Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.... http://www.gotelugu.com/issue244/666/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి)... నర్సిమ్మకి తెలిసిన వాళ్ళ ఇల్లు ఉన్నంతలో పరిశుభ్రంగా ఉండడం ఆ ఇంట్లో దాదాపు తన వయసే ఉన్న అమ్మాయిలు ఇద్దరు  ఉండడంతో గాయత్రి కొంచెం ఊపిరి పీల్చుకుంది.

ఇంటి యజమాని పేరు శ్రీనివాసులు. చిన్న స్వంత ట్రావెలింగ్ కంపనీ ఉంది, ముందు ఒక ఇండికా కారుతో ప్రారంభించి, ఇప్పుడు రెండు కార్లు,  నాలుగు ఆటోలు కొన్నాడు. అవి అద్దెకిచ్చి వ్యాపారం  నడిపిస్తున్నాడు. అతని  భార్య పేరు సత్యవతి , వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు.. పెద్దమ్మాయి చంద్రకళ, రెండో అమ్మాయి సూర్యకళ, మూడో అమ్మాయి కళావతి ... పెద్దమ్మాయి పెళ్లి అయింది... అదిలాబాద్ లో అల్లుడికి ఉద్యోగం.

రెండో అమ్మాయి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది .. బాగా నలుపు, మెల్లకన్ను... ఒత్తైన నల్లన వంకీల జుట్టు రెండు జడలేసుకుని లంగా ఒణి వేసుకుని కాలేజ్ కి  వెళ్తుంది.

మూడో అమ్మాయి కళావతి ... పెద్ద పిల్లలిద్దరికన్నా ఒక్క పిసరు రంగు ... అంటే కారు నలుపు కొంచెం తగ్గి నల్లగా ఉంటుంది. టెన్త్ చదువుతోంది. ఆ కాస్తకే ఆ పిల్లకి తను చాలా అందగత్తెనని నమ్మకం.. అందుకే తొమ్మిదో తరగతి నుంచే ఒక కుర్రాడిని ప్రేమిస్తున్నా అనుకుంటూ అతనితో చెట్టపట్టాలేసుకుని తిరిగేస్తోంది. గాయత్రి ఆ ఊరికి ఎందుకొచ్చిందో నర్సిమ్మ తండ్రికి చెప్తోంటే ఎంతో ఆసక్తిగా వింది ... వినడమే కాదు.. ప్రేమించడం కాకుండా ఏకంగా పెళ్లి చేసుకోడం కోసం ఇంట్లోంచి పారిపోయి వచ్చినందుకు ఆ పిల్లకి గాయత్రి హిరోయిన్ లాగా కనిపిస్తోంది. వెంటనే గాయత్రితో స్నేహం కలిపేసింది.. తన కూతురి విశ్వరూపం తెలియని శ్రీనివాసులు  కొత్త, పాత లేకుండా తన కూతురు గాయత్రితో స్నేహం కలుపుకుని మాట్లాడేస్తుంటే ముచ్చట పడ్డాడు.

ఇప్పుడు శ్రీనివాసులు ఉంటున్న ఇల్లు అతనీమధ్యే కట్టించుకున్నాడు. వందగజాల స్థలం ... చిన్న గేటు తోసుకుని లోపలికి వచ్చి నాలుగు అడుగులేయగానే నాలుగు మెట్లు, అవి ఎక్కగానే ఎత్తుగా ఉన్న వీధి గదిగడప, ఆ గడప దాటి లోపలి వెళ్తే వీధి గది,  లోపలికి వెడితే చిన్న వంటగది , వంటగదికి రెండు వైపులా పడక గదులు, ఒక గది భార్యభార్తలు వాడుకుంటారు .... రెండోది ఆడపిల్లలు వాడుకుంటారు. వెనక కొంచెం ఖాళి  స్థలంలో బాత్రూం, లావెటరీ విడి, విడిగా ఉంటాయి.

రాత్రి పదిగంటలు అవుతుండగా గాయత్రిని వెంటపెట్టుకుని వచ్చిన నర్సిమ్మ తనకి వరసకి బావమరిది అయిన శ్రినివసులుకి చూచాయగా గాయత్రి, రమేష్ ల  సంగతి చెప్పాడు. గాయత్రిని చూడగానే పెద్దింటి పిల్లలా ఉండడంతో తనే ఇక్కడికి తెచ్చానని ఒకపూట ఆశ్రయం ఇస్తే తెల్లవారాక వాళ్ళ సంగతి ఏంటో చూడచ్చని సాయం అడగడంతో శ్రీనివాసులు పెద్దమనసుతో ఒప్పుకునిగాయత్రిని మనసారా ఆహ్వానించాడు.. అతని భార్య సత్యవతి కూడా లేత తమలపాకులా ఉన్న గాయత్రిని చూసి జాలితో ఒప్పుకుంది.

తాము వండుకున్న దాంట్లోనే కొంచెం అన్నం లో పెరుగు, నిమ్మకాయ తొక్కు వేసి ఇచ్చింది గాయత్రికి సత్యవతి. వాళ్ళు నీచు తిన్నా ఇంట్లో ఆ వాసనలు లేకపోడంతో ఆకలి మీద ఉన్న గాయత్రి ఆ పెరుగన్నం ఆప్యాయంగా తింది ... మిగతా ఆడపిల్లలతో పాటు ఒకే మంచం మీద పడుకోడం చాలా ఇబ్బందిగా అనిపించినా భరించక తప్పలేదు.

నీకేం బుగుల్లేదు బిడ్డా మంచిగ పండుకో అంటూ సత్యవతి, శ్రీనివాసులు వాళ్ళ గదిలోకి వెళ్లి తలుపు వేసుకోగానే అక్కచెల్లెల్లిద్దరూ అప్పటివరకు ఉగ్గబట్టుకున్నదంతా వెళ్లగక్కుతూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయసాగారు గాయత్రిని ...

మీరు పెండ్లి చేసుకోనికి మీ డాడి ఒప్పుకోలేదా అడిగింది సూర్యకళ కుతూహలంగా .

నీ లవర్ మీ కులపోల్లు కాదా అడిగింది కళావతి మరింత ఆసక్తిగా ..

మీరు బాపనోల్లా ...

నీ లవర్ ఏం కులం ?

ఏం చదువుతున్నావ్ .... ఏ కాలేజ్ ? నీ లవర్ ఏం చదువుతున్నడు?

మీరిద్దరూ ఒక్క దగ్గరనే ఉంటారా .... ఇప్పుడు నువ్వు  లేచిపోయి వచ్చినవని మీ ఇంట్ల ఎరికేనా .. నీ గురించి వెతుకుతున్డచ్చ... ఇంక మీ ఇంటికి పోవా ... పెండ్లి ఎప్పుడు ... ఇలా ఇద్దరూ చెరో వైపునుంచి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే అసలే భయంతో వణికిపోతున్న గాయత్రికి  ఇప్పుడింకా భయం ఎక్కువై పిచ్చి పడుతున్నట్టు అయింది. వాళ్లకి సమాధానం చెప్పకుండా గట్టిగా ఆవలించి నాకు నిద్ర వస్తోంది పడుకుంటాను అంటూ కళ్ళు మూసుకుని నిద్ర నటించింది ..

తెల్లవారి ఉదయం తోమ్మిదైంది.

అప్పుడే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకుని  స్నానం చేసి సత్యవతి ఇచ్చిన చాయ్ తాగుతోంది గాయత్రి .. నిజానికి ఆమె ఎప్పుడు టి తాగలేదు.. ఎప్పుడన్నా ఒకసారి కాఫీ, లేదంటే పాలు ... ఇవాళ తప్పని సరిగా ఆ ఇంట్లో వాళ్లతో పాటుగా తను కూడా టి, బిస్కెట్ తో సరి పెట్టుకో వలసి వచ్చింది. పది నిమిషాల నుంచీ వీధి మెట్ల మీద కూర్చుని గేటు సందులో నుంచి రోడ్డు మీద అటు, ఇటూ తిరుగుతున్న జనాలని చూస్తూ  చిన్న, చిన్న సిప్ లతో బలవంతంగా తాగుతోంది.  అక్కా చేల్లెల్లిద్దరు కాలేజ్ కి ఒకరు, స్కూల్ కి ఒకరు వెళ్ళి పోయారు . వెళ్తూ, వెళ్తూ నువ్వుంటావు కదా.. మేమొచ్చిందాకా పోవద్దు... పెండ్లికి మేము కూడా ఉండాలె అని హెచ్చరించి వెళ్ళారు .

గాయత్రికి అంతా అయోమయంగా ఉంది ... ఇంటి దగ్గర ఎంత గొడవ జరుగుతోందో ... అమ్మ బాగా ఏడుస్తుందేమో... నాన్న ఏం చేస్తున్నారో ...అన్నయ్య తన కోసం ఎక్కడెక్కడో వాకబు చేస్తున్నాడేమో... అక్కడ రమేష్ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో.. పాండు తనని చూసే ఉంటాడా.. ఈ పాటికి తనూ, రమేష్ పారిపోయినట్టు మొత్తం లోకాలిటిలో అందరికి తెలిసి పోయి ఉంటుందా?

రమేష్ పేరెంట్స్ ని నాన్న బాగా తిడుతున్నాడేమో! అమ్మ, రమేష్ వాళ్ళమ్మ దెబ్బలాడుకుంటున్నారేమో! అమ్మని రమేష్ వాళ్ళమ్మ నీ కూతురే నా కొడుకుని లేవదిసుకు పోయింది ... బిడ్డని పెంచనీకి రాదా అని తిడుతుందా..

గాయత్రికి ఒక్క సారి కళ్ళ ముందు ఇరు కుటుంబాల వాళ్ళు సినిమాల్లో లా ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకుంటూ, తిట్టుకుంటూ కనిపించారు.. గజ, గజ వణికి పోయింది ... అలా జరక్కూడదు.. వెళ్లి పోవాలి...తను ఇక్కడి నుంచి వెళ్లి పోవాలి.. తన వలన అమ్మా, నాన్న ఒకరితో మాట పడడమా ... అదే జరిగితే ఆత్మాభిమానంతో బతికే వాళ్ళిద్దరూ ఏమవుతారు?

ఆ ఆలోచనతో గబుక్కున కూర్చున్న దగ్గర్నుంచి లేవ బోయిన గాయత్రి చేతిలో స్టీల్ గ్లాస్ కింద పడడం,  కాలి కింద లంగా ఇరుక్కోడంతో ఆ చిన్న మెట్టు మీద నుంచి తూలి పడబోయింది.  అప్పుడే ఆగిన ఆటోలోంచి దిగి గేటు తీసుకుని లోపలికి వస్తున్న రమేష్ గభాల్న ఆమెని రెండు చేతులతో పట్టుకున్నాడు .

గాయత్రికి ఒక్కసారిగా మైకం కమ్మేసినట్టు అయి పైన ఆకాశం , కింద భూమి గిర గిరా తిరుగుతున్నాట్టు అయి రెండు చేతులతో అతని భుజాలు రెండూ గట్టిగా పట్టుకుంది. రమేష్ కి కూడా ఏం జరుగుతుందో తెలినంతగా మైకం కమ్మేయడంతో ఆమెని బాగా దగ్గరగా లాక్కున్నాడు.

ఆటో పార్క్ చేసి వచ్చిన నర్సిమ్మ ఆ దృశ్యం చూసి ఖంగారుగా ఏ పోరగా రమేష్ ఏందిది అంటూ రమేష్ ని పక్కకి లాగేసాడు.
నర్సిమ్మ గొంతు విని లోపలినుంచి సత్యవతి, శ్రీనివాసులు అక్కడికి వచ్చి “ఏమైంది” అన్నారు తల వంచుకుని నిలబడిన రమేష్, గాయత్రిలను చూస్తూ ..

నర్సిమ్మ రమేష్ వైపు కోపంగా చూస్తూ “పొద్దుగాల, పొద్దుగాల” అని పళ్ళు కొరుకుతూ “ఏడికెల్లి వచ్చిన్రో నన్ను పరేషాన్ చేయనికి” అన్నాడు.

గాయత్రి ఎర్ర బడిన మొహంతో పరుగులాంటి నడకతో లోపలికి పరిగెత్తింది ..

“ఆమె నేను లోపటకు వస్తుంటే పడి పోతుండే” అన్నాడు నేల చూపులు చూస్తూ రమేష్..

ఏదో అర్ధమైనట్టు శ్రీనివాసులు పోనీ, పోనీ అని సర్ది చెప్తూ “రాండ్రి లోపలకు” అంటూ భార్య భుజం పట్టుకుని పక్కకి లాగి వాళ్ళిద్దరికీ లోపలికి దారి ఇచ్చాడు .

నర్సిమ్మ, రమేష్ లోపలికీ నడిచారు.

అందరూ కూర్చున్నాక నర్సిమ్మ రమేష్ వైపు కోపంగా చూస్తూ అడిగాడు..” ఏం జేయనీకివచ్చినవ్... ఇప్పుడెం చేస్తవ్... ఆమెని తోల్కొని రిటర్న్ పోతవా”

గబ గబా తల అడ్డంగా ఆడిస్తూ అన్నాడు రమేష్ “ పోను ... మేం పెండ్లి చేసుకోనికి వచ్చినం ...  టెంపుల్ ల మా పెండ్లి చేయుండ్రి...”

“నీ తాన పైసలేన్ని ఉన్నయి...”

“ఏం లేవు ....”

“మల్ల పెండ్లి చేసుకుని ఏం తింటవ్ ...ఆమెకి ఏం పెడ్తావ్ తమ్మీ” అడిగాడు శ్రీనివాసులు .. రమేష్ ఏం మాట్లాడలేదు.

నర్సిమ్మ,  శ్రీనివాసులు వైపు చూస్తూ “జర వయసు రాంగానే లవ్వులు మొదలైతున్నాయ్ ఇయాల రేపు పిల్లలకు ... లవ్ చేసుడు ఈజినే ... పెండ్లి చేసుకుని సంసారం ఇస్తార్ట్ చేసినంక  ఎరికైతది.. అయినా పెద్దోల్లను కాతరు చేయకుండ గిట్ల ఉరికి పోయి వచ్చుడేనా... ఆమె వచ్చిన సంది ఒకటే ఏడవ వట్టింది.. ఈడెమో పెండ్లి, పెండ్లి అంటున్నాడు ఏందీ బావా ఇది” అన్నాడు..

“జమాననే అట్లుంది బావా ...” అన్నాడు శ్రీనివాసులు.

“నాకు ఎడనన్న నౌకరి ఇప్పించన్న” అన్నాడు రమేష్ ..

“ ఏం నౌకరి చేస్తవ్” అడిగాడు నర్సిమ్మ

“అన్నా చాయ్ తాగుతారా” అడిగింది సత్యవతి ..

“ఇయ్యమ్మ” అన్నాడు నర్సిమ్మ ..

సత్యవతి చాయ్ తయారు చేయడానికి వంట గదిలోకి వెళ్తూ పిల్లల గదిలో ఉన్న గాయత్రి ఏం చేస్తోందో అన్నట్టు తొంగి చూసింది.
గాయత్రి మంచం మీద కూర్చుని ఏడుస్తోంది .. సత్యవతి లోపలికి నడిచింది ..

గాయత్రి భుజం మీద చేయి వేసి మెత్తగా అడిగింది “ఎందుకేడుస్తున్నావ్ “

ఆ పలకరింపుతో గాయత్రి దుఃఖం మరింత ఉధృతం అయింది...

సత్యవతి ఓదారుస్తూ అంది “ఏడవకు .... మీ అమ్మ, నాయనలకు చెప్పకుండ ఇంట్లకెల్లి వచ్చేటప్పుడే ఆలోచన చేయాలే ... గా పోరడు ఏడ దొరికిండు నీకు ... ఏమన్న మంచిగున్నడా ... రూపం లేదు, సదువు లేదు, ఏముద్యోగం చేస్తాడో ... నిన్నెట్ల సాకుతడో... ఊకో ఏడవకు... మీ ఇంటికి పోతావా ...”

గాయత్రి చివ్వున కన్నీళ్ళు నిండిన కళ్ళతో ఆశగా చూస్తూ తల ఊపింది ..

“మంచిది పంపిస్త... మీ ఒల్లు రానిస్తారా” అడిగింది సత్యవతి ..

గాయత్రి కళ్ళల్లో భయం, అనుమానం కదిలాయి ..

“అసలే మీరు బాపనోల్లు.... గిసొంటి పనులు చేస్తే మంచిగుంటదా...ఇజ్జత్ పోదా... నీకు అనిపిస్తలేదా తప్పు చేసినవని ...”
గాయత్రి తిరిగి వెక్కి, వెక్కి ఏడవ సాగింది.

“ఏడవకు, నడు నర్సిమ్మతో మాట్లాడదాం” అంటూ గాయత్రి భుజం పట్టుకుని లేవదీసి మెల్లగా నడిపించుకుంటూ వచ్చింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్