Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
vepachettu

ఈ సంచికలో >> కథలు >> జోగినాధం ద గ్రేట్

joginatham the great

గబగబా సూట్ కేస్ సర్దుకుంటున్నాడు జోగినాధం. మూడ్రోజులు ఆఫీస్ పని మీద హైదరాబాద్ కేంప్ కెళ్ళాలి.

"ఏమండీ నే సర్దనా?" అని భార్య అంటే అక్కర్లేదు "నేను సర్దుకోగలను"అంటూ అభిమానం అడ్డురాగా కొరకొరా భార్యని చూస్తూ అన్నాడు.
అన్నీ సర్దుకున్నానో లేదో అనుకుంటూ మరోసారి చెక్ చేసుకోడం మొదలెట్టాడు. ప్రక్కనే వున్న భార్య సుబ్బలక్ష్మి జోగినాధాన్ని గమనించసాగింది. భర్తకి కాస్తా మతిమరుపు. అన్నీ పనులు తను దగ్గరుండి చూడాలి లేకుంటే ఏదో మర్చిపోయి మళ్ళా వెతుక్కొని కెలుకుతుంటాడు భర్త. తెల్లారగానే లేచి స్నానం చెయ్యాలి, తువ్వాలు,సబ్బుబిళ్ళ,లుంగీ పెట్టుకున్నాను. తర్వాత తలకి నూనె రాసుకు దువ్వుకోవాలి..తలనూనె,దువ్వెన రెడీ. బట్టలు వేసుకొని ఆఫీస్ కి వెళ్ళాలి, బనీన్లు,అండర్ వేర్లూ, రెండు ప్యాంట్లు,మూడు షర్టులు వేసుకున్నా. పెన్నులు,జేబురుమాళ్ళూ, కళ్ళజోడు  వున్నాయి. చెప్పుల్తో పాటూ బూట్లు  కూడా సర్దా. ఆఫీస్ లో ఆఫీసర్ని కలవాలి, ఫైల్ కాగితాలు వేసా.

రాత్రి పడుకోడానికి ఎయిర్ పిల్లో,రెండు దుప్పట్లువేసా..అంతే అయిపోయింది...రోజుకి కావల్సినవన్నీ సర్దుకున్నా చూశావా సుబ్బూ...
ఆ(.....చూస్తూనేవున్నా...

తెల్లారి లేవగానే ఏం చేస్తారు ? అని అడిగింది భర్తని ,మర్చిపోయినది గుర్తుతెచ్చుకుంటాడేమోనని.

"ఏం చేస్తామేంటి స్నానం చేస్తాం..."

"ఏం చేస్తారూ ?."...రెట్టించి అడిగింది సుబ్బలక్ష్మి.....

"స్నానం....స్నానం"...ఫోర్సు గా సమాధానమిచ్చాడు జోగినాధం.

"స్నానమా..?" " స్నానమా ? " అంది.

"అవును"..."అవును"...సమాధానమిచ్చాడు జోగినాధం.

మరైతే "పళ్ళుతోముకోరా ?"  అందుకు "బ్రష్, పేష్టూ ,నాలికబద్దా వద్దా ?" చిరాకుగా. ప్రశ్నించింది సుబ్బలక్ష్మి.

"అయ్యో! నా మతి మండా " అనబోయి భార్య మళ్ళా తన మతిమరుపు మీద క్లాస్ పీకుతుందని

"మర్చిపోయానే" అన్నాడు యధాలాపంగా

అంతే తగులుకుంది  సుబ్బలక్ష్మి...

మర్చిపోతారు...మర్చిపోరూ...?

మొన్నటికి మొన్న సరుకులు తెద్దామని పచారీ కొట్టుకి తీసుకెళ్ళి , "సరుకులు కట్టిస్తూండు ,యిప్పుడే వస్తా" అంటూ  వెళ్ళి , ఎంతకీ రాకపోతే ఫోన్ చేస్తే....

సినిమాహాల్లో సినిమా చూస్తున్నా..ఏం..ఏమయిందీ అన్నారు.

అంతకు ముందోసారి సినిమాకని తీసుకెళ్ళి, టిక్కెట్ట్లు కొని నా చేతిలో పెట్టి సోడా తాగొస్తానంటూ మాయమయ్యారు.. సర్లే మీకిది మామోలేనని హాల్లో కూర్చొని సినిమాని కాక , మీకై ఎదురు చూస్తుంటే వో గంటన్నర పోయాక....

ఆఫీస్ నుంచి యింటికొచ్చి అరగంటయ్యింది..యింటికి తాళంవేసి ఎక్కడ ఛచ్చావే ?...అంటూ ఫోన్లో కేకలు వెయ్యలేదూ ?

మీ సంగతి తెలిసి సినిమా అంతటితో వదిలి రాలే ?.....

అంతెందుకూ...మా తమ్ముడి పెళ్ళికని విశాఖపట్నం బయల్దేరి త్రోవలో రాజమండ్రి స్టేషన్ లో కాఫీ తాగొస్తానని దిగి , మళ్ళా ట్రైన్ కదిలినా రాకపోతే....మీరేమయ్యారోనని వెతుక్కుంటుంటే....విజయవాడ చేరి నేనెక్కడికో వెళ్ళిపోయానని గంతులెయ్యలేదూ ?...

అబ్బబ్బా...ఆపవే నీ సోది...అసలే ఏం చెయ్యాలో తోచక ఛస్తూంటే...

అవును నావి సోది మాటలే....మరి మీ పనులో...?

ఓసారి ఆఫీసర్ని పట్టుకు "ఏరా..?  టీ తెమ్మని చెప్పి గంటైనా తేకుండా పళ్ళికిలిస్తున్నావేంటి "? అనంటే కోపంతో ఆయనో వారంరోజులు తమర్ని సస్పెండ్ చెయ్యలేదూ ?...

క్రితంలో మనిల్లు అనుకొని ప్రక్క వాటా వాళ్ళ బెడ్ రూం లో దూరి "సుబ్బూ మై డార్లింగ్" అంటూ ప్రక్కింటావిడతో డ్యూయెట్ పాడ్డం మొదలెడ్తే గాభరాతో ఆవిడ మనింట్లోకి పరుగున రాలేదూ ?

ఖర్మ..అంతా నా ఖర్మ..ఇందండి బ్రష్షు,బద్దా,పేష్టూన్నూ అంటూ కళ్ళనీళ్ళు కక్కుకుంది సుబ్బలక్ష్మి. జోగినాధం చిన్నప్పుడు చాలా తెలివైనవాడే. పదోతరగతిలో ఫస్ట్ ర్యాంకొస్తే తండ్రి రామశర్మ వూర్లో అందరికీ పేరు పేర్నా మిఠాయిలు పంచి గొప్పగా చెప్పుకున్నాడు .
రామశర్మ వాళ్ళది సాలూరు దగ్గర రామభద్రాపురం. రెండెకరాల మాగాణి, సొంతిల్లు వుండేవి.

స్త్రోతీయ బ్రాహ్మణ కుటుంబం, భార్య అన్నపూర్ణ, నిప్పుని కడుక్కొనేంత మడి,ఆచారం. పేరుకి తగ్గట్టు అన్నపూర్ణాదేవే.  ఎవరైనా ఆకలితో వుంటే సహించలేదు.  "అయ్యో పాపం " అంటూ కడుపునిండా తిండి పెట్టనిదే పంపించేదికాదు అన్నపూర్ణ. రిజల్ట్స్ తెలిసాక ఎండాకాలం శలవుల్లో చెరువులో ఈత కి పిల్లలందరితో వెళ్ళాడు జోగినాధం.

పిల్లలందరూ సరదాగా ఈత కొడ్తూ , గట్టునున్న బండరాయి ఎక్కి చెరువులోకి డైవింగ్ చేస్తూంటే తనూ చెయ్యాలని సరదా పడ్డాడు.
అనుకున్న వెంటనే బండరాయినెక్కాడు డైవింగ్ కి. చెరువులోకి డైవింగ్ చెయ్యబోతే పట్టుతప్పి చెరువు గట్టుకి బుర్ర తగిలి స్పృహ తప్పి చెరువులో పడిపోయాడు.

గాభరాగా పిల్లలందరూ పైకి తీసి యింటికి తెచ్చారు. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే రెండింజిక్షన్లు చేశాక స్పృహలోకి వచ్చాడు జోగినాధం.  మరేం ఫర్వాలేదు యింటికి తీసుకెళ్ళొచ్చన్నారు డాక్టర్. అదిమొదలూ జోగినాధం యిలా తయారయ్యాడు. వ్యాధి మొదలయిన కొత్తలో అంటే యింటర్మీడియట్ లో పాఠాలు గుర్తుండట్లేదని పాఠాల్ని సినిమా పాటల లయ తో కూర్చి పాడుతూ గుర్తుపెట్టుకోసాగాడు. కానీ అంతవరకూ గుర్తున్నవి సరిగ్గా క్వొశ్చన్ పేపరివ్వగానే.....

సినిమా పాటే కానీ ఆ లయతో గుర్తుపెట్టుకున్న జవాబు ఎంతకీ గుర్తొచ్చి చచ్చేది కాదు. అలా వో సారి యింటర్, రెండుసార్లు డిగ్రీ తప్పాక ఎలాగో డిగ్రీ అయిందనిపించాడు జోగినాధం. తండ్రి రామశర్మ పలుకుబడితో ఎల్.ఐ.సి లో క్లర్కు గా జాయనయ్యాడు. మొదట్లో తండ్రి "బజారుకెళ్ళి కూరలు తేరా" అని డబ్బిచ్చి,చెల్లిని తోడుగా పంపితే, హాయిగా సెలూన్ కెళ్ళి  క్షవరంచేస్కోని, గడ్డంగీస్కోని  చెల్లి సుమ ఎంత చెప్పినా వినకుండా  రిక్షా ఎక్కిచుకొని యింటికొచ్చేవాడు. అదేంట్రా..? కూరలేవి? రిక్షా మీదొచ్చావేంటని అడిగిన తండ్రికి చెల్లాయి జడవేస్కోకుండా చింపిరిజుత్తుతో నా వెంట వచ్చింది నాన్నా....ఎవరైనా చూస్తే నవ్వరా..అన్న సమాధానంతో నవ్వాలో,ఏడ్వాలో తెలియని పరిస్ధితి రామశర్మది.

పెళ్ళి చేసేస్తే కోడలొచ్చిన ముహూర్తాన జాతకంమారి సవ్యంగా వుంటాడనుకొని మేనకోడలు సుబ్బలక్ష్మినిచ్చి వివాహం చేశాడు రామశర్మ జోగినాధానికి.

కానీ పెళ్ళిలో జోగినాధం చేసిన చేష్టలు చనిపోయేవరకూ తల్చుకొని ఏదోలా ఫీలవ్వసాగాడు రామనాధం.

పెళ్ళికొడుకుని చేశాక,స్నాతకవ్రతం పూర్తి కాగానే బాబూ..! కాశీయాత్రకిబయల్దేరూ...బావమరిదిని

సిద్దం చెయ్యండి..అని పురోహితుడు అనగానే...

ఒక్క నిమషం పంతులుగారూ....అన్న జోగినాధాన్ని చూసి ఏదో ఊహించిన పురోహితుడు

"సరే...అలాగే..కానీ..బాబూ...వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళూ,చేతులూ కడుక్కురా" అన్నాడు.

"అలాగేనండీ " అంటూ పరిగెత్తాడు జోగినాధం.

పది,పదిహేను నిముషాలైనా ఎంతకీ రాకపోయే సరికి ....

సమయం మించిపోతోందన్న పురోహితుని కేకలతో నలుగురూ నాలుగు వైపులా వెదకసాగారు.

పందిట్లో ఎక్కడా జోగినాధం కనిపించకపోతే ఏదో అనుమానంతో యింటికొచ్చాడు రామశర్మ. ఇంట్లో వున్న కొడుకుని చూసి....

"అదేంట్రా..!  పెళ్ళిపందిరి వదిలేసి యింట్లో యిక్కడ సూట్ కేస్ ముందేసుకొని  ఏం చేస్తున్నావ్.?" అన్నాడు కొడుకుతో

"అదే ...నాన్నా...కాశీయాత్రకి బయల్దేరమన్నారుగా..పంతులుగారు...మనూర్నించి కాశీకి ప్రయాణమంటే పోను రెండ్రోజులూ, రాను రెండ్రోజులూ కనీసం అక్కడుండేదో మూడ్రోజులూ మొత్తం వారం రోజులకి సరిపడా బట్టలు సర్దుకోవద్దూ  అవే సూట్ కేస్ లో సర్దుతున్నా" అన్నాడు తండ్రితో.

"చాల్లే...పదా.."  అంటూ రెక్క పట్టుకులాక్కొచ్చాడు పందిట్లోకి జోగినాధాన్ని. దగ్గరుండి తంతు పూర్తి చేయించాడు రామశర్మ. కోడలుపిల్ల రాగానే " సుబ్బూ వాడొట్టి అమాయకుడే...జాగ్రత్తగా చూస్కో తల్లీ" అన్నాడు.

"అలాగే " ...మామయ్యా మీరింతగా చెప్పాలా ? అంది సుబ్బలక్ష్మి.

చివరి క్షణాల్లో కూడా...

"వాడ్ని జాగ్రత్తగా చూసుకో తల్లీ"...అంటూ పోయాడు రామశర్మ.

.........

సూట్ కేస్ లో అన్నీ సర్దాక "బస్సుకి టైమయ్యింది" పదండి అంది భర్తతో. పదండా....? నువ్వెక్కడికీ..? అంటూ భార్యనడిగాడు
చెప్తా...పదండి ముందు..అంటూ సూట్ కేస్ తీసుకు బయలుదేరింది బస్టాండ్ కి. అయోమయంతో ఆమెని  అనుసరించాడు జోగినాధం.
జోగినాధాన్ని హైదరాబాద్ కి వెళ్ళే బస్సెక్కించి కండక్టర్ కి భర్త పరిస్ధితిని వివరించి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఎందుకైనా మంచిదని తన ఫోన్ నెంబర్ కూడా కండక్టర్ కి యిచ్చి, భర్తకి చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి బస్సు కదలగానే యిల్లు  చేరింది సుబ్బలక్ష్మి.  ముదనష్టపు సంత....మతిమరుపుమేళం...అన్నీ నేనే చూసుకోవాలి...

ఈ మూడ్రోజులైనా కాస్తంత తిని విశ్రాంతి తీసుకోవచ్చు....అనుకుంటూ గడియారం చూసి పదిన్నరయ్యింది. కాస్తంత తిని పడుక్కోవాలని...చేసిన ఉప్పుపిండి గబగబా తిని గిన్నెలు షింకులో పడేసి నిద్రకుపక్రమించిది సుబ్బలక్ష్మి. అలసిపోయిన తను మాంఛి నిద్రలోకి జారుకుంది. తెల్లారుఝామున ఫోన్ మోగుతూంటే మళ్ళా యేమొచ్చిందిరా బాబూ..అనుకుంటూ గాభరాగా ఫోనందుకొని...హల్లో...అంది.

అవతలి వ్యక్తి సుబ్బలక్ష్మిగారాండీ...అంటే...

సుబ్బలక్ష్మినే చెప్పండంది.

అదేనండి.....మీ ఆయన్నెక్కించిన హైదరాబాద్ బస్సు.....

ఆ..( ..బస్సు ? అని సుబ్బలక్ష్మి అనగానే....

గాభరా పడకండీ....ఆ బస్సు జనగాం దగ్గరలో ఏక్సిడెంటయ్యింది....కొందరికి గాయాలయ్యాయి...

మీ వారికి తలకి గాయమైతే....మిగతా వారితో పాటూ జనగాం ప్రభుత్వాసుపత్రిలో చేర్చాం....

పూర్తి కాకుండానే...వోరి దేముడో...నేనేం చేతునురో...అంటూ ఏడుపు లంకించుకుంది.

మీరు త్వరగా బయల్దేరి జనగాం రండమ్మా...అని ఫోన్ కట్ చేసాడు అవతలి వ్యక్తి.

దు:ఖ్ఖాన్ని దిగిమింగి గబగబా బస్టాండుకి పరుగులు తీసింది జనగాం వెళ్ళడాన్కి.

జనగాం చేరి ఎలాగో వెతుక్కొని ప్రభుత్వాసుపత్రికి వెళ్ళి భర్త బెడ్ దగ్గరికి చేరింది తను.

తలనిండా కట్లతో బెడ్ పై అచేతనంగా పడున్న భర్తని చూసి దు:ఖ్ఖాన్ని ఆపుకోలేకపోయింది.

సుబ్బలక్ష్మిని చూసిన డాక్టరుగారు..."మరేం ఫర్వాలేదమ్మా...ఏక్సిడెంట్ లో తలకో బలమైన దెబ్బ తగిలింది....స్కానింగ్ చేశా...అన్నీ సవ్యంగా వున్నాయి....నొప్పి తగ్గటానికి...తెలివి రాడానికి రెండిజక్షన్లు  చేశా...కాస్సేపట్టో తెలివి రావొచ్చు" అన్నాడు డాక్టర్.
అలా రెండ్రోజులు గడిచాయి....కానీ జోగినాధానికి తెలివి రాలేదు.  ఈ రెండ్రోజుల్లో సుబ్బలక్ష్మి తన భర్తని మామూలు మనిషిని చెయ్యమని మొక్కని దేముడూ,దేవతా లేదు.

అహర్నిశలూ కంటికి రెప్పలా కాపలా కాసాక రెండోరోజు సాయింత్రానికి స్పృహలోకి వచ్చాడు జోగినాధం. ఆనందంతో డాక్టర్ దగ్గరికి పరుగులు తీసి పిలుచుకొచ్చింది సుబ్బలక్ష్మి.

పరీక్షలన్నీ చేసిన డాక్టరుగారు.... సంతోషంగా..."మరేం ఫర్వాలేదమ్మా...మీ ఆయనకి నయమయింది...

పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు" అన్నాడు.

పట్టలేని ఆనందంతో యేం చెయ్యాలో తెలియక..."ధాంక్సు డాక్టరుగారూ...ధేంక్యూ వెరీమచ్" అంది భర్త తలచేత్తో నిమురుతూ...
తల నిమురుతూన్న సుబ్బలక్ష్మిని అయోమయంగా చూస్తూ తెగ సిగ్గుపడి మెలికలు తిరిగిపోసాగాడు

జోగినాధం.

ఏమండీ...ఏమండీ..ఆ భగవంతుని దయవల్ల మీ ఆరోగ్యం కుదుటపడింది. కనకదుర్గమ్మ నా మొరాలకించిందండీ....విజయవాడ వెళ్ళగానే కనకదుర్గమ్మవారి మొక్కు తీర్చుకోవాలి....అంటున్న సుబ్బలక్ష్మిని ఎగాదిగా కొత్తవ్యక్తిని చూస్తున్నట్టు......పట్టి పట్టి చూడసాగాడు జోగినాధం.

అలా చూస్తారేంటండీ..."నేనండీ..సుబ్బలక్ష్మినండీ...మీ సుబ్బూని".... అంది.

సుబ్బలక్ష్మా...? ఏ సుబ్బలక్ష్మి....? సుబ్బూ ఎవరూ...? ఎవరు మీరూ ?.... మీరెవరో నాకు తెలియదే...మిమ్మల్నెక్కడా చూసినట్టు, కలిసినట్టు కూడా గుర్తుకూడా లేదే....అంటూ దీర్ఘంగా ఆలోచించసాగాడు.

నేనండీ...మీ భార్య సుబ్బలక్ష్మినండీ....మీ మేనమామ పేరంశాస్త్రి రెండో కూతుర్నండీ....అంది

గుర్తుచేస్తూ...

"నా భార్యేంటీ...? నాకింకా పెళ్ళేకాలేదు...నాకు భార్యెక్కడిది...? మీరెవరో నాకు తెలియనే తెలీదు...

దయచేసి నన్నొదలండీ...మీకు పుణ్యముంటుంది...మీకు నమస్కారం చేస్తా....అన్నాడు

సుబ్బలక్ష్మి నుంచి విదిలించుకుంటూ.

అయ్యయ్యో..! నాకు నమస్కారం పెడ్తారేంటండీ....మీ భార్యనండీ...తప్పండీ...

నాక్కసలు పెళ్ళేకాలేదంటుంటే....నా భార్యనంటోందేంటీ పిచ్చి మేళం....నేనిక్కడే వుంటే... నన్నెలాగైనా బుట్టలో పడేసేటట్టుందీ బజారుసరుకు....మరికలాభం లేదు....ఇక్కణ్ఞుంచి... వెంఠనే...జంపెయ్యాలి...అదొక్కటే మార్గం....జంపు జోగినాధం...జంపు...అంటూ సూట్ కేస్ ని ,

సుబ్బలక్ష్మిని వదలి ఆస్పత్రి నుండి ఒకటే పరుగులంఘించుకున్వాడు ద గ్రేట్ జోగినాధం.

"చదవ్వేస్తేవున్న మతిపోయిందన్నట్టూ"......నాకీ గతేమిటి....దేముడా...? అంటూ లబోదిబో మంటూ జోగినాధం వెంట ఏమండీ..ఏమండీ..అంటూ పరుగులు  తీసింది సుబ్బలక్ష్మి.

మరిన్ని కథలు