Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tatagaripette

ఈ సంచికలో >> కథలు >> మేమూ మనుషులమే

memoo manusulame

రైల్వే భద్రతా వారోత్సవాల్లో తనకీ ప్రైజ్ ఉందని తెలిసినప్పటినించి ముసలయ్య ఆనందానికి అంతులేకుండా పోయింది. దొరగారు తెలియ పర్చినప్పట్నుంచి సహచరులంతా అభినందిస్తూనే వున్నారు. తోటి గ్యాంగ్ మెన్లు మెచ్చుకుంటుంటే గర్వంగా ఫీలయ్యి, నాడు జరిగిన సంఘటనని వివరించ సాగాడు ముసలయ్య.

....

ఆ రోజు గ్యాంగ్ హట్ 34 లోడ్యూటీ బుక్ చేశారు

ఎస్.ఎస్.ఇ. పి వె.(దొరగారు).  డ్యూటీకి చేరగానే నైట్ పెట్రోలింగ్ డ్యూటీ బుక్ చేసాడు మేస్త్రి.

నైట్ పెట్రోలింగ్ డ్యూటీ అంటే తెలుసుకదా ఓ 5 కి.మీ.రైల్వేట్రాక్ పై నిర్ణయించిన జాగా వరకు నడుచుకుంటూ ట్రాక్ ని చెక్ చేస్తూ  వెళ్లి మళ్ళా తిరిగి రావాలి. రాత్రి 8 గం. నుండి ఉదయం 6 గం వరకు ట్రాక్ ని కాపలా కాయడమే డ్యూటీ  రాత్రి అప్పటికే మూడు రౌండ్లు పూర్తి చేసాను. సరిగ్గా సమయం 1 -30 అయ్యుండొచ్చు యధాలాపంగా పెట్రోలింగ్ చేసుకుంటూ వెళ్తున్న నాకు దూరంగా ఎవరో కొంతమంది ట్రాక్ పై తచ్చాడుతుండడం చూసాను వెంటనే నా దగ్గరున్న విజిల్ ఊది  ఎవరక్కడా....?ఎవరక్కడా..? అని అరిచాను

నన్ను చూసి నా అరుపులతో వాళ్ళు చీకట్లోకి జారుకున్నారు నా కెందుకో అనుమానం వేసి నేనొంటరిగా వున్నానని ఎందుకైనా మంచిదని దగ్గర్లో వున్న స్టేషన్ వైపు పరుగు తీశాను.

కంగారుగా వచ్చిన  నా  నుంచి సంగతి తెలుసుకున్న ప్రభాత్ (స్టేషన్ మాస్టర్ )అప్రమత్తమయ్యాడు కంట్రోలర్ కి తెలియ పర్చి పోర్టర్ ని, ఆర్ పి ఎఫ్ ని తీసుకొని నాతో పాటు బయల్దేరాడు

అప్పటికే బ్రిడ్జి పై ట్రాక్ దగ్గర ఎవరో నలుగురు మళ్ళా తచ్చాడుతుండడం చూసి  అందరం గట్టిగా కేకలేస్తూ  బ్రిడ్జి మీదకు పరుగులు తీసాం మమ్మల్ని గమనించిన ఆ ఆగంతకులు ఒక్కసారిగా పరుగు లంకిచుకున్నారు. పరిస్థితిని అర్ధం చేసుకున్న ఎస్ ఎం గారు వెంటనే నన్ను అక్కడే ఉండమని, పోర్టర్ చేతికి సిగ్నల్ లాంప్ తో  పక్క స్టేషన్ వదిలి బ్రిడ్జి మీదకొస్తున్న రాజధాని ఎక్సప్రెస్ ని ఆపడానికి ప్రయత్నిచామన్నాడు

అలాగే సర్ అంటూ పోర్టర్ ట్రైన్ వైపుగా సిగ్నల్ లాంప్ తో దౌడు లంకిచుకున్నాడు

నా వెనుకనే ట్రాక్ ని చెక్ చేస్తూ వెళ్తున్న ఎస్ ఎం ట్రాక్ ని చూసి నివ్వెర పోయాడు . మూడడుగుల మేర ట్రాక్ క్రింద ఏదో వస్తువున్నట్టు గమనించాక ఉలిక్కి పడి అదేదో చూద్దాం తీద్దామా? అని.  ఆర్ పి ఎఫ్ ని ప్రశ్నించాడు ఎస్.ఎం.

వద్దు సర్ ..! ముట్టుకోకండి అనుభవం తో చెప్తున్నాను అదేదో ఎక్సప్లోజివ్స్ అవ్వొచ్చు....!

ఏ నక్సలైట్లో,ఆటంకవాదుల పనో అవ్వొచ్చు మంత్రి గారి ప్రోగ్రాము తెలుసుకొని ఇలాంటి పనులకి దిగివుండొచ్చు అనగానే ఎస్.ఎం గారికి గుర్తొచ్చింది వస్తున్న ట్రైన్ లో మంత్రి గారున్నట్టు కంట్రోలర్ మెసేజ్.....!

ఆలస్యం చెయ్యక తాను కూడా రెడ్ సిగ్నల్ లైట్ చేత్తో పట్టుకొని ట్రైన్ వస్తున్నా వైపుగా పరుగులు తీశారు. పోర్టర్,ఎస్.ఎం, డేంజర్ సిగ్నల్స్ తో రావడం గమనించిన ట్రైన్ డ్రైవర్ అప్రమత్తమై ట్రైన్ ని ఆపి కారణం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు.

అసలే మంత్రి గారున్న ట్రైన్ సర్వ హంగులూ ఉండడం తో వెంటనే అందరూ కార్యోన్ముఖులయ్యారు సెక్యూరిటీ సిబ్బంది సంగతి తెలుసుకొని ఆ ప్రదేశంలో అమర్చిన వస్తువులని బాంబులుగా గుర్తించి డి ఫుజ్ చేసి విషయాన్ని మంత్రిగారి చీఫ్ సెక్రటరీ గారికి విన్నవించారు విషయం తెలుసుకున్న మంత్రిగారు ఘటనా స్థలానికి చేరి నన్ను,పోర్టర్ని,ఆర్ .పి.ఎఫ్ ని,ఎస్.ఎం.ని అభినందించి తగు బహుమతికి సిఫార్సు చేస్తానన్నారు.

..........

ఏప్రిల్- 16

రైల్వే వారోత్సవాలు జరిగే వేదికని రంగు,రంగు దీపాలతో ఎంతో వెచ్చించి శోభాయమానంగా అలంకరించారు .  అందరితో పాటూ గ్యాంగ్ మెన్ ముసలయ్యకూ,పోర్టర్ కిరీటి కీ,ఆర్.పి ఎఫ్. అహ్మద్ కీ,ఎస్.ఎం. ప్రభాత్ కీ ఆహ్వానాలందేయి.

ఎదురుచూస్తున్న రోజు రాడంతో దారి ఖర్చులకి ఏం చెయ్యాలో అని సతమతమౌతున్న ముసలయ్యకి షావుకారు గుర్తొచ్చాడు.తనకో ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుతుందని త్రోవ ఖర్చులకి ఓ 200 రూపాయలిస్తే మొత్తం 1500 అవార్డు అందగానే తీర్చేస్తానని తీసుకు బయల్దేరాడు.

రంగు రంగుల దీపాలతో వేదికని అత్యంత సుందరంగా అలంకరించారు. కార్యక్రమం జరుగుతోంది కానీ ముసలయ్య మనసులో చెప్పలేని ఆనందం పదిమందిలో తనకో గుర్తింపు వచ్చిన ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి కా సాగాడు. అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభమైంది.

డి.ఆర్.ఏం. గారు ఒక్కొక్కరి పేర్లు చదువుతూ అవార్డుల మొత్తం ప్రకటిస్తున్నారు. ముసలయ్య వంతు రానే వచ్చింది.పెను ప్రమాదాన్ని పసిగట్టి నివారించినందుకు i తనతో పాటూ మిగతా ముగ్గురికీ చెరో 200 రూపాయలు నగదు బహుమానం తో ప్రశంసాపత్రము ప్రకటించారు.

విన్న వెంటనే ముసలయ్యకి నవనాడులూ కృంగిపోయాయి.

బహుమానం అనగానే ఏదేదో ఊహించుకున్న ముసలయ్య తలచిందొక్కటీ,జరిగిందొక్కటీ అయింది.ఈ అవార్డు తో షావుకారు బాకీ తీర్చొచ్చు,మళ్ళా కొత్త బాకీ తో కొడుక్కి స్కూల్ షూలు కొందామనుకున్నాడు.కానీ తీరా చూస్తే అవార్డు 200 లే. దారిఖర్చులకని తెచ్చిందే తీరుతుంది.మరి షావుకారు బాకీ? కొడుక్కి స్కూల్ షూలో?.....

గొర్రె తోక లాంటి తన జీతం పై, ఎదుగూ,బొదుగూ. లేని తన జీవితం పై అసహ్యం వేసింది.

ఒకరి తర్వాత ఒకరయ్యకా చివరికి తనొంతొచ్చింది.ఇక్కడ కూడా మమ్మల్ని గుర్తించేది చిట్టచివరికా? ఈ ఆలోచన తో పట్టరాని ఆవేశం కట్టలు త్రెంచుకుంది ముసలయ్య మదిలో. జీవచ్ఛవం లా కదిలి వేదిక పైకి చేరుకొని వణుకుతున్న చేతుల్తో అవార్డుని అందుకున్నాడు.తనలో రగులుతోన్న భావోద్వేగాల్ని అణుచుకోలేక ....

సార్...! మీరనుమతిస్తే ఓ రెండు మాటలూ..! అన్నాడు డి.ఆర్.ఎం.తో

ఓకే..ష్యుర్..అంటూ మైక్ చేతికందించారు డి.ఆర్.ఎం.

మైక్ ని అందుకొని వేదిక పై నున్న అధికారులనుద్దేశించి...

దొర బాబులకు దండాలు అంటూ మొదలెట్టేడు ముసలయ్య.

మేం గ్యాంగ్ మెన్లం...

  పగలనక,రాత్రనక,ఎండనక,వాననక చివరికి చలిక్కూడా లెక్కలేకుండా చేస్తాం డ్యూటీ లు కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతున్న సైనికుల్లా మేం ఈ రైల్వేని కాపాడుతూంటాము.సైనికులకైతే బోల్డంత జీత భత్యాలు అలవెన్సులూ కానీ నిరంతరం దేశం లో రైల్వే ని రక్షిస్తున్న మమ్మల్ని మాత్రం క్లాస్ ఫోర్ అంటారు. మాకు జీతం అంతంత మాత్రమే. రావాల్సిన నైట్ డ్యూటీ అలెవెన్సులు సరిగా రావు.

ఎండకి ఎండి,వానకి తడిసి,చలికి గడ్డకట్టిపోయినా మాకో గుర్తింపులేదు.

పగులుదేరిన కాళ్లతో రాళ్లపై నిర్ణయించిన దూరం నడుచుకొంటూ వెళ్లడమే కానీ తగు బూట్లు సప్లై చెయ్యమని కోరలేదెప్పుడూ.. ఇల్లూ,సంసారం,భార్యాబిడ్డల్ని వదిలి మాకు నిర్దేశించిన ప్రదేశానికి పోతాం సార్ డ్యూటీకి....అక్కడ మా భార్యాబిడ్డలకేమొచ్చిన దిక్కులేదు..అడిగే నాధుడూలేడు.

అర్ధరాత్రి ఏ విషపు పురుగు బారినో,క్రూర జంతువు బారినో మేం పడితే అంతే.....!

మా ఆడ కూతుళ్ళ పెళ్ళిళ్ళకి,కుర్రోళ్ళ చదువులకి నోచుకోలేదుసార్ ...మాకా స్తోమతేది?కమిషన్ ల మీద కమిషన్లు ఆరు దాటి ఏడవది వచ్చినా మేం, మా గేంగుకూలీల గురించి చిన్న మాట కూడా లేదు సార్ .

ఇంత పెద్ద ఇండియన్ రైల్వేస్ లో మేం చిన్న స్క్రూ లం సార్

మా కోసం పోరాడే నాయకులూ లేరు,మమ్మల్ని గుర్తించే అధికారులూ కరువయ్యారు . మేమూ మనుషులమనీ రైల్వేలో ముఖ్య కార్మికులమని మమ్మల్ని గుర్తించండి సార్...మేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదుసార్...!

మాకు తగిన ప్రమోషన్ల అవకాశాలు కల్పించండి సార్..!

మా భార్యా,బిడ్డల్ని ఆదుకోండి సార్...!

మా పిల్లల ఉన్నత చదువులకి చేయూత నివ్వండి సార్...!

మాక్కూడా జీతాలు పెంచి భత్యాలవ్వండి సార్....!

జై జవాన్..! జై కిసాన్.ల తో పాటూ రైల్వేలో జై గ్యాంగ్ మెన్ అన్న నినాదాన్ని తెండి సార్..

మేమూ మనుషులమే సార్..

మేమూ మనుషులమే.... అంటూ మొదలు నరికిన మానులా కుప్ప కూలాడు ముసలయ్య.......

మరిన్ని కథలు