Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
atmasamtrupti

ఈ సంచికలో >> కథలు >> అనురాగ బంధం

anurgabhandham

" లల్లీ ,తొందరగా రా! టిఫిన్ చల్లారిపోతుంది." వసుంధర పిలుస్తోంది.

"వస్తున్నా వదినా ! అయిపోయింది." డ్రెస్సింగ్ రూమ్ నుంచి లలిత సమాధానం చెబుతోంది  డైనింగ్ టేబిల్ వద్ద దినపత్రిక చదువుతున్న సుందరం, వదిన ఆడపడుచుల ఆత్మీయ సంభాషణ వింటూ వారి అన్యోనత, ఆప్యాయతలకు ఆనందభరితుడై గతం జ్ఞాపకం తెచ్చుకున్నాడు. తన పెళ్లయిన కొత్తలో  కోడలిగా వసుంధర కాపురానికి రావడం, తీర్థయాత్రలకని వెళ్లిన అమ్మానాన్నలు తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న ట్రైన్ యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోడం జరిగింది.లల్లీకి అన్నీ తానై కన్నతల్లి కన్నా ఎక్కువగా కంటికి రెప్పలా కాపాడి
పెంచింది. లల్లీకి కొంచం జ్వరం వచ్చినా గట్టిగా తుమ్మి దగ్గినా కంగారు పడిపోయేది.తినేటప్పుడు మారాం చేస్తే, ఏది కావాలంటే అది అప్పటికప్పుడు చేసి పెట్టేది. ఏదైనా కారణం వల్ల స్కూల్ నుంచి రావడం ఆలశ్యమైతే తల్లడిల్లి పోయేది. మైన్ గేటు వద్ద నిలబడి పాప రాకకోసం ఎదురు చూస్తుంది. పుట్టిన రోజు, పండగలు వస్తే ఇల్లంతా సందడే సందడి.

వసుంధర కాపురాని కొచ్చినప్పుడు లల్లీ వయసు పది సంవత్సరాలు.లల్లీకి ముందు ఒక ఆడపిల్ల పుట్టి జబ్బుచేసి చనిపోవడంతో అమ్మ లల్లీని ఎంతో ముద్దు గా చూసుకునేది. లల్లీకి ఆలోటు వసుంధర తీర్చింది. లల్లీ అసలు పేరు లలితా మహేశ్వరి. అమ్మ పేరు పెట్టేరు. తెల్లగా
బొద్దుగా కనబడుతుంది. అమ్మానాన్నలు చనిపోయారన్న విషయాన్ని జ్ఞాపకం రాకుండా పెంచింది వసుంధర. మాకు పిల్లలు లేక పోవడం
కూడా కారణం కావచ్చు. నేను ప్రైవేటు కంపెనీలో చార్టెడ్ ఎకౌంటెంటుగా ఉధ్యోగంలో స్థిరపడ్డాను. ఇప్పుడు లల్లీ మా ఇంటి వెలుగు. రాత్రప్పుడూ శలవులప్పుడూ ఇంట్లో కబుర్లూ నవ్వులతో సందడిగా ఉంటుంది. లల్లీ కాలేజీ చదువుకొచ్చింది. వసుంధర దాని చదువుకి ఇబ్బందవుతుందని పండగలకు పుట్టింటి కెళ్లకుండా ఊరి నుంచి అత్తయ్య మామయ్యల్ని ఇక్కడికే రప్పించేది.

కాలేజీ డ్రెస్సు సరి చేసుకుంటూ, పుస్తకాల బేగ్ భూజానికి తగిలించుకుని " నేను రెడీ, వదినా !" అంటూ లలిత డైనింగ్ టేబిల్ అన్నయ్య
పక్క కుర్చీలో కూర్చుంది.సుందరం ఆలోచనల్లోంచి తేరుకుని చేతిలో న్యూస్ పేపరు టేబుల్మీద పెట్టాడు. వసుంధర వేడిగా దోసలు , కొబ్బరి చెట్నీ ప్లేట్లలో ఉంచి వారి ముందుపెట్టింది.

" లల్లీ, మెల్లగా తిను. అన్నయ్య ఉంటారులే.తొందర పడకు." అని వేడిగా బూస్టు కలిపి తెచ్చింది  " రోడ్డు మీద వెహికిల్ నడిపేటప్పుడు స్పీడ్ బ్రేకర్లూ, గోతులు చూసి డ్రైవ్ చెయ్యండి. వెనక ఆడపిల్ల కూర్చుందని జ్ఞాపకం పెట్టుకోండి " భార్య మాటలు విని అతి ప్రేమకు హెచ్చరికని తనలో తనే నవ్వు కున్నాడు సుందరం.

అన్నా చెల్లెల్నీ  గేటు వరకు  దిగబెట్టి కనుచూపు వరకూ సాగనంపి లోపలి కొచ్చింది వసుంధర.

***

" లల్లీని మెడిసిన్ చదివిద్దామండీ ! " వసుంధర మాట విన్నసుందరం " ఈ రోజుల్లో మెడిసిన్ చదివించడమంటే మాటలా! డబ్బు
లక్షల్లో వ్యవహారం , సీటు రావాలంటే లంచం లేదా రికమండేషన్  కావాలి. మనలాంటి వాళ్లకు సీటు సంపాదించడం కష్టం " సర్ది చెప్ప
బోయాడు సుందరం.

" లల్లీని తెల్లకోటు, మెడలో స్తెతస్కోపుతో డాక్టరుగా చూడాలని నా కోరిక. పెళ్లిలో మా పుట్టింటి వారు కట్నంగా ఇచ్చిన కొబ్బరితోట, మాగాణి భూమి అమ్మైనా సరే లల్లీని డాక్టరు కోర్సు చదివిద్దాం.అమ్మా నాన్నలకు నేనొక్క దాన్నే కాబట్టి నేను ఏదడిగినా కాదనరు." పట్టుదలగా చెప్పింది. వసుంధర ఏదైనా ఒక సంకల్పం చేసిందంటే అది నెరవేరే వరకు వెనక్కి తగ్గదని సుందరానికి తెలుసు.

***

లాంగ్ టర్మ్ కోచింగులకు వెళ్లి మెడికల్ ప్రవేశ పరిక్షల్లో లలితకి ఎంత కష్టపడి చదివినా మెరిట్ లిస్టులో సీటు రాలేదని నిరాశ పడలేదు
వసుంధర.మరింత పట్టుదలగా స్పెషల్ కోచింగ్ క్లాసులకు పంపి తను డిగ్రీలో సైన్సు స్టూడెంట్  కాబట్టి లలితకి గైడెన్సు ఇస్తూ రాత్రి, , తెల్లవారుజామున మేలుకుని చదివించి రెండవసారి మెడికల్ ఎంట్రెన్సు ఎగ్జామ్ రాయిస్తే మెరిట్ లిస్టులో మెడిసిన్ సీటు వచ్చింది.       పుట్టింటి వారిచ్చిన కొబ్బరి తోట అమ్మించి వచ్చిన డబ్బుతో మెడికల్ కాలేజీ ఫీజులు,బుక్స్, డ్రెస్సులో ఏర్పాటు చేసింది.

మెడికల్ కాలేజీ ఫస్టు టర్మ్ లో సీనియర్స్ ర్యాగింగ్ చేసారని మూడీగా ఉన్న లల్లీని చూసి తల్లడిల్లిన వసుంధర రెచ్చిపోయింది.
మెడికల్ కాలేజీకెళ్లి ప్రిన్సిపాల్ కి రిపోర్టు చేసి ర్యాగింగ్ చేసిన వారిని సస్పెండ్ చేయిస్తానని బయలుదేరిన భార్యను శాతింప చేసి, ఈ రోజుల్లో
ఇదంతా సహజమనీ, విధ్యార్దుల మధ్య సిగ్గు బిడియం పోగొట్టి ఒకరి కొకరి మధ్య అవగాహన కోసం జరుగుతూంటాయి. రేపు జూనియర్సే
సీనియర్స్ అవుతారని నచ్చచెప్పి ఆపాడు సుందరం. లలిత రెగ్యులర్ గా మెడికల్ కాలేజీకి హాజరవుతూ మెడిసిన్ కోర్సు పూరి చేసింది. అవకాశం కలిగినప్పుడు గ్రామాల కెళ్లి మెడికల్ కేంప్ లకి ఎటెండు అవుతోంది.

ఈ మధ్య కాలంలో వసుంధర ఆరోగ్యంలో మార్పులు చేసుకుంటున్నాయి. లలిత మెడిసిన్ చదువు విషయంలో ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచిస్తోంది. లల్లీ కోర్సు పూర్తి చేసి డాక్టరుగా చూడాలన్న కోరిక బలపడిండి. పూజలు , ఉపవాసాలు ఎక్కువై ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు.అప్పుడప్పుడు తల తిరగడం, నీర్సం అనిపించినా, భర్తకి లల్లీకీ తెలిస్తే కంగారు పడతారని అలాగే లల్లీ చదువు మీద ప్రభావం చూపి ఏకాగ్రత దెబ్బ తింటుందనీ బయటకు చెప్పేది కాదు. అంతర్గతంగా భాధలు ఎక్కువైనా ఎవరిముందు అనేది కాదు.        లలిత  మెడిసిన్ ఫైనల్ ఇయర్ పూర్తయి హౌస్ సర్జన్ చేస్తోంది.కాలేజీలో ఉన్నా , బయట ఉన్నా ఏదో సమయంలో వదినతో ఫోన్లో
మాట్లాడ వల్సిందే. లేకపోతే ఇంటికి వచ్చినప్పుడు గుమ్మం దగ్గరే క్లాసు పీకుతుంది.

ఇలా ఉండగా ఒకరోజు అనుకోని ఘటన జరిగింది.ఎప్పటిలా లలిత వదినకి ఫోన్ చేస్తే రింగయింది కానీ జవాబు లేదు.
తన ఫోను కోసం ఎదురు చూసే వదిన ఎందుకు ఫోను ఎత్తలేదని ఆలోచిస్తూ కాసేపు ఆగి మళ్లీ ఫోన్ చేసింది. ఫోన్ రింగవుతోంది కానీ ఎవరు ఎత్తడం లేదని గాబరా పడిన లలిత విషయం అన్నయ్యకి ఫోన్ ద్వారా తెలియ చేసింది. సుందరం ఇంటికి ఫోన్ చేస్తే వసుంధర ఎత్తలేదు. పక్కింటి వారికి ఫొన్ చేసినా జవాబు లేదు. ఆందోళనగా ఇంటికి వచ్చిన సుందరం డోర్ కాలింగ్ బెల్ నొక్కినా ఎవరు వచ్చి తలుపు తెరవలేదు. పేరు పెట్టి పిలిచినా జవాబు లేదు.సుందరంలో గాబరా మొదలయింది. భయాందోళనలతో పక్కింటి కెళ్లిన సుందరానికి తలుపుకి తాళంకప్ప  వేసి ఉంది. పెరట్లో కెళ్లి చూస్తే పనిమనిషి గిన్నెలు కడిగి,బట్టలు ఉతికి తాడుమీద  ఆరేసి వెళ్లినట్టుంది. పెరటి తలుపు దగ్గరగా వేసి ఉంది. సుందరం లోపలి కెళ్లి పేరు పెట్టి పిలిచినా ఎవరు పలక లేదు. పక్క నున్న కిచెన్లోకి తొంగి చూస్తే వసుంధర రక్తపు మడుగులో పడి ఉంది. ఆ దృశ్యం చూసిన సుందరానికి కాళ్లూ చేతులూ ఆడలేదు. వెంటనే తేరుకుని వంట గదిలో స్ప్రుహ తప్పి పడున్న  భార్యని
రెండు చేతులతో ఎత్తుకుని హాల్లోని సోఫాలో పడుకోబెట్టి , చెల్లి లలితకి ఫోన్ చేసి పరిస్థితి చెప్పి వెంటనే అంబులెన్సు తీసుకురమ్మని గద్గద
స్వరంతో చెప్పేడు.అంబులెన్సుతో వచ్చిన లలిత ఏడుపు స్వరంతో, మెడికల్ ఎస్కార్టు సహాయంతో స్ప్రుహ తప్పి పడి ఉన్న వదినను హాస్పిటల్ ఐ సీయు లో అడ్మిట్ చేయించి, ఛీఫ్ న్యూరో సర్జన్ తో సంప్రదించి డాక్టర్లతో ట్రీట్ మెంటు ప్రారంభించింది.స్కానింగు రిపోర్టులో బ్రైన్ ట్యూమర్  కారణంగా తల విసిరి కిచెన్ గట్టు మీద పడి తలకి గట్టి దెబ్బ తగిలి స్ప్రుహ తప్పినట్టు నిర్దారణ జరిగింది.

వెంటనే ఎమర్జెంన్సీ న్యూరో సర్జరీ చేసి బ్రైయిన్ లో ఉన్న ట్యూమర్ తొలగించి , ఐ సి యు లో ఉంచిన నలబై ఎనిమిది గంటల తర్వాత
వసుంధర కోలుకోసాగింది. అత్యవసర మందులు, నర్సింగ్ కేర్ ప్రభావంతో వసుంధర స్ప్రుహ లో కొచ్చి కళ్లు తెరవగలిగింది. తిండి, నిద్ర లేకుండా వదినను కనిపెట్టుకు బెడ్ పక్కన కూర్చున్న డాక్టరు లలిత ఆనందానికి అవధులు లేక పోయాయి.

డాక్టరుగా తెల్లకోటు, మెడలో స్తెతస్కోపుతో లల్లీని చూసిన వసుంధర కళ్లు మెరిసి  ఆనందభాష్పాలు రాల్చాయి.  తన మనసులోని కోరిక తీరి లల్లీ డాక్టరయింది. ఆ ఆనందంలో మనసు  కుదుకపడి త్వరగా కోలుకుంది.అందుకే అంటారు పెద్దలు , సంతోషం సగం బలమని.తన కోసం  జీవితాన్నీ, డబ్బుని ధారపోసి రాత్రింపవళ్లు కష్టపడి తనని డాక్టరు చేయించిన  వదినకి మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంది.తల్లి లాంటి వదినను ప్రాణాపాయం నుంచి కాపాడిన భగవంతుడికి నమస్కారాలు అందచేసింది లలిత.

తాత గారి ఊళ్లో పేద ప్రజల కోసం " వసుంధర నర్సింగ్ హోమ్" నెలకొల్పిపేదల సేవలో, పేదలకు ఉచిత మందులు, వైద్య సేవలు
అందిస్తూ చుట్టు పక్కల గ్రామాల్లో పేరు తెచ్చుకుంది లల్లీ ఉరఫ్ డాక్టర్ లలిత మహేశ్వరి.

మరిన్ని కథలు