Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue281/739/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి).... చెత్త కుప్ప లోకి తోసెయ్య బోతూ ప్లాస్టిక్ కవరు లోపల భద్రంగా ఉన్న పేపర్ల కేసి చూసి టక్కున ఆ కవరు తీసాడు. ఉత్సాహంగా లేచి నిలబడ్డాడు రైటర్.

‘‘సార్!....సార్! ఈ కవరు చూడండి.’’ ఆనందంగా ఎస్సై అక్బర్ ఖాన్ కి చూపించాడు రైటర్. ఏదో ఫైల్స్ చూస్తూ మధ్య మధ్యలో పర్సులో ఉన్న ‘స్త్రీ’ ముగ్ధ మొహన రూపం తిలకిస్తూ ఏదో ధ్యాసలో ఉన్న ఎస్సై చిరాగ్గా తలెత్తి రైటర్ కేసి చూసాడు.

‘‘ఏంటీ?!’’ అన్నాడు ఎస్సై.

‘‘దీని కోసమే కదా సార్! నిన్నంతా ఆందోళన పడ్డాము.’’ కవరు ఎస్సై అక్బర్ ఖాన్ కి అందిస్తూ అన్నాడు రైటర్.

‘‘దీని కోసమా?...ఏమిటబ్బా?’’ అనుకుంటూ రైటర్ దగ్గర కవరు అన్య మనస్కం గానే తీసుకున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘అదే సార్! కొండ మీద హత్య చేయబడ్డ హతురాలి దగ్గర దొరికిన ప్రాపర్టీస్ లో ఒక కవరు మిస్సయిందనుకున్నాం కదా! అదే ఇదేమో సార్?’’ ఉత్సాహంగా అన్నాడు రైటర్.

‘ఎస్!...’’ అంటూనే సంతోషంతో ఆ ‘కవరు’ జాగ్రత్తగా చేత్తో పట్టుకుని లోపల కాగితాలు అతి జాగ్రత్తగా బయటకు తీసాడు ఎస్సై అక్బర్ ఖాన్.    హతురాలు ముసలమ్మ వీలునామా పేపర్లు. చకచకా వీలునామా అంతా చదివాడు. ‘మైగాడ్! వేటి కోసమైతే నిన్నంతా తలలు బద్దలు కొట్టుకున్నారో! ఆ వీలునామా పేపర్లు!’ మనసు లోనే అనుకున్నాడు ఉత్సాహంగా.

‘‘రైటర్ గారూ! ఈ ప్లాస్టిక్ కవరు వీళ్ళ దగ్గరకు ఎలా వచ్చిందో? ఆ దొంగ వెధవల్ని ఇలా లాక్కురండి’’ అన్నాడు

‘‘ఎస్ సార్!’’ అంటూ రైటరే ఉత్సాహంగా వెళ్లి సెల్లో ఉన్న ‘ముగ్గురు’ దొంగల్ని వెంట బెట్టుకు వచ్చాడు. దొంగలు ముగ్గురూ ఎస్సై అక్బర్ ఖాన్ కి ఎదురుగా గదిలో ఓ మూల గోడకి చేరగిల బడి నిలబడ్డారు.

‘‘అమాయకుల్లా తలలు దించుకు నిలబడ్డ దొంగలిద్దరి కేసి చూసి సీట్లో నుండి లేచాడు ఎస్సై అక్బర్ క్ళాన్. వాళ్ళ ముందుకెళ్లాడు.

‘‘నా కొడకల్లారా! ముసలమ్మ దగ్గరా దోచుకున్నార్రా! ఈ కవరు మీకెలా వచ్చింది?’’ లాఠీతో  కొట్టి అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.ఆ ప్లాస్టిక్ కవర్ చూసి ముగ్గురూ తలలు గోక్కుంటూ గుర్తు రాక ఒకరి మొహాలు ఒకరు చూసుకుని మౌనంగా నిల బడి పోయారు.

‘‘చెప్పండ్రా! ఇదెవరి దగ్గర కొట్టేసారు.’’ కోపంగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్. హతురాలు ముసలమ్మ దగ్గర తస్కరించారని తెలుసు. ఎలా?! ఆ ముసలమ్మ బట్టల మూటలో భద్రంగా ఉన్న ఈ ప్లాస్టిక్ కవరు ఎలా దొంగిలించారు? అందులో ఉన్న డాక్యుమెంట్లు ఎందుకు వదిలేసారు?! అది తెలుసుకుందామనే ఎస్సై అక్బర్ ఖాన్ ఆరాటం.

ముగ్గురూ అయోమయంగా చూస్తూండి పోయారు.

‘‘చెప్పండ్రా! ఆ ముసలమ్మ దగ్గరే దొంగిలించారా? లేదా మరెవరి దగ్గరైనానా?’’  రైటర్ కోపంగా ఇద్దరి దగ్గరికి వెళ్లి ముగ్గుర్ని ఎడాపెడా వాయిస్తూ అడిగాడు.

‘‘సార్! గుర్తు రావటం లేదు సార్!...సార్! అందులో ఏమీ దొరక లేదు సార్!’’ ఉత్తి చెత్త కాగితమేనని ప్రక్కన పడేసాము.’’ అన్నాడొకడు.   

‘‘సార్! సార్! అందులో డబ్బు లేదు గాని, ఏదో ఒక తాళం ఉంది సార్....అది...!’’ నసుగుతూ అన్నాడు మరొకడు.

‘‘తాళం ఉందా? ఏదీ ఇందులో లేదే?!’’ ఆశ్చర్యంగా మళ్లీ ఆ కవరు తీసి చూస్తూ అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘చూడండి సార్! క్రింద ఉన్న వాటిల్లో ఉండాలి. ఉంటుంది సార్’’ అన్నాడు మొదటి వాడు.

ఆ దొంగ మాటలు వింటూనే చెత్తలా ఉన్న సామాన్లన్నీ మళ్ళీ కెలికి కెలికి చూసాడు రైటర్. ఒక బ్యాగ్ లో గలగల శబ్దం చెవిన సోకే సరికి ఛటుక్కున ఆ బ్యాగ్ తెరిచి చూసాడు రైటర్.

అందులో స్కూటర్ తాళాలతో ఒక తాళం విడిగా కనిపించింది. గబుక్కున ఆ తాళం తీసి ఎస్సై అక్బర్ ఖాన్ చేతికి ఇచ్చాడు రైటర్.

‘‘ఇదేనా?!’’ అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘ఏమో సార్! అప్పుడే చిరాగ్గా ప్రక్కన పడేసాము’’ అన్నాడు మూడో వాడు.

‘‘అదే అయుంటుంది సార్! ఈ తాళాన్నీ బైక్ వి, స్కూటర్ తాళాల్లా ఉన్నాయి.’’ చెప్పాడు రైటర్.

ఇంతలో ఎస్సై అక్బర్ ఖాన్ టేబుల్ మీదున్న పర్సు కేసి చూసాడు ఒక దొంగ అందులో స్పష్టంగా కనిపిస్తున్న స్త్రీ ఫొటో చూస్తూనే అదిరి పడ్డాడు.

‘‘సార్....సార్! ఆమె సార్....ఆవిడే...!’’ ఆతృతగా అన్నాడు మొదటి దొంగ.

దొంగల్లో ఒకడు ఉన్నట్టుండి అలా అరిచే సరికి ఉలిక్కి పడి పర్సు కేసి చూసారు ఎస్సై అక్బర్ ఖాన్, రైటరు ఇద్దరూ ఒక్క సారే.

‘‘ఈవిడెవరో మీకు తెలుసా?!’’ పర్సు చేత్తో పట్టుకున్న ఫొటో వారిద్దరి ముందు పెట్టి ఉత్సాహంగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘తెలియడ మేంటి సార్! ఈమెనే మేము రేప్ చేయ బోయామని కదా మీరు లాక్కొచ్చారు. ఆవిడే మమ్మల్ని చుర కత్తి తీసి చంప బోయింది సార్. ఈ లోగా మీ పోలీసులు వచ్చారు. మేము ఆమె దగ్గర బ్యాగు పట్టుకుని పారి పోయాము.’’ అన్నాడొకడు.

దొంగలు  చెప్పేది వింటూనే అదిరి పడ్డాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఈమేనా! ఈమెనేనా పట్టుకోవడానికి నగరమంతా జల్లెడ పడతున్నాది. ఈమెనా హతురాలు ముసలమ్మతో ఆ రాత్రంతా ఉన్నది. ఈమెనా నిన్న రాత్రి కాంప్లెకక్స్ యాచకులందరికీ రగ్గులు దానం చేసింది?!

ఈమె ఫొటో...ఈ పర్సులో ఉందంటే....ఈ పర్సు గల వ్యక్తితో ‘ఆమె’ కూడా ఉందా? ఆ వ్యక్తి ఎవరు? ఇది ఆడవాళ్ల పర్సు కాదు. ఈ పర్సులో ఈమె ఫొటో ఉందీ అంటే అతను ఈమె భర్త అయి ఉంటాడు?!

అబ్బ! ఏమిటీ పిచ్చి ఆలోచనలు! తల మీద ఉన్న టోపీ తీసి జుట్టు పీక్కుంటూ కళ్ళు మూసుకున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘....తుపాకీ....గన్....గన్’’ కళ్ళ ముందుగ కనిపించే సరికి ఉలిక్కి పడ్డాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఇంత  అందగత్తె  ఒంటరిగా  సంచరిస్తోందంటే...?  మరి ఈ పర్సు గల వ్యక్తి ఏమయ్యాడు? ఇద్దరూ కలిసే ఉండాలి కదా! మరి ఈమె ఒక్కతే ఎందుకు తిరుగుతోంది? ఈమె దగ్గర ఇలాంటి గన్ ఉందంటే...?! అమ్మో!  ఆలోచనల్లో నుండి బయట పడి దొంగ కేసి చూసాడు ఎస్సై.

‘మీరీ పర్సు ఎవరి దగ్గర దొంగలించారో గుర్తుందా?!’’ యాదృచ్ఛికంగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్. ఇన్ని పర్సులు, బ్యాగ్‌ లు బంగారు గొలుసులు దొంగిలించే వీళ్ళకి ఏం గుర్తుంటుంది. డబ్బు తప్ప వారి కళ్లకి మరేదీ గుర్తుండదు. అయినా ఓ రాయి విసిరితే తప్పేముంది? మనసు లోనే అనుకున్నాడు.

‘‘సార్!  ఆ పర్సు....ఆమె  ఫొటో...అందులో...’’  బాగా  గుర్తుంది సార్....ఆ పర్సుని ఎలా మర్చి పోతాం సార్!’’ ఉత్సాహంగా అన్నాడొకడు.
    దొంగలు హుషారుగా పర్సు గురించి చెప్పే సరికి ఎస్సై అక్బర్ ఖాన్ ఆశ్చర్య పోయాడు.

‘‘నిజమేనా! సొల్లు కబుర్లు చెప్పి తప్పించుకుందామనుకుంటున్నారా?’’ కోపంగా అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘లేదు సార్! లేదు. ఆ పర్సు మా ఇద్దరికీ బాగా గుర్తు.’’ గట్టిగా చెప్పాడొకడు.

‘‘చెప్పండి...ఎలా? ఎందుకంత బాగా గుర్తుండి పోయింది’’ ఉత్సుకతగా వాళ్ల దగ్గరకెళ్ళి నిలబడి అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘సార్! ఈమెని మేము కొండ మీద కేశ ఖండన శాల దగ్గరే చూసాం సార్!’’ అన్నాడొకడు తల దించుకుంటూ.

‘‘చూస్తే....’’ ఆశ్చర్యంగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘ఆమెని ఒక్క సారి చూస్తే మర్చి పోయే రూపం కాదు కదా సార్. తల నీలాలు సమర్పించడానికి భక్తులు క్యూలో ఉన్నారు. వాళ్ల దగ్గర అదును చూసి బ్యాగులు, డబ్బులు కొట్టేయడానికి అదే లైను దగ్గర మేము ఇద్దరం తచ్చాడుతూ ఈమెని చూసాము.’’ అన్నాడు ఒకడు.

‘‘చెప్పారుగా చూసామని...తర్వాత ఏం జరిగిందో చెప్పండ్రా! ఈ పర్సుకి ఆమెకి గల సంబంధం ఏమిటో?’’ ఆతృతగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘అదే చెప్తున్నా సార్.’’ అన్నాడింకొకడు.

‘‘క్యూ లైన్ లో భక్తుల్ని ఫాలో అవుతూనే ఈమెని ఓర కంట గమనిస్తూనే మా పనిలో ఉన్నాం సార్?’’ మరొకడు.

‘‘కేశ ఖండన శాల దగ్గర నుండి ఎదురుగా టోపీ దుకాణం దగ్గరకు వెళ్లింది సార్. క్రింద దొరికిన బొగ్గు ముక్క తీసుకుని గోడ మీద పోస్టర్లన్నీ సున్నాలు గీసి పక పకా నవ్వుకుంది సార్.’’ అన్నాడు మొదటి వాడు.

‘‘ఓరి నాయనా! ఈ సోదంతా ఎందుకురా! అసలు విషయం చెప్పండ్రా!’’ చిరాగ్గా అన్నాడు రైటర్.

‘‘అక్కడికే వస్తున్నాం సార్! ఆమె అలా పకపకా నవ్వుతూ నవ్వుతూ ఒక్క సారే క్రింద కూర్చుని ఏడుపు మొదలు పెట్టింది సార్. అది కూడా క్షణమే. ఆ వెంటనే టక్కున లేచి ఆలయం కేసి వెళ్ళింది సార్.’’ చెప్పాడు రెండో వాడు.

‘‘ఆవిడ కోసం తర్వాత...ఈ పర్సు ఎవరిది? ఎలా వచ్చింది? ముందావిషయం చెప్పండి’’ ఆతృతగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘అదే సార్! ఆమె అలా ఒక్క సారే పక పకా నవ్వడంతో దారంట పోయే వాళ్ళు. క్యూలో ఉన్న భక్తులు అందరూ ఆమెనే ఆశ్చర్యంగా చూస్తూండి పోయే వారు. అదిగో. అప్పుడే....ఎత్తుగా....లావుగా ఉన్న ఒక వ్యక్తి మా దగ్గరే క్యూలైన్లో ఉన్న వాడు గబాలున బయటకు వచ్చి ఆమె కేసి ఆశ్చర్యంగా చూస్తూండి పోయాడు. అతనే జేబులో నుండి ఈ పర్సు తీసి ఈ ఫొటోని ఆమెని పదే పదే చూస్తూ తిరిగి పర్సు జేబులో పెట్టుకున్నాడు. లావుగా ఉన్న పర్సు చూసి మాకు ముచ్చటేసింది సార్. ఇద్దరం నెమ్మదిగా అతని వెంట నడిచాము.’’ చెప్తున్నాడు మొదటి వాడు.

కళ్ళకు కట్టినట్టు చెబుతున్న వాళ్ళ కథనం పోలీసులకు ఉపయోగపడిందా? ఆమే ఆచూకీ తెలుసుకోగలిగారా?? సస్పెన్స్ వీడాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే.......

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani