Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

'షాడో' - చిత్ర సమీక్ష

shadow movie review
చిత్రం: షాడో
తారాగణం:
వెంకటేష్, తాప్సీ, శ్రీకాంత్, మధురిమ, ఆదిత్యా పాంచోలి, ముకేష్ రిషి, ఆదిత్యా మీనన్, జయప్రకాష్ రెడ్డి, నాజర్, నాగబాబు, ఎమె ఎస్ నారాయణ, ధర్మవరపు, శ్రీనివాస రెడ్డి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, గీతా మాధురి
కథ: కోన వెంకట్, గోపీ మోహన్
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ
కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్
పంపిణి: సురేష్ ప్రొడక్షన్స్
కథనం, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: పరుచూరి కిరీటి
విడుదల తేదీ: ఏప్రిల్ 26, 2013

ఎన్టీఆర్ తో 'శక్తి' సినిమా తీసిన తర్వాత రెండేళ్ళకు దర్శకుడు మెహర్ రమేష్, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లో నటించిన  ఏడాది లోపు హీరో వెంకటేష్ 'షాడో' తో నేడూ వెండితెరను వెలిగించారు. ఇది ఎలా ఉందో తెలుసుకోవడానికి వివరాల్లోకి వెళ్దాం.

క్లుప్తంగా చెప్పాలంటే:
రాజారాం (వెంకటేష్) సన్ ఆఫ్ రఘురాం (నాగబాబు) తన తండ్రిని చంపిన దుర్మార్గులపై ప్రతీకారం తీర్చుకోవడమే ఈ షాడో ఇతివృత్తం. దుర్మార్గులని అంతమొందించేందుకు ఒక అండర్ కవర్ జర్నలిస్టుగా ఆ గ్యాంగ్ లో చేరతాడు రఘురాం. ఆ ఆపరేషన్ కి అతను పెట్టుకున్న పేరు షాడో. తండ్రి మరణం తర్వాత రాజారాం షాడోగా మారి ఒక్కొక్కరిని ఎలా చంపుతాడో తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
కథలో పట్టు సంగతి ఎలా ఉన్నా కథనంలో కనికట్టు లేకపోతే సినిమాలు ఆడే రోజులు కావివి. కామెడీ ని ఆశ్రయిస్తే సరిపోతుందనుకున్నా అందులో కూడా కొత్తదనం ఉండాల్సిందే. గబ్బర్ సింగ్ అంత్యాక్షరి సీన్ నే మళ్ళీ చూపించేసి ఇదె కామెడీ అనుకోమంటే ప్రేక్షకులని తక్కువ అంచనా వెయ్యడమే. ఎం ఎస్ నారాయణ ని పెట్టుకున్నా, ధర్మవరపు ఉన్నాడులే అనుకున్నా, వెన్నెల కిషోర్ ఉన్నాడుగా అనిపించినా వాళ్ళందర్నీ సరిగ్గా వాడుకోవడానికి సరిపడా సరుకు ఉండాలిగా.

ఇక ప్రధాన కథ, సన్నివేశాలు ఎప్పుడో 80వ దశకం నాటి సినిమాలు గుర్తుచేస్తాయి. ఇంకా సూటిగా చెప్పాలంటే చిరంజీవి నటించిన 'లంకేశ్వరుడు' గుర్తుకువస్తుంది. రివెంజ్ డ్రామాలు తెలుగు వారికి కొత్త కావు. అది తెలిసినప్పుడు స్క్రీన్ ప్లే ఎంత పకడ్బందీగా ఉండాలో తెలిసుండాలి. స్క్రిప్ట్ దశలోనే మరింత హోం వర్క్ చేసుంటే బాగుండేది. సెంటిమెంట్ సీన్లు వస్తున్నప్పుడు జనం నవ్వుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు...దీని ఫలితం ఎమౌతుందనేది.


కెమెరా పనితనం, కొరియోగ్రఫీ బలం ఇందులో ఎలా ఉన్నాయో అలా  సినిమాకి గుండెకాయ లాంటి సన్నివేశ  కల్పన, సంభాషణల్లో కూడా ఉండాల్సింది. స్టైలింగ్  పై పెట్టిన శ్రధ్ధ, ఖర్చుకు వెనుకాడని తెగువ కనిపిస్తున్నా చెడిన వ్రతం గురించి చెప్పుకునేటప్పుడు అవి లెక్కలోకి రావు.
వీటికి తోడూ ప్రధాన విలన్ తన కాంపిటీటర్స్ అయిన మరో ముగ్గురు డాన్స్ ని తన స్థావరానికి పిలిపించుకుని చంపడం, నాగబాబు మాస్క్ తీస్తే వెంకటేష్ అయిపోవడం, బి బి సి లో తెలుగు వార్తలు రావడం లాంటి సన్నివేశాలు దర్శకుడి 'ప్రతిభకు' అద్దం పడతాయి.

వెంకటేష్ మాత్రం తన పాత్రకు న్యాయం చేసారు, దర్శకుడు చెప్పింది చేసుకుపోతూ. మొదటి సగంలో ఆయనకు వాడిన విగ్గు మాత్రం ఎబ్బెట్టుగా ఉంది. కొంతసేపటికి బాగానే ఉందిలే అనిపిస్తుంది..కళ్ళకి అలవాటవడం వల్ల.

తాప్సీ కంటికి ఇంపుగా ఉంది. హీరోయిన్స్ ని కలర్ ఫుల్   గా చూపించడం లో మాత్రం దర్శకుడిని వేలెత్తి చూపలేం. 'షాడో' టైటిల్ సాంగ్ లో కోరియోగ్రఫీ, అలాగే చివరి పాట 'గబ్బర్ సింగుకి లైనేసా..కొంచెం తిక్కని వదిలేసా..' అనే భాస్కరభట్ల గీతం వినడానికి, చూడడానికి కూడా బాగుంది. అదే శ్రధ్ధ సన్నివేశ  బలం పై కూడా చూపిస్తే  తదుపరి చిత్రంతో నైనా మంచి దర్శకుడిగా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. అది జరగాలని కోరుకుందాం.

ఒక్క ముక్కలో చెప్పాలంటే: ఈ 'నీడ' లోకి వెళ్తే కాళ్ళు కాలతాయి.

అంకెల్లో చెప్పాలంటే: 2/5

మరిన్ని సినిమా కబుర్లు
ramajogayya shastry interview