Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Rahul Sipligunj & Mangli Sankranti Special Song By Pramod Puligilla ||JRR || JR TV

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రయాణానికి ముందు పదనిసలు! - -ప్రతాప వెంకట సుబ్బారాయుడు

sankranti festival

ఇంకో రెండు రోజుల్లో సంక్రాంతి. పెద్ద పండగ!

ఎక్కడెక్కడికో చదువుల కోసం, ఉద్యోగాల కోసం వలస వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి సొంత గూటికి (ఊరికి) వెళ్లే మంచి సందర్భం.

మనకు ఎన్నో పండగలున్నా దసరా, సంక్రాంతిలను పెద్ద పండగలుగా భావించి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో జరుపుకుంటారు.

పండగ ప్రత్యేకతలు మనం ఎన్నోసార్లు ముచ్చటించుకున్నాం. ఈసారి పండగ ముందు ఊరికి వెళ్లే ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుందాం.

పండక్కి ఇంటికి వెళ్లాలని తాపత్రయ పడే ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి వర్ణనాతీతం. పండగకి చాలా ముందునుంచే సెలవుల కోసం తీవ్ర ప్రయత్నం చేస్తారు.

కంపెనీలకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మార్చ్ నెల. అందుచేత జాన్, ఫిబ్ మరియూ మార్చి నెలల్లో కంపెనీలు టర్నోవర్ కి చేరుకోడానికి యమా కష్టపడతాయి. ఉద్యోగులు పగలూ, రాత్రీ తీవ్రంగా కృషిచేస్తారు. అలాంటి సమయంలో సెలవుల మాట అటుంచి కనీసం గంటో, రెండు గంటలు పర్మీషన్ కూడా దొరకదు. ఇహ పండక్కి సెలవులు ఎలా దొరుకుతాయి? ఇలాంటి స్థితిలో ఉద్యోగి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి.

పని తొందర తొందరగా పూర్తి చేసి, బాస్ ను కాకా పట్టి మిగతా ఉద్యోగుల నుంచి సమస్య రాకుండా నేర్పుగా వ్యవహరిస్తూ లీవ్ లెటర్ మీద బాస్ సంతకం పడేదాకా దాదాపు పురిటి నొప్పులు పడతారు. సెలవు అంకం పూర్తయ్యాక టికెట్ల అంకం మొదలవుతుంది. సెలవులు దొరుకుతాయో లేదో అని ముందు రిజర్వేషన్ చేయించుకోరు. ఇప్పుడేమో రైల్ టికెట్లు దొరకవు. బస్సుల టికెట్లేమో డబల్ ట్రిబుల్ రేట్లు. అయినా సరే కొంతమంది రైళ్లలో, జనసంద్రంలో ఈదులాడుతూ వెళతారు. మరికొంతమంది బోలెడంత ఖర్చుపెట్టి బస్సుల్లో వెళతారు. లారీల్లో, కార్లలో, బైకుల మీద వెళ్లేవాళ్ల సంగతి ఇహ చెప్పనక్కర్లేదు.

ఇంతా కష్టపడి నానాబాధలు పడి ఊరికెళితే పండగ సంబరం మాట దేవుడెరుగు అలసిన శరీరాలు సేదదీరేలోగా సెలవులు పూర్తయి ఈసురోమంటూ తిరిగొచ్చేయాల్సొస్తుంది.

నగరంలో ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ల దీన పరిస్థితి ఇది.

ఈసారి పండక్కి తలంటు పోసుకోండి, కొత్త బట్టలు వేసుకోండి, దేవుడికి పూజ చేయించండి, పిండి వంటలతో భోజనం చేయండి. కానీ జీవ హింస మహాపాపం కదా, అంచేత కోడి పందాలకి మాత్రం దూరంగా ఉండండి. కోళ్ళకి హాని చేయని పండగ సంబరం మరింత అద్భుతంగా ఉంటుంది. ఇది నిజం.

పండగని ఊరిలో మీ వాళ్లతో బాగా ఎంజాయ్ చేయండి. ఆనందంగా కమ్మటి అనుభూతుల్ని మనసుల్లో నింపుకుని రండి.

 

గోతెలుగు పాఠకులకి సంక్రాంతి శుభాకాంక్షలు!

మరిన్ని శీర్షికలు