Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి..http://www.gotelugu.com/issue240/657/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి)...

కాచిగూడ రైల్వే స్టేషన్... హైదరాబాద్ లోని ప్రధాన రైల్వే స్టేషన్ ...

1916 సంవత్సరంలో నిజాం నవాబు కట్టించిన ఈ స్టేషన్   ప్రాచీన ముస్లిం సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. అద్భుతమైన, కళాత్మకమైన  నిర్మాణం ..శ్వేత వర్ణంలో వెన్నెల సౌధంలా ఉంటుంది.  అన్ని వైపులా మినార్ లతో రాజ ప్రాసాదం లా ఉంటుంది. బయట నుంచి చూస్తే తాజమహల్ లాంటి ఒక యాత్రాస్థలం లాగా అనిపిస్తుంది. మొత్తం ఐదు ప్లాట్ ఫార్మ్స్ ఉంటాయి.. బెంగుళూరు ఎక్స్ ప్రెస్, తుంగభద్రా ఎక్స్ ప్రెస్ , జైపూర్ ఎక్స్ ప్రెస్ ఈ స్టేషన్ నుండి బయలుదేరతాయి.

ఎక్కడికి వెళ్ళాలో , ఏం  చేయాలో  తెలియని ఒక అయోమయ స్థితిలో యవ్వన ప్రాంగణంలో అడుగు పెట్టిన  ఇద్దరు యువతీ యువకులు తమ మధ్య ఏర్పడిన ఒక అనిశ్చిత, బలహీనమైన ఆకర్షణతో తమ కలయికకు ఏర్పడుతున్న అవరోధాలను తొలగించుకోడానికి,  తమ స్వేచ్చకి భంగం కలగని అనుకూల పరిస్థితులను కల్పించుకోడానికి ఇవాళ  అక్కడ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.

సమయం మధ్యాహ్నం పన్నెండు  దాటి తొమ్మిది నిమిషాలైంది ...

ఒక ఆటో వచ్చి ఆగింది. అందులోనుంచి రమేష్ చేతిలో సూట్ కేస్ తో దిగాడు.  ఒకసారి చుట్టూ కలయ చూసి సూట్ కేస్ కింద పెట్టాడు. ప్యాంటు జేబులోంచి పర్స్ తీసి ఆటో అతనికి డబ్బులిచ్చి పర్స్ తిరిగి జేబులో పెట్టుకుని కింద పెట్టిన సూట్ కేస్ తీసుకున్నాడు. కొంచెం బెరుకు, కొంచెం హుషారు కలగలిసిన భావాలతో అటూ  ఇటూ చూస్తూ స్టేషన్ వైపు నడిచాడు. ప్రయాణికులతో రద్దీగా ఉంది. లోపలినించి వచ్చేవాళ్ళు, లోపలికి వెళ్ళేవాళ్ళు , అందర్నీ తప్పించుకుంటూ లోపలికి నడిచాడు.   ఎంక్వైరీ కౌంటర్ దగ్గర కొంచెం ఎడంగా నిలబడి ప్లాట్ ఫార్మ్ మీద ఆగి ఉన్న రైలుని చూసాడు. తిరిగి అన్ని కౌంటర్ల దగ్గర క్యూలో నిలబడి టికెట్స్ కొంటున్న ప్రయాణీకులను చూసాడు.  ప్లాట్ ఫార్మ్ మీద హడావుడిగా అటు ఇటూ తిరుగుతున్న ప్రయాణికులను చూసాడు.  తిరిగి చూపులు సగం, సగం కనిపిస్తున్న రోడ్ వైపు తిప్పాడు.

నిన్న ఊరంతా బలాదూర్ తిరిగి  సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ఆకలేసింది.. వంట గది లోకి వెళ్లి గిన్నెలు, డబ్బాలు వెతుక్కుంటూ తల్లి మీద విసుక్కున్నాడు “తిననికి ఏం లేదా ఆకలైతుంది” అని. తల నొప్పితో మూలుగుతున్న ఆవిడ “ నెత్తి  నొస్తుంది బిడ్డా ...దుక్నంలకి పోయి మిచ్చర్ తెచ్చుకో” అంటూ యాభై రూపాయలు ఇచ్చింది.  అది తీసుకుని  హల్దిరాం మిక్స్చర్ పాకెట్ కోసం  కిరాణా కొట్టుకి వెళ్ళిన రమేష్ దగ్గరికి మెరుపులా  వచ్చి ...” రమేష్  నీకోసమే చూస్తున్నా... రేపు మధ్యాహ్నం కాచిగూడ రైల్వే స్టేషన్ కి రా తప్పకుండా రా... మనం వెళ్ళి పోదాం”  అని చెప్పి హడావుడిగా వెళ్ళి పోయింది  గాయత్రి.

ముందు తెల్లబోయినా వెంటనే ఎగిరి గంతేశాడు.  అంటే తనతో వచ్చేయడానికి గాయత్రి ఒప్పుకుంది అనుకున్నాడు. మేఘాల మిద తేలుతూ ఇంటికి వెళ్లి,  రాత్రి అందరు పడుకున్నాక  తన బట్టలన్నీ సూట్ కేస్ లో పెట్టుకుని తను ఎప్పుడూ నిలబడే వేప చెట్టు దగ్గర ఎవరికీ కనిపించకుండా దాచి నిశ్సబ్దంగా వచ్చి పడుకున్నాడు. వేప చెట్టు  వీధి చివరలో ఉంటుంది.. దాని వెనక గోడ ఉంటుంది.. గోడతో ఆ వీధి ఆగి పోయింది.. ఆ గోడ వెనకే కాచిగూడ రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్, ఇస్కాన్ వాళ్ళ కృష్ణ మందిరం.. సాధారణంగా అక్కడికి వేరే వాళ్ళు ఎవరూ రారు.. ఆ కాలనీలో నివాసం ఉండే వాళ్ళు తప్ప. ఎవరికీ కూడా  చెట్టు వెనక్కి పెట్టిన వస్తువు పరీక్షగా చూస్తె తప్ప  కనిపించదు. ఆ ధైర్యంతో అక్కడ పెట్టి నిశ్చింతగా పడుకున్నాడు.

గాయత్రితో పెళ్లి అయిపోయి ఇద్దరూ కలిసి కాపురం పెట్టేసినట్టు కలలు కంటూ నిద్ర పోయాడు కానీ మధ్య, మధ్య లేచి టైం చూసుకుంటూ నాలుగున్నర కాగానే  లేచి బ్రష్ చేసుకున్నాడు. నెమ్మదిగా తండ్రి చొక్కా జేబులో వెతికి నాలుగు వందల యాభై రూపాయలు తీసి జేబులో వేసుకున్నాడు. వంట గదిలోకి వెళ్లి తల్లి దాచుకునే పోపుల డబ్బా వెతికితే నూట ముప్ఫై రూపాయలు దొరికాయి. అన్నీ జేబులో వేసుకుని  బట్టలు మార్చుకుని చప్పుడు చేయకుండా ఇంట్లోంచి బయటికి వచ్చి సూట్ కేస్ తీసుకుని రోడ్డు మీదకి నడిచాడు. దరి దాపుల్లో ఎక్కడా ఆటో కనిపించ లేదు. నెమ్మదిగా నడుస్తూ సిగ్నల్ దాకా వచ్చాక ఆటో దొరికింది. ఆటో చేసుకుని పబ్లిక్ గార్డెన్ కి వెళ్ళాడు. అక్కడే అటూ ఇటూ తిరిగి, హోటల్లో భోజనం చేసి పదకొండున్నర కాగానే మళ్ళి ఆటో చేసుకుని కాచిగూడ వచ్చాడు.

రమేష్ వాచి చూసుకున్నాడు. పన్నెండున్నర.. ఇంకా రాలేదేంది ఈ మె అనుకున్నాడు విసుగ్గా. ఇప్పుడు ఆ స్టేషన్ నుంచి ఏ ట్రైన్ ఉందో అది ఎక్కడికి వెళ్తుందో, ఇద్దరూ ఎక్కడికి వెళ్ళాలో ఏమి తెలియదు.. కానీ గాయత్రి మీద నమ్మకంతో ఓపిగ్గా వేచి ఉన్నాడు.
ఒంటి గంట అయింది.. గాయత్రి రాలేదు..

రమేష్ జేబు లోంచి మొబైల్ తీసి చూస్తూ “ధూ నీ .... ఈమె తాన  ఫోన్ గూడ లేక పాయే ఏడుందో ఏమో “ అనుకున్నాడు.
“అరె రమేషు ఏందిరా ఈడ నిలబడ్డావ్ ... ఏడకి పోతున్నవ్ “  భుజం మీద చేయి పడడంతో ఉలిక్కి పడి చూసాడు. కిళ్ళికొట్టు పాండు పళ్ళికిలిస్తూ నిలబడ్డాడు. అతని చేతిలో చందన బ్రదర్స్ సంచి ఉంది.

రమేష్ ఉలికిపాటు కప్పిపుచ్చుకుంటూ “నువ్వేడినుండి వస్తున్నవ్” అని అడిగాడు.

“బాసర పోయినుంటి...నువ్వేడికి పోతున్నవ్ రా ...” అప్పటికప్పుడు రమేష్ అక్కడ ఎందుకున్నాడో తెలుసుకు తిరాలన్నట్టు అడిగాడు.
“ఊరికి బోతున్న” అన్నాడు రమేష్..

ఇద్దరు కుర్రాళ్ళు ఎంక్వైరీ కౌంటర్ లో అడుగుతున్నారు “అన్నా నిజామాబాద్ పోయే ట్రైన్ ఉందా ఇప్పుడు?”

“ఏ ఊరికి? ఒక్కనివేబోతున్నవా...”

నిజామాబాద్ అని చెప్ప బోయి ఆగి పోయాడు.. . కౌంటర్లో ఉన్న వ్యక్తీ అడిగిన వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు “ మూడున్నరకి పాసింజేర్ ఉంది “  

ఎక్కడికి వెళ్ళాలో తెలియని రమేష్ కి ఆ సమాచారం  ఒక క్లారిటిని ఇచ్చినట్టు అయింది.

పాండు ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు.. సమాధానాలు చెప్పడం  మీద ఆసక్తి లేని రమేష్ అసహనంగా చూపులు రోడ్ వైపు తిప్పాడు. గాయత్రి కనిపించ లేదు కాని ఎందఱో ప్రయాణికులు మాత్రం సూట్ కేసులు, ఎయిర్ బాగులు పట్టుకుని ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటూ వస్తున్నారు..ఎవరో అడ్డుగా నిలబడిన పాండుని తోసుకుంటూ పోడంతో తుళ్ళి పడ బోయిన పాండు వాళ్ళని బండ బూతులు తిట్ట సాగాడు...వాళ్ళు కూడా నాలుగు తిట్టి హడావుడిగా లోపలికి వెళ్ళి పోయారు.

అప్పుడే బాగా వదులుగా ఉన్న చుడిదార్ వేసుకున్న ఒక యువతి జనాన్ని తప్పించుకుంటూ వస్తోంది.. ఆమె చున్ని తల మీద నుంచి చుట్టూ తిప్పి మొహాన్ని కవర్ చేస్తూ చుట్టుకుంది. ఆమె చేతిలో ఒక ఎయిర్ బాగ్, భుజానికి ఒక హ్యాండ్ బాగ్ ఉన్నాయి. ఎవరో తోస్తే పడ బోయి నిలదొక్కుకుని పక్కనుంచి వస్తోంది.

గాయత్రి ఏ క్షణంలో వచ్చినా ఈ పాండు గాడు ఆమెని చూస్తాడేమో అనిపించింది రమేష్ కి అందుకే అతన్ని వదిలించుకోడానికి టికెట్ కొనాలే అంటూ టికెట్ కౌంటర్ వైపు కదిలాడు.

పాండు ఏడికి పోతున్నవ్ రా అని అడుగుతూ రమేష్ వెళ్తున్న వైపు తిరిగాడు.  ఆ తిరగడంలో చూడి దార్ వేసుకుని వస్తున్నా  యువతి ఎదురుగా రావడంతో డాష్ ఇవ్వ బోయి పక్కకి తప్పుకుని వెళ్ళ బోతూ ఆమె వైపు చూసాడు.. అతనికి ఆమె కళ్ళు మాత్రమె కనిపించాయి. ఒక్క క్షణం ఏదో అలోచిస్తున్న వాడిలా అలాగే నిలబడి పోయాడు.. గాయత్రి అతన్ని గమనించనట్టు వేగంగా మెటల్ డిటెక్టర్  కింద నుంచి లోపలికి వెళ్ళి పోయింది.. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ సాలోచనగా తలాడించి బయటకు నడిచాడు పాండు.

పాండు వెళ్ళి పోవడం లోపలి నుంచి ఆ యువతి ,  కౌంటర్ దగ్గర నుంచి రమేష్ గమనించి ఇద్దరూ వారి, వారి స్థలాల నుంచి కదిలి ఇద్దరూ ఒకే సారి ఎంక్వైరీ కౌంటర్ దగ్గరకు వచ్చారు.

ఆమె రమేష్ దగ్గరగా వచ్చి “ఎంతసేపైంది నువ్వు వచ్చి” అని అడిగింది.

రమేష్ ఆమె వైపు అనుమానంగా చూస్తుంటే ఆమె మొహం మీద నుంచి చున్ని పక్కకి తొలగించి “టికెట్ తీసుకున్నావా”  అని అడిగింది.
“గాయత్రీ” ఆమెని చూసిన ఆనందంతో కొంచెం గట్టిగా పిలిచాడు.

“ఇక్కడ ఎక్కువ సేపు నిలబడద్దు... టికెట్ తీసుకో” అంది.

ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు “ఏడికి పోదాం ..”

గాయత్రి తల అడ్డంగా ఆడిస్తూ అంది “తెలియదు.. ఇప్పుడు ఏ ట్రైన్ ఉంటె అది ఎక్కుదాం .”

“నడు నిజామాబాద్ ట్రైన్ ఉందంట గిప్పుడే చెప్పిండు నువ్వు లోపటకి పో మల్ల ఎవరన్న చూడగలర ,,, నేను టికెట్ తీసుకుని వస్త “ అన్నాడు.

సరే గాయత్రి తల వంచుకుని లోపలికి వెళ్ళింది.

రెండు నిమిషాల్లో పాసింజర్ ట్రైన్ కి టికెట్స్ తీసుకుని వచ్చాడు రమేష్.

గాయత్రి అటూ, ఇటూ చూస్తూ అంది “ఎన్నో నెంబర్ ప్లాట్ ఫార్మ్ మీదకి వస్తుందో అడిగావా “

లే ... అడగలే అన్నాడు రమేష్.

గాయత్రి ప్లాట్  ఫాం మీద అటూ ఇటూ తిరుగుతున్న పోర్టర్ ని పిలిచి  అడిగింది ”నిజామాబాద్ పోయే ట్రైన్ ఎన్నో నెంబర్ మీదకి వస్తుంది. “
“మూడో  నెంబర్ ల పొండి”  అన్నాడు అతను.

గాయత్రి వెనక్కి తిరిగి చూసి “నాకు ఆకలిగా ఉంది ఏమన్నా కొందాం” అంది ..

ఇద్దరూ అక్కడే ఉన్న కొట్టు దగ్గరకి వెళ్లి అర డజను అరటి పళ్ళు,, నాలుగు బిస్కెట్ పాకెట్లు చిప్స్ పాకెట్ కొన్నారు. రమేష్ దర్జాగా పర్స్ తెరిచి డబ్బులిచ్చాడు.

ఇద్దరూ కొంచెం దూరంలో కనిపిస్తున్న మెట్ల వైపు నడిచి నెమ్మదిగా మెట్లెక్కి మూడో నెంబర్ ప్లాట్ ఫార్మ్ మీదకి వెళ్ళారు.

గడియారం లో చిన్నముల్లు నెమ్మదిగా రెండు మీదకి వచ్చింది.. ఇద్దరూ వెళ్లి బెంచి మీద కూర్చున్నారు. అరటి పండు గాయత్రికి ఇస్తూ తిను అన్నాడు.

గాయత్రి పండు వలిచి తింటూ జనాన్ని చూడ సాగింది.. వీళ్ళలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటె తామిద్దరిని చూస్తె ... ఒక్క క్షణం గుండె గుభిల్లుమంది.

రమేష్ గొంతు వినిపించింది..” పాండు గాడు  గలిజు గాడు మనలను చూసిండు ఏం లొల్లి చేస్తడో ఏమో” అన్నాడు.

“చేయనీ” నిర్లక్ష్యంగా అంది గాయత్రి..

“నువ్వంటే చున్నీ తో కవర్ చేసుకున్నావు నిన్ను గుర్తు పట్టడు ... కాని నా సంగతి  ఇప్పుడు వాడు మా డాడికి చెప్పిసి ఉండచ్చు...జల్ది ట్రైన్ వస్తే మనం ట్రైన్ల కూసుంటే పరేశానుండదు ..”

గాయత్రి మాట్లాడ లేదు.

“మీ ఇంట్ల తెల్వదా నువ్వు ఇట్లా వస్తున్నట్టు “

“చెప్పి వస్తానా” చిరాగ్గా అడిగింది.

“కాలేజ్ కి పోలేదా.”

“ కాలేజ్ కి వెళ్లాను.. నాకు కడుపులో నొప్పిగా ఉందని ఇంటికి వెళ్ళి పోతానని చెప్పి పర్మిషన్ తీసుకుని వచ్చేసాను. దారిలో ఒక రెడీ మేడ్ షాపులో ఈ డ్రెస్ కొనుక్కున్నా.. నా దగ్గర థౌసంద్ రూపిస్ ఉన్నాయి. ఈ డ్రెస్ నాలుగు వందల అరవై రూపాయలైంది ... ఇది కాక నేను ఇంటి నుంచి వేసుకుని వచ్చిన నా లంగా వోని ఉంది. ““నేను నా బట్టలు తెచ్చుకున్న “

“ఎలా తెచ్చుకున్నావు? ఎవరూ చూడలేదా..”

రమేష్ తను ఎలా తెచ్చుకున్నాడో చెప్పాడు.

గాయత్రి అభినందనగా చూసింది.

“పాండు గాడు చెప్పిండే ఏమో” అన్నాడు మళ్ళి .

“చెప్పనీ  మీ నాన్న ఇప్పుడు స్టేషన్ కి వచ్చి నీకోసం వెతుకుతాడా.. అంత  భయ పడతావేం”  విసుక్కుంది గాయత్రి.

“లే అట్లంట లేను చెప్పిండేమో అంటున్నా “

ఇంతలో వేరే ట్రైన్ ఏదో వస్తున్న అనౌన్స్ మెంట్ వినిపించింది..

ఆ శబ్దానికి ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు.

పేరు తెలియని ట్రైన్స్ వస్తున్నాయి. పోతున్నాయి. జీవితంలో మొదటిసారి ఆ రైలు ప్లాట్ ఫారంనీ, వాటి మీద వస్తూ, పోతున్న రైళ్ళుని  చూస్తుంటే ఇద్దరికీ సరదాగా అనిపించింది.. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం తిరుపతి వెళ్ళారు ఇంట్లో అందరు కలిసి.. ఒకసారి ఒంగోలు వెళ్ళారు తాతయ్య చనిపోయినప్పుడు.. ఒక సారి మేన మావ కూతురు పెళ్ళికి వెళ్ళారు.. అంతే తప్ప ఎక్కడికి వెళ్ళింది లేదు.. ఇప్పుడుమొదటి సారి తను ఈ అబ్బాయితో వేరే ఊరు వెళ్తోంది.. ఎగ్జయిటింగ్ గా ఉంది.. ఒక మూల ఎవరన్నా చూస్తారేమో అనే భయం, మరో మూల చూస్తె చూడనీ ... వెళ్లి చెప్తారు మీ అమ్మాయి ఎక్కడికో వెళ్తోంది అని ... అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నిరంకుశంగా ప్రవర్తిస్తే ఎం జరుగుతుందో .. కచ్చగా అనుకుంది.

నాడు ప్లాట్ ఫార్మ్ చూసోద్దం అన్నాడు బిస్కట్ పాకెట్ ఓపెన్ చేసి రెండు బిస్కెట్లు ఆమె చేతిలో పెట్టి.

ఇద్దరూ కాస్సేపు అలా ప్లాట్ఫారం చివరి దాకా నడిచి వచ్చారు.. కొనుక్కున్న బిస్కెట్ ప్యాకెట్ లో రెండు అయి పోయాయి.. రెండు అరటి పళ్ళు అయి పోయాయి ... చిప్స్ ఖాళ్  చేసి పడేసారు .. విసుగ్గా ట్రైన్ కోసం ఎదురు చూస్తూ మధ్య మధ్య ఎవరన్నా తెలిసిన వాళ్లు కనిపిస్తారేమో అని జనాలను అనుమానంగా చూస్తూ కాలం గడపగా నాలుగు అవుతుండగా నిజామాబాద్ వెళ్ళే పాసింజర్ ట్రైన్ వచ్చింది.
ఇద్దరూ కాస్సేపు ఇదేనా, ఇదేనా అనుకుంటూ, పక్కన ఉన్న వాళ్ళని అడిగి కన్ ఫర్మ్  చేసుకుని ఎక్కేలోగా మిగతా వాళ్ళంతా ఎక్కేసి సీట్ల మీద కర్చీఫ్ లు వేయడం, బాగులు పెట్టడం, కొందరు కూర్చుని వాళ్ళ వాళ్ళ కోసం సీట్లు రిజర్వు చేయడం జరిగి వాళ్లకు కూర్చోడానికి సిటు దొరక లేదు. రమేష్ మొత్తం కంపార్ట్మెంట్ వెతికి ఒక సిటు సంపాదించి గాయత్రిని పిలిచాడు.

ఆ కాస్త స్థలంలో ఇద్దరూ సర్దుకుని కూర్చున్నారు.  భుజాలు , చేతులు, కాళ్ళు తగులుతూ బాగా సన్నిహితంగా కూర్చున్న ఇద్దరికీ కొత్తగా, మత్తుగా ఉంది ..

కొందరు ప్రయాణికులు సీట్లు  దొరక్క నిలబడి ఏ మాత్రం సందు దొరికినా కూర్చోడానికి డేగ కళ్ళతో చూస్త్తున్నారు...

అటు, ఇటూ తిరుగుతున్నవాళ్ళు, టిలు, కాఫీలు అమ్మే వాళ్ళు, బిస్కట్ లు, సమోసాలు అమ్మే వాళ్ళు.. నిలబడిన వాళ్ళని తోసుకుంటూ వెళ్తోంటే వాళ్ళు ఆ తోపులాటలో కూర్చున్న వాళ్ళ మీద పడుతుంటే వాళ్ళు పడిన వాళ్ళమీద తిట్లు  లంకించుకుంటూ  గోల, గోలగా ఉంది. ఆ సమయం లోనే ఒక వ్యక్తీ చివరకి ఒదిగి పోయి కూర్చున్న రమేష్ మీద పడడంతో రమేష్ దాదాపు గాయత్రి మీద ఒరిగి పోయాడు. గాయత్రికి ఒళ్ళంతా జల్లుమంది..తరవాత రమేష్ సరిగా కూర్చున్నా తనని ఆనుకుని నిలబడిన వ్యక్తీ మాటి, మాటికి తోస్తుండడంతో గాయత్రికి మరింత దగ్గరగా హత్తుకుని కూర్చున్నాడు.  ఇద్దరూ పరస్పరం వారి, వారి  స్పర్శలోని హాయిని అనుభవిస్తూ,  ఐదారు గంటల  ప్రయాణాన్ని ఆస్వాదించారు.

నిజామాబాద్ చేరేసరికి ఎనిమిది దాటింది. ఇద్దరూ వారి, వారి బాగులు తీసుకుని ట్రైన్ దిగి  ప్లాట్ ఫారం మీదకి చేరి చేతిలో బాగులతో దిక్కులు చూస్తూ నిలబడి పోయారు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్