Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.. http://www.gotelugu.com/issue305/789/telugu-serials/katyayani/katyayani/

 

(గత సంచిక తరువాయి)..... ఉదయం నాలుగున్నరకు వరాలమ్మ, సోమయాజులుగారు నిద్రలేస్తారు. ఇప్పుడు వాళ్లతో పాటూ కాత్యాయని కూడా లేచేస్తోంది. వాళ్లని చూస్తుంటే ఆమెకి తన తల్లి తండ్రులు గుర్తొస్తున్నారు. వాళ్లకి తను ఒకతే సంతానం. ఇప్పుడు పిల్లల్లేని వీళ్లకు తను కూతురైంది. ఏమిటో విధి విచిత్రం.

గుడి ముందుకెళ్లి వాకిలి ఊడ్చి, కళ్లాపి జల్లి, మెట్లు కడిగి ముగ్గులేసి దేవుని సామాను శుభ్రపరచి గర్భ గుడి గుమ్మం ముందు ఉంచి, తొలి సూర్యకిరణం స్పృశించేసరికి ఇంటికొచ్చి స్నానం చేసి దొడ్లో ఉన్న రకరకాల పూలు కోసి, సజ్జలో వేసుకుని వెళుతుంటే, వరాలమ్మ నవ్వుతూ ఎదురొచ్చి అక్కడే ఉన్న అరటి చెట్టు నుంచి సన్నని నార తీసి, పూలను కొన్ని నిముషాల్లో చక్కని మాలగా కట్టిచ్చింది. దానిని సజ్జలో విడిపూలతో పాటు ఉంచి, గుడికి తీసుకెళ్లింది. అప్పటికే గర్భ గుడిలో దేవతా మూర్తులను కడిగి, బట్టలు కట్టి, బొట్లుపెట్టి హారతి పల్లెం, శఠగోపం, పంచపాత్ర ఇత్యాది వస్తువులు చక్కగా సర్దుకున్నాడు సోమయాజులుగారు. పూల సజ్జను ఆయనకు అందించేసరికి ఆయన నవ్వుతూ ఆమెని కూర్చోమని సంజ్ఞ చేసి, కొన్ని విడిపూలను పూజకు ఉంచుకుని, దండలతో దేవతామూర్తులను చక్కగా అలంకరించారు.
అగరు.. అత్తరు సువాసనలు మత్తెక్కిస్తుంటే, దీపాల వెలుగులో నవ్వులు చిందిస్తున్న దేవతా మూర్తులను చూస్తూ, ప్రాతఃకాల సమయంలో వీచే చల్లనిగాలి.. స్నానించిన శరీరాన్ని స్పృశిస్తుంటే, మంద్రంగా వినవస్తున్న మంత్రాలకు ఒళ్లు పులకరించిపోతోంది కాత్యాయనికి. అప్రయత్నంగా శాంకరికి చేతులు జోడించింది.  ఒక్కొరొక్కరుగా జనం వస్తుంటే, పమిట చెంగు తలమీదుగా ముఖం కనబడకుండా వేసుకుంది. పూజ పూర్తయ్యాక తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇంటి ముఖం పట్టింది.

కొత్త వాతావరణం, కొత్త పని కాలం కళ్లెం లేకుండా సాగిపోతోంది.

కాత్యాయనికి అది మరో జన్మలా ఉంది.

*****

ఛానల్ టీవీల ప్రపంచంలో కొత్తగా ప్రారంభించిన వాహ్ టీవీ రోజు రోజుకి తనదైన ప్రత్యేక కార్యక్రమాలతో వ్యూవర్స్ ను పెంచుకుంటూ ప్రభంజనం సృష్టిస్తోంది. ఆ ఛానల్ లో ప్రసారమయ్యే ‘చీకటి మలుపు’ కార్యక్రమం పి ఆర్ పి రేటింగ్ లో టాప్ లెవెల్ లో ఉంది. మనుషుల జీవితాల్లోని అనూహ్యమైన మలుపులను వాస్తవంగా చిత్రీకరీస్తూ జన హృదయాలకు బాగా దగ్గరయింది. దానిక్కారణం హేమ. హేమ ఓ జర్నలిస్ట్. చీకటి మలుపు కార్యక్రమ రూపకల్పన, నిర్వహణ అంతా ఆమెదే!

గుళ్లోని పూజారుల యథార్థ జీవనం మీద కార్యక్రమం షూట్ చేయడానికి అన్ని గుళ్లూ తిరుగుతోంది హేమ. తలుపులు తెరిచిందగ్గర్నుంచి, గుడి మూసే దాకా ఉండి పూజారుల వాస్తవ జీవన విధానాన్ని యథాతథంగా చిత్రిస్తోంది. అందులో భాగంగా తొలికోడి కూయంగానే తలంటు పోసుకుని, చక్కగా ముస్తాబై, కెమెరా మెన్ తో అమ్మవారి ఆలయానికి వచ్చింది. ముందే ఆలయ కమిటీ సభ్యులు చెప్పి ఉండడంతో సోమయాజులు కొద్ది దూరంలో చాప వేసి ఆమెని కూర్చోమన్నాడు. కాత్యాయని గుడిని శుభ్రపరచే పని చేసుకుంటోంది.

సోమయాజులుగారితో "మీరు గుడి గురించి ఏమీ చెప్పనక్కర్లేదండి. అందుకు చాలా ఛానల్స్ ఉన్నాయి. మీ గురించి చెప్పండి. మీ సమస్యలు చెప్పండి. మానవ సేవే మాధవ సేవ కదా! అందుకే నేనొచ్చాను" అంది.

సోమయాజులుగారు చెప్పేది శ్రద్ధగా వింటున్నా, జర్నలిస్ట్ కాబట్టి చుట్టూ పరీక్షగా చూస్తోంది. ఊడ్చే పనంతా చేసి, దేవుడి సామాగ్రి తోమిపెట్టి, వెళ్లి స్నానం చేసొచ్చి పూలమాలలు సోమయాజులుగారికిచ్చి, కాత్యాయని దూరంగా కూర్చోడం గమనించింది హేమ. కొంతసేపటి తర్వాత జనం రావడం ప్రారంభం కావడంతో తలమీదకి పమిట చెంగు లాక్కుని ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడడం, తర్వాత వెళ్లిపోవడం హేమకి ఆసక్తి కలిగించింది.

మధ్యాహ్నం సోమయాజులుగారు గర్భగుడికి తాళం వేసి "అమ్మా, పద మళ్లా ఐదింటికి గుడి తెరుస్తాను. అప్పటిదాకా మా ఇంట్లో కాస్త ఎంగిలిపడి కాస్సేపు విశ్రాంతి తీసుకుని సాయంకాలం నాతో వద్దువుగాని"అన్నాడు.

ఆయన వంక రెండు నిముషాలు నిశ్చలంగా చూసి "పొద్దుట ఇక్కడ ఒకమ్మాయి ప్రవర్తన నాకు వింతగా అనిపించింది. ఆమెందుకో జనం కంట పడకుండా జాగ్రత్త పడుతున్నట్టనిపించింది. ఆమెవరు?" అని సూటిగా అడిగింది.

ఆ ప్రశ్న ఆయన్ని ఉలిక్కిపడేలా చేసింది.

 

జర్నలిస్ట్ కాత్యాయని వివరాలు తెలుసుకుని ఏం చేయబోతోంది.. కాత్యాయని జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలుసుకోవాలంటే????వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా వెయిట్ చెయ్యండి.....   

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana