Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anna chelli madhyalo o vadina

ఈ సంచికలో >> కథలు >> రేపు వస్తాడో రాడో...!

repu vastado rado

చాలా రోజుల తరువాత రచయిత రఘురాంకు నిన్నటి రాత్రి  కలొకటి వస్తే దాన్నే కథా వస్తువుగా చేసుకొని చక్కటి  కథనొకటి రాయాలనుకొని ఉదయం పదిగంటలకల్లా అన్ని పనులను ముగించుకొని తన గదిలోకి వెళ్ళి తలుపేసుకొని గడియపెట్టుకొన్నాడు.ప్యాడ్ పెన్ను తీసుకొని చకచక రాయను మొదలెట్టాడు భోజనాల వేళకు కథను పూర్తిచేయాలన్న వుద్దేశ్యంతో. కారణం  రోజూ తన శ్రీమతి తనకు 'టీ'ఇచ్చే సమయానికి వచ్చి  'టీ' తాగడమే కాక చెత్త కబుర్లలోకి దింపి సెల్ఫ్ డబ్బా  వాయించుకొంటూ కథను రాయకుండా చేస్తూ మెదడును తినే  మిత్రుడు మహానందం వస్తాడన్నభయంతో.

మహానందం,రఘురాంలు  సమవయస్కులు. ఇద్దరూ మూడు నెలల తేడాతో పదవి విరమణ పొందారు. వారిరువురిలో మహానందం చాలా తెలివైన వాడు.ఘటికుడు.తిమ్మిని బమ్మిని చేసే రకం. అందుకే చాలా తెలివిగా తన వ్యాపకంకోసం ఓ తెలుగు సంస్థను స్థాపించి తెలుగు భాషా సేవలో మునిగి తేలుతూ విస్తారంగా మీడియా,పత్రికా,రాజకీయనాయకుల మధ్య పలుకుబడిని పెంచుకొని సభలు,సన్మానాలంటూ జరుపుతూ  వాటి ద్వారా కాస్తో కూస్తో సొమ్ము చేసుకొంటూ కొనసాగు తున్నాడు.

స్తేహితుడితో పోటీ పడలేక పోయినా  తనకున్న రవ్వంత జ్ఞానంతో  లోకాన్ని చదివినందున తనకు చేతనైన రచనలు చేస్తూ సమయాన్ని గడుపుకోవాలని నిర్ణయించుకున్నాడు రఘురాం.అందుకే పదవి విరమణ పొందిన ఆరునెల్ల తరువాత తనూ రచనలు చేయడం ప్రారంభించాడు.

రఘురాంకు  వెంట వెంటనే జోరీగల్లా కథకు సంబంధించిన ఆలోచనలు,అందుకు తగ్గ పదాలు సుళ్ళు తిరుగుతూ కళ్ళ ముందు కనబడుతుంటే వాటిని అలాగే పేపరు మీద పెట్టేస్తున్నాడు .

అంతలో కాలింగ్ బెల్లు మోగింది.కధకు అంతరాయం కలిగినందుకు కోపం,విసుగును ముఖానికి పులుముకొని వెళ్ళి తలుపు తీశాడు బహుశా వచ్చింది మహానందమేననుకొంటూ.అవును. వచ్చింది మహానందమే!

ఇక లాభం లేదనుకొన్న రఘురాం ముఖ కవలికలను వెంటనే మార్చుకొని పెదాలపైకి  నవ్వు తెచ్చి పెట్టుకొని

"రారా...కూర్చో!నిజంగా ఇవాళ నువ్వు ఎక్కడ రాకుండా పోతావో.... మీ చెల్లెమ్మ పుట్టిన రోజు సందర్భంగా తను  చేసుంచిన గారెలు పాయాసం వేస్టయి పోతుందోనని తెగ ఫీలవుతూ కూర్చున్నాను!ఎలాగో కరక్టు టైంకు వచ్చావ్ " అని మనసులోనే మహానందాన్ని తిట్టుకొంటూ" ఏమేవ్ !మీ అన్నయ్య వచ్చాడు"అని కిచ్చన్ లోకి వినిపించేలా హెచ్చరికగా కేకేశాడు.

సోఫాలో కూర్చొన్నాడు మహానందం.రివాల్వింగ్ చెయిర్లో కూర్చొన్నాడు రఘురాం ఇక కథ రాయడం కొనసాగించలేడన్న నిర్ణయానికొచ్చి.
"ఏరా కథ రాస్తున్నావులా వుంది?"అడగాలని అడిగాడు మహానందం.

"అవునురా!నువ్వేమో ఎంచక్కా నీ వ్యాపకం కోసం మాతృభాష, భాషాభివృద్దంటూ  ఓ సంస్థను నెలకొల్పి,మీడియా మిత్రులతో పత్రికా సంపాదకులతో,రాజకీయనాయకులతో పరిచయాలు పెంచుకొని సిటీలో గొప్పగా చలామణి అవుతున్నావ్ !అలాంటివేమీ చేతగాని నేను ఇల్లు,పిల్లలు,ఉద్యోగమంటూ ఇన్నాళ్ళు  ఏగాను.అందుకే ఎప్పుడో ఓ నాలుగు కథలను రాసి నేనూ రచయితనేననిపించుకొన్న అనుభవంతో మళ్ళీ కలం పట్టుకున్నాను.  ఇదేగా నాకున్న  ఏకైక వ్యాపకం. టైం పాసవ్వాలిగా!?"అని నవ్వాడు రఘురాం.

"అది నిజమే!అయితే  గొడక్కొట్టిన బంతిలా  నువ్వు రాసే ప్రతికథ తిరిగి రావడం చూస్తున్నానురా! అవి తిరిగి రాకుండా అచ్చయ్యేలా చూసుకో!.అదే నీ సామర్థ్యం..ఆఁ"

"అచ్చవుతాయిలేరా !ఏదో ఒకరోజు ఏదేని పత్రికవాడు నా కథను వేస్తాడన్న నమ్మకంతోనే రాస్తున్నాను".

"నాకైతే ఆ నమ్మకం లేదన్నయ్యగారూ!శుభ్రంగా ఏ మార్వాడి కొట్లోనో  రసీదులు రాసే పనికి వెళ్ళినా పది వేలు వస్తాయి.వింటేనా మరి. వీరు ఏదో ఒకటి చెయ్యాలి.లేకపోతే వాకింగ్ కనీ పార్కుకు వెళ్ళినా, పుస్తక పఠనమని గ్రంథాలయానికెళ్ళినా, కూరలు తేవడానికి బజారుకెళ్ళినా ఏవో తగాదాలు తెస్తారేమోనని భయం నాకు" అంటూ వేడి వేడి గారెలున్న ప్లేట్లను ,రెండు పెద్దగ్లాసులతో పాయాసాన్ని తెచ్చి టీపాయి మీదుంచింది రఘురాం భార్య కనకరత్నం.

" మొదటిగా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలమ్మా! పోనీ...నువ్వేమిటి వాణ్ణి అంతమాటన్నావ్ !వాడెవడో అన్నట్టు ఇంత బ్రతుకు బ్రతికిన వాడ్ని మార్వాడి కొట్లో రసీదులు రాయమంటే ఎలా?అది కుదరదులే ! కథలనే రాసుకోనివ్వు.నువ్వు రాసుకోరా!"అంటూ వేడి గారెను విరిచి నోట్లొ పెట్టుకొన్నాడు.

"అదికాదురా! అన్నాచెల్లి  ఒక్కటై అలా దెప్పేయక పోతే బోలెడు మంది పత్రిక వాళ్ళనూ, కవులను, రచయితలను,రాజకీయనాయకులను పిలిపించి సభలు సన్మానాలంటూ జరుపుతూ వాళ్ళను గౌరవిస్తూ అందరికి దగ్గరయ్యానంటావ్ !నువ్వు తలచుకొంటే ఏలాంటి పనినైనా  వాళ్ళ చేత చేయించగలనంటావ్! అంతటి వాడివి ఆ పత్రిక వాళ్ళకు చెప్పి నా కథలను ప్రచురింపజేసే ప్రయత్నం చేయకూడదూ!?"అన్నాడు
"అంటే...నా రికమండేషన్ కావాలంటావ్ ,నువ్వడగందే!  చెప్పు...ప్రముఖ 'ఖ్యాతి' పత్రిక ఎడిటర్ రాంకు చెప్పాలా,'దివ్య' పత్రిక ఎడిటర్ జీకేకు చెప్పాలా లేక ',జన్మ భూమి' పత్రిక ఎడిటర్ లక్ష్మి రాజ్యానికి  చెప్పాల్నా!? వీళ్ళందరూ నా ఫ్రెండ్సు.అప్పుడప్పుడు మనింటికి వచ్చి వెళ్ళే వారే!నేను గీసే గీతను దాటరు సుమా!ఒక్కమాట చెప్పాననుకో మరుసటి వారమే నీ కథ వాళ్ళ పత్రికలో వస్తుంది"అంటూ పాయాసాన్ని చేతికందుకొని జుర్రు శబ్దం చేస్తూ తాగను ప్రారంభించాడు.

"ఏదోలే అన్నయ్యా!వాళ్ళతో చెప్పి ఏదో ఒక పత్రికలో వారి కథను వేయించండి పాపం!వారిని చూస్తుంటే జాలేస్తుంది నాకు"

"ఓకేమ్మా!నువ్వూ అడిగావు కనుక చేసి పెడతాను.అసలు...నిన్నే జన్మ భూమి పత్రిక ఎడిటర్ లక్ష్మీరాజ్యం మా ఇంటికొచ్చి వెళ్ళింది.ఈ సంగతి ముందే తెలిసుంటే ఆవిడతో ఓ మాట చెప్పి ఈ పాటికి వేయించేవాడిని. పోనీ...ఇప్పుడు చెపుతానులే!"

"ఏమిట్రా! నువ్వంటుంది నిజమా?ప్రముఖ పత్రిక ఎడిటర్ లక్ష్మీరాజ్యంగారు మీ ఇంటికొచ్చారా?"ఆశ్చర్యాన్ని కనుబరచాడు రఘురాం.

"అవువురా!పెద్దాలందిరికీ అయ్యగారి దయకావాలి మరి. అందుకే ఆవిడగారు మా ఇంటికొచ్చారు.ఈ సంవత్సరం మా సంస్థ జరిపే ఉగాది వేడుకల్లో ఆమెను గొప్పగా సన్మానించి,గైరవించమని బ్రతిమాలింది. పోనీలే పాపమని ఒప్పుకున్నాను!"

"నిజమా! నాకు ఆశ్చర్యమేరా!కారణం ఓరోజు నా కథ ఎంపిక నిమిత్తం మాట్లాడాలని నన్ను పత్రికాఫీసుకు రమ్మంటే వెళ్ళాను. కొన్ని గంటలు వైట్ చేసిన తరువాత  సాయంత్రానికి ఆమెను కలుసుకునే భాగ్యం కలిగింది నాకు.చాలా మంచి వ్యక్తి.నన్ను కొన్ని వివరాలడిగి తెలుసుకొని వెళ్ళమంది.బహుశా నా కథను ప్రచురణకు తీసుకొంటుందని నా నమ్మకం.ఆలాంటావిడ  మీ ఇంటికొచ్చిందంటే అది నాకూ ఆశ్చర్యంతో కూడికొన్న గర్వకారణమే!"అన్నాడు గర్వంగా ఫీలవుతూ రఘురాం.

నవ్వాడు మహానందం.వెంటనే జేబులో నుంచి ఫోన్ తీశాడు..ఏదో ఎవరితోనో మాట్లాడాడు."ఓకే...ఓకే..."అని ఫోన్ కట్ చేసి నీళ్ళు తాగి"ఓకేరా  నీ కధ మరో రెండు వారాల్లో పత్రికలో వస్తుంది. చాలా!"అన్నాడు.

ఎగిరి గెంతేశాడు రఘురాం.గట్టిగా స్నేహితుణ్ణి ముద్దు పెట్టుకొని "థాంక్సురా! ఏ పత్రికలో వస్తుందిరా?నువ్వు ఎవరితో మాట్లాడావో చెప్పవూ?సంతోషంతో పూవల్లే విచ్చుకున్న ముఖంతో అడిగాడు.

"ఇంకెవరూ...ఆ లక్ష్మీరాజ్యంతోనే!వాళ్ళ పత్రికే వున్న వాటిల్లో నంబరు ఒన్ !అందులోనే వస్తుంది,చాలా?"

""చాలా థాంక్సురా!నిజంగా పెద్దలతో నీకున్న పరపతికి హేట్స్అప్ !" అన్నాడు.మళ్ళీ కథ రాయడంలో నిమగ్నమైయ్యాడు రఘురాం.రఘురాంను ఇక డిస్ట్రబ్ చేయకూడదనుకొన్న మహానందం లేచి వెళ్ళి డైనింగ్ టేబుల్ చెయిర్ లో కూర్చొని కిచ్చన్ లో పని చేసుకొంటున్న కనకరత్నంతో పిచ్చా పాటి మాట్లాడుతున్నాడు.

అప్పుడు వున్నట్టుండి ఓ కారొచ్చి ఇంటి ముందాగింది.కారులోనుంచి ఒకావిడ దిగింది.

ఆమెను చూసిన రఘురాం షాక్ తిన్నాడు.ఎదరే వెళ్ళి"రండి మేడం .నా ఇంటికి మీరు రావడం నా అదృష్టం.రండి.కూర్చొండి"అని సోఫాను చూపాడు.అప్పుడు రఘురాం తాపత్రయాన్ని,వచ్చినావిడ హుందాతనాన్ని గమనించిన మహానందం  మళ్ళీ కనకరత్నంతో మాట్లాడ్డంలో నిమగ్నమైయ్యాడు.

"ఈ వీధి చివర మా బంధువులబ్బాయికి నిశ్చితార్థం అయితే  వచ్చాను.మీరిక్కడే వున్నారు కనుక మీకు స్వీటు న్యూసును చేరవేద్దామని దిగాను.మీ కథను తీసుకున్నాం రఘురాంగారూ!వచ్చే ఇస్సులో వస్తుంది. చూసుకొండి"అంటూ వెళ్ళి కారులో కూర్చొంది.

"ధన్యవాదాలు మేడం "అన్నాడు ఆవిడ వెంట కారు వరకూ వెళ్ళి డోరు మూస్తూ. కారు కదిలింది.

అక్కడే నిలబడి కారు కనుమరుగైయ్యేంత వరకూ చూస్తూ నిలబడ్డ రఘురాంకు రకరకాలైన ఆలోచనలు మెదడులో కొట్టాడు తుంటే లోనికెళ్ళి డైనింగ్ చెయిర్ లో కూర్చొని వున్న స్నేహితుడు మహానందం వంక చూశాడు'ఏమిటి వీడు లక్ష్శీ రాజ్యంతో మాట్లాడకుండా నిర్లక్షంగా వుండి పోయా'డనుకొంటూ.

మహానందం అక్కణ్ణుంచి లేసొచ్చి సోఫాలో కూర్చొని "ఎవర్రా ఆవిడ!నువ్వేంటి అంత వినయంగా చేతులు కట్టుకొని కారు వరకూ వెళ్ళి పంపించి మరీ వస్తున్నావ్ ?అడిగాడు .

షాక్ తిన్నాడు రఘురాం.అంటే ఎడిటర్ లక్ష్శీ రాజ్యం ఎవరన్నది  మహానందంకు తెలియదన్న మాట. ఒక్క లక్ష్మీరాజ్యమే కాదు తనతో రోజూ ప్రస్తావిస్తున్న  గొప్పవాళ్ళెవరూ మహానందంకు తెలియదేమోనను కొన్నాడు.తన గొప్పలకోసం అలా రోజూ తనతో అబద్దాలాడుతున్నాడన్న నిర్ణయానికొచ్చాడు రఘురాం. "అయితే ఆవిడెవరో నీకు తెలీదా?" అడిగాడు మహానందం  ముఖంలోకి చూస్తూ రఘురాం.

"నాకెలా తెలుస్తుందిరా పరిచయం లేకుండా?"సాధారణంగా చెప్పాడు మహానందం.

"అవునా!మరిందాక నా కథా ప్రచురణ గురించి మాట్లాడిందెవరితో....!"

"ఆవిడ...ఆవిడ...ఆవిడేరా..లక్ష్మీరాజ్యం"తడబాటుతో వచ్టాయా మాటలు మహానందం నోటినుంచి.

"ఇప్పుడొచ్చిందెవరో తెలుసా.. లక్ష్శీ రాజ్యంగారే! వారేరా మాతృభూమి ఎడిటర్ .ఈ వీధి చివరున్న వాళ్ళ బంధువుల ఇంటికెళుతూ వచ్చేవారం వాళ్ళ పత్రికలో నా కథ వస్తుందని ఆ తీపి కబురు నాతో చెప్పటానికి ఇక్కడ దిగారు"అంటూ మహానందం ముఖంలోకి మళ్ళీ  చూశాడు రఘురాం.

ఇక ఏమీ మాట్లాడలేక పోయాడు మహానందం.తను కావలసినన్ని అబద్దపు ప్రచారాలతో అందరిని మభ్య పెడుతూ, నమ్మిస్తూ,ఆర్థికంగా లాభ పడుతున్న సంగతి తన స్నేహితుడికి తెలిసి పోయిందని యిట్టే గ్రహించాడు. మారు మాట లేకుండా ముఖం తప్పించుకొని "సాయంత్రం ఓ సాహిత్య సభకు కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలిరా. వస్తాను!"అంటూ చకచకా మూడు  మెట్లు దిగి తిరిగి చూడ కుండా వెళ్ళిపోయాడు మహానందం.మరి రేపు 'టీ'సమయానికి వస్తాడో రాడో !

మరిన్ని కథలు