Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.... http://www.gotelugu.com/issue241/660/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి)... 

ఇప్పుడు “ఏడకి పోదం” అడిగాడు రమేష్.

గాయత్రి మాట్లాడలేదు. జనాలని, రైళ్ళని చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయింది. కొత్త మొహాలు, కొత్త పరిసరాలు, కొత్త వాతావరణం .... అప్పటిదాకా పొందిన అనుభూతులన్నీ ఆకారం మార్చుకుని భయం అనే వానపాముల్లా మారి ఆమె వెన్నుమిడ పాక సాగాయి.

“ఏందీ మాట్లాడవు” అడిగాడు.

“నాకు భయంగా ఉంది” అంది దాదాపు ఏడుపు మొహం వేసుకుని .

“ షురు జేసినవా ...పరేషాన్ కాకు.. “ అన్నాడు.

“ ఏం  పరేశానో ... ఈ పాటికి ఇంట్లో ఎంత గొడవ జరుగుతోందో.. ఇప్పుడు ఎనిమిదిన్నర అయింది.. నేను ఎప్పుడూ ఈ టైం దాకా బయట లేను.. మా అమ్మ, నాన్న ఎంత ఖంగారు పడుతున్నారో.. ఏంటో నాకు భయం వేస్తోంది రమేష్.. వెళ్ళిపోదాం ..”

“పాగల్ దానివా ... ధైర్యం చేసి వచ్చినంక మల్ల పోవుడా.. గమ్మునుండు.. మా ఇంట్ల పరేషాన్ గారా.  మా డాడి మాట పక్కన బెట్టు  మా మమ్మీ మస్తు ఏడుస్తది .. నేనంటే మా మమ్మికి చానా ఇష్టం .. కానీ మనం లవ్ చేసుకున్నం ... మారేజ్  చేసుకోనికి వచ్చినం ... ఇప్పుడు ఏడిస్తే మంచి గుండదు ఏడ్వకు. “

గాయత్రికి అతని మాటలు వింటున్న కొద్దీ దుఃఖం ఎగసిపడసాగింది ... ఇంట్లో నుంచి బయలు దేరి వస్తున్నప్పుడు కాని,  కాలేజ్ నుంచి పర్మిషన్ తీసుకుని బయట పడినప్పుడు కానీ, డ్రెస్ కొనుక్కుని అప్పటికప్పుడు ట్రయల్ రూమ్ లో ఆ డ్రెస్ వేసుకుని రైల్వే స్టేషన్ కి వచ్చినప్పుడు కానీ , అక్కడ పాండుని చూసినప్పుడు కాని , రమేష్ తో ప్లాట్ ఫార్మ్ మీద చిప్స్ తింటూ తిరిగినప్పుడు,  రైల్లో అతని పక్కన ఆనుకుని కూర్చుని అతని స్పర్శ లోని మాధుర్యం అనుభవించినప్పుడు కాని లేని దుఃఖం, భయం నిజామాబాద్ స్టేషన్ లో దిగగానే ఒక్కసారిగా ముప్పిరి గొన్నాక కానీ  తను తప్పు చేశానన్న స్పృహ రాలేదు ఆమెకి. 

అప్పటి దాకా తల్లి, తండ్రుల మీద ఒకలాంటి కసి, కోపం మనసంతా నిండిపోయి, వాళ్లకి బుద్ధి చెప్పాలి అన్న ఆలోచన,  తనని మరీ కట్టుదిట్టం చేసి, అనుక్షణం కాపలా కాస్తుంటే వాళ్ళ మీద తనకున్న కోపం అసహనం ఏదో ఒక విధంగా ప్రదర్శించాలన్న కసి తప్ప మరో ఆలోచన రాలేదు. ఇల్లు వదలి, తల్లి,తండ్రుల్ని వదిలి, తోడబుట్టిన వాడిని వదిలి, తనకి ఏ మాత్రం తెలియని, తను ఎన్నడూ చూడని ప్రదేశానికి ఒక పరాయి మగవాడితో అలా రావడంలోని రిస్క్ ఇప్పుడు తెలుస్తోంది. ఊరు కాని ఊరు, ఇక్కడ తనకి తలదాచుకోడానికి ఇల్లు లేదు, ఆదరించి ఆశ్రయం ఇచ్చే బంధువులు, మిత్రులు లేరు.. తన దగ్గర, అతని దగ్గర కలిపితే కూడా వేయి రూపాయలు లేవు .. ఎక్కడ ఉండాలి? ఏం చేయాలి? అయోమయం ... 

“అరె ఎందుకేడుస్తున్నావు “ ఎంత సర్ది చెప్తున్నా ప్లాట్ ఫార్మ్ మీద నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తున్న గాయత్రిని చూస్తుంటే ఒక పక్క చిరాకు, మరో పక్క భయం వేస్తుంటే అసహనంగా అడిగాడు. 

“మనం మనం .... ఇ ... ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఎక్కడ ఉందాం? మనకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కదా.. మనకి ఏమి తెలియదు కదా”  అంది వెక్కుతూ.

“ నేనున్న కదా ముందు బయటికి పోదం ఎన్కసిరి సోచాయిద్దం” అన్నాడు.

“ కాని  ఎలా? అసలు బయటికి వెళ్ళడం కూడా ఎలాగూ నాకు తెలియడం లేదు..”

“నా ఎనక రా గమ్మున” ఆమె బాగు కూడా తనే తీసుకుని ముందుకు నడుస్తూ అన్నాడు ..

గాయత్రి చున్నితో కళ్ళు తుడుచుకుని భయం, భయంగా అతడిని అనుసరించింది. 

ఇద్దరూ పరిసరాలను చూసుకుంటూ వెళ్తోంటే ఎగ్జిట్ గేటు కనిపించింది. ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. 

ఆటో వాళ్ళు ఇద్దరు , ముగ్గురు వచ్చి  ఆటో కావాలా అని అడగడంతో రమేష్ కొంచెం ధైర్యం చేసి హోటల్ రూమ్ గురించి వాకబు చేసాడు. ఆటో అతను కొంచెం వయసు మళ్ళిన వాడు ... వాళ్ళిద్దరిని కొంచెం అనుమానంగా చూసాడు.. 

“హోటల్ల రూములు ఎంత ఉంటాయ్యో ఎరికేనా మీకు ఎసోంటి రూము గావలె “ అన్నాడు.. 

ఆ ప్రశ్నకి ఇద్దరూ తెల్లబోయి ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నారు. 

“యాడికెల్లి వస్తున్నరు ...” అడిగాడు.

గాయత్రి వణికిపోయింది ఆ ప్రశ్నకి.. అయిపొయింది.. ఇతనికి తెలిసిపోయింది.. తామిద్దరూ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చారని తెలిసింది.. ఇప్పుడు తప్పకుండా పోలిస్ లకి పట్టిచ్చేస్తాడు పేపర్లో, టి వి లో  ఇద్దరి ఫోటో తో న్యూస్ వచ్చేస్తుంది.. ఆ న్యూస్ నాన్న చూసేస్తాడు..చూసి, చూసి 

గాయత్రి కళ్ళ ముందు ఉగ్రనరసింహమూర్తిలా నిప్పులు కక్కుతున్న తండ్రి రూపం కనిపించింది. 

“ఇంట్ల నుండి చెప్పకుండా వచ్చిన్రా... లవ్ మాటరా “  రెట్టించి అడుగుతున్నాడు అతను. 

రమేష్ ఏదో సణుగుతూ చెప్తున్నాడు.  అతను ఏం చెప్తున్నాడో గాయత్రికి వినిపించడం లేదు.. వినాలన్న ఆసక్తి కూడా ఆమెకి కలగడం లేదు.. ఆమెకి ఇప్పుడు వెంటనే వెనక్కి వెళ్లి పోయి తల్లి ఒళ్లో వాలిపోయి బావురుమని ఏడవాలని ఉంది. “తప్పు చేశాను నాన్నా నన్ను క్షమించు” అని తండ్రి కాళ్ళ మీద పడి క్షమార్పణ వేడుకోవాలని ఉంది.. తెల్లవారితే కాలేజిలో కూడా అందరికి తెలిసిపోయింది.. అందరూ తనని అసహ్యించుకుంటారు.. అవును.... నాలుగు నెల్ల క్రితం రజని ఎవరితోతో లేచిపోయిందని అందరూ రజనిని తిట్టారు.. ఇప్పుడు తనని కూడా అలాగే తిడతారు.. ఊహు... అలా జరక్కూడదు ... వెళ్లిపోవాలి ఇంటికి వెళ్లిపోవాలి.. తెల్లవారి మామూలుగా రోజు లాగా కాలేజ్ కి వెళ్ళాలి.

తన గదిలో తన మంచం మీద నిశ్చింతగా పడుకోవాలి ... పక్కనే అడుగు దూరంలో తనకి రక్షణగా పడుకునే అన్నగారితో కబుర్లు చెప్పాలి ...

టైం కి కమ్మగా వండి పెట్టే అమ్మా .... పండగలకి, పుట్టినరోజులకి అడగకుండానే బట్టలు కొనిపెడుతూ కాలేజి ఫీజులు కడుతూ తను చదువుకుని డిగ్రి సంపాదించుకోవాలని ఆశ పడే నాన్న ... తను ఎంత కసురుకున్నా తన శ్రేయస్సు కోరుకునే అన్నయ్య అందరు గుర్తోస్తూన్నారు. ఈ రాత్రి తల దాచుకోడానికి దారి తెలియక తనకి తెలియని ఊరులో నడిరోడ్డు మీద  నిలబడ్డానన్న వాస్తవం కళ్ళముందు కనిపిస్తోంటే  తప్పు చేసానన్న బాధ తొలిచేస్తోంది ఆమెని.

గబుక్కున వెనక్కి తిరిగి స్టేషన్ లోకి వెళ్ళడానికి అడుగు వేసిన ఆమె గాయత్రీ అని ఖంగారుగా రమేష్ స్వరం వినిపించడంతో ఆగిపోయింది. 

“ఏడికి? ... ఉండు... మనకి ఈ ఒక్కదినానికి షెల్టర్ దొరికింది.. రేపు మార్నింగ్ వేరేది చూసుకుందాం ... అన్న ఇంటికి రమ్మంటున్నడు” అన్నాడు ఆమె చేయి పట్టుకుని ఆపుతూ.

“ఛి, ఛి వాళ్ళింటికా నేను రాను ... “ గబ గబా అంది.

“హోటల్ రూమ్ ఒక్క రోజుకి ఎనిమిది వందలంట ... ఈ ఒక్కరోజు పోదం ... రాత్రి పండుకుంటే తెల్లరినంక లేచి పోవుడే నా మాట ఇను గాయత్రి..  ఈ డ మనకి ఎరికున్నోల్లు ఎవ్వరు లేరు” బతిమాలాడు.

“నేను రాను.. మా ఇంటికి వెళ్ళిపోతా” ఏడుస్తూ అంది.

““మల్ల ఎందుకొచ్చినవ్ .... వచ్చినసంది పోత, పోత .. పో .... నిన్ను ఇంట్లకి రానిస్తారా బయటనుండి ఎల్లగొడతారు ... ఇంట్లకెల్లి చెప్పకుండ పోయినంక మీ డాడి నిన్ను రానిస్తడా ...”

“ఎందుకు వెళ్ళగొడతారు.. నేను కనిపించకపోతే బాధ పడతారు.. ఏడుస్తారు.. తిరిగి వెళితే సంతోషిస్తారు. “

“ఎవరు? మీ నాయన్నా ....అంత సిన్ లేదు ... ఒక్కసారి ఇంట్లకెల్లి పోయిన బిడ్డని రానిస్తారా.. మొగోడిని నన్ను రానిస్తారు ...ఎక్వ సతాయించకు నడువ్”  కొంచెం కోపంగా అన్నాడు రమేష్.

గాయత్రికి లాగి అతని చెంప పగలకోట్టాలనిపించింది ... ఏదో అనబోతుంటే ఆటో అతను వాళ్ళ దగ్గరగా వచ్చి గాయత్రిని చూస్తూ అన్నాడు..” నడువ్ బిడ్డా.. మా ఇంట్ల మీకు మంచిగుంటది.. హోటల్ కి పోవుడు మంచిది కాదు.. నడు మా ఇంటికి పోదం ... నాకు అర్తమైంది ... మీరు ఇంట్ల చెప్పకుండా వచ్చిన్రు.. నేనేమన్నా సాయం చేస్త.. నడువ్” అన్నాడు నచ్చ చెబుతూ.

గాయత్రికి తను ఊబిలో కూరుకు పోతున్నట్టు అనిపించింది.. టి వి9 లో చూసిన క్రైం వార్తలు గుర్తుకు రాసాగాయి.. భయంతో బిర్రబిగుసుకుపోయి నిలబడిపోయిన గాయత్రిని చేయి పట్టుకుని తీసికెళ్ళి ఆటోలో కూర్చో బెట్టాడు రమేష్.. ఆటో కదిలింది.

సాయంత్రం నాలుగున్నర నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది అన్నపూర్ణ .... గాయత్రి ఇంకా ఇంటికి రాలేదు. ఐదైంది... ఐదున్నర... ఆవిడ కళ్ళు గేటుకు అతుక్కు పోయాయి. గుండె దడ దడలాడుతోంది ... భర్త వచ్చే టైం అయింది. గాయత్రి కనిపించకపోతే ఆయన మండిపడతాడు.. ఇంట్లో పెద్ద రాద్ధాంతం జరుగుతుంది.. అసలు ఈ పిల్ల ఎందుకు ఇంకా రాలేదు.. ఎక్కడికన్నా వెళ్ళిందా? లేక టివి లో చూపించినట్టు దానికి ఏమి కాలేదు కదా.. భగవంతుడా అలా జరక్కూడదు.. కార్తికేయ వచ్చాడు. కాలుగాలిన పిల్లిలా ఆటు, ఇటూ టెన్షన్ గా తిరుగుతున్న తల్లి వైపు చిత్రంగా చూస్తూ అడిగాడు “ఏంటమ్మా ఏమైంది ఎందుకలా ఉన్నావు?”

ఆవిడ వణుకుతున్న స్వరంతో అంది “గాయత్రి ఇంకా ఇంటికి రాలేదురా ఆరవుతోంది..మీ నాన్నగారు వచ్చారంటే ఇల్లు పీకి పందిరేస్తారు ..”

“అదేంటి ఇంకా రాకపోడం ఏంటి?”ఆశ్చర్యంగా చూసాడు కార్తికేయ .

“అదే నాకూ అర్ధం కావడం లేదు.. ఎక్కడికి వెళ్ళదు.. ఒకవేళ వెళ్లాలనుకున్నా ఇంటికి వచ్చి చెప్పి వెళ్తుంది..”

కార్తికేయ తల్లి ఆందోళన తీసేయాలి అన్నట్టు  గేటు దగ్గరకు వెళ్లి విధి చివరిదాకా చూసొచ్చి అన్నాడు..” రావడం లేదు.. “

“మీ నాన్న వచ్చేస్తారురా నాకు దడ వస్తోంది.. ఒక్కసారి దాని కాలేజ్ కి వెళ్లి చూసి రాకూడదూ.. “

“కాలేజ్ లో ఇప్పుడు ఎవరుంటారమ్మా ..ఎవరిని అడగను.. ఏమని అడగను..”

“చూడరా కనీసం వాచ్ మాన్ అయినా ఉంటాడుగా ... మా నాయన కదూ ... ఆటోలో వెళ్లిరా డబ్బులిస్తా “ అంటూ లోపలికి వెళ్లి వంద రూపాయల నోటు తీసుకొచ్చి ఇచ్చింది. 

“అది కాదమ్మా ఇప్పుడు నేను వెళ్ళినా లాభం ఏముంది? ఆరు దాటింది కూడా ...”

ఈ లోగా గేటు చప్పుడు అవడం కోటేశ్వరరావు అడుగుపెట్టడం జరిగింది. అన్నపూర్ణ పై ప్రాణాలు పైనే పోయాయి. అయిపొయింది.. ఇప్పుడు ఎం జరుగుతుందో ... అది ఇప్పుడు వస్తే మాత్రం ఆయన చేతిలో చావు దెబ్బలు తప్పవు. తను కాదు కదా ఆ దేవుడు కూడా కాపాడలేడు.

కోటేశ్వరరావు చెప్పులు విడిచి లోపలికి వచ్చాడు. 

చేతిలో వంద రూపాయల నోటుతో బిక్కచచ్చి నిలబడ్డ కార్తికేయను , ఆందోళనతో ఉన్న భార్యను చూసి నొసలు చిట్లించి లోపలికి తొంగి చూస్తూ “గాయత్రి ఏది” అన్నాడు. 

అన్నపూర్ణ శిలా ప్రతిమలా సమాధానం చెప్పకుండా నిలబడిపోయింది. 

ఆయన భార్య వైపు అనుమానంగా చూసేడు “ఏమైంది..” అన్నాడు .

ఏమి లేదు అన్నట్టుగా అన్నపూర్ణ తల అడ్డంగా ఊపింది.

ఆయన అదే చూపులతో లోపలికి వెళ్లి గదులన్నీ కలయతిరిగి వచ్చి “రాలేదా”  అన్నాడు.  అన్నపూర్ణ తలవంచుకుంది. 

“రాలేదా”  మళ్ళి అడిగాడు. 

కార్తికీయ సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తూ “ స్పెషల్ క్లాస్ ఉందేమో నాన్నా పరీక్షలు దగ్గరికి వస్తున్నాయిగా” అన్నాడు.

ఆయన కొడుకు వైపు సీరియస్ గా చూసాడు.

కార్తికేయ తలవంచుకున్నాడు. 

ఆయన అన్నపూర్ణ వైపు చూసి అడిగాడు. “కాలేజ్ నుంచి అసలు ఇంకా రాలేదా వచ్చి ఎక్కడికన్నా వెళ్ళిందా ...”

అన్నపూర్ణ నీళ్ళు నిండిన కళ్ళతో ఆయన వైపు చూసి “అసలు ఇంటికి రాలేదండి” అంది. 

ఆయన పళ్ళు బిగించి గట్టిగా శ్వాస తీసుకుని పెద్దపులిలా పచార్లు మొదలు పెట్టాడు. అన్నపూర్ణకి, కార్తికేయకి కూడా ఆయన్ని అలా చూసేసరికి భయంతో ఒళ్ళు జలదరించింది.. ఇప్పుడు ఇంత ఆవేశంలో గాయత్రి ఇంటికి వచ్చిందంటే ఏం చేస్తాడో అని ఇద్దరూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని శిలా ప్రటిమల్లా నిల్చున్న చోటే కదలకుండా నిలబడిపోయారు. 

నిమిషాలు గడుస్తున్నాయి. అన్నపూర్ణ కళ్ళు మాటిమాటికి గోడ గడియారం వైపు చూస్తున్నాయి.. ఆరు నలభై.... నలభై ఐదు.... అలాగే గంభీరంగా గడిచింది..

అకస్మాత్తుగా కోటేశ్వరరావు పచార్లు ఆపి గడప దాటి చెప్పులు వేసుకుని వీధిలోకి వెళ్ళాడు.. అన్నపూర్ణ కొడుకు వైపు ఆందోళనగా చూసి “నువ్వు కూడా వెళ్ళరా ఈ ఆవేశంలో ఆయన ఎక్కడికి వెళ్తారో... ఎం జరుగుతుందో...” అంది.

“సరేనమ్మా“ అంటూ కార్తికేయ వేగంగా బయటికి నడిచాడు. అన్నపూర్ణ నీరసం ముంచుకు రాగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి సోఫాలో కూలబడిపోయింది. 

ఇంకా ఉంది ...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadaina prapancham