Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

బారముల్లా ఇండియా పాకిస్ధాన్ సరిహద్దు ప్రాంతం.

మిత్రవింద వేగంగా పరిగెత్తుతుంది. ఆయాసంతో ఆమె గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి.  కాళ్ళు విపరీతంగా నొప్పి పుడుడుతున్నాయి. ఒళ్ళంతా చెమటతో నిండిపోయింది. పరిగెత్తుతునే వెనక్కు తిరిగి చూసింది. వెనుక రాహుల్ వేగంగా ఆమె వైపుకు దూసుకు వస్తున్నాడు. అతని మొహం అస్తమిస్తున్న సూర్యుడిలా ఎర్రగా ఉంది.  కోపంతో ప్రళయకాల ప్రభంజనుడిలా ఊగిపోతున్నాడు అతను. పళ్ళు పట్టపటకొరుకుతూ ఆమె కేసి దూసుకు వస్తున్నాడు. అతని చేతిలో యాసిడ్ సీసా ఉంది.


ఆ యాసిడ్ తో ఆమె మొహాన్ని కాల్చాలని అతన ప్రయత్నం. అదృష్టవశాత్తు ఈ విషయం ముందే గ్రహించింది మిత్రవంద. విద్యుత్ వేగంతో రియాక్ట్ అయింది. అడ్డుగా ఉన్న అతన్ని బలంగా పక్కకు తోసి మెయిన్ గేటు వైపు పరిగెత్తింది. క్షణంలో మెయిన్ రోడ్డు మీదుక వచ్చింది.
రాహుల్ తన వెనుక వస్తున్నాడో లేదో ఆమె గ్రహించలేదు. ఎలాగైన తన ప్రాణాలు కాపాడుకోవాలి ఆమె ప్రయత్నం. అందుకే తుపాకి నుంచి వెలువడిన బుల్లెట్ లా ముందుకు దూసుకుపోయింది. లేని శక్తిని కాళ్ళకు తెచ్చుకుని రేసు గుర్రంలా ముందుకు పరిగెత్తింది. పరుగెత్తటం అలవాటు లేకపోవటం వల్ల కాళ్ళు విపరీతంగా నొప్పి పుడుతున్నాయి. ఇంకా కొంచం సేపు ఇలాగే పరిగెత్తితే ఆమె తప్పకుండ ఆలసిపోతుంది.


అప్పుడు తప్పకుండ రాహుల్ చేతికి చిక్కుతుంది. ఆ తరువాత ఆమెను పాలాక్షుడు కూడా కాపాడలేడు. ఈ విధమైన ఆలోచనలతో మరికొంత దూరం పరిగెత్తింది. అప్పుటికే ఆమె బాగా డస్సిపోయింది. విపరీతంగా దాహం వేస్తుంది. బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉంది. కాని దాన్ని తీసి తాగే సమయం ఆమెకు లేదు. కొంచం వేగం తగ్గించి దాక్కోవటానికి ఏదైన స్దలం ఉందా లేదా చుట్టు చూసింది. ఎదురుగా అవతలవైపు మెయిన రోడ్డు మీద ఆమెకు విశాలమైన కంచె కనిపించింది. ఆ కంచె ఇనుపతీగలతో గట్టిగా నిర్మించబడిఉంది. మాములుగా అయితే ఆ కంచెకు కన్నం చెయ్యటం చాల కష్టం. కాని మిత్రవింద అదృష్టవంతురాలు. ఎవరో ఆ కంచెలో పెద్ద కన్నం చేశారు. ఒక మనిషి నునాయసంగా దూరే కంత చేశాడు. ఫెన్సింగ్ అవతలవైపు చిన్న గుహ ఉంది. అది సహజంగా ఏర్పడిన గుహ. మనుష్యులు నిర్మించింది కాదు.  ఆ గుహలో ఏముందో ఎవరికి తెలియదు. ఆ విషయం గురించి ఆమె ఆలోచించలేదు.

ఫెన్సింగ్ లో కంత చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి. ఇంకేం ఆలోచించలేదు. రోడ్డు క్రాస్ చేసి అవతలవైపుకు చేరుకుంది. ఫెన్సింగ్ లో ఉన్న కంతలోంచి దూరి గుహ దగ్గరకు చేరుకుంది. ఎందుకైన మంచిదని ఒకసారి అటుఇటు చూసింది. చుట్టుపక్కల ఎవరు కనిపించలేదు. భారంగా నిటుర్చి గుహలోకి వెళ్ళింది.

టైం ఎంతయిందో తెలియదు. కాని బయట మాత్రం విపరీతంగా వేడిగా ఉంది. సూర్యుడు తన ప్రతాపాన్ని పూర్తిగా చూపిస్తున్నాడు. ఎండ విపరీతంగా మండిపోతుంది. పైగా వేడిగాలులు కూడా వీస్తున్నాయి. గుహలోకి వచ్చిన మిత్రవింద నేలమీద కూర్చుంది. లోపల చాల చల్లగా ఏసీలో కూర్చున్నట్టుగా ఉంది. బ్యాగ్ తీసి నేలమీద పెట్టింది. దానిపక్కన తన సెల్ పెట్టింది.

ఆమెను తరుముకుంటు వచ్చిన రాహుల్ అప్రయత్నంగా ఫెన్సింగ్ దగ్గర ఆగిపోయాడు. అంతవరకు కోపంతో కుతకులాడిపోతున్న అతని మొహం ప్రస్నంగా మారింది. మిత్రవింద గుహలోకి వెళ్ళటం అతను చూశాడు. ఆమె తన చేతికి చిక్కలేదని అతను వర్రికాలేదు. పైపెచ్చు సంతోషించాడు. దానికి కారణం మిత్రవింద దాక్కున్న చోటు.

అది భారత భూభాగానికి చెందిన స్ధలం కాదు. పాకిస్ధాన్ కు చెందినది. అందుకే దాదాపు పాతికమైళ్ళు చుట్టు ఆ కంచెను ఏర్పాటుచేశారు. ఆ కంచెదాటి ఎవరు లోపలికి వెళ్ళటానికి వీలులేదు. ఒక వేళ వెళితే వాళ్ళు తిరిగిరారు. తిరిగివస్తే శవ రూపంలో వస్తారు. ఈ విషయం అక్కడ ఉన్న వాళ్ళందరికి తెలుసు. నిజానికి ఈ విషయం మిత్రవిందకు కూడా తెలుసు. కాని కంగారులో భయంలో ఆమె ఆ విషయం మరిచిపోయింది. పెనం మీద నుంచి తప్పించుకోవాలని నిప్పుల కుంపటిలోకి వెళ్ళింది. ఆ సంగతి ఆమెకు ఆ సమయంలో గుర్తుకురాలేదు.
అందుకే రాహుల్ లోపలికి వెళ్ళలేదు. కొన్ని క్షణాలపాటు బయట ఉండిపోయాడు. తరువాత ఏదో తట్టినట్టు తలపంకించి వెనక్కి తిరిగాడు. చేతిలో ఉన్న యాసిడ్ సీసాను రోడ్డు పక్కకు విసిరేశాడు. అది బళ్ళున పగిలి అందులో ఉన్న యాసిడ్ నేలపాలైంది.

తన కోసం రాహుల్ బయట కాచుకున్నాడని మిత్రవింద భావిస్తోంది. అందుకే ఆమె అక్కడ నుంచి కదలలేదు. ఈజిప్షియన్ మమ్మీలా కళ్ళు మూసుకుని కూర్చుంది. పరిగెత్తి పరిగెత్తి విపరీతంగా అలసిపోయిందామే. పైగా కాళ్ళు విపరీతంగా నొప్పిపుడుతున్నాయి. దాహంతో నాలిక పిడచకట్టుకుపోయింది. బ్యాగ్ లోంచి వాటర్ బాటిల్ తీసి నీళ్ళు గొంతులోకి పోసుకుంది. అప్పుడు కాని ఆమె ప్రాణం కుదుటపడలేదు.
నీళ్ళు తాగిన తరువాత బాటిల్ కు మూతపెట్టి తిరిగి బ్యాగ్ లో పెట్టేసింది. బ్యాగ్ పక్కన పెట్టుకుని భారంగా కళ్ళు మూసుకుంది. విపరీతంగా అలసిపోవటం వల్ల వెంటనే ఆమెకు నిద్రపట్టేసింది. క్షణంలో గాఢనిద్రలోకి జారుకుంది. ఎంతసేపు నిద్రపోయిందో ఆమెకు తెలియదు. తిరిగి కళ్ళు తెరిచేసరికి సాయంత్రం కావస్తోంది. సూర్యుడు తన డ్యూటి ముగించుకుని పశ్చిమాద్రి చాటుకు తప్పుకుంటున్నాడు. పొద్దున తిండి కోసం వెళ్ళిన పక్కులు తిరిగి తమ గూటికి చేరుకుంటున్నాయి.

మెల్లగా లేచింది మిత్రవింద. నేలమీద పెట్టిన బ్యాగ్ ను అందుకుని భూజం మీదకు వేసుకుంది. దాని పక్కన ఉన్న తన సెల్ ఫోన్ విషయం మరిచిపోయింది. నింపాదిగా నడుస్తూ గుహలోంచి బయటకు వచ్చింది. చుట్టుపక్కల ఎవరు కనిపించలేదు. అంతా నిశబ్ధంగా నిస్తేజంగా ఉంది. మెల్లగా నడుస్తూ కంత వైపు వెళ్ళబోయింది. అప్పుడే ఆమె ఊహించని సంఘటన జరిగింది.

“ఆగండి”అంటు గంభీరంగా వినిపించింది.ముందుకు వెళ్ళబోతున్న మిత్రవింద బ్రేక్ పడినట్టు చప్పున ఆగిపోయింది. ఆమె గుండెలు రాకేట్ వేగంతో కొట్టుకోసాగాయి. శరీరం చిగురుటాకులా కంపించింది. కట్రాయిలా బిగుసుకుపోయింది.

“దయచేసి వెనక్కి తిరగండి. నా వల్ల మీకు ఎలాంటి ప్రమాధం రాదు”అని వినిపించింది. ఈ సారి ఆ గొంతులో ఎక్కడలేని మృదుత్వం కనిపించింది.     గొంతులో కనిపించిన మార్పును వినగానే మిత్రవింద తేరుకుంది. మెల్లగా ధైర్యాన్ని కూడదీసుకుని వెనక్కి తిరిగింది.
ఆమెకు పదడుగుల దూరంలో ఒక పాకిస్ధాన్ మిలిట్రి అధికారి ఠీవిగా నిలబడిఉన్నాడు. అతను పూర్తిగా పాకిస్ధాన్ మిలిట్రి యూనిఫారమ్ వేసుకున్నాడు. పొడుగ్గా బలంగా హీమ్యాన్ లా ఉన్నాడు. మిలిట్రి హెయిర్ కటింగ్ బిస్మార్క్ మీసాలు.

అతన్ని చూడగానే అంతవరకు మిత్రవిందలో ఉన్న భయం పూర్తిగా పోయింది. దానికి కారణం అతని మెస్మరైజింగ్ పర్సనాలిటి కాదు. అతను కళ్ళు. ఆ కళ్ళు అచ్చంగా ఆవుకళ్ళలాగా ఉన్నాయి. వాటిలో కరుణ ప్రేమ అప్యాయత ొట్టోచ్చినట్టు కనిపిస్తున్నాయి. సృష్టిలో ఒక అవుకు మాత్రమే అలాంటి కళ్ళు ఉంటాయి. మనుష్యులకు అలాంటి కళ్ళు సాధారణంగా ఉండవు. ఒకవేళ ఉన్నా అవి ఆడవాళ్ళకు ఉంటాయి. కాని మగవాళ్ళకు ఉండటం చాల అరుదు. అందుకే మెస్మరైజ్ అయినట్టు ఆ కళ్ళవైపు చూస్తూ ఉండిపోయింది మిత్రవింద.

అతను ఆమె వాలకం పట్టించుకోకుండ తన దోరణిలో తాను సాగిపోయాడు.     “మీరు ఉదయం గుహలోకి వెళ్ళి దాక్కోవటం గమనించాను. మీ వెనుక మిమ్మల్ని తరుముకుంటు ఒక యువకుడు రావటం కూడా చూశాను. అతని చేతిలో ఒక సీసా ఉంది. అందులో ఏముందో నేను ఉహించుకోగలను. మీరు గహలోకి వెళ్ళిన తరువాత అతని అయిదునిమిషాలపాటు బయట ఉన్నాడు. తరువాత సీసాను పడేసి వెళ్ళిపోయాడు. అతనికి భయపడే మీరు గుహలోకి వెళ్ళారని నాకు అర్ధమైంది. అతను వెళ్ళిపోయిన మీకు తెలియదు. ఈ విషయం మీకు చెప్పాలని గుహ దగ్గరకు రాబోయాను. కాని ఇంతలోనే ఒక కాల్ వచ్చింది. మా సూపీరియర్ ఆఫీసర్ చేశాడు. ఆయన ఏదో అర్జంట్ పని చెప్పాడు. అందుకే హడావిడిగా వెళ్ళిపోయాను. కంగారులో ఈ విషయం మీకు చెప్పలేకపోయాను. తరువాత సాయంత్రం వరకు ఆ విషయం నాకు గుర్తురాలేదు. ఇప్పుడే తిరిగి వచ్చాను.

మీరు అప్పుడే గుహలోంచి బయటకు వస్తున్నారు. నేను చేసిన పొరపాటు ఏమిటో నాకు తెలిసివచ్చింది. ఆ విషయం మీకు వెంటనే చెప్పిఉండే బాగుండేది. మీరు హాయిగా ఇంటికి వెళ్ళిపోయేవారు. కాని చెప్పలేకపోయాను. మీకు కూడా అతను వెళ్ళిపోయిన విషయం తెలియదు. అందుకే భయంతో ఇంత వరకు ఉన్నారు. ఇదంతా నా తప్పే. అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను మన్నించండి”అన్నాడు అపాలజటిక్ గా అతను.

అతని మాటలతో మిత్రవింద భయం పూర్తిగా పోయింది.“ఇందులో మీ తప్పు ఏం లేదు. తప్పంతా నాదే. ఇది పాకిస్ధాన్ భూభాగం అని తెలిసికూడా వచ్చి దాక్కున్నాను. మీరే నన్ను క్షమించాలి. నా పేరు మిత్రవింద. ఇప్పుడే డిగ్రీ పూర్తిచేశాను”అంది తనని తాను పరిచయం చేసుకుంటు మిత్రవింద. “నా పేరు జహీర్ అబ్బాస్. మిలిట్రి కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ లో క్యాప్టన్ ను”అన్నాడు అతను.
“ద్యాంక్యు క్యాప్టన్. ఇక నేను బయలుదేరుతాను. ఇప్పుటికే ఆలస్యమైంది. మా ఇంట్లో వాళ్ళు కంగారుపడుతుంటారు”అంటు బయలుదేరబోయింది మిత్రవింద.

“ఆగండి నేను వచ్చి మిమ్మల్ని కంచె దాటిస్తాను”అంటు ఆమె దగ్గరకు వచ్చాడు అబ్బాస్. ఇద్దరు పక్కపక్కన నడుస్తూ కంచె దగ్గరకు చేరుకున్నాడు. మిత్రవింద మెల్లగా కంతలోంచి దూరి అవతలకు చేరుకుంది.

“వెళ్ళేముందు ఒక చిన్న సలహ”అన్నాడు అబ్బాస్ నవ్వుతూ.

“ఏమిటి?

“ఏ పరిస్ధితిలోను మళ్ళి ఇటువైపు రాకండి. మీ అదృష్టంబాగుండి ఈ రోజు సెక్యురిటి గార్డ్స్ లేరు. ఇంకో పనిమీద వెళ్ళారు. కనుక మీరు క్షేమంగా బయటపడ్డారు. ఇంకోసారి మాత్రం ఇలాంటి సాహసం చెయ్యకండి”అన్నాడు మెల్లగా అబ్బాస్.     కాని గొంతులో చిన్న హెచ్చరిక అస్పష్టంగా కనిపించింది మిత్రవిందకు. అలాగే అని తలూపి ముందుకు సాగిపోయింది. అప్పుటికే బాగా చీకటిపడిపోయింది. రోడ్డుమీద పెద్దగా జనసంచారం లేదు. ఆటోకోసం ముందుకునడుస్తూ అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూసింది. అబ్బాస్ ఇంకా అక్కడే నిలబడిఉన్నాడు. ఆమె తన వైపు తిరగగానే చెయ్యిఊపాడు. మిత్రవింద కూడా చెయ్యిఊపింది. అది చూసి అబ్బాస్ లోపలికి వెళ్ళిపోయాడు.అది చూసి నవ్వుకుంది మిత్రవింద. కొంచం దూరం వెళ్ళిన తరువాత ఆమెకు ఖాళీ ఆటో ఒకటి కనిపించింది. అందులోకి ఎక్కి తన అడ్రస్సు చెప్పింది. ఆటో వేగంగా గమ్యస్ధానం వైపు దూసుకుపోయింది. అరగంట తరువాత ఆటో ఆమె ఇంటి ముందు ఆగింది. ఆటో ఫేర్ చెల్లించి లోపలికి వెళ్ళింది. గుమ్మం దగ్గర ఆమె తండ్రి చక్రపాణి తల్లి విశాలాక్షి విచారంగా కూర్చున్నారు. వాళ్ళ మొహంలో కళ పూర్తిగా ఇంకిపోయింది. ఒక మద్యతరగతి అమ్మాయి సమయానికి రాకపోతే ఆ ఇంటిల్లిపాదికి మనస్సుకు శాంతి ఉండదు. ఆందోళనతో తల్లిడిల్లిపోతారు. మిత్ర వింద తల్లి పరిస్ధితి కూడా ఇంచుకుమించు అలాగే ఉంది.

అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు భయంతో గిజగిజలాడిపోయారు. చక్రపాణి ఈ రోజు ఆఫీసుకు వెళ్ళలేదు. వాళ్ళ భయానికి బ్రేకు వేస్తూ గేటు చప్పుడు వినిపించింది. ఇద్దరు ఆత్రంగా చూశారు. లోపలికి వస్తున్న కూతురిని చూడగానే వాళ్ళ మొహాలు మళ్ళి వికసించాయి.
“ఏమిటమ్మా ఇంత ఆలస్యం అయింది”అడిగాడు తండ్రి. అసలు విషయం చెప్పటం తెలిస్తే తల్లి తండ్రి ఇద్దరు తల్లిడిల్లిపోతారు. రేపటినుంచి ఆమెను బయటకు వెళ్ళనివ్వరు. ఇంటికే పరిమితం చేస్తారు. అందుకే మిత్రవింద అసలు విషయం చెప్పకుండ చిన్న అబద్దం ఆడింది.
“నేను ఇంటికి తిరిగివస్తుంటే అనుకోకుండ కళ్ళు తిరిగాయి. తలనొప్పి విపరీతంగా వచ్చింది. ఒక్క అడుగుకూడా ముందుకు
వెయ్యలేకపోయాను.

అందుకే లలిత ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాను. లలిత తల్లి నాకు కాఫీ ఇచ్చి పడుకోబెట్టింది. కళ్ళు మూసుకున్న వెంటనే గాఢనిద్రలోకి జారుకున్నాను. తిరిగి మేలుకువ వచ్చేసరికి ఈ వేళ ఆయింది. మీరు నా గురించి కంగారుపడుతుంటారని గుర్తుకువచ్చింది. వెంటనే ఆటో పట్టుకుని వచ్చేశాను”,    “ఇప్పుడు ఎలా ఉంది? అంతవరకు మౌనంగాఉన్న విశాలాక్షి అడిగింది.

“ఇప్పుడు ఫర్వాలేదమ్మా కంగారులో అసలు విషయం చెప్పటం మరిచిపోయాను. నేను ఫస్ట్ క్లాసులో పాసయ్యాను”అంది మిత్రవింద.
“కంగాట్స్. తల్లి ఈ విషయం నాకు ముందే తెలుసమ్మా”అన్నాడు చక్రపాణి ఆప్యాయంగా.

తరువాత కొంచం సేపు తల్లితండ్రితో మాట్లాడి తన గదిలోకి వెళ్ళింది మిత్రవింద. మంచంమీద ఆమె చెల్లెలు వసంతసేన పడుకుని ఉంది. ఆమె చేతిలో ఏదో తెలుగు నవల ఉంది.

“అక్కా అబద్దాలు చెప్పటం ఎప్పటినుంచి నేర్చుకున్నావు”అంది పుస్తకం మూస్తూ వసంతసేన.“నేను అబద్దాలు చెప్పటం ఏమిటి? మొహం చిట్లిస్తూ అడిగింది మిత్రవింద.“నువ్వు లలిత ఇంటికి వెళ్ళలేదు. ఆ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను”అంది వసంతసేన పెద్ద డిటెక్టివ్ లా ఫోజుపెట్టి.“అన్ని తెలిసినట్టు మాట్లాడకు. నేను లలిత ఇంటినుంచే వస్తున్నాను”అంది చిరాకుగా మిత్రవింద.

“నువ్వు లలిత ఇంటికి వెళ్ళలేదని నేను నిరూపించగలను. ఉదయం నువ్వు కాలేజికి వెళ్ళిన తరువాత లలిత నాకు కాల్ చేసింది. అప్పుడు టైం పన్నెండుగంటలు కావస్తోంది. నీ గురించి అడిగింది. ఇంకా కాలేజినుంచి రాలేదని చెప్పాను. మళ్ళి ఒక గంట తరువాత కాల్ చేసింది. ఇంకా రాలేదని చెప్పాను. అలా నాలుగుసార్లు చేసింది. చేసిన ప్రతిసారి నీ గురించి అడిగింది. నువ్వు నిజంగా లలిత ఇంట్లో ఉంటే తను నాకు ఎందుకు కాల్ చేస్తుంది. నీ గురించిఎందుకు అడుగుతుంది. అంటే నువ్వు లలిత ఇంటికి వెళ్ళలేదని తెలుస్తోంది. నువ్వు ఎక్కడికైన వెళ్ళు నాకేం అభ్యంతరం లేదు. కాని అమ్మ నాన్నకు మాత్రం నువ్వు అబద్దం చెప్పావు. అసలు నిజం వాళ్ళకు తెలిస్తే చాల బాధపడతారు. అందుకే ఈ విషయం నాలోనే ఉండిపోవాలంటే నువ్వు నాకో సహయం చెయ్యాలి”అంది వసంతసేన.

“ఏం చెయ్యాలి? మెల్లగా అడిగింది మిత్రవింద.

“నాకు అయిదువందలు ఇవ్వాలి. రేపు మా స్నేహితులతో సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నాను. తప్పకుండ వెళ్ళి తీరాలి. కాని చేతిలో ఒక్క రుపాయి కూడా లేదు. అందుకే నువ్వు సర్దాలి.”

“అంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నావన్న మాట.

“నువ్వు ఏమైన అనుకో. నాకేం అభ్యంతరం లేదు. కాని డబ్బు మాత్రం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి.

“నాన్నగారు ఇచ్చిన పాకెట్ మని ఏం చేశావు”కోపంగా అడిగింది మిత్రవింద.

“అది మొదటి వారంలోనే అయిపోయింది. ఆ వివరాలు నీకెందుకు. డబ్బు ఇస్తావో లేదో చెప్పు ముందు”అంది వసంతసేన.
“ఇవ్వక చస్తానా ఇదిగో అయిదువందలు మళ్ళి నన్ను అడగకు. నేను ఇవ్వలేను. ప్రతి సారి నువ్వు అడిగినప్పుడల్లా ఇవ్వటానికి నేను బాంకర్ ను కాదు”అంది మిత్రవింద.

వసంతసేన ఆ మాటలు పట్టించుకోలేదు. డబ్బు తీసుకుని గదిలోంచి వెళ్ళిపోయింది. బ్యాగ్ ను టేబుల్ మీద పెట్టి అలసటతో మంచంమీద వాలిపోయింది. జరగిన దంతా సినిమా రీలులా ఆమె కళ్ళముందు కనిపించింది. జరిగింది తలుచుకుంటే ఇప్పటికి ఆ1మె రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఆ రోజు మాములుగా కాలేజికి బయలుదేరింది మిత్రవింద. ఫలితాలు తెలుసుకుని సంతోషంతో ఇంటికి బయలుదేరుతుంటే ఆకస్మాతుగా ఆమెకు ఎదురువచ్చాడు రాహుల్. అతను మిత్రవింద క్లాస్ మెట్. చాల అందంగా స్మార్టుగా ఉంటాడు. తల్లితండ్రికి ఒక్కడే కొడుకు. తల్లి చిన్నప్పుడే పోయింది. అప్పటినుంచి తండ్రి తనే అన్ని అయి రాహుల్ ను పెంచి పెద్ద చేశాడు. ఒక్కగానొక్క కొడుకు కనుక మితిమీరిన గారాబం చేశాడు. దాంతో రాహుల్ కు చదువు పెద్దగా అబ్బలేదు. అతికష్టంమీద బండిని డిగ్రివరకు లాక్కు వచ్చాడు. చదువు అబ్బలేదు కాని మిగత అవలక్షణాలు అతనికి బాగా వచ్చాయి. అందమైన అమ్మాయిలను చూస్తే విడిచిపెట్టడు. వాళ్ళను ఏదో విధంగా లొంగదీసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ముందు డబ్బు ఆశ చూపిస్తాడు. లొంగితే సరి. లొంగకపోతే భయపెడ్తాడు. తన దగ్గరఉన్న రౌడిలతో ఇంటిమీద దాడిచేయిస్తాడు. అప్పటికి లొంగకపోతే కిడ్నాప్ చేసి రేప్ చేస్తాడు. అతని కామదాహానికి చాల మంది అమ్మాయిలు బలిఅయ్యారు. కాని ఒక్కరు కూడా పోలీసులకు కంప్లయింట్ చెయ్యలేదు. దానికి కారణం రాహుల్ తండ్రికి ఉన్న రాజకీయపరపతి డబ్బు బలం. అధికారపార్టితో రాహుల్ తండ్రికి సత్ సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా సెంట్రల్ లేబర్ మినిస్టర్ తో అయనకు మంచి స్నేహం ఉంది. నెలకు రెండుమూడుసార్లు ఆ సదరు మంత్రి రాహుల్ తండ్రి దగ్గరకు వస్తాడు. ఇద్దరు రాహుల్ తండ్రి ఫారమ్ హౌజ్ లో ఎంజాయ్ చేస్తారు. ఈ విషయం మాములు ప్రజలతో పాటు పోలీస్ డిపార్ట్ మెంట్ కు కూడా బాగా తెలుసు. అందుకే వాళ్ళు రాహుల్ మీద ఎవరు కంప్లయింట్ ఇచ్చిన పట్టించుకోరు. 

దాంతో రాహుల్ ఆగడాలకు అంతులేకుండ పోయింది. అప్పుడే రాహుల్ దృష్టి మిత్రవింద పడి పడింది. ఆమె అందం ఒంపు సొంపులు అతన్ని విపరీతంగా ఆకర్షించాయి. అయితే ఆశ్చర్యం ఏమిటంటే రాహుల్ ఆమెను కామించలేదు. నిజంగానే ప్రేమించాడు. పెళ్ళిచేసుకోవాలని భావించాడు. ఆ ఉద్దేశంతోనే ఆమెతో తన ప్రేమ విషయం చెప్పుకున్నాడు.కాని మిత్రవింద ఒప్పుకోలేదు. తనకు ప్రేమ లాంటి వాటిమీద నమ్మకం లేదని ఖచ్చితంగా చెప్పేసింది. అంతేకాదు తన తండ్రికి కొడుకులు ఎవరు లేరని ఆయన తరువాత కుటుంబాన్ని తనే ఆదుకోవాలని చెప్పింది. అందుకే తనని మరిచిపోమని సున్నితంగా చెప్పింది.

కాని ప్రేమ పోరలు కమ్ముకున్న రాజేష్ కు ఆ మాటలు వినిపించలేదు. ఎలాగైన ఆమెను పెళ్ళిచేసుకోవాలని తీర్మానించుకున్నాడు. అందుకే ప్రేమ లేఖలు రాయసాగాడు. కాని మిత్రవింద మాత్రం కొంచం కూడా స్పందించలేదు. ఆ ప్రేమలేఖలు చదవకుండానే చింపి అవతలపారేసింది. ఆయిన రాహుల్ పట్టువిడువలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా ఉత్తరాలు రాస్తునే ఉన్నాడు. మిత్రవింద వాటిని చింపేస్తునే ఉంది.
ఈ తతంగం డిగ్రి మూడో సంవత్సరం వరకు సాగింది. అయిన రాహుల్ తన ప్రయత్నం మానలేదు. అతను ఒకసారి పెద్ద ప్రేమలేఖ రాశాడు. అందులో తను మిత్రవిందను ఎంతగా ప్రేమిస్తుంది వివరంగా రాశాడు. తను ఆమెను పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నానని రాశాడు. అంతేకాదు పెళ్ళయిన తరువాత ఆమె పై చదువులకు కూడా సహకరిస్తానని రాశాడు. “

ఆ ఉత్తరం తీసుకుని మిత్రవింద ప్రిన్స్ పాల్ దగ్గరికి వెళ్ళి చూపించింది. ఆయన రాహుల్ ను పిలిచి గట్టిగా చీవాట్లు పెట్టాడు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేస్తే కాలేజినుంచి పంపించేస్తానని హెచ్చరించాడు. అందరిముందు మిత్రవింద అలా చెయ్యటం అతను సహించలేకపోయాడు. అవమానంతో రగిలిపోయాడు. ఎలాగైన మిత్రవిందకు తగిన బుద్ధి చెప్పాలని భావించాడు. ఆ సమయం కోసం కాచుకున్నాడు. ఆ సమయం రానే వచ్చింది.

డిగ్రి ఫలితాలు తెలుసుకోవటానికి మిత్రవింద తప్పకుండ కాలేజికి వస్తుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కెమికల్ కంపెనికి వెళ్ళి యాసిడ్ సీసా కొన్నాడు. అది తీసుకుని నిన్న కాలేజికి చేరుకున్నాడు. తనకు దక్కని అందం ఇంకేవరికి దక్కకూడదని అతని ప్రయత్నం. మిత్రవింద మొహంమీద యాసిడ్ పోసి ఆమె రూపాన్ని విక్కతంగా చెయ్యాలని భావించాడు. అందుకే సమయం కోసం కాచుకున్నాడు. ఫలితాలు చూసుకుని మిత్రవింద ఒంటరిగా రావటం చూశాడు. ఆమె మీద యాసిడ్ పొయ్యాటానికి సిద్దపడ్డాడు.

కాని అదృష్టవశాత్తు  ఈ విషయం ముందే మిత్రవింద గమనించింది. ఎదురుగా ఉన్న రాహుల్ ను తోసి మెయిన్ రోడ్డు మీదకు పరిగెత్తింది. పాకిస్దాన్ భూభాగంలోకి ప్రవేశించి తన ప్రాణాలను కాపాడుకుంది. మనుష్యులందరు చెడ్డవాళ్ళు కారు. భారత్ దేశంలో మంచివాళ్ళు ఉన్నట్టుగానే తన శతృవు దేశమైన పాకిస్ధాన్ లో కూడా మంచివాళ్ళు ఉన్నారని జహీర్ అబ్బాస్ నిరూపించాడు. అతను మంచివాడు సంస్కారం ఉన్నవాడు. అందుకే మిత్రవిందను జాగ్రర్తగా కంచె దాటించి కాపాడాడు. ఆ సంఘటన జహీర్ అబ్బాస్ గుర్తుపెట్టుకున్నాడో లేదో తెలియదు. కాని మిత్రవింద మాత్రం ఆ సంఘటన మరిచిపోలేకపోయింది. ముఖ్యంగా జహీర్ అబ్బాస్ ను మరిచిపోలేకపోయింది. 

మిత్రవింద  ముంచుకొచ్చే ప్రమాదం నుండి బయపడింది కాని.. మున్ముందుకు తను ఎన్ని ప్రమాదాలను తప్పించుకోవాలో తెలియాలంటే..వచ్చే శుక్రవారం దాకా ఎదురు చూడాల్సిందే... 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani