Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue271/719/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)... ‘‘ఎవరికీ తెలీకూడదు. అడిగినా చెప్పకూడదు. ప్రమాణ పూర్వకంగా ఎవరు ఏమడిగినా నోరు విప్పనంటేనే చెప్తాను.’’ వార్డు బోయ్ కేసి చూస్తూ అంది.

ఆమె మాటలకి వార్డు బోయ్ క్షణం పాటు బిత్తర పోయాడు. ‘‘ఈవిడెవర్రా బాబూ! ఏదో మర్డర్ చేయమన్నట్టు చెప్తోంది. కొంపదీసి ఈ కుర్రాడి పీక పిసికెయ్యమంటుందా?! అయ్యో! ఇదెక్కడి గొడవరా బాబూ! నేరకపోయి అడిగాను. చూద్దాం. ఏం చెప్తుందో! తనకి నచ్చితేనే ఒట్టేస్తాను. ఆమె చెప్పినట్టు వింటాను.నచ్చకపోతే బిల్కుల్గా నా వల్ల కాదని చెప్తాను అంతే’

‘‘చెప్పండమ్మా! ఏదీ చెప్పకుండానే ఎవరికీ చెప్పొద్దంటే నాకేమర్ధమవుతుంది.’’ మనసులో పరిపరివిధాలుగా ఆలోచించుకుని అన్నాడు వార్డుబోయ్.

‘‘ఏమీ లేదు చిన్న సహాయం. ఈ కుర్రాడ్ని చూడ్డానికి ఇప్పుడో....రేపో...ఒక కుర్రాడు వస్తాడు. వాడి పేరు రాము. వాడి దగ్గర నాదే పాతిక వేల కేష్ వుంది. అది వాడి దగ్గరే ఉంచుకుని ఈ కుర్రాడికి బాగయ్యే వరకూ ఖర్చులకు ఉంచమను. వాడి దగ్గర నా ఏ టి ఎమ్ కార్డు ఉంది. అది నువ్వు తీసుకో. ఎవరూ చూడకుండా ఇదంతా చెయ్యాలి. ఎవరికీ అనుమానం కూడా రాకూడదు. వాడికీ చెప్పు. ఏ.టి.ఎమ్ ఏదని ఎవరైనా అడిగితే పోయిందని చెప్పమను. నీకిచ్చినట్టు చెప్పొద్దను.’’ చెప్పింది ఆమె.

‘‘ఆ! పాతికవేలే! ఆ కుర్రాడ్ని తీసుకోమనాలా? మరి నాకో మేడమ్?!’’ ఆశగా అన్నాడు వార్డుబోయ్.

‘‘నీకూ ఇస్తాను. ఈ పని చెయ్యి.’’ అంది ఆమె.

‘‘పిన్ నెంబర్  చెప్తారా?!? ఆ కుర్రాడ్ని అడగమంటారా?’’ ఆశగా ఆమెకేసి చూస్తూ అడిగాడు వార్డుబోయ్.

‘‘పిన్ నెంబర్ నీకెందుకు?’’ ఆశ్చర్యంగా అంది ఆమె.

‘‘మరి, ఆ కుర్రాడి దగ్గర ఏ.టి.ఎమ్ నన్ను తీసుకోమన్నారు కదా!’’ బిక్కమొహం వేస్తూ అన్నాడు వార్డుబోయ్.

‘‘అది నువ్వు నాకు అందిస్తే అప్పుడు నీకు నేను డబ్బులిస్తాను.’’ అంది ఆమె.

‘‘ఆ! ఎంతిస్తారు మేడమ్?!’’ ఆనందంగా అడిగాడు వార్డుబోయ్.

‘‘అదింకా నా చేతికి రావాలి కదా! ఏ.టి.ఎమ్ నాకిచ్చినప్పుడే ఇస్తాను.’’ అంది ఆమె.

‘‘సరే! మిమ్మల్ని ఎలా? ఎక్కడ కలవాలి? మీరే ఇక్కడికి వస్తారా?’’ అడిగాడు వార్డుబోయ్.

‘‘నేనే ఇక్కడకు వస్తే ఆ కుర్రాడి దగ్గర నేనే తీసుకుంటా కదా! ఇది నా సెల్ నెంబర్. రాము దగ్గర ఏ.టి.ఎమ్. కార్డు తీసుకోగానే నాకు ఫోన్ చెయ్యి. ఎక్కడ కలవాలో చెప్తాను. జాగ్రత్త! ఈ విషయం నీకూ నాకూ తప్ప వేరే ఎవరికీ తెలీకూడదు.’’ అంది ఆమె.

‘‘మేడమ్...మేడమ్....ఎంతిస్తారో చెప్తే....’’ నీళ్ళు నములుతూ అడిగాడు వార్డుబోయ్.

‘‘అంతకు పదింతలు సరేనా?!’’ అంది చిన్నగా నవ్వుతూ ఆమె.

‘‘ఆ!....!’’ ఒక్కసారే ఆశ్చర్యంగా నోరు వెళ్లబెట్టేసాడు వార్డుబోయ్. ఆ కుర్రాడికి పాతికవేలు ఇచ్చేసింది. అంతకు పదింతంలంటే...అమ్మో! రెండు లక్షల ఏభై వేలే?....! అయితే, ఆ ‘కార్డు’లో ఇంకెంత సొమ్ము ఉందో?! లక్షలో... కోట్లో...ఏమో!’ అనుకుంటూ ఆమె కేసి చూస్తూండి పోయాడు వార్డు బోయ్.

ఆమె అక్కడ్నుండి బయట పడి కలెక్టరాఫీసు గేటు దగ్గరకు చేరుకుంది.

ఆ నాలుగు రోడ్ల జంక్షన్ లో నాలుగు మూలలా నాలుగు బ్యాంకులకు చెందిన ఏ.టి.ఎమ్ సెంటర్లు ఆమె దృష్టిని ఆకర్షించాయి. గబగబా వెళ్లి ఒక బ్యాంకు ఏ.టి.ఎమ్ లోకి వెళ్లి పాతిక వేలు డ్రా చేసింది. అలా నాలుగు ఏ.టి.ఎమ్ ల్లోకి వెళ్లి నాలుగు పాతిక వేలు డ్రా చేసి లక్ష రూపాయలు మడిచి చిన్న బ్యాగ్ లో కూరేసింది. అన్నీ రెండు వేలు, అయిదొందల నోట్లయినా చిన్న బ్యాగ్ కావడం వలన ఇరికించి మరీ లోపల దాచి జిప్ వేసింది ఆమె.

అప్పటికే టైమ్ ఎనిమిది దాటి తొమ్మిది గంటలు కావస్తోంది.

కలెక్టరాఫీసు అప్లో నిలబడి క్రిందకు చూసింది. ఒకవైపు కేజిహెచ్ ముఖ ద్వారం...దానికి అటూ ఇటూ కళకళలాడుతూ నర్సింగ్ హోం లు.
రెండో వైపు చూసి ఆశ్చర్య పోయింది. కలెక్టరాఫీసు ఎత్తులో ఉండడం వలన రెండో వైపు డౌన్ లో ఉరకలు వేస్తూ అలల హోరుతో గంభీరంగా కనిపించింది సముద్రం.

అక్కడే ఒక్కక్షణం నిలబడి సముద్రం కేసి చూసింది. గబగబా అడుగులు వేసుకుంటూ ‘బీచ్’ కేసి నడిచింది ఆమె. సముద్రం అలలు హోరెత్తి పోతున్నాయి.

రాత్రి తొమ్మిది గంటలు కావస్తున్నా సందర్శకుల తాకిడి తగ్గ లేదు. కలెక్టరాఫీసు నుండి నడుచుకుంటూ రామ కృష్ణా బీచ్ దగ్గరకు చేరుకుంది ఆమె.

సముద్రానికి ఎదురుగా ఉన్న ఇసుక తిన్నెపై రక రకాల బొమ్మలు... జారుడు బల్లలు, తూగుటుయ్యాలలు, ఎక్కడ బడితే అక్కడ అందంగా అమర్చారు. మధ్య మధ్య పూల మొక్కలు పెద్ద పెద్ద కుండీలలో విరబూసి కమ్మని సువాసనలు వెదజల్లుతున్నాయి. సముద్ర తీరానికి విహారానికి వచ్చే సందర్శకులు కూర్చోడానికి అన్నట్టు సిమ్మెంటు బల్లలు ఈ చివరి నుండి ఆ చివరి వరకు వరసగా ఏర్పాటు చేసారు.
సముద్రానికి చేరువలో ఒక సిమ్మెంటు కుర్చీ ఖాళీగా కనిపించే సరికి మౌనంగా వెళ్లి కూర్చుంది ఆమె.

సముద్ర తీరమంతా జనంతో నిండి పోయింది. బీచ్ పార్క్ లో కూడా చాలా మంది సందర్శకులు తమ పిల్లా పాపలతో వచ్చి ఆట పాటలతో ఉత్సాహంగా గెంతులేస్తున్నారు.

పోలీసుల చేతికి చిక్కిన రాము ఎలా ఉన్నాడో? ఏ.టి.ఎమ్ లో డ్రా చేసిన పాతిక వేలు రాము దగ్గర పోలీసులు లాగేసుకునే ఉంటారు. వీలైతే ఏ.టి.ఎమ్. కూడా లాగేసుకోవచ్చు. కానీ ఏదో మూల అలా చేస్తారా?! అన్న అనుమానం.  రాము ఎక్కడున్నా పోలీసుల దగ్గర నుండి బయట పడితే స్నేహితుడైన సోమూని చూడ్డానికి తప్పకుండా వస్తాడు.

అందుకే వార్డు బోయ్ తో బేరం కుదుర్చుకుంది. కానీ పోలీసులు రాముని అంత వేగంగా వదులుతారా?! ఆలోచిస్తూ కూర్చున్న ‘ఆమె’ ఒక్క సారే అదిరి పడింది.

బ్యాగ్ లో ఉన్న ‘పిస్టల్’ అనవసరంగా బయటకు తీసి తను కూర్చున్న దగ్గర పోస్టర్ పేపర్ క్రింద దాచింది. కొంప దీసి ఆ పిస్టల్ గాని పోలీసులకు దొరికి పోయిందా?!

విదేశాల నుండి తెప్పించిన ఎంతో ఖరీదైన పిస్టల్ అది. చీకట్లో టార్గెట్ ని ఛేదించడానికి వీలుగా టార్చిలైటు కూడా అమర్చిన అత్యాధునిక ఆయుధం అది 9 ఎమ్.ఎమ్ పిస్టల్. చేతిలో ఇమిడి పోయేంత చిన్న పిస్టల్ ఆది. ఎంతో ఆశ పడి, ఇష్ట పడి తెప్పించుకున్నది. ఆ గన్ గుర్తొచ్చే సరికి ‘ఆమె’ నవ నాడులూ కృంగి పోయాయి. తన రక్షణ కోసం తెచ్చుకున్న గన్ అది. అదే ఇప్పుడు తన పీకల మీదకు తెచ్చేటట్టు ఉంది. అలాంటి ఆయుధం తన దగ్గరుందని తనని ఉగ్రవాదిగా చిత్రిస్తారు పోలీసులు. వారి చేతిలో ఆ పిస్టల్ పడిందంటే తన మీదే గురి పెడతారు. ఆ ఏ టి ఎమ్ కార్డు తనదేనని గుర్తిస్తారు. ఆ తర్వాత తనని....తన ఉనికిని గుర్తించడం అంత కష్టమైన పని కాదు.
ఆలోచిస్తూ కూర్చున్న ఆమె మనసంతా కకావికలమై పోయింది. అనవసరంగా తనకి తనే పోలీసుల ఉచ్చులో చిక్కుకు పోతుందేమో! వార్డు బోయ్ కి తన సెల్ నెంబర్ ఇవ్వకుండా ఉంటే బావుండేది.

పోతే  పోయాయ్ పాతిక వేలే! అయినా ఆ డబ్బు కోసం ఆలోచించ లేదు. ఏ.టి.ఎమ్ కార్డు కోసం తెలివి తక్కువగా ప్రయత్నించింది. ఇప్పుడు పోలీసులు తన మీద ఈజీగా వల విసరొచ్చు. తానెక్కడున్నా దొరికి పోతుంది.

ఆ ఆలోచన కలగ గానే టక్కున చిన్న బ్యాగ్ లో ఉన్న సెల్ కోసం గబగబా వెదికింది. నోట్ల మధ్య కూరుకు పోయి అట్టడుగున ఉంది సెల్.
బయటకు తీసి సెల్ స్విచ్చాఫ్ చేయ బోయింది. పాతిక పై చిలుకు మిస్డ్ కాల్స్. ఉదయం నుండి ఇప్పటి వరకు తెరిపి ఇవ్వకుండా వచ్చినట్లున్నాయి,. సెల్ సైలెన్స్ మోడ్ లో ఉండడం వలన ఒక్క కాల్ కూడా గొంతు పెగుల్చుకుని బయట పడలేదు.
‘ఏం చేద్దాం?’ ఒక్క క్షణం మౌనంగా సెల్ కేసి చూసింది.

అత్తమ్మ! ఎంతో ఆందోళన చెందితే గాని....మరెంతో అత్యవసర పరిస్థితి ఎదురైతే గాని ఫోన్ చెయ్యదు. తనూ అంతే! ఇద్దరి మధ్య అదే ఒప్పందం మరి? ఇప్పుడెందుకు చేసినట్టు?’ ఆలోచిస్తూనే టక్కున రింగ్ చేసింది ఆమె.

అవతల నుండి ఆమె ఫోన్ కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నట్టు ఒకే రింగుతో రిసీవ్ చేసుకున్నారు.

‘‘అమ్మా!  ఎలా ఉన్నావమ్మా! ఉదయం నుండి భయపడి పోతున్నాను!’’ ఆందోళనగా అంది అవతల నుండి అత్తమ్మ.

‘‘నాకేం కాలేదమ్మా! మీరెందుకంత కంగారు పడుతున్నారు?’’ లాలనగా అంది ఆమె.

‘‘సింహాచలం  దేవాలయం దగ్గర ఎవరో ఒక స్త్రీని చంపేసారని టీవీల్లో చెప్తూ చూపిస్తుంటే...నీ శాలువా...నీ కోసం విదేశాల నుండి మీ మామయ్య తెప్పించిన శాలువ చూసి భయపడి పోయానమ్మా!...ఆ తర్వాత, చని పోయిన స్త్రీ వృద్ధురాలని చెప్పినంత వరకూ నా గుండె దడ ఆగలేదు తల్లీ!’’ ఆందోళనగా అంది అత్తమ్మ.

‘‘నాకేం కాదత్తమ్మా! మీరేం భయ పడకండి.’’ అంది ఆమె.

‘‘ఆ శాలువా?! అర్థోక్తిలో ఆగి పోయింది అత్తమ్మ.

‘‘ఆ ముసలమ్మకి నేనే ఇచ్చానత్తమ్మా!’’ అంది ఆమె.

‘‘అంటే....?! ఆశ్చర్య పోయింది అత్తమ్మ.

‘‘అంటే....ఏమిటి అత్తమ్మ’’ అడిగింది ఆమె.

‘‘ఆశాలువ నీదని తెలిసే....అది నువ్వే అనుకుని...అమ్మో!  నాకెందుకో భయంగా ఉందమ్మా!’’ అవతల నుండి ఏడుపు వినిపించగానే టక్కున సెల్ ఫోన్ కట్ చేసింది ఆమె.

అన్నింటికీ తెగించే తాను ఇంత దూరం వచ్చింది. అన్నీ ఉన్నా అందరూ ఉన్నా నాకంటూ ఎవరూ లేరన్న బాధలో దేశాలు పట్టుకు తిరుగుతోంది. నాకంటూ మిగిలిన ఒకే ఆధారం... దాన్ని వెదుక్కుంటూ తిరుగుతోంది.

తన గురించి అత్తమ్మకి తప్ప వేరే ఎవరికీ తెలీదు. తన గురించి తెలియాల్సిన అవసరం కూడా లేదనే అనుకుంది.

కానీ, అత్తమ్మ భయ పడుతున్నట్టు తనని ఎవరైనా వెంబడిస్తున్నారా? ఎందుకు?! తానన్ని బంధాలని ఒదులుకుని వచ్చేసింది. అయినా, ఇంకా తన మీద పగ ఎవరికి? దేనికి?! తానేం నేరం చేసింది?’’

ఆలోచిస్తూనే చుట్టూ పరికించి చూసి ఉలిక్కి పడింది. సందర్శకులందరూ తరలి పోతున్నారు.  అక్కడక్కడ ఒకరిద్దరు ప్రేమికుల జంటలు తప్ప వేరే ఎవరూ కనిపించటం లేదు. 

(ఆమె భయపడినంతా జరుగుతుందా? అక్కడ తను వదిలేసిన పిస్టల్ ఎలాగూ పోలీసుల చేతికి చిక్కింది కాబట్టి దాన్ని ద్వారా ఆమె పోలీసులకు దొరికినట్టేనా?? ఈ సస్పెన్స్ వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్