Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అనుబంధాలు - ఇరవై ఐదవ భాగం

Anubandhaalutelugu serial twenty fifth Part

"ఇంకేమిటి వెళ్లి పడుకో" అంటూ పోబోయాడు.

అతని చేయి పట్టుకొని ఆపింది. ఏదో చెప్పాలని ఉంది. కానీ మాటలు బయటకు రావడం లేదు. చివరకు "థాంక్స్! బావా గుడ్ నైట్!" అంటూ చరచరా వెళ్లిపోయింది.

చిన్నగా నవ్వుకుంటూ కదిలాడు నవీన్.

ఆ సమయంలో రెండు కళ్ళు ఆసక్తిగా తనను గమనించిన సంగతి వాళ్ళిద్దరికి తెలీదు. ఆ కళ్ళ తాలూకు మనిషి ఎవరో కాదు నవీన్ తల్లి భ్రమరాంబ.

సరిగ్గా ఇక్కడ నవీన్, శివానీలు మాట్లాడుకుంటున్న సమయంలోనే అక్కడ రామలింగేశ్వర్రావుతో తమ్ముడు గోపాల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు.

"అన్నయ్యా! నేను ఇండియా వస్తున్నాను. రేపు ఉదయం ఇండియా వస్తున్నాను. ఏర్ పోర్ట్ కి రా... నేను వస్తున్న సంగతి అమ్మకి, సత్యవతికి తెలీదు. తెలియకూడదు. వచ్చాక మాట్లాడతాను ఉదయం ఏర్ పోర్ట్ కి రా" అంటూ సింపుల్ గా విషయం చెప్పి ఫోన్ కట్ చేసాడు అవతల గోపాల్.
రామలింగేశ్వర్రావు ఇక క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తమ్ముడు ఎన్నో బాధల్లో ఉండి ఇక్కడకు వస్తున్నాడు. వాడికి ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకోవాలి, అనుకుంటూ అప్పటికప్పుడు ప్రయాణమయ్యాడు. ఇంట్లో ఎవరికీ గోపాల్ వస్తున్న సంగతి చెప్పలేదు.

పనిమీద రాజమండ్రి వెళ్తున్నట్టు చెప్పి, రాత్రి పదిగంటలకు కారు తీసుకొని వెళ్లిపోయాడు. మరునాడు డాక్టర్ గోపాల్ ఇంటికొస్తున్న సంగతి అతన్ని చూసేవరకు ఎవరికీ తెలీదు. రామలింగేశ్వర్రావు ఎప్పటిలాగే కారును మండువా లోగిట్లో ఆపాడు.

కారు ఆగిన వెంటనే మౌనంగా కారు దిగి లోనకి వెళ్ళిపోయాడు గోపాల్. అప్పటికి సాయంత్రం నాలుగు దాటింది సమయం. గోపాల్ ని ముందుగా చూసింది వదిన మహాలక్ష్మీ. ఆమె అతన్ని చూస్తుండగానే ఆశ్చర్యానికి గురైంది. మనిషి కొంచెం చిక్కి, గడ్డం మాసి, విషాద వదనంతో ఉన్న అతన్ని చూడగానే ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎలా పలకరించాలో తెలీక బొమ్మలా నిలబడిపోయిందావిడ.

గోపాల్ ఎవరికోసమూ చూడలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు. సరాసరి తన తల్లి అన్నపూర్ణేశ్వరి గదిలోకి వెళ్లి అటు తిరిగి పరుండిపోయాడు.

మహాలక్ష్మీ వెళ్లి భ్రమరాంబను పిలుచుకొచ్చింది. క్షణంలో గోపాల్ వచ్చినట్టు అందరికీ తెలిసిపోయింది. రామలింగేశ్వర్రావు, వెనకాలే రఘునాథ్, భ్రమరాంబ, మహాలక్ష్మీ
ఒక్కొక్కరే గదిలోకి వచ్చారు. కుర్చీ లాక్కుని కూర్చున్నాడు రామలింగేశ్వర్రావు. ఆ సమయంలో నవీన్ ఇంట్లో లేడు.

ఈ విషయం తెలీగానే అనంత్ ని, శివానీని పిలుచుకురావడానికి డాబా ఇంట్లోకి పరుగెత్తింద మహేశ్వరి.

చిన్నన్నయ్యను చూస్తుంటే భ్రమరాంబకు దుఃఖం ఆగలేదు. బలవంతంగా కన్నీళ్లు ఆపుకుంటూ పిలిచింది. రెండుసార్లు పిలిచాక ఊ... అంటూ అటునుంచి ఇటు కదిలి, నెమ్మదిగా లేచి కూర్చున్నాడు.

"ఏమ్మా ఎలా ఉన్నార్రా?" అంటూ పలకరించాడు.

"మేం బాగానే ఉన్నాం. అమ్మ, వదిన ఎలా ఉన్నారు?"

"బాగానే ఉన్నారు."

"ఏమిటన్నయ్యా ఇలా నిన్ను చూస్తాననుకోలేదు." అంటూ ఆపుకోలేక అన్నయ్యను పట్టుకొని ఏడ్చేసింది భ్రమరాంబ.

"అయినా పోతేపోయింది వెధవ డబ్బు. మళ్లీ సంపాదించుకుంటాం దానికోసం నువ్విలా బెంగపట్టుకోవడం ఏమిటి బావా? నలుగురికీ చెప్పాల్సినవాడివి నువ్వే ఇలా డీలా పడిపోతావనుకోలేదు" అన్నాడు మందలిస్తున్న ధోరణిలో రఘునాథ్.

వాళ్ళంతా సానుభూతి చూపిస్తున్నారు. ధైర్యం చెప్తున్నారు. అంతా మౌనంగా వినడం తప్ప, ఎక్కువ మాట్లాడలేదు గోపాల్.

ఇంతలో మహేశ్వరి, ఆ వెనకే అనంతసాయి, సాయి శివానీలు లోనకొచ్చారు.

"ఏరా! ఎలా ఉన్నారు?" అంటూ కొడుకు కూతుర్నీ చూసి పొడిగా పలకరించాడు.

ఆ పిలుపులో మునుపటి ప్రేమగానీ, ఆప్యాయతగానీ లేదు. లాంఛనంగా మాట్లాడినట్టుంది.

ఏం చెప్పాలో తెలీక "డాడీ!" అంటూ చిన్నగా ఏడ్చేసింది శివానీ.

అనంత్ మాత్రం ముఖం ముడుచుకొని "మేం బాగానే ఉన్నాం డాడీ! మమ్మీ, నాయనమ్మ ఎలా ఉన్నారు?" అంటూ అడిగాడు.

"కోలుకోలేని దెబ్బ తగిలింది. నా అదృష్టం ఒకరోజు ఇలా తిరగబడుతుందని అనుకోలేదు" అన్నాడు బాధగా.

"మీ అదృష్టమే కాదు డాడీ, మీతో పాటు మా అదృష్టం కూడా నాశనం చేసారు" అన్నాడు ఆవేశంగా అనంత్.

"ఒరే ఏమిట్రా... డాడీతో ఇలాగా మాట్లాడేది?" అంటూ వారించే ప్రయత్నం చేసాడు రఘునాథ్.
కానీ ఆగలేదు అనంత్ "ఇంకెలా మాట్లాడమంటావ్?" అంటూ అడిగాడు.

"మేం ఖర్చుపెట్టేస్తున్నాం. డబ్బు పాడుచేస్తున్నామనేగా డాడీకి మా మీద కోపం. ఇప్పుడాయన చేసింది ఏమిటి? ఒకటి కాదు రెండు కాదు ఐదువందల కోట్లు ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. మొత్తం డబ్బు షేర్లలో ముదుపు చేసి దివాళా తీసారు. మేం ఏమైపోవాలని చేశారు? మా భవిష్యత్తు గురించి ఆలోచన ఉంటే ఇలా చేసేవారేనా?" అంటూ నిలదీశాడు.

ఆ మాటలతో రఘునాథ్ కి కోపం వచ్చింది.

"ఒరే బుద్ధి లేకుండా మాట్లాడకు. మీ చేత మాటలు పడ్డానికే ఆయన ఇక్కడికి వచ్చారనుకున్నావా? అక్కడ అమెరికాలో మనసు బాగోలేక మనసు ప్రశాంతంగా గడుపుదామని ఇక్కడికి వస్తే, ఇదా మీరు మాట్లాడేది" అంటూ కేకలు వేసాడు.

"ప్లీజ్ మావయ్యా! అన్నయ్య మాట్లాడిందాంట్లో తప్పేముంది? తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించనక్కర్లేదా?" అంటూ అన్నయ్యను వెనకేసుకొచ్చింది శివాని. వాళ్ళిద్దరి ప్రవర్తనకు అక్కడివాళ్లంతా నిర్ఘాంతపోయారు.

రఘునాథ్ కు ఆమె మాటలు మరింత చికాకు తెప్పించాయి .

"ఏమిటి తల్లీ నువ్వు కూడా అదేమాట... మీ అన్నాచెల్లెళ్లకి మెదడు మోకాళ్ళలో ఉందని ఇప్పుడు అర్ధమౌతుంది. బాధ్యత గురించి మీరు మాట్లాడుతున్నారా? సిగ్గులేదా మీకు? తండ్రికి తగ్గ బిడ్డల్లా మీరు ఒక్కరోజైనా నడుచుకున్నారా? ఎప్పుడూ డబ్బు తగలేయడమే కానీ, సంపాదించడం అంటే ఏమిటో తెలియదు. మీ భవిష్యత్తు గురించి మీకే ఆలోచన లేదు. ఆయనెందుకు ఆలోచించాలి" అంటూ కేకలు వేసాడు రఘునాథ్.

ఇంతలో గోపాల్ కల్పించుకుంటూ నువ్వాగు బావా! వాళ్ల మనసులో ఏముందో మాట్లాడనియ్. తొందరెందుకు చెప్పండ్రా. నిన్నటి వరకు నా బిడ్డలు అమాయకులైన చిన్న పిల్లలనుకున్నాను. హక్కు గురించి మాట్లాడుతున్నారంటే నా అభిప్రాయం తప్పని అర్ధమౌతుంది. మీరు పెద్దవాళ్ళయ్యారు సంతోషం. చెప్పండి ఇంకా మీకు నేను చేసిన అన్యాయాలు ఏమన్నా ఉంటే ఇంకా బయట పెట్టండి. అన్నింటికీ ఒకేసారి సంజాయిషీ ఇచ్చుకుంటాను. కమాన్" అని అడిగాడు. "ఒరే గోపాల్ ఏమిట్రా? బాధ్యతలు, సంజాయిషీలు అంటూ వాళ్లముందు పెద్ద పెద్ద మాటలు. తెలిసీ తెలియకుండా వాళ్లేదో మాట్లాడుతుంటే నువ్వూ తొందరపడతావేమిటి? ఊరుకో..." అంటూ గోపాల్ ని శాంతిపరిచే ప్రయత్నం చేశాడు రామలింగేశ్వర్రావు.

"తెలిసీ తెలియకుండా ఏమిటన్నయ్యా నువ్వుకూడా. తెలియని వాళ్లు మాట్లాడే మాటలా... అడుగు..." అన్నాడు ఆవేశంగా గోపాల్.

శివానీ, అనంత్ లు మౌనంగా నిలబడ్డారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఏం మాట్లాడినా ఆయన మరింత రెచ్చిపోతారనే భయంతో ఆపైన పెదవి కూడా కదపలేదు. కానీ వాళ్ళు అడిగిన రెండు మాటలు గోపాల్ ని బాగా కష్టపెట్టాయి. అందుకే గోపాల్ వాక్ప్రవాహం వరదలా బయటకు దూకింది. "ఏం తక్కువ చేసాను వీళ్లకి? ఏ తండ్రీ ఇవ్వనంత ప్రేమను ఇచ్చాను, స్వేచ్ఛనిచ్చాను, డబ్బిచ్చాను, రేయింబవళ్ళు సంపాదించాను, ఒక తండ్రిగా బిడ్డలు ఎలా ఉండాలో చెప్పాను. కానీ ఏ రోజన్నా మా అభీష్టం ప్రకారం నడుచుకున్నారా? వేలమైళ్ళ దూరంలో, పరాయి గడ్డమీద, పరాయి సంస్కృతిలో ఉన్నాం. మనం ఎక్కడున్నా మన మూలాలు ఇండియాలో ఉన్నాయి. మనం తెలుగువాళ్లం. తెలుగు సంస్కృతి నిలబెట్టుకుందాం. మనం మనలా నిరూపించాలి. మన ప్రత్యేకతను చాటాలి అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. కాని వీళ్లు చూడు రెండింటికీ చెడ్డ రేవడిలా తయారయ్యారు. వీళ్ళిద్దరిదీ పూర్తిగా అమెరికా సంస్కృతి కాదు, తెలుగు సంస్కృతి కాదు. తప్పు చేసాను. చాలా పెద్ద తప్పు చేసాను. వీళ్లను చిన్నప్పుడే ఇక్కడే వదిలేసి పోయుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అమ్మ ఆరోజే చెప్పింది. వినకపోవడం మా తప్పే" అంటూ ముఖం తిప్పుకున్నాడు గోపాల్.

"అన్నయ్యా! ఊరుకో తరువాత మాట్లాడుకోవచ్చు. నా మాట విను..." అంటూ భ్రమరాంబ నచ్చజెప్పబోయినా ఆగలేదు గోపాల్. అంతకన్నా ఆవేశంగా మాట్లాడాడు.

"నీకు తెలీదు చెల్లాయ్. మీ పిల్లలకీ, వీళ్లకీ ఉన్న తేడా నీకు తెలీదు. వీళ్లు మూర్ఖులు. విన్నావుగా ఏమంటున్నారో డబ్బంతా షేర్లలో పెట్టి నాశనం చేశానంట. వాళ్ల భవిష్యత్తు గురించి నేను ఆలోచించడం లేదంట. బుద్దున్న బిడ్డలు అడిగే మాటలేనా ఇవి. సంసారం అన్నాక సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. కావాలని ఎవరూ నాశనం చేసుకోరు. నేను కష్టంలో ఉన్నాను. ఈ సమయంలో నాకు అండగా నిలబడి ధైర్యం చెప్పాల్సిన బిడ్డలు అలా ఉండకపోగా మాటలతో నా గుండెను గాయపర్చాలని చూస్తున్నారు. ఏం చెప్పాలి?" అన్నాడు నిస్సహాయంగా.

"అదికాదు డాడీ..." అంటూ ఏదో చెప్పాలని చూసాడు అనంత్. కానీ తనకి ఆ అవకాశం ఇవ్వలేదు గోపాల్.

"అమెరికా కల్చర్ ను ఇష్టపడే మీరు. అమెరికా పద్ధతిలో ఎందుకు నడుచుకోవడం లేదో చెప్తారా? ఇంటర్ వరకే చదివిస్తారు అక్కడి తల్లిదండ్రులు. అక్కడి నుంచి పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ వాళ్ల చదువులు వాళ్ళే చదువుకోవాలి. ఎంత గొప్ప కుటుంబంలోనైనా అదే పద్ధతి. మీరలా చేయకుండా నా డబ్బుతో ఎందుకు చదువుకున్నారు? అలాగే పిల్లలు కనీసం తమ తల్లిదండ్రుల ఆస్థికి పన్ను కట్టగల కనీస సంపాదన ఆర్జించగల అర్హత సంపాదించుకున్నప్పుడే అక్కడి పిల్లలకు హక్కు ఉంటుంది. ఆ లెక్కన మీకింకా సంపాదన అంటే ఏమిటో కూడా తెలియదు. నా ఆస్థిని అడిగే హక్కు ఎక్కడుంది. పైగా నేనేమీ పాడుచేసింది మీ నాయనమ్మ ఆస్థి కాదు. మీ అమ్మ పుట్టింటివాళ్లు ఇచ్చిందికాదు. కష్టార్జితం, నా కష్టార్జితం. అమెరికాలో బయలుదేరేముందు అనుకున్నాను. డబ్బుపోతే ఏమిటి? రత్నాల్లాంటి ఇద్దరు బిడ్డలున్నారు నాకు. వాళ్ళే నా ఆస్థి అని. కాని నేను కన్నది రత్నాల్ని కాదు, వట్టి రాళ్ళనని ఇప్పుడు అర్ధమైంది. అయామె పూల్" అంటూ ఇక ఆపుకోలేక చిన్నగా ఏడ్చేశాడు.

అతడిని చూస్తున్న అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

ఇక ఎంత ఆపుకుందామన్నా శివానీకి దుఃఖం ఆగలేదు. పరుగున వచ్చి తండ్రిని కౌగలించుకొని పెద్దగా ఏడ్చేసింది.

"అయాం సారీ డాడ్! క్షమించు... క్షమించండి" అంటూ బావురమంది.

అంతవరకు శిలావిగ్రహంలా నిలబడిన అనంతసాయి కూడా తండ్రి ఏడుస్తుంటే చూడలేక వచ్చి కాళ్ల దగ్గర కూచుండిపోయాడు.

"సారీ డాడ్! ఇంకెప్పుడూ మిమ్మల్ని బాధపెట్టే పని చేయం. సారీ!" అన్నాడు.

బిద్దలిద్దర్నీ లేపి గుండెలకు హత్తుకున్నాడు గోపాల్.

అంతా వాళ్లని ఓదార్చారు. ధైర్యం చెప్పారు.

ఇంతలో నవీన్ కూడా ఇంటికొచ్చాడు. గోపాల్ ని పలకరించాడు. వాతావరణం కొద్దిగా తేలికపడ్డాక అందరికీ చెప్పాడు గోపాల్.

"నేను కెనడా వెళ్తున్నానని వంక పెట్టి మనశ్శాంతి కోసం కొద్ది రోజులు ఇక్కడ గడపాలని వచ్చాను. అంచేత సత్యవతికి గానీ, అమ్మకి గానీ ఈ విషయం తెలీదు. తెలిస్తే వాళ్లు ఇక్కడికి వచ్చేస్తారు. దయచేసి అమెరికా నుంచి ఫోన్ వస్తే నేనిక్కడ ఉన్న విషయం చెప్పకండి" అంటూ అందర్నీ హెచ్చరించాడు.

"తమ్ముడు ఏం ఫరవాలేదురా. నువ్విక్కడికి వచ్చిన సంగతి వాళ్లకి తెలీదు. సరేనా... ముందు దిగులు వదిలి సంతోషంగా ఉండు." అంటూ తమ్ముడికి అభయం ఇచ్చాడు రామలింగేశ్వరరావు. రాత్రి భోజనాలు అయిన కొద్దసేపటి తరువాత ఎందుకో పెరటి వైపు వచ్చాడు నవీన్. అక్కడున్న దృశ్యాన్ని చూసి కొద్దిసేపు డోర్లోనే నిలబడిపోయాడు. పున్నమి రోజు. అప్పటికే రెండు బారాలు పైకి వచ్చేసాడు చంద్రుడు. మబ్బుల్లేని నీలాకాశం. వెండి దారాళ్ళా దూసుకొస్తున్న చల్లని వెండి కిరణాలు. పూలు సుగంధాలు మోసుకొస్తున్న మంద గాలుల స్పర్శ మనసును పులకింపజేస్తోంది. అయితే అతన్ని పట్టి అక్కడ నిలబెట్టిన విషయం ఇదికాదు. అంతదూరంలోని మల్లె పందిరి పక్కన ఒంటరిగా నిలబడుంది సాయిశివాని. ఆమె సిల్కు నైటీతో అల్లరి గాలుల పరిహాసాలు, విరబోసిన ఆమె జుట్టు మీద పండువెన్నెల జలతారు జిలుగులు. నవీన్ కళ్ళను కనికట్టు చేసి, రెప్ప వేయడం మర్చిపోయేలా చేసాయి, ఇవాళ ఒక సరికొత్త శివానీ కన్పిస్తోంది అతనికి. ఆమె పెరటి వైపు రావడం ఎప్పుడూ చూడలేదు అతను. అలాంటి ప్రశాంతమైన ఆ రేయిలో ఇలా ఒంటరిగా కన్పించేసరికి నిజంగానే ఆశ్చర్యపోయాడు నవీన్. చిన్నగా అడుగులు వేస్తూ దగ్గరకు పోయాడు.

వెళ్లాక అర్ధమైంది అతడికి ఆమె ఊరకే నిలబడలేదని. తనలో తాను దేనికో అప్పుడప్పుడూ బాధపడుతూ కళ్ళు తుడుచుకుంటోంది.

అతడి మనసు ఆర్ధ్రమైంది. పక్కనే ఉన్న తిన్నెమీద కూర్చున్నాడు.

మనసులో బాధ ఎవరితోనైనా చెప్పుకుంటే ఆ బాధ తగ్గుతుందంటారు. తప్పులేదంటే నాతో చెప్పు. ఇప్పటికిప్పుడు నీకొచ్చిన కష్టం ఏమిటి? ఎవరన్నా ఏమన్నా అన్నారా? నాతో భయం లేదు?" అన్నాడు.

కళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగి అతనివంక చూసింది.

"నాకెందుకు  బావా భయం. కాపాడ్డానికి నా వెనకే నీడలాగా నువ్వున్నావుగా." అంది.

"అబ్బో నా మీద ఆ నమ్మకం ఉంచావ్ సంతోషం. ఇంతకీ విషయం ఏమిటి? మీ నాన్న తిట్టినందుకు బాధగా ఉందా?"
లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది.

"లేకపోవడం ఏమిటి? అందుకే అయి ఉండాలి. అయినా పెద్దవాళ్లు మనల్ని కొట్టినా, తిట్టినా అది మన మంచికే గదా! ఈ మాత్రానికే అంతలా బాధపడాలా? మీ అమెరికా అమ్మాయిలంతా ఇలాగే చీటికీ మాటికీ ఏడుస్తారు." తమాషాగా అన్నాడు.

"బావా ప్లీజ్...!" అంటూ కళ్ళు తుడుచుకొని చిన్నగా నవ్వింది.

"నాకు బాధగా ఉంటే నీకు వేళాకోళంగా ఉందా?" అంటూ వచ్చి అతడికి కొంచెం ఎడంగా తిన్నెమీద కూర్చుంది.

"విషయం చెప్పకపోతే అలాగే ఉంటుంది మరి. నీకో విషయం తెలుసా? ఆడపిల్ల కంటతడి పెడితే ఇంట సిరి నిలవదని చెప్తారు పెద్దలు. ఇప్పటికే మీ నాన్నకు ఐదు వందల కోట్లు
నష్టం. నువ్విలా ఏడిస్తే ఇంకా నష్టపోతారు. ఇక కన్నీరు ఆపేసి నీ ఏడుపుకి కారణం ఏమిటో చెప్పేస్తే బాగుంటుంది."

"సర్లే! ఇప్పటికే డాడీ నష్టపోయింది చాలు. నా మూలంగా ఇంకా ఏమీ నష్టపోనక్కర్లేదు. ప్రత్యేకించి ఈ వెక్కిరింపులెందుకు?"

"అవున్లే. నువ్వు కోతివని వెక్కిరించాను. ముఖం చూడు."

"నేను కోతిని. నువ్వు కోతి బావవా? చాల్లే వెధవ పోలికలు."

(... ఇంకా వుంది)

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
okanati premakatha by akella shiva prasad