Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> గోనెసంచిలో శవం (క్రైం కథ)

gone sancheelO savam

వరాల వనమాల కనబడ్డం లేదనే వార్త.. వాడ వాడలా మారుమ్రోగి పోతోంది. యువక రక్తంలో వనమాల చార్జింగ్ లేక  నీరు కారిపోతోంది. మూలకున్న పండు ముదుసలి సైతం ‘అయ్యో.. వనమాలా..! అంటూ బావురుమంటున్నాడు. ప్రతినిత్యం శాపనార్థాలు పెట్టే ఆడవారి నోటికి కాస్త విరామం దొరికినట్లయ్యింది.

‘వరాల’ ఆమె ఇంటిపేరు కాదు. మగవారిని కనికరించి కనుసైగ జేసిందంటే..  అ రాత్రికి ఆమె బాహువుల్లో స్వర్గ సుఖాల అనుభవానికి  వనమాల వరమిచ్చినట్లే నని.. టీన్ ఏజ్ నుండి నైన్టీ ఏజ్ వరకు పురుష పుంగవులు.. ఆమె పేరు వనమాలకు ముందు  ‘వరాల’ను తగిలించారు. ‘వాడ వదిన’ అని పిలవడం నామోషీగా భావించి అంతా ఆమెను  వరాల వనమాలగా నామకరణం చేసారు. ముద్దుగా కొందరు ’వరాలూ’ అని పిలవడం కద్దు.

ఒంటరిగా నివసించే వరాల వనమాల తన ఓర చూపుల కత్తులను విసురుతూ.. ఒక వీధి గుండా నడిచి వెళ్లిందంటే.. ఇక ఆ వీధికారాత్రి  నిద్ర కరువైనట్లే.. ఆమె ఎవరికి వరమిచ్చిందో..! ఎవరు జారుకుంటారో..! అని ప్రతీ కుటుంబంలో  ఒకరికి తెలియకుండా మరొకరు కనబడీ కనబడని కాపలా పని అప్పజెప్పుతారు.

అలా కుల-మత, జాతి, వయసు అంతరాలు లేకుండా అందరినీ  చైతన్యవంతులను  చేస్తున్న  వరాల వనమాల కనబడకపోవడం.. పోలీసులకు సైతం ఏ పని లేకుండా పోయింది. ఎటూ పాలుబోక అయోమయంగా టోపీ తీసి చేతిలో పట్టుకొని మరో చేత్తో తలలు గోక్కోసాగారు.     

ఊళ్ళో స్తబ్ధత ఏర్పడింది..

ఆ స్తబ్ధతను చీల్చుకుంటూ.. సునామీలా వ్యాపిస్తున్న వార్తతో ఎస్సై కమలాకర్ ముఖం సూర్య కిరణాలు సోకిన కమలంలా విచ్చుకుంది. రెండు రోజులు గా ఏ పనీ పాట లేని తనకు పని కల్పింబోతున్న ఆ వార్త విని  తెగ సంబర పడ్డాడు. అది అల్లాటప్పా వార్త  కాదు. ‘గట్టమ్మ పల్లె మోరీ కింద.. గోనె సంచిలో శవం’.

ములుగు నుండి హన్మకొండకు వెళ్ళే రహదారిలో రెండు కిలోమీటర్ల దూరంలో గట్టమ్మ పల్లె ఉంది. పల్లెకానుకొని చిన్న కొండ.. కొండ మీద గట్టమ్మ దేవత గుడి.  రెండు సంవత్సరాలకొకసారి జరిగే సమ్మక్క జాతరకు వెళ్ళే భక్తులు గట్టమ్మ  దేవత దీవెనలు తీసుకొని  వెళ్ళడం పరిపాటి.

కొండ నుండి  జారిన  వర్షపు నీటితో పల్లెకు ప్రమాదం జరుగకుండా.. చిన్న వంతెన కట్టారు. అంతా దానిని గట్టమ్మ పల్లె మోరీ అని పిలుస్తుంటారు.

బహిర్భూమికి వెళ్ళిన వారెవరో మోరీ కింద గోనె సంచిని చూసాడు. కుక్కలు పీక్క తింటూండగా జారిన అవయవాల ఆనవాలు ఎవరిదో శవమని గుర్తించాడు. గుండె దిటవు చేసుకొని చాటింపు చేసిన ఆ వార్త ఊళ్ళో సంచలనం రేపింది. అది తప్పకుండా వరాల వనమాల శవమై  ఉండాలని   ఆడవారు.. హే.. భగవాన్! మా వరాలది కాకూడదని మగవారు భగవంతుణ్ణి ప్రార్థించసాగారు.

కమలాకర్ ఎస్సై తన బలగాన్ని తీసుకొని జీపులో వాయు వేగంతో గట్టమ్మ పల్లె మోరీ వద్ద వాలాడు. అప్పటికే ఇసుక వేస్తే రాలనంత జనం. జీపు వస్తుంటే సముద్రపు అలల్లా కదలాడుతూ దారినిచ్చారు.

గ్రామ సర్పంచ్ సమక్షంలో గోనె సంచి తెరిపించాడు కమలాకర్. నగ్న మానవ శరీర ముక్కలు బయట పడ్డాయి. అవి మగ వాని శరీర భాగాలు అని తేలే సరికి అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరాల వనమాల కాకపోయే సరికి పురుష పుంగవులంతా కేరింతలు కొట్టారు. కాని ఆ శవం ఔసుల (కంసాలి, విశ్వకర్మ) శ్రీశైలం  కొడుకు అంబరీషదని గుర్తించి అంతా శోక సంద్రంలో మునిగి పోయారు. శ్రీశైలంకు ఒక్కగానొక్క కొడుకు. అంబరీష పుట్టి తల్లిని పొట్టన పెట్టుకున్నాడని ఊరంతా ఆడిపోసుకున్నా తన బాహువుల్లో ఊయలలూగిస్తూ.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. కాలేజీ చదువు పూర్తిగాక ముందే కాటికి వెళ్ళడం కఠినాత్ములు సైతం కన్నీరు పెట్టుకోవడం.. వాతావరణమంతా గంభీరంగా మారి పోయింది. శ్రీశైలం గుండెలు బాదుకుంటూ.. దిక్కులు పెక్కటిల్లే రోదనలకు ఊరు, పల్లె అంతా కన్నీటితో తడిసి ముద్దయ్యింది.

శవాన్ని పంచనామా చేస్తుండగా మోరీ కింది ఊబిలో నుండి మరొక గోనె సంచి నెమ్మదిగా తేలుతూండడం.. కమలాకర్ కనుగుడ్లు తెలేసాడు. హడావుడిగా పంచాయతీ కార్యాలయ సహాయకులకు పని అప్పగించాడు. వారు పూర్తిగా తేలిన సంచిని లాక్కొచ్చారు. మళ్ళీ జనంలో ఉత్కంఠ.

సంచులు సమస్తం.. శవాల మయంగా మారింది.

ఆ సంచి తెరచి చూసే సరికి సీను మారింది. జనంలో హాహాకారాలు ఆకాశాన్నంటాయి. అది నూలు పోగు లేని వరాల వనమాల శవం. తల వేరు చేసి మిగిలన అంగంగాలను ఖండ ఖండలుగా చేయ బడింది. 

పరిసరమంతా దుర్ఘంధమయమైన.. జనం సహనం శ్లాఘనీయం. వారికి వరాల మోహం  తప్ప వాసనను పట్టించుకునే స్థితిలో లేరు.
ఆడ వారి ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఎవరో గాని వరాలను చంపి పుణ్యం కట్టుకున్నాడని మనస్సులో ఎవరికీ వారే అభినందించుకోసాగారు. అయితే అంబరీషను పొట్టన పెట్టుకోవడం జీర్ణించుకోలేని విషయం, అంబరీష, వరాల శవాల మూటలు ఒకే దగ్గర దొరకడం జనం పలురకాల అనుమానాలకు దారి తీస్తోంది. లోకులు పలుగాకులు. పలు రకాలుగా గుసగుసలాడుకో సాగారు.
పంచనామాలు.. పోస్ట్ మార్టంలు.. దహన క్రియలు.. అన్నీ పూర్తయ్యాయి. వరాల వనమాల శవాన్ని తీసుకెళ్ళడానికి ఆమె బంధువులెవరూ రాక పోయేసరికి అనాథ శవంగా సర్పంచ్  అంతిమ సంస్కారం నిర్వహించాడు.

ఇప్పుడు ఎస్సై కమలాకర్ కు చేతి నిండా పని.. వీపు గోక్కుందామంటే తీరడం  లేదు.

***

శ్రీశైలం బతుకు ఆగమయ్యింది. ఉన్న ఒక్క కొడుకు మంట్లె కలిసే సరికి బాధను భరించ లేక సగం దినం సారాయి కొట్టులో గడిచి పోతోంది. ఈ సంపాదన నాకెందుకని కంసాలి పనికి స్వస్తి చెప్పి మిత్రులకూ తాగించే వాడు.

రాత్రి పది కావస్తోంది. సారాయి కొట్టు మూసేసే సమయం. అప్పటికే ఒక రౌండ్ కొట్టి వెళ్ళిన శ్రీశైలం మరో కొత్త మిత్రుడు  కాశీనాథంను  తీసుకొని మళ్ళీ వచ్చాడు. రెండు శేరు సీసాల సారాయి తీసుకొని కొట్టులో మూలాన కూర్చున్నారు. రెండు వేయించిన చేప ముక్కలను నంజుకుంటూ.. సారాయి సీసాలు ఖాళీ చేస్తూ.. లోకాభిరామాయణంలో పడ్డారు. కాశీనాథం గూడా తన కులస్తుడే కావడం శ్రీశైలంకు కాస్తా ఊరట లభించింది. తను పది రోజుల క్రితమే పరిచయమయ్యాడు. తాగడంలో.. వాగడంలో  అభిరుచులు కలిసే సరికి ‘బావా..’, ‘బావా..’ అని పిలుచుకునేంత  జిగ్రీ దోస్తులయ్యారు.

శ్రీశైలంకు కిక్కు మాడకంటింది. మాట యాస పోతోంది.. 

“బావా.. నువ్వంటే ప్రాణం..” అంటూ నేరుగా సీసాతో ఒక గుటక వేసుకున్నాడు శ్రీశైలం, సీస తిరిగి బల్లపై పెట్టాడు. అది  సరిగ్గా పొందక పడి పోతుంటే కాశీనాథం సీసాను పట్టుకొని సర్ది పెడ్తూ..“కాని బావా.. నీ బతుకే గిట్ల ఆగమయ్యే..” అంటూ నిట్టూర్పు విడిచాడు.

“ఇదంతా నేను చేజేతులా చేసుకున్నదే..“ అంటూ సన్నగా ఏడ్వసాగాడు శ్రీశైలం.

“బావా.. ఇందులో నువ్వు చేసిందేముందే.. అంతా ఆ పైన ఉన్నోనికే ఎరుక” అన్నాడు కాశీనాథం ఓదార్పు వచనాలు పలుకుతూ..

“ఆ.. ఇది కరకట్టు. నిజం చెప్పినౌ బావా.. అప్పుడు నేను పైనే ఉన్నా..” అంటూ అంతలోనే పెదవులపై చిరునవ్వు తొణకిసలాడింది. “ నేనొక రహస్యం  చెబుతా బావా.. మల్ల ఎవ్వలతోనూ అనకు.. చేతిల చెయ్యెయ్యి” అంటూ కాశీనాథానికి చెయ్యి అందించాడు.

“నా పిల్లలమీద ఒట్టు బావా..” అంటూ కాశీనాథం శ్రీశైలం చేతిలో చెయ్యి వేసాడు.

“ఆ (బూతు మాట) వరాలు నాకు వరమియ్యకుంట నా కొడుక్కు వరాల మీద వరాలియ్యబట్టింది. నా కొడుకు బతుకు నాశనం చేస్తాంది. వరాలునే పెండ్లి చేసుకుంటనని నా కొడుకు మొండి పట్టుబట్టిండు. దినాం మా ఇంట్ల లొల్లి మోపయ్యింది.  నాకు కిందికెళ్ళి కాల్సుకచ్చింది.
ఆ రోజు చీకటి పడంగనే రెండు సీసాల సారా పట్టిచ్చిన.  వరాలు ఇంట్ల సొచ్చి అటుక మీద నక్కిన. వరాలు నా కొడుకును తీసుకొని వచ్చింది. మంచి మోఖా చూసి వరాలు తల నరిక బోయిన కాని అంబరీషడు అడ్డం వచ్చిండు. వాని తల తెగింది. వాడు కిందబడి గిల గిలా కొట్టుకుంటుంటే.. కోపం పట్ట లేక వనమాల మీద ఎగబడి  తల నరికిన. దాన్ని కైమా చేసిన. రెండు గోనె సంచుల్ల కుక్కి గట్టమ్మ పల్లె మోరి కింద గుంతల పడేసిన..” అంటూ సీసా ఖాళీ చేసాడు శ్రీశైలం. 

ఇంతలో సారా కొట్టు ఆసామి వచ్చి “సార్.. మీరేవరో తెలియదు గాని  శ్రీశైలం మాటలు పట్టించుకోకండి.. కొడుకు చనిపోయాక ఇలా పిచ్చి వాగుడు మొదలయ్యింది” అంటూ కొట్టు కట్టేసే యత్నం చేస్తుంటే.. శ్రీశైలంను తీసుకొని అతని ఇంటికి బయలు దేరాడు కాశీనాథం.

***

 ఆ మరునాడు ఉదయం ఎస్సై కమలాకర్ పిలుస్తున్నాడని కానిస్టేబుల్ నుండి కబురందుకున్నాడు శ్రీశైలం.

శ్రీశైలం పోలీసు స్టేషన్ అరుగు ఎక్కుతుంటే.. “బావా.. రా..’ అంటూ కమలాకర్ చిరునవ్వుతో ఆహ్వానించాదు. కంగు తిన్నాడు శ్రీశైలం.. ఆ గొంతు కాశీనాథానిది. అమాయకంగా పల్లెటూరి బైతులా కనబడ్డ కాశీనాథం.. ఎస్సై కమలాకరా..! అని శ్రీశైలంకు వెన్నులో వణకు  పుట్టింది.

“అవును కాశీనాథంను. నీ బావను. నీ మీద మొదటి నుండీ అనుమానం గానే  వుంది. కాని ఎవరైనా కొడుకును చంపుకుంటారా..  ఇందులో ఏదో తిరకాసు ఉండాలి అని మారు వేషం వేసుకొని గత పది రోజులుగా నీతో స్నేహం చేసాను. సారా తాగిన వాడు ధైర్యంగా నిజాలు గక్కుతాడన్న నా నమ్మకం నిజమయ్యింది. రాత్రి నీ మాటలన్నీ రికార్డు చేసాను” అంటూ కమలాకర్ కనుబొమ్మలెగరేసాడు. శ్రీశైలం కూర్చో బోయిన కుర్చీని కాలుతో తోసేసాడు.

“రికార్డులెందుకు సార్.. ఇప్పుడూ చెబుతున్నా.. నా కొడుకునూ.. వారాల వనమాలును  నేనే నరికిన.. అరెస్టు చెయ్యండి.. కోర్టుకు తీసుకెళ్ళండి.. నాకేం భయం లేదు” అంటూ వెకిలిగా నవ్వసాగాడు శ్రీశైలం.

వీనికి నిజంగా పిచ్చి లేవ లేడు గదా.. అని సంశయించాడు కమలాకర్. పగబడ్బందీగా ఫైలు తయారు చేసి..  శ్రీశైలంను కోర్టులో ప్రవేశపెట్టాడు కమలాకర్.

కోర్టులోనూ ఇదే తంతు.. ఇంకా పిచ్చి ముదిరి శ్రీశైలం  “నేనే నరికిన. నరికినా.. నరికినా. నేనే.. చంపినా. చంపినా.. చంపినా..” అంటూ పాట పాడుకుంటూ డాన్స్ చెయ్యసాగాడు.

కోర్టు ఆదేశానుసారం శ్రీశైలంను ప్రభుత్వ డాక్టరు పరీక్షలు చేసి మతి చలించిందని సర్టిఫికెటిచ్చాడు.

శ్రీశైలం కొడుకు చనిపోయాక పిచ్చివాడయ్యాడని సారా కొట్టు యజమాని సాక్ష్య మిచ్చాడు. 

జడ్జిగారు కేసు కొట్టివేసి  శ్రీశైలంను పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయించాలని  ఆదేశాలిచ్చాడు.

***

ఆరు మాసాలు గడిచాయి.

ఎస్సై కమలాకర్ నిరాశ.. నిస్పృహలలో నుండి ఇంకా తేరుకో లేదు. అంత శ్రమ పడి కేసు పరిశోధిస్తే ఇలా నీరు కారిపోయిందేమని బాధ పడుతూనే ఉన్నాడు.

“ములుగు ఊరి వాస్తు బాగులేదు సర్.. ఇక్కడ ఇది వరకు చాలా హత్యలు జరిగాయి కాని ఒక్కటీ తేల లేదు..” అంటూ టీ అందిస్తూ ఉపశమన మాటలు పలికాడు కానిస్టేబుల్ ఫోర్ నాట్ టు. “ఉదాహరణకు ఈ ఫైల్ చూడండి..”

కరుణాకర్ ఫైలు తీసుకొని ఆశ్చర్యంగా చూడ సాగాడు టీ ఆస్వాదిస్తూ..

ఇంతలో “నమస్కారం కాశీనాథం బావా..” అంటూ ప్రత్యక్షమయ్యాడు శ్రీశైలం.

కరుణాకర్ ఆశ్చర్య పోయాడు. ఇంత త్వరగా పిచ్చి కుదిరి శ్రీశైలం రావడం.. కాసింత పెదవులపై కృత్రిమ చిరునవ్వులు పూయించాడు. కూర్చోమంటూ ఆహ్వానిస్తూ కుశల ప్రశ్నలు వేసాడు కరుణాకర్. మరొక టీ తీసుకు రమ్మని కానిస్టేబుల్‍కు సైగ జేసాడు.

“సర్.. మీకు అభినందనలు చెబుదామని వచ్చాను” అంటూ ప్రశంసా పూర్వకంగా కరుణాకర్‍ను చూసాడు శ్రీశైలం. “మీరు చాలా ఇంటల్లిజెంట్ సర్.. వేషమేసి నన్ను హంతకుడిగా పట్టుకున్నారు. నిజమే నేను హంతకుడినే.. ఆ రాత్రి తాగి వాగిందంతా వాస్తవమే” అంటూ ఫోర్ నాట్ టు ఇచ్చిన టీ సిప్ చేస్తూ..

“మీకు ఇంకో విషయం తెలియదు సర్.. నాకొడుకు, వరాలు కలిసి నన్ను అడ్డు తొలగించుకోవాలనే ఎత్తుగడ వేసారు. నేనది  పసిగట్టిన ఆ పర్యవసానమే.. ఇది.

మీరు నా మాటలు రికార్డు చేసారని తెలియగానే.. ఆరాత్రి సారా కొట్టు ఆసామి నన్ను పిచ్చి వాడిగా జమ కట్టడం గుర్తుకు వచ్చింది. నాటకమాడాను. డాక్టరును మేనేజ్ చేసాను.. వస్తా.. బై..” అంటూ టీ కప్పు ఖాళీ చేసి వెళ్ళి పోయాడు శ్రీశైలం.

“శ్రీశైలం పెద్ద కేటు గాడు సార్.. చిన్నప్పుడు నాటకాలేసే వాడు” అంటూ శ్రీశైలానికి కితాబిచ్చాడు ఫోర్ నాట్ టు. కమలాకర్ కొయ్యబారిపోయాడు.

మరిన్ని కథలు
parayi sommu