Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
poems

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాప భావాలు! - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

’ఒక యోగి ఆత్మ కథ’

పుస్తకాల పిచ్చి ఉండడం చేత ఒకసారి బేగంపేటలోని ఒక పుస్తకాల షాపుకెళ్లాను.

అక్కడ అప్పుడే వచ్చిన పరమహంస యోగానంద రాసిన ’ఒక యోగి ఆత్మ కథ’ పుస్తకాల కట్టలు చూశాను.

రెండు మూడు సార్లు చేతిలోకి తీసుకున్నాను. మళ్లీ పెట్టేశాను. ‘యోగుల కథల్లో ఏముంటుంది? వాళ్లూ మనలాగానే తమ గొప్పతనం, మహత్మ్యాలు చాటుకోవడం తప్ప..’ అన్న భావన నాది.

రేటు చూశాను. మనం తేలిగ్గా వెచ్చించగలిగేదే. అంత ‘లావు’ పుస్తకానికి, ఇంత సన్నటి రేటా? అన్న ఆశ్చర్యం నాది. పైగా ఎన్నో భాషల్లోకి అనువదించబడిందంట.

‘సర్లే కొంటే పోలా..బాగుంటే చదవచ్చు, లేదంటే దాంతో పుస్తకాలర్యాకుని అలంకరించొచ్చు’ అనుకుని మొత్తానికి కొనేశాను.

ఇంటికొచ్చి అన్యమనస్కంగా పేజీలు తిరగేశాను. పుస్తకం పూర్తయ్యేదాకా వదిలితే ఒట్టు.

ఆధ్యాత్మకతను ఎంత చక్కగా..విపులంగా..తెలియజేశారో. ముఖ్యంగా సైంటిఫిక్ గా వివరించిన తీరు హృద్యం. చదువుతూ పోతుంటే రాజకీయ నాయకులు, మానవతామూర్తులు, రవీంద్రనాథ్ ఠాగూర్, సైంటిస్ట్ సర్ జగదీశ్ చంద్రబోస్ లాంటి వ్యక్తులు తారసపడతారు.

మహాభారతాన్ని, క్రైస్తవ తత్వాన్ని సమయోచితంగా చక్కగా మనసుకు పట్టే విధంగా తెలియజెప్పారు. 

మతాల సామరస్యానికి ఇందులో పెద్దపీట వేశారు. ఏ మతమైనా చెప్పేది, చెయ్యమనేదీ మంచేనని విపులీకరించిన తీరు ప్రశంసాత్మకం.

అనేక ప్రాంతాలకు చెందిన యోగులు వాళ్ల ప్రత్యేకతలు మనలను అబ్బుర పరుస్తాయి.

కొంతమంది యోగులు తమ నిరంతర సాధనతో, ధ్యాన శక్తితో ఎలాంటి అద్భుతాలు చేస్తారో చదువుతుంటే మనసు పులకరించి పోతుంది.

క్రియాయోగ శాస్త్ర సాధనకు సంబంధించిన విషయాలు వివరణాత్మకంగా ఉన్నాయి.

ఇంట్లో భగవద్గీత, రామాయణం, భాగవతం ఉండాలంటారు పెద్దలు. ఈ పుస్తకం వాటితో పాటు మన ఇంట్లో కొలువుతీరాల్సిన గ్రంథరాజం.

ఈ జీవితం బుద్బుదప్రాయం. దాన్ని ఉన్నంతల్లో సద్వినియోగం చేసుకోవాలనుకునే వాళ్లు తప్పక చదవాల్సిన ఉత్తమ పుస్తకమిది అనడం నిర్వివాదాంశం.

***

 

 

 

మరిన్ని శీర్షికలు
chamatkaaram