Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pratapabhavalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

ఒకానొకప్పుడు, అంటే  ఎప్పుడో కొన్ని యుగాల పూర్వం కూడా కాదు, ఇరవయ్యవ శతాబ్దంలోనే, ఒకరికొకరి సంబంధ బాంధవ్యాలు కొద్దిగా మెరుగ్గానే ఉండేవి. టెక్నాలజీ అంతగా అభివృధ్ధి చెందకపోయినా, అందుబాటులో ఉండే సదుపాయలతో, ఒకరి క్షేమ సమాచారాలు మరొకరికి తెలిసేవి.  దానికి ముఖ్య కారణం, మనుషుల మధ్య ఉండే అభిమానం. అవతలి వ్యక్తి ఓ బంధువవొచ్చు, స్నేహితుడవొచ్చు, దూరాలతో సంబంధం లేకుండా, ఇద్దరి మధ్యా రాకపోకలు కూడా ఉండేవి. అప్పటి వాతావరణం, ఈ తరంవారికి చిత్రంగా అనిపించొచ్చు.గుర్తుండే ఉంటుంది--  మొగపిల్లాడు పైచదువుకి పొరుగూరు వెళ్ళినా, ఆడపిల్ల పెళ్ళి చేసుకుని అత్తవారింటికి వెళ్ళినా, వారానికో, పదిహేనురోజులకో , రెండు వైపులనుండీ, ఓ పోస్ట్ కార్డో, ఇన్లాండ్ లెటరో రావాల్సిందే…  ఉత్తరం రాలేదంటే, ఇంటినుండి ఓ టెలిగ్రాం వచ్చేయడమో, లేదా పుట్టింటికి సంబంధించి ఈ పిల్లలుంటున్న ఊళ్ళో ఉండే బంధువో, స్నేహితుడో  వీరి క్షేమసమాచారం తెలుసుకుని, తెలియపరిచేవాడు. ఈ పైచదువులకి వెళ్ళిన పిల్లాడు, చదువులో బిజీ అయో, మిగిలిన వ్యాపకాలలో మునిగో, మరీ తండ్రి చెప్పినట్టుగా వారానికీ, పదిహేనురోజులకీ కాకపోయినా, కనీసం డబ్బు అవసరం వచ్చినప్పుడు మాత్రం, ఓ ఉత్తరం ముక్క రాసిపడేసేవాడు…అలాగే అత్తారింట్లో ఉండే ఆడపిల్ల,, పుట్టింటితో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించేది. అలాగని మరీ  పెద్దపెద్ద ఉత్తరాలు కాకపోయినా, కనీసం క్షేమసమాచారం తెలియపరిచేది. తండ్రి, కూతుళ్ళ ఉత్తరాలకి , ఓ గొప్ప ఉదాహరణ—మన దేశ మొదటి ప్రధాని నెహ్రూ, తను జైల్లో ఉన్నప్పుడు కూడా, కుమార్తె ఇందిరకు , ఉత్తరాల ద్వారా, ప్రపంచ చరిత్ర బోధించేవారు..

ఆ ఉత్తరాలే   Glimpses of World History  అనే పుస్తకంగా రూపొందింది.   ఆరోజుల్లో ఉండే సంబంధబాంధవ్యాలకి ఎంత విలువ ఇచ్చేవారో తెలియచేయడానికి మాత్రమే ఈ ఉదాహరణ.

ప్రస్థుత పరిస్థితి ఏమిటంటే, సమాచారవ్యవస్థ ఎంత అభివృధ్ధి చెందిందో, సంబంధబాంధవ్యాలు అంత తగ్గిపోవడం.. చిత్రంగా ఉంది కదూ.. టెలిఫోన్లు వచ్చిన కొత్తలో , ఖర్చు ఎక్కువకాబట్టి,  వాడకం అంత ఎక్కువగా ఉండేది కాదు, అర్ధం చేసుకోవచ్చు. కాలక్రమేణా, మొబైల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా, సెకండ్ల లెక్కన డబ్బులు వసూలు చేసేవారు

అదేదో Circle  దాటితే  incoming  కి ఇంత,  outgoing  కి ఇంతా, అంటూ తడిపి మోపెడయేది. ఈ మొబైల్స్ వచ్చేటప్పటికి టెలిఫోన్లు వెనక్కిపడిపోయాయి. గత రెండుమూడేళ్ళగా, అంబానీ రంగంలోకి వచ్చి, ప్రక్షాళనం చేయడంతో , ఈ రోజుల్లో ఎవరిచేతుల్లో చూసినా కనీసం రెండు సెల్ ఫోన్లు… పైగా వాటికి ఛార్గెస్ కూడా బహుతక్కువ. అయినా సరే, దగ్గరవాళ్ళతో మాట్టాడకపోవడానికి ముఖ్యకారణం ఏమిటంటారూ ? అలాగని ప్రతీరోజూ మాట్టాడాలనీ కాదూ, కనీసం నెలకో రెండునెలలకో, ఒకసారి పలకరించడం వలన , కనీసం తెలుస్తుందికదా, తన బంధువో, స్నేహితుడో బతికే ఉన్నాడని.  పాపం కొంతమందికి ఓ అలవాటుంటుంది… తన చుట్టాలకీ, బంధువులకీ నెలకోసారో, రెండుసార్లో ఫోనుచేసి , క్షేమ సమాచారాలు తెలుసుకోవడం, బహుశా పాతకాలం మనిషై ఉంటాడు కదూ.. ఎప్పుడు చూసినా, ఈ పెద్దమనిషే ఫోను చేయడం కానీ, కనీసం ఒక్కసారైనా, అవతలివాళ్ళు కూడా ఫోనుచేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో మాత్రం తెలుసుకోరు… అలాగని వాళ్ళకు టైమే లేదంటే నమ్మే విషయమేనా? ఈరోజుల్లో ప్రతీవారూ  Social Media  ని  Facebook, Twitter  లను ధారాళంగా వాడుతున్నారు… వాటిల్లో పనికిరాని పోస్టులు పెట్టడానికి ఉన్న టైము, తనవారన్నవారిని జస్ట్ ఒక్కసారి పలకరించడానికి ఉందదంటే నమ్మే విషయమేనా? వచ్చిన గొడవేమిటంటే, ఇవతలివారిని అవతలివారు   take it for granted   గా తీసుకోవడం. “ చేసేదేమిటిలే ఏదైనా అవసరం ఉంటే తనే ఫోనుచేస్తాడూ..” అనే చులకనా భావం… పోనీ క్షేమసమాచారాలడగడానికి ఫోనుచేస్తూంటాడేమో అని మాత్రం ఛస్తే అనుకోడు. దీనితో ఏమైపోతుందీ, సంవత్సరాలనుండీ ఉన్న స్నేహం కాస్తా పుటుక్కున తెగిపోతుంది. ఎవరైనా ఎంతమాత్రం సహనం చూపగలరూ? దేనికైనా ఓ హద్దుండాలని ఇవతలివారు అనుకోవడంలో తప్పుందనుకోను.

చివరకి జరిగేదేమిటంటే,  ఒకరిమొహం ఒకరు చూసుకోరు…

మరి సంబంధబాంధవ్యాలు వ్యాపారాత్మకపోయాయంటే అవవు మరీ ? టెక్నాలజీ అభివృధ్ధిధర్మమా అని విడేశాలలో ఉన్నవారితో కూడా పైసా ఖర్చులేకుండా మాట్టాడుకునే ఈ రోజుల్లో, దేశంలో ఉన్నవారికి దిక్కులేకపోవడం దురదృష్టకరం కదూ…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
endaro mahanubhavulu andarikee vandanaalu