎన్నో వచ్చాయి .కాకపోతే నువ్వు పుల్ టైం రచనలు చేస్తున్నావు. అఫీసు  పని ఒత్తిడివల్ల మావల్ల కావట్లేదు.అంతే తేడా"అంటూ అటు రోడ్డు వేపు చూస్తుండగా పోస్టు మ్యాను సైకిల్లో వచ్చి దిగి పెద్ద కవరొకటి చేతికిచ్చి కాగితంలో సంతకం పెట్టించుకొని వెళ్ళి పోయాడు.

"అబ్బా నిజంగా మీ ఆనందానికి ,తపనకు అవధుల్లేవండి,రండి...లోనికొచ్చి కవర్ను విప్పి చూడండి బాబూ...! అది పత్రికో లేక తిరిగొచ్చిన మీ కధో తెలిసి పోతుంది".

"అది కుదర్దు.ఇక్కడే చూసుకుంటా... నీకేమైనా అభ్యంతరమా?"అని సినీ నటుడు బ్రహ్మానందం స్టయిల్లో కవరును పరాపరా పీకీ అటు పారేసి చూశాడు  రాంబాబు. ఇంకేముంది.వచ్చింది  కధను అచ్చు వేసిన పత్రిక కాదు.ప్రచురణకు నోచుకోని తన కధే!రాంబాబు ముఖం క్షణాల మీద రంగులు మారి తాటి ముట్టెలా అయ్యింది.అంతలో కధతో పాటు కవరులో వున్న సంపాదకుని  వుత్తరాన్ని చేతికి తీసుకుంది భానుమతి.

"నన్నీ వుత్తరాన్ని చదవమంటారా లేక మీరే చదువుకుంటారా"అడిగింది అట్లకాడను ప్రక్కన పెడుతూ.

"పర్వాలేదులే...చదువు!  పెళ్ళానివేగా !నేనేమీ ఫీల్ కానులే" దీనంగా వచ్చాయా మాటలు.

"ఓకే! రాంబాబుగారికి!పట్టు విడువని బట్టి విక్రమార్కుడిలా ,పద్దెనిమిది సార్లు మన దేశం పైకి దండెత్తిన గజినీ మొహమ్మదులా ఇప్పటికి ఇరవై కధలకు పైగా మా పత్రిక్కు పంపారు.మేమూ ఓపిగ్గా చదివి అన్నిటినీ త్రిప్పి పంపాము మీ ఓపికను హర్షిస్తూ. ఏదేమైనా మీరు రాసిన మొదటి కధను ఇప్పుడు రాసిన ఈ కధతో పోల్చుకుంటే  బోలెడు ఇంప్రూవ్ మెంటు వుంది. పట్టు విడవకుండ ప్రయత్నించడి. బెస్ట్ ఫ్  లక్ అని వుందండి."కాస్త బాధగానే చదివి ముగించింది భానుమతి.

" పట్టు విడువక ప్రయత్నించడి అని రాశారుగా!ఇప్పుడేం చేయ్యాలి భాను"ప్రశ్నించాడు.

"చేసేదేముంది.ప్రయత్నించాలంతే!అవునండీ...బలమైన కధా వస్తువు ఎన్నుకోవాలి.చక్కటి శైలితో అందరికీ అర్థమైయ్యే భాషతో చిన్న చిన్న పదాలతో కధను ఆసక్తి కరంగా నడపాలి.ముఖ్యంగా కధా వస్తువు కొత్తగా వుండాలి. మీకు ఆది,శనివారాలు లీవులేగా! ఆ సమయాల్లో నేను కధను రాసే పద్దతిని నేర్పుతాను. నేర్పుకొండి. ఇప్పుడు భోంచేద్దురుగాని పదండి"అంటూ లోనికి నడిచింది భానుమతి.

"ఓకే! భోంచేసిన తరువాత నేనేంచేయ్యాలమ్మా"గోముగా అన్నాడు భానుమతి చేయి పట్టుకొని రాంబాబు.

ఆగి అలా భర్త ముఖంలోకి చూస్తూ"ఏంచేస్తారూ!నేను రఫ్ గా రాసి వుంచిన ఆ కధను ఫైర్ చెయ్యండి చాలు." అంది భానుమతి పెదాలపైకి నవ్వు తెచ్చుకొని.

©©©©©©                     ©©©©©©                     ©©©©©©

నెల తరువాత---

"ఇక లాభం లేదండి.మీకు కధలు రాయడం రాదు. కనుక ఆ పనిని అటకెక్కించేసి హాయిగా ఆఫీసు పనులకు పరిమితమైపొండి.  నాతో సరదాగా వున్నండి చాలు"అంది  భానుమతి ఇంటి ముందు మల్లె తీగకున్న మల్లె మొగ్గలను కోస్తూ 'పనికిరాని మొగుడా!ఏదో చదివి ఏడ్చావని పనైతే వచ్చింది కాని రచనలు చేయడం నీ వల్లకాదు. మానుకో'అని ముఖం మ్మీదే అనలేక.

"అంతేనంటావా!రచనలు చేయటానికి నేను పనికి రానంటావా?విను భానూ!నేను బాగా ఫామ్ లో వున్న ఓ  రచయిత్రి మొగుణ్ణి.త్వరలో మంచి కథావస్తువును ఎన్నుకొని చక్కటి కధను  రాసి దాన్ని పత్రికలో వచ్చేటట్లు చూస్తాను.ఇది నా శపధం"అంటూ ఉక్రోషంగా భానుమతి దగ్గరకు నడిచాడు.

విరగబడి నవ్వింది భానుమతి.అయినా భర్తకు భరోసాగా"అలా జరిగితే నేనే మీకు మొదటి పాఠకురాలినై సంతోషిస్తానండి" .

"చూస్తావుగా!నా శపధం నెగ్గి తీరుతుంది...ఆఁ"

"మంచిదండి.అయినా ఒక్కమాట చెప్పాలని వుంది."

"ఏమిటది?"

"అందరూ అన్నీ చేయలేరు.కొందరికే అవి పరిమిత మన్నట్టు  మన సింధులా  నేను వరల్డు టెన్నిస్  ప్లేయర్ కాలేను. ఆమె నాలా కధలూ రాయలేదు.ఇంతెందుకూ ఆఫీసు వర్కులో మీరు యమా ఘటికులని విన్నాను.మీలా నేను కాగలనా!?" అని అంటుండగా పోస్టుమ్యానొచ్చాడు.  భానుమతి పేరా వచ్చిన  ఓ కవరిచ్చి వెళ్ళి పోయాడు.

భానుమతి కవర్ను ఓపెన్ చేస్తుండగా"ఏం కవరది భానూ?"మెల్లగా అడిగాడు రాంబాబు.

అప్పటికే కవరు ఓపెన్ చేసి చూస్తూ "ఇదా ... నేను  దీపావళి కధల పోటీకి పంపిన కధకు మొదటి బహుమతి వచ్చినట్టు తెలుపుతూ వచ్చిన వుత్తరంలే"అంది భానుమతి

"అలాగా!నాకెంత సంతోషమో!"అన్నాడు రాంబాబు తనలోని ఈర్ష్యను బయట పెట్టకుండా.

"పోనిండి.కధలు నేను రాస్తున్నానుగా .మీరు ఆ ప్రయత్నం మానుకొని తతమ్మా ఇంటి విషయాల మీద దృష్టి సారించండి చాలు"అంటూ నాట్యం చేస్తున్నట్టు లోనికి నడుస్తుంటే.....

"నో అలా కుదరదు భానూ ఎలాగైగా సరే  కధ రాస్తాను,పత్రికకు పంపుతాను అది అచ్చయిన తరువాత నీకు చూపుతాను.ఓ కే!" ఓ రకమైన ఉత్తేజంతో ఆమె వెంట నడిచాడు రాంబాబు.

మరో నెల గడిచింది....

"సార్ పోస్ట్ !"అంటూ కవరొకటి వరాండాలో విసిరేసి వెళ్ళి పోయాడు పోస్టుమ్యాన్ .

ఆ మాటల్ను విన్న రాంబాబు వరండాలోకి వచ్చి కవరును చేతికందుకొని చూశాడు.అది పత్రికాఫీసునుంచి తన పేరా వచ్చిందే!తనకు అశ్చర్యం. ఈసారి కధ తిరిగి రాలేదు.

"ఏంటండి!కవరు నాకొచ్చిందేనా?" వంట గదిలోనుంచి అడిగింది భానుమతి.

"కాదు...నాకొచ్చింది"అంటూ ఓపెన్ చేశాడు.చదివాడు.ముఖం వెయ్యి కాంతులతో వెలిగి పోయింది.పాత నటుడు రంగారావులా నవ్వాడు.నవ్వుతోటే ఆనందంలో మునిగి తేలుతూ "చూశావా!నన్ను పత్రికాఫీసుకు రమ్మని కబురొచ్చింది" పత్రికలో కధ పడ్డంతగా సంబరపడి పోతూ అన్నాడు.

"అబ్బో సంబడం.వుత్తరం వస్తే కధ ఎన్నికైనట్టు కాదండి.అందులో ఏదేని మెలిక వుంటుంది.అక్కడికి వెళితే కాని తెలీదు మీకు!"అంటూ దగ్గరకొచ్చింది భానుమతి.

"అయితే ఏదో లిటిగేషన్  వుందంటావా"భయంతో వచ్చాయా మాటలు.

"అక్కడికి వెళితే కదా తెలిసేది"

"అయితే రేపే వెళతాను.వాళ్ళడిగే మెలిక ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పత్రికలో కధను వేసేలా చేసుకొంటాను" అంటూ ఇంట్లోకి నడిచాడు .ఈ సారి ఎలాంటి కామెంటు  చేయకుండా జాలితో భర్తను చూసింది భానుమతి.

మరుసటి రోజు ఆఫీసుకు ఫోన్లోనే సెలవు చెప్పాడు.పదిగంటలకల్లా స్నానమదీ చేసి టిఫన్ ముగించుకొని చక్కగా ఓ పేరున్న రచయిత స్టయిల్లో భుజానికి పొడవాటి జోలె సంచిని తగిలించుకొని బైకులో పత్రికాఫీసుకు బయలు దేరాడు. బైకును పార్కు చేసి పత్రికా సంపాదకుడి గదికి నడిచాడు రాంబాబు.

"ఎక్స్ క్యూజ్ మీ సార్ ! ఐయామ్ రాంబాబు.కధల రచయతను.మీరు వుత్తరం వేస్తే వచ్చాను"

"ఓఁ ...మీరా!ప్లీజ్ కూర్చొండి,"అని షేకండ్ యిచ్చాడు సంపాదకుడు..రాంబాబు కూర్చొన్నాక "ఏం తీసుకుంటారు?కాఫీ,టీ" అని అడిగాడు.

"పర్వాలేదు సార్ !విషయాన్ని చెప్పండి." గతంలో నాలుగైదు పత్రికాఫీసుల చుట్టు తిరిగిన అనుభవంతో పత్రిక సంపాదకులు కనీసం రెండు మాటలు కూడా మాట్లాడని సందర్భాలను ఎదుర్కొన్న తనకు  సాదర ఆహ్వానానికి ఆనందించాడు. వుత్తరం సంపాదకుడి చేతికిచ్చాడు.
వుత్తరాన్ని ప్రక్కన పెట్టి "కంగ్రాట్సండి.మీ కధను తీసుకున్నాం.కాకపోతే కొన్ని సందేహాలున్నాయి,వాటిని నివృత్తి చేసుకునే నిమిత్తం మిమ్మల్ని పిలిపించాము"

కధను తీసుకున్నామని చెప్పిన సంపాదకుడి మాటను అండర్ లైను చేసుకున్నాడు రాంబాబు. సంతోషంతో వుబ్బిపోతూ"అడగండి సార్ !మీసందేహాలేమిటో"అని అంటుండగా కధను బయటికి తీశాడు సంపాదకుడు.

"ఇందులో కధా వస్తువు చాలా బలమైంది.కధను నడిపిన తీరు చాలా బాగుంది.శైలి గొప్ప రచయితలను తలపిస్తుంది.మొత్తంలో కధ సూపర్బ్ . కాని ఈ కధను నేను ఎక్కడో,ఎప్పుడో చూసి చదివినట్టు ఫీలింగ్ ! ఈ కధ మీదేనా!?పైగా కధ చివరిలో మీ హామీ పత్రం లేదండి.ఈ చివరి పేజీలో మీ దస్తూరితో హామీపత్రం రాయండి"అని పెన్ను,కధను తన ముందుంచాడు సంపాదకుడు.

షాక్ తిన్నాడు రాంబాబు. ముఖకవలికలు మారిపోయాయి.నోట మాటరాలేదు.పెన్ను పట్టుకున్నచేయి వణకనారంభించింది. సంపాదకుడు 'కధను ఎక్కడో,ఎప్పుడో చదివిన ఫీలింగ్' అన్న మాట మళ్ళీ మళ్ళీ మనసులో మెదులు తుండగా మౌనంగా సంపాదకుడి ముఖంలోకి చూశాడు రాంబాబు.

"కానీండి రాంబాబు గారూ! హామీ పత్రం రాసి సంతకం చేశారంటే వెంటనే బొమ్మ గీయించి ప్రింటింగుకు పంపుతాను"అన్నాడు సంపాదకుడు.
రాంబాబు అదోలా అయిపోయాడు.పెన్ను సంపాదకుడి చేతికిచ్చాడు.మౌనం వీడి "సారీ సార్ !ఈ కధ నేను రాసింది కాదు.నా శ్రీమతి భానుమతి రాసింది. ఆరేళ్ళ క్రితం మీ పత్రికలోనే  వచ్చింది.ఈ కధ మీకు గుర్తుండదన్న వుద్దేశ్యంతో ,నేనూ రచయతనై పోవాలన్న ఆశతో మా ఆవిడకు తెలీకుండ  ఆమె కధను కాపీ చేసి నా పేరుతో పంపాను.ఇది తప్పు మాత్రమే కాదు... కధను తస్కరించటమే అవుతుంది..నన్ను  క్షమించండి సార్ ! వస్తాను"అంటూ కధను సంచిలో పెట్టుకొని బైకు వద్దకు నడిచాడు రాంబాబు.చూస్తూ వుండి పోయాడు సంపాదకుడు.

మరిన్ని కథలు