Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
all in one robo

ఈ సంచికలో >> యువతరం >>

అప్పుడప్పుడూ అలా! అప్పుడప్పుడూ ఇలా!

Today's children are tomorrow's citizens

పిల్లల్ని పెంచడం ఓ కళ. ఆ కళని మరింత కళాత్మకంగా తీర్చి దిద్దే బాధ్యత నూటికి నూరు పాళ్లూ తల్లితండ్రుల పైనే ఉంది. పిల్లల్ని పెంచడంలో అప్పటి రోజులకీ, ఇప్పటి రోజులకీ చాలా తేడా ఉంది. ఇదివరకటి రోజుల్లో పిల్లలకు ప్రతీ విషయం తల్లితండ్రులు నేర్పిస్తేనే తెలిసేది. కానీ ఇప్పటి రోజుల్లో ఈ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. వారి ఆలోచనలూ ఫాస్ట్‌గానే ఉన్నాయి. చిన్నతనం నుండే హైపర్‌ యాక్టివ్‌నెస్‌ ప్రదర్శిస్తున్నారు ఇప్పటి పిల్లలు. తల్లితండ్రులకు తెలియని ఎన్నో విషయాలు పిల్లల నుండి తెలుసుకోవల్సి వస్తోంది. అంత అప్‌డేట్‌ అయిపోయారు పిల్లలు ఇప్పుడు. అలా వారి మైండ్‌ సెట్‌ని అందుకోవడం పేరెంట్స్‌కి చాలా కష్టమైన పనిగా మారింది ఇప్పుడు రోజుల్లో. ఒక్కోసారి ఈ హైపర్‌ యాక్టివ్‌తో తల్లితండ్రులు చిన్న బుచ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. ఆడగకూడని విషయాలు ఒక్కోసారి పిల్లలు తెలిసి అడుగుతున్నారో, తెలియక అడుగుతున్నారో తెలియని పరిస్థితులు తల్లి తండ్రుల కొంప ముంచేస్తున్నాయి. ఇదివరకటి రోజుల్లో ఈ విషయం చిన్న పిల్లలు మీకు తెలియకూడదు అంటే ఓహో అమ్మ చెప్పింది కదా, నాన్న చెప్పాడు కదా అడగొద్దులే అనుకునే మైండ్‌సెట్‌లో పిల్లలుండేవారు. కానీ ఇప్పుడలా కాదు. కూడదు అన్న విషయంపై మరింత ఆశక్తి కనబరుస్తున్నారు పిల్లలు. అందుకే ఇప్పుడు పిల్లల్ని పెంచడంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. 

పిల్లలకు బహుమతులు కొనిచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. కావల్సిన వస్తువును దక్కించుకునేందుకు మారాం చేసే స్థాయికి పిల్లల్ని మనం అలవాటు చేయకూడదు. ఈ అలవాటు ఊహ తెలిసినప్పటి నుండీ పిల్లలకు అలవాటు చేయాలి. లేదంటే ఆ మారాం కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందికరంగా మారవచ్చు. మన ఆర్ధిక పరిస్థితిని చిన్నతనం నుండే పిల్లలకు అర్ధం అయ్యేలా తెలియ చెప్పాలి. ఇరుగు, పొరుగు వారితో పోల్చుకోవడం వంటి విషయాల్లో పిల్లలకు అవగాహన కల్పించాలి. అందులోని మంచి, చెడులను ఎత్తి చూపాలి. అలాగే ఆశక్తికరమైన విషయాలను గురించి తెలుసుకునే క్రమంలో పిల్లలు ఆడ, మగ మధ్య సంబంధం, తేడాల గురించి కూడా ఆడిగేస్తూ ఉంటారు. ఇవి చాలా చిలిపి ప్రశ్నలుగా అనిపించొచ్చు. ఆ రకంగా వీటిని లైట్‌ తీస్కోకూడదు. అవే ఒక్కోసారి దారుణమైన విషయాలుగా రూపాంతరం చెందే ప్రమాదాలున్నాయి. స్కూల్లో పిల్లలు కొన్ని వందల మనస్తత్వాలున్న పిల్లలతో కలిసి మెలిసి తిరుగుతూంటారు. వారిలో కొంత మంది నాటీ పిల్లలు కూడా ఉంటారు. మన పిల్లలు కూడా ఆ తరహా పిల్లల డిస్కర్షన్స్‌లో పాల్గొనే అవకాశాలున్నాయి. అలాంటి పరిస్థితుల్ని తల్లితండ్రులు చాలా సున్నితంగా అడిగి తెలుసుకోవాలి. 

ఇవన్నీ తెలుసుకోవాలంటే తల్లితండ్రులు ఏం చేయాలి. అప్పుడప్పుడూ తల్లితండ్రులు తమ వయసును పిల్లల వయసుకు తగ్గించేసుకోవాలి. పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారో అలాగే ఆలోచించి, వారి మనస్తత్వాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పిల్లలు దారి తప్పుతున్నారనిపిస్తే, వెంటనే వారిని దారిలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో పిల్లలపై ఒత్తిడిని పెంచడం భావ్యం కాదు. మెల్ల మెల్లగా వారి మైండ్‌ సెట్‌ని మార్చే ప్రయత్నం చేయాలి. వారితో క్లోజ్‌గా ఉంటూ, జాగ్రత్తగా అబ్జర్వ్‌ చేయాలి. పరిస్థితుల్ని తమంతట తాముగా అర్ధం చేసుకునే వాతావరణం మొదట వారికి కల్పించాలి. కొన్ని చెప్పకూడని విషయాలను పిల్లలకి చెప్పాల్సిన అవసరం వస్తే వాటిని డైరెక్ట్‌గా ఖండించకుండా, కన్విన్స్‌ చేసేందుకు ప్రయత్నించాలి. ఎంతటి బిజీయెస్ట్‌ పేరెంట్స్‌ అయినా కానీ తమ పిల్లల కోసం కూడా కొంత టైం కేటాయించండి. మా పిల్లలే కదా మా ఇష్టం.. మా ఇష్టం వచ్చినట్లు మేం పెంచుకుంటాం అనే కొంతమంది తల్లి తండ్రుల ఆలోచన నూటికి నూరు శాతం తప్పు. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. అంటే ఓ నూతన తరాన్ని సమాజానికి అందిస్తున్నాం. సో ప్రియమైన తల్లితండ్రులారా! అందమైన, ఆదర్శమైన భవిష్యత్‌ తరాన్ని అందించే మీ బాధ్యతని బాధ్యతగా నిర్వర్తించడానికి కొంచెం కొత్తగా ఆలోచించి చూడండి.

మరిన్ని యువతరం