Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు,విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

( కుంభకోణం , పట్టీశ్వరం )

కామధేనువు కూతురు ‘ పట్టి ‘ యిక్కడ శివునికి పూజలు చేసుకున్నదట , ఆమె పేరుమీదుగా యీ వూరు పట్టేశ్వరంగాను , ఈశ్వరుడు ‘ ధేనుపురీశ్వరు ‘నిగాను పిలువబడుతున్నారు . మరో కథనం ప్రకారం ఒక ఆవు ప్రతీరోజూ యిక్కడి శివలింగానికి పాలు విడిచేదట , ఆ ఆవు యొక్క దూడ కూడా అక్కడే పాలు విడిచేదట , ఆదూడను యజమాని ‘ పట్టి ‘ అని పిలిచేవాడట , అందుకు ఈశ్వరునకు పట్టీశ్వరుడు , ధేనుపురీశ్వరుడు అనే పేర్లు వచ్చేయి .  శ్రీరాముడు వాలిని సంహరించినందువల్ల చుట్టుకున్న ‘ సయాగతి పాపాన్ని ‘ ధేనుపురీశ్వరునికి పూజలు చేసుకొన పోగొట్టుకున్నాడు , పార్వతీ దేవి యిక్కడ తపస్సు చేసుకొని మహదేవుని కృపను పొందింది , అలాగే యీ ప్రదేశంలో విశ్వామితృడు గాయత్రీవుపదేశం పొంది గాయత్రీజపం చేసి గాయత్రి కృపతో బ్రహ్మర్షిగా మారిన ప్రదేశమట .

మర్కండేయుడు ఆగమశాస్త్ర ప్రకారంగా మధ్యలో సూర్యుడు చుట్టూర మిగతా గ్రహాలు వుండేటట్లుగా నవగ్రహ మండపం నిర్మించి పూజలు చేసుకున్నాడట .

7 వ శతాబ్దంలో ‘ జ్ఞాన సంబంధార్ ‘ అనే పరమ శివభక్తుడు వుండేవాడు , అతని తల్లితండ్రులు కూడా శైవులుకావడం వల్ల సంబంధార్ మూడేళ్ల పిల్లవాడిగా వున్నప్పుడు శివకోవెలకు తీసుకువెళ్లగా గర్భగుడిలో పిల్లవాడిని విడిచిపెట్టి తల్లితండ్రులు ప్రదక్షిణలు చేసుకొని వచ్చేలోపున పార్వతీదేవి స్వయంగా పిల్లవాడికి పాలు తాగించిందట , పాలనోటితో వున్న పిల్లవాడిని పాలు యెవరు త్రాగించారని అడుగగా మూడేళ్ల బాలుడు మొదటి తేవరం పాడేడట , 7 వ సంవత్సరం ఉపనయనం జరిగే సమయానికి నాలుగువేదాలలోనూ దిట్ట అనిపించుకున్నాడట , అయిదవ యేట మునులతో శైవ క్షేత్రాలను సందర్శిస్తూ పట్టీశ్వరం వచ్చేడట , మంచి యెండాకాలం కావడంతో బాల సంబంధార్ యెండకు తట్టుకోలేక పోతే శివుడు బూతగణాలను పిలచి దారంతా ముత్యాల పందిళ్లు కట్టించేడట , శివుడు భక్తునికోసం చేసిన యేర్పాట్లను చూసి మునులు ఆశ్చర్యపడ్డారట , సంబంధార్ కోవెలకు చేరుకొనేసరికి మధ్యాహ్న పూజ జరుగుతోందట , పూజ సమయంలో గర్భగుడిలో ప్రధాన అర్చకుడు మాత్రమే వుండాలనే నియమం వుండడంతో సంబంధార్ గర్భగుడి బయట నుంచి దర్శనం చేసుకోవలసి వచ్చిందట , సంబంధార్ శివా నీ దర్శనానికి నంది అడ్డుగా వున్నాడయ్యా అని అర్దం వచ్చేలా పాటపాడగా నంది పక్కకి తప్పుకున్నదట , అందుకే యీ మందిరంలో నంది గర్భగుడికి యెదురుగా కాక పక్కగా వుంటుంది .

ఇదే కోవెల ప్రాకారంలో వున్న దుర్గాదేవి మందిరం కూడా స్థానికంగా చాలా పేరుపొందినదే , యిక్కడ భక్తులు కుంకుమార్చనలు చేయిస్తూ వుంటారు .

స్వామినాధస్వామి స్వామి మలై —-

కుంభకోణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో వుంది స్వామిమలై , సుమారు 60 అడుగుల యెత్తైన గుట్టమీద వున్న కార్తికేయుని మందిరం . మందిరం వున్న గుట్ట మానవనిర్మితమైనదని అంటారు . చారిత్రక ఆధారాల ప్రకారం యీ మందిరం సుమారు క్రీస్తు పూర్వం 2 వ శతాబ్దం నుంచి వున్నట్లుగా తెలుస్తోంది . 7 వ శతాబ్దం లో కుళోత్తుంగ చోళుడు - 1 యీ మందిరాన్ని పునఃనిర్మాణం చేసినట్ల తెలుస్తోంది . 1740 లో ఆంగ్లేయులకు హైదరాలికీ జరిగినయుధ్దంలో యీ మందిరం బాగా దెబ్బతింది . తమిళనాడు ప్రభుత్వం తీసుకున శ్రధ్దతో యీ మందిరంలో చాలా మార్పులు చేర్పులు జరిగేయి .

ఈ మందిరం చేరుకోడానికి ఆటోలు , టాక్సీలు , సిటీబస్సులు అందుబాటులో వున్నాయి . ఓపక్క గా ప్రవహిస్తున్న కావేరీనది పాయ , మరో పక్క పచ్చని వరి పొలాలు వుండడం తో మనస్సుకి అహ్లాదాన్ని కలిగిస్తూ వుంటుంది .

తమిళనాడు లో వున్న ఆరుపడైవీడు  కుమారస్వామి మందిరాలలో యిదివొకటి .

ఈ మందిరం నాలుగు గోపురాలతో మూడు ప్రాకారాలలో నిర్మించబడింది . గుట్ట క్రింద భాగంలో అంటే మొదటి ప్రాకారంలో పర్వతీ పరమేశ్వరులు , నవగ్రహాలు , దక్షిణామూర్తి , దుర్గ , సంధికేశ్వరుడు , స్మామినాధస్వామి యొక్క ఉత్సవ విగ్రహం వుంటాయి . ఇక్కడ పార్వతీ పరమేశ్వరులను సుందరేశ్వరుడు , మీనాక్షి లుగా పూజలందుకుంటున్నారు . ఇక్కడ నుంచే కొండపైకి మెట్లు వుంటాయి , పైన గర్భగుడి వరకు మొత్తం 60మెట్లు వుంటాయి , ఇవి హిందూ సంవత్సరముల పేర్లతో పిలుస్తారు , సరిగ్గా ముప్పై మెట్ల దగ్గర రెండో ప్రాకారం మొదలవుతుంది . అక్కడ నాగకన్నెలు , వాసుకి మందిరాలు వుంటాయి , మరో ముప్పై మెట్లు యెక్కేక గర్భగుడి చేరుతాం . గర్భగుడిలో స్వామినాధస్వామి బాలరూపం లో దర్శనమిస్తాడు. ఆరున్నర అడుగుల నల్లరాతి విగ్రహం , వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలు , వజ్రాలు పొదిగిన దండాన్ని ధరించిన కుమారస్మామిని దర్శించుకోవచ్చు .

కోవెల చూసేం కదా ? యిక స్థలపురాణం తెలుసుకుందాం .

కైలాసం లో ఒకనాడు పరమశివుడు తన పరివారంతో వుండగా బ్రహ్మ శివుని దర్శనానికి వచ్చాడట , కుమారస్వామి తో మాటామాట వచ్చి ప్రణవ మంత్రమైన ‘ ఓమ్ ‘ ( ఓం అని రాయకూడదు) ని హేళనగా పలికి , వేదాలననుసరించి తాను సృష్టి చేస్తున్నట్లు , ప్రణవమంత్రం తో తనకు పనిలేదని చెప్తాడు . కోపగించుకున్న స్కంధుడు బ్రహ్మను ఒక్కదెబ్బ కొట్టి  సృష్టిచేసే అర్హతలేకుండుగాక అని శపిస్తాడు . సృష్టి ఆగిపోవడంతో దేవతలు అల్లాడిపోయి విష్ణుమూర్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా విష్ణమూర్తి స్కందుని శాపానికి విముక్తి తన వద్దలేదని శివుని వద్దకు తెళతారు . శివుని కోరికమేరక బ్రహ్మ తిరిగి తన పదవిని పొంది సృష్టి చేయనారంభిస్తాడు . ప్రణవ మంత్రం యెక్క గొప్పతనాన్ని వివరించమని శివుడు కోరగా స్కందుడు యీ ప్రదేశంలో గుట్టమీద కూర్చొని శివమునకు ప్రణవమంత్రం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేడట , అందుకే యిక్కడ షణ్ముఖుని విగ్రహం యెత్తుగా గుట్టమీద గురువు స్థానంలో , క్రింద అంటే శిష్యుల స్థానంలో శివపార్వతుల విగ్రహాలు వుంటాయి . గర్భగుడిలోని మూలవిరాట్టుని స్వామినాధస్వామి ( స్వామినాధునికి ( శివునికి )స్వామి ) అనేపేరుతో పూజిస్తారు . ఈ మందిరం లో ప్రతీరోజూ ఆరు సేవలను నిర్వహిస్తారు . ప్రతీ సంవత్సరం కార్తీకపున్నమి వుత్సవాలు నిర్వహింస్తారు , థైపూసం వుత్సవాలకు దేశవిదేశానుంచి భక్తులు తరలివస్తారు . ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం నిర్వహిస్తారు . 2015 లో కుంభాభిషేకం జరిగింది .

స్వామి మలై కొండమీదనుంచి మొత్తం కుంభకోణం వూరు , వూరుచుట్టూ ప్రవహిస్తున్న కావేరి నది వాటి ఉపనదులు కనిపిస్తాయి , యెంత యెండాకాలమైనా కొండమీద చాలా హాయిగా వుంటుంది .

వచ్చేవారం మరికొన్ని మందిరాలను దర్శిద్దాం , అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
chamatkaram