Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
big  wonder in a small heart

ఈ సంచికలో >> యువతరం >>

మహిళలే మహరాణులు

ladies are queens

ప్రస్తుతం ఎక్కడ విన్నా మహిళల గురించే చర్చ జరుగుతోంది. ఇదంతా ఎందుకు అంటే, తాజాగా హైద్రాబాద్‌లో జరిగిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారై ఇవాంకా ముఖ్య అతిధిగా విచ్చేశారు. వ్యాపార రంగంలో మహిళలు ముందంజలో ఉండాలనీ ఆమె తెలిపారు. అందుకు తగిన సూచనలు సలహాలు అందించారు. ప్రస్తుతం మహిళలు అన్నింట్లోనూ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఆకాశంలో సగం, అన్నింటా సగం.. అనే నైజంలో పురుషులతో సమానంగా తమ ప్రతిభను చాటుతున్నారు. ఇదివరకటి రోజుల్లో మహిళలకు భద్రత తదితర ఇతర కారణాల వల్ల బాల్యంలో తండ్రి చాటు బిడ్డగా, యుక్త వయసులో భర్త చాటు భార్యగా, వృద్ధాప్యంలో కొడుకు చాటు తల్లిగా దాగి దాగి ఉండాల్సి పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మహిళలే మహరాణులుగా దూసుకెళ్తున్నారు. అంతరిక్షంలోనూ అడుగిడుతున్నారు. వినూత్న ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలకు నిలయమవుతూ సమాజానికి వెలుగు రేఖలవుతున్నారు కొందరు మహిళలు. అలాంటి పలువురు మహిళలు ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇకాంకాతో పాటు ప్రపంచం దృష్టినీ ఆకర్షించారు.

తాజాగా జరిగిన ఈ సదస్సులో ఎక్కువ ప్రాధాన్యతను మహిళలకే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ సెక్టారుల్లో తమ ప్రతిభతో ప్రపంచ పారిశ్రామిక వేత్తలుగా ఎదిగిన పలువురు మహిళా పారిశ్రామిక వేత్తలు ఇవాంకాచే ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. మహిళలు సమాజంలో ఉన్నతంగా ఎదగడానికి అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సవాళ్లని అధిగమించి నిలవగలిగితే వారే సమాజానికి వెలుగు చుక్కలవుతారనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అందుకు నిదర్శనంగా తాజా సదస్సు నిలిచింది. ఎంతో మంది ఉన్నత మహిళా పారిశ్రామిక వేత్తలకు ఈ సదస్సు వేదికైంది. అలాంటి వారిని ప్రపంచానికి పరిచయం చేసుకునేందుకు ఈ వేదిక నిదర్శనంగా మారిందని చెప్పొచ్చు. రాజ్యలక్ష్మీ అనే మహిళ తన ఆలోచనకు పదును పెట్టి నెలకొల్పిన సంస్థ టెర్రా బ్లూ సంస్థ. ఈ సంస్థ దేశంలోని మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు చేరవేస్తోంది. ఆమె కృషి, పట్టుదల ఆమెని ప్రపంచ పారిశ్రామిక వేత్తల్లో ఒకరిగా గుర్తించింది. అలాగే అమెరికాకు చెందిన 'దారా డాట్జ్‌' అనే మరో మహిళ విపత్తుల వేళ అత్యవసర సహయం చేసేందుకు 'ఫీల్డ్‌ రెడీ' సంస్థను రూపొందించారు. ఎక్కడ విపత్తులు జరిగినా ఈ సంస్థ ముందుంటుంది. ఈ సంస్థ ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేయడంతో పాటు, వారిలో ధైర్యాన్ని నింపేందుకు తోడ్డడ్డారు దారా డాట్జ్‌. ఆ రకంగా ఆమె ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.

ఇలాంటి వారు కేవలం ఏ ఒక్కరో ఇద్దరో కాదు. చాలా మందే ఉన్నారు ప్రపంచంలో అలాంటి వారికి మనం ఏమీ తక్కువ కాదు. కుటుంబ బాధ్యతల్ని ఎంతో సమర్ధవంతంగా నిర్వర్తించగల సత్తా మహిళలకుంది. అలాగే పారిశ్రామిక రంగం అయినా ప్రపంచాన్ని శాసించే ఏ ఇతర రంగమైనా.. ఈ విషయాన్ని మహిళలు గుర్తించగలగాలి. ఇప్పటికే పలు రంగాల్లో తమ ప్రతిభ చూపిస్తున్నారు. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. అయితే ఇంకా ఎక్కడో కొంత వెనుకబాటుతనం, మహిళలపై చిన్న చూపు. దాన్ని అధిగమించాలంటే ప్రతీ మహిళ అంతులేని ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి. తమ శక్తి సామర్ధ్యాలపై స్వతహాగా నమ్మకం కల్గి ఉండాలి. తాజాగా హైద్రాబాద్‌కి వచ్చిన మెట్రో రైలు డ్రైవర్స్‌ అమ్మాయిలే అంటే వివక్ష చాలా వరకూ తగ్గినట్లే అనుకోవలి. అంతేకాదు ఆకాశంలో ఎగిరే విమానాన్ని సైతం నడపగలిగే ధైర్యం మహిళకుంది. చాలా మంది మహిళా పైలట్లు తమ శక్తి సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ మార్పు చాలదు. ఇంకా పెరగాలి. అప్పుడే మహిళలు 'అన్నింటా సగం - ఆకాశంలో సగం' అనే మాటకు అసలైన అర్ధం.

మరిన్ని యువతరం