Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
no exams tention.. do enjoy

ఈ సంచికలో >> యువతరం >>

యువతను మింగేస్తోన్న ఊబకాయం

obesity

'ఊబకాయం' ఇదో చిన్న సమస్యగా కనిపించే అతి పెద్ద సమస్య. అసలీ సమస్యకు కారణం మారుతున్న మన ఆహారపు అలవాట్లే. ఫాస్ట్‌ఫుడ్‌ కల్చర్‌ అతిగా పెరిగిపోవడమే ఈ ఊబకాయానికి అసలు సిసలు కారణం. ఎంచక్కా అమ్మమ్మలు, నాయనమ్మలు చేసిన బెల్లం, పిండి వంటకాలను తినడం మానేశారు. నూడుల్స్‌, పిజ్జా, బర్గర్స్‌లాంటి కొత్త ఐటెమ్స్‌ వైపే యువత మొగ్గు చూపుతున్నారు. అదే ఈ ఊబకాయానికి దారి తీస్తోంది. ఈ సమస్యను మొక్కగా ఉన్నప్పుడే తుంచేయకపోతే, మానుగా మారి పీడించేస్తుంది. ఊబకాయానికి చిన్నా - పెద్దా, అనే జాలీ దయలుండవు. ధనికా - పేదా అనే తారతమ్యామలు అస్సలుండవు. మనం తీసుకునే ఆహారమే దానికి బలం. ఆ బలం చూసుకుని ఎవ్వరి పైనైనా ఈజీగా విజృంభించేస్తుందీ మహమ్మారి. ఈ మహమ్మారి బారి నుండి తప్పించుకునేదెలా అంటే ఆహారపు అలవాట్లను కంట్రోల్‌లో పెట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు.

ఇప్పుడు పిల్లలను ఆహారం విషయంలో కంట్రోల్‌ చేయడం చాలా కష్టమైపోతోంది. ఇంట్లో కమ్మగా వండే ఆహారాన్ని ఈజీగా రిజక్ట్‌ చేస్తున్నారు. బయట దొరికే వెరైటీ ఫుడ్స్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇస్తున్నారు. దాంతో ఈ ఊబకాయ మహమ్మారి విజృంభణకు మార్గం అత్యంత సులభతరమైపోతోంది. ఒక్కసారి ఊబకాయం బారిన పడితే ఇంక అంతే సంగతి. అందుకే ఈ ఊబకాయ సమస్యని అంత సులువుగా వదిలేయకూడదంటున్నారు నిపుణులు. దీర్ఘకాల సమస్యలైన రక్తపోటు, మధుమేహం వంటి సమస్యల పక్కన ఈ ఊబకాయాన్ని కూడా చేర్చదగ్గ వ్యాధిగా దీన్ని పరిగణించాలనీ వైద్య నిపుణులు అంటున్నారు. పెరిగిన లావును తగ్గించుకునే ప్రక్రియలో చాలా మంది కొన్ని నెలలు కష్టపడి వర్కవుట్స్‌ చేసి, డైట్‌ కంట్రోల్‌ చేసి బరువు తగ్గుతారు. దాంతో హమ్మయ్యా..! నేనింక బరువు పెరగనులే అనుకుంటారు. తర్వాత తమ నార్మల్‌ డైట్‌నే కంటిన్యూ చేస్తారు. ఇంకేముంది. ఆ తర్వాత మళ్లీ తగ్గిన బరువు క్రమ క్రమంగా పెరిగిపోవడం స్టార్ట్‌ అవుతుంది. అయితే ఇలా ఒక్కసారి ఊబకాయం బారిన పడిన వారు ఒక్కసారి బరువు తగ్గితే, పూర్తిగా తమ శరీరాన్ని కంట్రోల్‌లోకి తెచ్చుకున్నట్లు కాదనీ, తగ్గిన బరువును జీవితాంతం కంట్రోల్‌లోనే పెట్టుకోవల్సి ఉంటుందనీ తాజా అధ్యయనాల ద్వారా వెల్లడి అయ్యిందనీ నిపుణులు చెబుతున్నారు. 
అందుకే వారు చెప్పేదేమంటే, ఊబకాయాన్ని దీర్ఘకాల సమస్యగానే భావించాలన్న విషయాన్ని గమనించాలంటున్నారు. బీపీ, షుగర్స్‌కి జీవితాంతం ఎలా మందులు వాడతామో, అలాగే ఊబకాయులు కూడా జీవితాంతం డైట్‌ కంట్రోల్‌లో పెట్టుకుని, తగు చిన్న చిన్న వ్యాయామాలను అనుసరిస్తూ, ఈ ప్రక్రియను ఏదో కొన్ని నెలలు, రోజుల వరకూ మాత్రమే కేటాయించకుండా, నిత్యకృత్యం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అంటున్నారు. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిందేమంటే, బయటి ఫుడ్‌ని పూర్తిగా అవైడ్‌ చేయడమే. ఇంటి ఫుడ్‌కి పూర్తిగా ఆడిక్ట్‌ అవ్వడమే. పిల్లలకూ ఈ విషయంలో తప్పక అవగాహన కల్పించాలి. అది తప్ప మరో మార్గం లేదు. వీటితో పాటు, నిపుణులు చెబుతున్న పై విషయాల్ని గమనించి, తమ డైట్‌ విషయంలో కాస్త ఆచి తూచి వ్యవహరిస్తూ, జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ, అవసరమైన మేర రెగ్యులర్‌గా వర్కవుట్స్‌ చేస్తూ వుంటే ఈ ఊబకాయాన్ని కొంతవరకైనా జయించే అవకాశాలు లేకపోలేదు. ఊబకాయం మన కారణంగానే వస్తోంది, దాన్ని తగ్గించుకోవడమూ మన చేతుల్లోనే వుంది. మరి జాగ్రత్తపడదామా ఇకనైనా?

మరిన్ని యువతరం