Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aaditya hrudayam - vn adithya

ఈ సంచికలో >> సినిమా >>

అయిదు భాషల్లో సూపర్ హిట్టైన సినిమా!

Superhit movie in five languages

సాధారణంగా ఏదైనా ఒక భాషలో ఘనవిజయం సాధించిన సినిమా రీమేక్ హక్కులకోసం చాలా మంది పోటీ పడతారు. అది కూడా సినిమా విడుదలైన ఆరునెలల్లోపు లేదా ఒక సంవత్సరం లోపు మాత్రమే ఇలా జరుగుతుంటుంది. కానీ ఒక సినిమా ఆ చిత్ర పరిశ్రమలోనే ఘనవిజయం సాధించడమే కాకుండా అంతవరకూ ఏ సినిమాకూ రానటువంటి అత్యధిక కలెక్షన్లు రాబట్టినా కూడా రీమేక్ హక్కులకోసం ఎవ్వరూ పోటీపడకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ సినిమా విడుదలైన పది సంవత్సరాల తర్వాత ఇతర భాషల్లో రీమేక్ అయి ఘనవిజయం సాధించిన తర్వాతగానీ ఆ సినిమా సత్తా తెలీలేదు ఎవ్వరికీ. అలా ఆ సినిమా అయిదు భాషల్లో సూపర్ హిట్టైంది. ఇంతకూ అయిదు భాషల్లో సూపర్ హిట్టైన సినిమా ఏంటో తెలుసా?!

'కోకిల, అభినందన, అల్లుడుగారు, నారీ నారీ నడుమ మురారీ, రౌడీ అల్లుడు, అప్పుల అప్పారావు, రౌడీ గారి పెళ్ళాం, ఏప్రిల్ 1 విడుదల. దళపతి, రక్షణ' మొదలైన సినిమాల వరుస విజయాలతో ఆనందంగా ఉన్న హీరోయిన్ శోభనకు ఈ చిత్రాలను మించిన ఆనందం, గుర్తింపు ఒక మళయాళ చిత్రం ద్వారా కలిగింది. ఆ చిత్రమే 'మణిచిత్రతాళు'.

1993 లో విడుదలైన ఈ సినిమాకు దర్శకుడు ఫాజిల్ (నాగార్జున నటించిన 'కిల్లర్' సినిమా దర్శకుడు) ఈ సినిమా కథకు ఆధారం 19వ శతాబ్దంలో ట్రావెన్ కోర్ రాజసంస్థానంలో జరిగిన ఒక యదార్ధ సంఘటన. శోభన, మోహన్ లాల్, సురేష్ గోపి, మొదలగువారు నటించిన 'మణిచిత్రతాళు' సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా ఏకంగా 300 రోజులకు పైగా ప్రదర్శింపబడింది. అప్పట్లోనే ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్స్ షేర్ గా అయిదుకోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఇది మళయాళ చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద రికార్డ్. మామూలుగా మళయాళ సినిమాలు తెలుగు, తమిళ సినిమా మాదిరి భారీ బడ్జెట్ సినిమాలు కావు. లక్షల్లోనే చిత్రనిర్మాణం జరుగుతుంది. అలాంటిది 'మణిచిత్రతాళు' సినిమా అయిదుకోట్లకు పైగా వసూళ్ళు సాధించడం ఓ ట్రెండ్ సెట్టర్.

1993 సంవత్సరానికి గాను జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 'ఉత్తమ వినోదాత్మక' చిత్రానికి గాను 'మణిచిత్రతాళు'కు, ఉత్తమ నటిగా శోభనకు అవార్డు వచ్చింది. 'గంగ' మరియు 'నాగవల్లి' పాత్రల్లో తన విశేషమైన, అమోఘమైన, అసమాన నటనను చూపించిన శోభన ఈ సినిమా ఘనవిజయం సాధించడంలో కీలకపాత్ర వహించింది. మళయాళ చిత్రపరిశ్రమలోనే నెంబర్ వన్ సూపర్ హిట్ గా నిల్చిన ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం ఇతర చిత్రపరిశ్రమ వారు ఎవ్వరూ పోటీపడకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అలా పదిసంవత్సరాల వరకూ ఎవ్వరూ ఈ సినిమా గురించి పట్టించుకోలేదు.

వరుస ఫ్లాపులతో సరైన హిట్టుకోసం తపించుకుపోతున్న దర్శకుడు పి.వాసు 2002 లో ఢిల్లీలో జరిగిన ఒక ఫిలిం ఫెస్టివల్ కు హాజరైనప్పుడు 'ఏదైనా ఒక మంచి సినిమా ఉంటే చెప్పండి రీమేక్ చేసి విజయం సాధించాలి' అని సినిమా పరిశ్రమకు చెందిన వారిని అడిగినప్పుడు ఈ 'మణిచిత్రతాళు' సినిమా గురించి చెప్పడం, వెంటనే పి.వాసు కన్నడంలో సౌందర్య, విష్ణువర్ధన్, రమేష్ అరవింద్ లతో 'ఆప్తమిత్ర' పేరుతో రీమేక్ చేసి విడుదల చేసాడు. ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన ఒక హెలికాప్టర్ ప్రమాదంలో నటి సౌందర్య దుర్మరణం పాలైంది. 'ఆప్తమిత్ర' నే సౌందర్య నటించిన చివరి చిత్రం. 'ఆప్తమిత్ర' సూపర్ హిట్ కావడమే కాదు దాదాపు 15 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమానే రీమేక్ చేసి 2005 లో రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభులతో పి.వాసు దర్శకత్వంలోనే 'చంద్రముఖి' పేరుతో (తెలుగులో 'చంద్రముఖి' పేరుతోనే డబ్బింగ్ చేయబడింది) విడుదలయ్యింది. తమిళంలో మరియు తెలుగు భాషల్లో దాదాపు 50 కోట్లకు పైగా కలెక్షన్ల వర్షం కురిసింది.

2005 లోనే బెంగాలీ భాషలో 'రాజమోహల్' పేరుతో రీమేక్ చేయబడి కమర్షియల్ గా హిట్టైంది. 2008 లో అక్షయ్ కుమార్, విద్యాబాలన్ లతో ప్రియదర్శన్ దర్శకత్వంలో 'భూల్ భులయ్యా' పేరుతో హిందీలో విడుదలై మంచి విజయం సాధించింది. మళ్ళీ 2009 లో పి.వాసు దర్శకత్వంలోనే కన్నడంలో 'ఆప్తమిత్ర'కు సీక్వెల్ గా విష్ణువర్ధన్, విమలారామన్ లతో 'ఆప్త రక్షక' పేరుతో విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు నటుడు విష్ణువర్ధన్ హఠాత్తుగా మరణించడం గమనార్హం. 'చంద్రముఖి' విడుదలకు ముందు ఇలానే హఠాత్తుగా సౌందర్య మరణించడం ఒకింత బాధాకర విషయం. 'ఆప్తరక్షక' సినిమా కన్నడంలో ఘనవిజయం సాధించడమే కాకుండా సుమారు 25 కోట్లకు పైగా కలెక్షన్స్ వరద పారించింది.

'ఆప్తమిత్ర', 'చంద్రముఖి', 'ఆప్తరక్షక' సినిమాల ఘనవిజయంతో దర్శకుడు పి.వాసు 'చంద్రముఖి - 2' సినిమాను రజనీకాంత్ తో తీయ సంకల్పించారు. కానీ సౌందర్య, విష్ణువర్ధన్ లు ఈ సినిమాలు చేసిన తరువాత హఠాత్తుగా దుర్మరణం కావడంతో ఒకింత కలవరపడి రజనీకాంత్ 'చంద్రముఖి - 2' కు ససేమిరా చేయనన్నాడు. అజిత్ తో అనుకుంటే అజిత్ కూడా ఒప్పుకోలేదు. 2010 లో బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వెంకటేష్, అనుష్క, రిచా గంగోపాధ్యాయ, కమలినీ ముఖర్జీ లతో 'నాగవల్లి' పేరుతో తెలుగులో విడుదల చేశాడు. అనుష్క ఏమాత్రం 'నాగవల్లి' గా సూటవ్వకపోవడం, వెంకటేష్ నటన తేలిపోవడం తదితర కారణాలతో సినిమా అపజయం పాలైంది.

మలయాళంలో 'మణిచిత్రతాళు' సినిమాకు శోభనకు, కన్నడంలో 'ఆప్తమిత్ర'కు గాను సౌందర్య కు, 'చంద్రముఖి' సినిమాకు గాను జ్యోతికకు ఆయా రాష్ట్రాల ఉత్తమ నటి అవార్డులు వచ్చాయి. భారతీయ సినిమా వంద సంవత్సరాలు పూర్తైన సందర్భంగా జరుపుకుంటున్న సంబరాలకు గాను ఐబిఎన్ లైవ్ వారు నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో ద్వితీయ గొప్ప చిత్రంగా ఈ 'మణిచిత్రతాళు' నిలబడింది. ప్రధమ గొప్పచిత్రంగా మన తెలుగు 'మాయాబజార్' ముందు వరుసలో నిల్చింది.

ఏది ఏమైనా ఒక సినిమా అయిదు భాషల్లో (మలయాళం, కన్నడం, బెంగాలి, తమిళం, హిందీ) ఘనవిజయం సాధించడం ఆశ్చర్యపడవలసిన, ఆనందపడవలసిన విషయం.

మరిన్ని సినిమా కబుర్లు
kumbhakonamlo young hero