Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> మార్పు

marpu

అప్పుడే తెలవారుతోంది . సూర్యుని తొలి కిరణాలు అప్పుడప్పుడే విచ్ఛుకుంటున్నాయి . 'ప్రొదున్నభానుడు వంగపండు ఛాయ ' అన్న చందంగా కనిపిస్తున్నాడు సూర్యుడు.

తన తండ్రి నారాయణశర్మ తో పాటు మాధవశర్మ పూజ సామగ్రి పట్టుకొని గుడి కి బయలుదేరాడు. ఆ ఊరి లో ఉన్న ఏకైక చిన్న గుడి లో నారాయణ శర్మ పూజారి. మాధవ శర్మ తన తండ్రి కి సహాయకారి గా ఉంటూ ఉంటాడు. ఆ ఊరు ఆర్ధికం గా వెనుకబడిన జిల్లాలో , అభివృద్ధి లేని ప్రాంతం లో ఉండడంవల్ల గుడి లో సేవతో పాటు  నిధులు కూడా అంతంత మాత్రమే.  ఆ ఊరిలో స్కూలు లేకపోవడము వల్ల మాధవశర్మ ప్రక్కఊరిలోనే పదవతరగతి వరకు చదివాడు. మంచి తెలివైన విద్యార్ధని పేరు తెచ్చుకున్నాడు. మాధవశర్మ కు ఇంకా ఆ పై చదువులు చదవాలని ఉండేది. కానీ సరైన ఆర్ధిక స్థోమత లేకపోవడమువలన చదువు అక్కడితోనే ఆపివేసి తండ్రి కి సహాయకుడిగా చేరవలసివచ్చింది. నారాయణశర్మ, కొన్నాళ్ళు వేదం నేర్చుకోమని కొడుకును వేదపాఠశాల కు పంపాడు. కానీ చిన్నప్పటినుండి ఈ పూజలు, దానికి తగిన వేషధారణ అంటే మాధవశర్మ కు సుతారమూ ఇష్టం ఉండేదికాదు. 'నాలుగు ముక్కలు నేర్చుకోరా'! అంటే వినని కొడుకు తో చాలా తంటాలు పడ్డాడు ఆ తండ్రి.

ఒక్కగానొక్కకొడుకు, నాలుగు దెబ్బలు వేస్తె తండ్రి మనసు ఊరుకోదు. వేదం నేర్చుకోమని పంపితే, కొన్నాళ్లకే అమ్మను చూడాలనే వంకతో తిరిగివచ్చేసాడు. . తల్లికి కొడుకంటే ప్రాణం . "పోన్లెద్దూరూ .. వీడోక్కడేగా మనకి. ఇక్కడే ఉండి ,మీదగ్గరే ఆ నాలుగు ముక్కలు నేర్చుకొంటాడులెండి " అన్న ధర్మపత్ని మాటను ,కొడుకు మీద కోపంకలిగినా కొట్టి పారేయలేకపోయాడు. అప్పటినుండి మాధవశర్మ ,తండ్రి దగ్గరే ఉంటూ…. దూరంగా ఉండిఆ వేదం నేర్చుకొనే కంటే  తండ్రి చెప్పే పనులు చేస్తూ ఇక్కడే ఉండిపోవడం మేలనుకున్నాడు.
పై చదువులు చదువుకొనడానికి పట్నం  పోతానన్న .. "ఒరే !.. మాధవా .. నిన్ను చదివించే స్థోమత నాకు లేదురా . మన ఆర్ధిక స్థితి అంతంత మాత్రమే. ఏవో పండగల , పెళ్లిళ్ల సీసన్స్ తప్పించి , ఈ గుడినికానీ , ఈ  పూజారిని కాని  పట్టించుకొనే వారు ఎవరూలేరు. పండుగలలో తప్ప , మిగతారోజులలో దేవుని ప్రసాదానికే కష్టపడవలసి వస్తోంది. పండుగలలో ప్రజలంతా గుడి అలంకారాలకి , ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇస్తారే తప్ప , ఈ పూజారి గురించి ఎవరూ పట్టించుకోరు. ఒకప్పటి రోజులు కావురా ఇవి . మనం కులం పరంగా అగ్రం గా ఉన్నామేమో కానీ , ఆర్ధికం గా వెనకబడి ఉన్నాం . మనం ఒక్కళ్ళమే కాదు మనలాంటి వారు చాలామంది వున్నారు. ఏదో కష్టపడి నిన్ను చదివించినా , నీకు తగిన ఉద్యోగం వస్తుందని గ్యారంటీ లేదు. పై చదువులు చదివి , సరియైన ఉద్యోగం రాలేదని భాధ పడేకంటే , ఇక్కడే ఉంటూ .. ఆ పరమాత్ముని సేవ చేసుకొంటూ ..వచ్చే జన్మలోనైనా ఆ నాలుగు వేళ్ళు నోటిలోకి వెళ్ళేటట్టు పుట్టించమని ఆ దేవుని వేడుకొందాం. దేవుని సేవకై పుట్టినవాళ్ళము రా మనం. ఆ అదృష్టం ఎందరికోకాని దక్కదు. కాబట్టి ఇక్కడే ఉంటూ ఆ నాలుగు ముక్కలు నేర్చుకో .. నా తదనంతరం ఆ స్వామి బాగోగులు నువ్వే చూడాలి ” అంటూ మాధవుని కోర్కెను నొక్కేసాడు.

మాధవునికి ఈ మాటలన్నీ చిరాకు కలిగిస్తూవుండేవి. తన తండ్రి చెప్పే మాటలన్నీ 'చాదస్తం ' అనుకునేవాడు. బాగా చదువుకొంటే ఎందుకు ఉద్యోగం రాదు?. మాలాంటి వాళ్ళు అందరూ ఇలాగే లేరు కదా అనుకునేవాడు. కానీ ఎదురు చెప్పలేక అలిగి భోజనం మానివేసి పడుకునేవాడు. తనతో పాటే హైస్కూల్ లోచదివి , ఇప్పుడు పక్క పట్నం లో కాలేజీ లో చదువుతున్న స్నేహితులు కొంతమంది అప్పుడప్పుడు కలిసి అక్కడి కాలేజీ సంగతులు చెపుతుంటే నోరు తెరుచుకొని వింటూ ఉండేవాడు. తాను కూడా కాలేజీ లో చేరితే ఎంత బాగుండును . చక్కగా తనుకూడా జీన్స్ ఫాంట్ ,టీ షర్ట్స్ వేసుకొని పట్నం లో తిరిగేవాడు. క్రికెట్ ఆడేవాడు.

ఛ ! తండ్రి మీద పీకల దాకా కోపం వచ్చింది . తన జీవితం లో మధురమైన సంఘటనలన్నీ తండ్రి దూరం చేసేసే డని కోపం వచ్చేది . తన జీవితం ఇక ఇంతే.. గుడిలో ఆ నంది లాగ తను కూడా ఇక్కడ బంధీ అయిపోవలసిందే' అని  అనుకొన్నాడు.

తండ్రి మీద కోపాన్ని చూపించడానికి ఒకే అస్త్రం వాడేవాడు . అదే 'మూగనోము '. తండ్రి గుడిలో మంత్రాలు చదువుతూ , తనని కూడా చదవమన్నప్పుడు నోరు తెరిచేవాడు కాదు. గుడిలో తండ్రి ఏమి అనేక పోయినా , ఇంటి దగ్గర తిడుతూవుండేవాడు. తల్లేమో కొడుకుని వెనకేసు కొచ్చేది. నిత్యం తండ్రి కొడుకుల మధ్య ఏదోఒక వాగ్వివాదం జరుగుతూవుండేది.

***                                  ***                                    ***

నారాయణ శర్మ గుడిలో పని ముగించుకొని మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసరికి ,తనకి వరసకి మేనల్లుడైన కృష్ణమూర్తి వచ్చిఉన్నాడు .అతను దగ్గరలో ఉన్న పట్టణం లో పేరొందిన ఒక దేవస్థానం లో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. కుశల ఫ్రశ్నలన్నీ అయ్యాక కృష్ణమూర్తి, నారాయణ శర్మ తో "మావయ్యా ! మాధవుడిని నాతొ పాటే పంపకూడదా ?.. వాడు మీ మాట వినడం లేదని అత్తయ్య  చెప్పింది. వాడిని అక్కడే మా దేవస్థానం లో పెట్టిస్తాను. వాడిని చిన్నప్పుడే నాతొ పాటే పంపించేస్తే ఈపాటికే అన్నీ నేర్చుకొని ఒక స్థాయిలో ఉండేవాడు. " అన్నాడు. 

మాధవునికి చినప్పుడు ‘ఉపనయనం’ చేస్తున్నప్పుడే నారాయణ శర్మ ని కృష్ణమూర్తి ,తనతోపాటు పట్టణం పంపమని అడిగాడు.  కానీ తనే , పట్టణం లో భక్తి లో ఉండే కృత్రిమత్వానికి ఇష్ట పడక , వేదపాఠశాలకు పంపడానికి నిశ్చయించాడు. నారాయణ శర్మ ఆలోచనలని గమనించిన కృష్ణమూర్తి, ‘’ చూడండి మామయ్య ! మీరు వాడి గురించి ఏమీ దిగులు పెట్టుకోనక్కర్లేదు . ఇక్కడ మీరు ఎన్నాళ్లు ఈ గుడి లో సేవ చేసినా సంపాదన అంతంత మాత్రమే. కాలం చాలా మారిపోయింది. పౌరహత్యం లో కూడా ఆధునికత చోటుచేసుకొంది. పూజారి లేకపోయినా కొన్నిచోట్ల పూజా విధానాన్ని సి .డీ ల ద్వారా వింటూ పూజ చేసే రోజులివి. మాధవుడిని మా దేవస్థానం లో పెట్టిస్తాను . తక్కిన ఉద్యోగస్థుల్లాగే నెలకు ఇంతని జీతం ఇస్తారు. కొన్నాళ్ళు పెద్ద అర్చకులదగ్గర సహాయకుడిగా ఉంటూ , అన్నీ నేర్చుకోవచ్చు . కొంతకాలం తర్వాత జీతం పెంచి పెర్మనెంట్ కూడా చేస్తారు. ఇక్కడి లాగ రోజూ ఉదయం నుండి రాత్రి వరకు గుడిలో ఉండనక్కరలేదు. కంపెనీ లో ఉద్యోగులకుమల్లే షిఫ్టులు ఉంటాయి. సుప్రభాత సేవ మొదలుకొని , పవళింపు సేవ వరకు షిఫ్టులుగా చేస్తారు. అందులో ఏదో ఒక దానిలోమనని వేస్తారు. అదికూడా ఎప్పటికప్పుడు మారుతూవుంటుంది. మాధవునికి కూడా చదువుకోవాలని ఉంది  కదా .. మిగతా ఖాళీ సమయం లో ప్రైవేట్ గా చదువుకుంటాడు. కొన్నాళ్ళు పోయిన తరువాత వాడికి పౌరోహిత్యం నచ్చకపోతే , వాడి చదువుకు తగిన ఉద్యోగం చూసుకొంటాడు. " అన్నాడు.

మాధవునికి ఇదంతా కొత్తగా బాగున్నట్టు అనిపించింది. ముఖ్యం గా పట్టణం లో ఉండచ్చు , చదువుకోవచ్చు . కృష్ణమూర్తి లా చక్కగా ఫాంటు , షర్ట్ వేసుకోవచ్చు . రోజంతా గుడి లో ఉండక్కర్లేదు.నాన్న దీనికి ఒప్పుకొంటే బాగుండుననుకొన్నాడు.

కృష్ణమూర్తి చెప్పిన మాటలు విన్ననారాయణ శర్మ ఆలోచనలో పడ్డాడు. ‘ఇదంతా వింతగా ఉన్నట్టు అనిపించింది. దేవుని సేవ కు షిఫ్టులా .. సుప్రభాత సేవమొదలు స్వామి వారు పవళించేవరకు సేవ చేసుకొనే భాగ్యం ఎందరికి వస్తుంది. దానికి నెలసరి జీతాలా ? భక్తులు సమర్పించే త్రుణమో పణమో తీసుకొనేదానిలో ఆనందం , సంతోషం దీనిలో ఉంటుందా ?  హూ .. కాలం తో పాటే మనమూ మారాలి . పద్ధతులని ప్రాకులాడితే పూట గడవదు. కొడుకు భవిష్యత్తుని కాదనే అధికారం నాకు లేదు . ఇక్కడ ఉంటే ఎలాగో నాదారికి రాడు , నాలాగే అయిపోతాడు. కృష్ణమూర్తి చెప్పినదానిలో కూడా నిజం ఉంది . మాధవునిచూసుకోడానికి తను ఎలాగో ఉండనే ఉన్నాడు . దానికి వాళ్ళ అమ్మ కూడా అంగీకార ముద్ర వేసినట్టుంది.’ అనుకొంటూ కృష్ణమూర్తి అడిగినదానికి మౌనంగానే తలూపాడు .

వీధి లో లేగ దూడ స్వేచ్ఛ గా చెంగు చెంగు మని దూకుతూ పోతోంది .

****                                                               ****                                                          ****

మరిన్ని కథలు
oushadam