Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jeevitha chakram Telugu Story

ఈ సంచికలో >> కథలు >> అమ్మ... బ్రతికింది

amma batikindi telugu story

సృష్టిలో అమ్మను మించిన నిస్వార్ధజీవి మరొకటుండదు.

మా అమ్మ కూడా అంతే.

తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది.

తను కన్నెపిల్లగా వున్నప్పుడు ప్రేమికుడి ముసుగుతో ఉండే నయవంచకుడిని, దగాకోరుని, సుఖాలు తప్ప బాధ్యతలు పట్టించుకోని దగుల్బాజీని నమ్మి పెళ్ళిచేసుకుంది. ఏ కర్మ ముహూర్తాన దగ్గరయ్యారో కాని కష్టాలు... కష్టాలు. నేను పుట్టి నాకు ఊహ తెలిసేదాక ఎన్ని కష్టాలని బడబాగ్నిలా గుండెల్లో దాచుకుందో కాని... నేను చూసినవే కోకొల్లలు. నాన్న అనే ఆ పశువు తినడం తాగడం తిరగడం అదేపని. అమ్మ తిరగలిరాయిలా గిర గిరా అందరిల్లూ తిరుగుతూ రకరకాల పనులుచేస్తూ నన్నూ వాడిని పోషించేది. తనెన్ని కష్టాలు పడుతున్నా మునిపంట భరిస్తూ నన్ను మాత్రం కష్టపడి చదివించేది. చదువుతో మహా వృక్షమై ఎదుగుతానని నా చల్లని నీడలో తను సేదదీరొచ్చనీ అనుకునేది. కొంతలో కొంత అదృష్టం ఏమిటంటే నాన్న మమ్మల్ని కొట్టేవాడుకాదు... నా చదువుకి అభ్యంతరం చెప్పేవాడుకాదు. తనలోకంలో తను వుండేవాడు. నిలువెత్తు మనిషి రూపంలో బాధ్యతారాహిత్యం!

ఇప్పుడివన్నీ ఎందుకు చెబుతున్నానంటే...

కొంతమంది కేవలం కష్టపడడానికే పుడతారు. మా అమ్మ కూడా అంతే!

కష్టాలు నా చదువుని ఎక్కడ డిస్ట్రబ్ చేస్తాయోనని నన్ను పట్నంలో వుంచి చదివించింది.

నాకు ఒక మంచి సంస్థలో ఉద్యోగమొచ్చి మా అమ్మ కష్టాలన్నీ ఇహ దూరమయిపోతాయనుకునేంతలో అశనిపాతం!

అమ్మకి, అమ్మని నా నుండి దూరంచేసే నోరుతిరుగని పేరున్న వ్యాధి.

నాకు తెలియకుండా గుండెల్లో దాచుకుంది. బాధల్ని మనసులో దాచుకోవడం అలవాటేగా అమ్మకి.

అప్పటికే బాగా ముదిరిపోయిందట. ఆపరేషన్ అత్యవసరం. డబ్బు నీళ్ళలా కర్చు పెడితే తప్ప దక్కదట. డాక్టర్ చెప్పాడు.

నిన్న గాక మొన్న ఉద్యోగం వచ్చిన నాకు అంత డబ్బు ఎలా వస్తుంది? నేను అమ్మనెలా బ్రతికించుకోవాలి? పైగా రోగం ముదిరి క్షణం క్షణం అమ్మ విలవిల్లాడిపోవడం చూస్తుంటే గుండే కత్తితో కోస్తున్నట్టుంటోంది.

ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఏ సహాయ నిధికన్నా ప్రయత్నించడానికి... పేపర్లలో ప్రకటనలిచ్చి మీనమేషాలు లెక్కించడానికి మనస్కరించడంలేదు.

ఎలా... ఎలా... ఏమి చేయాలి? భగవంతుడా అమ్మను కాపాడు. నా సమక్షంలో కాసింత సుఖపడేలా చెయ్యి.

ఆలోచిస్తూ నడుస్తున్న నన్ను కొద్ది దూరంలో ఒక బిల్డింగ్ మీద పెట్టిన పెద్ద హోర్డింగ్ కట్టిపడేసింది. మెదడులో ఒక చిన్న ఆలోచన మెరిసి మొత్తంగా ఆక్రమించింది.


****    ****    ****    ****


మాంచి పాష్ లొకాలిటీలో దర్పంగా నిలచివుంది కార్పొరేట్ ఆఫీస్.

ఆ సంస్థ తయారుచేసే రకరకాల వస్తువులు లేచిన దగ్గర్నుండీ పడుకునేదాకా సామాన్య జనావళికి ఎంతో ఉపయోగం.

సెక్యూరిటిలో నా పేరు వివరాలు ఎంటర్ చేసి లోపలికి అడుగుపెట్టి సరాసరి పిఆర్ వో చాంబర్కి వెళ్ళాను ఆయన్ని కలవడానికి. అక్కడున్న రిసెప్షనిస్ట్ కి నా వివరాలు అందించి పిఆర్ వోని నేను తప్పకుండా కలవాలని అన్నాను.

ఆమె లోపలికెళ్ళి విషయం చెప్పింది.

నేను అనుకున్న పని నిర్విఘ్నంగా పూర్తవ్వాలని తెలిసిన దేవుళ్ళందరికీ దండం పెట్టుకున్నాను.

కాస్సేపటికి నాకు పిలుపు వచ్చింది ‘లోపలికి రమ్మని’.

గుండె డబ డబ కొట్టుకుంటుండగా... నోరు తడారిపోతుండగా చల్లని ఆ ఏ సి గదిలోకి అడుగుపెట్టాను.

"చెప్పండి... మీరు నన్నెందుకు కలవాలనుకుంటున్నారు?" సౌమ్యంగా అడిగాడు.

మా అమ్మ గురించి మొత్తం గడ గడ చెప్పి. "సార్! అడ్వర్టైజ్ మెంట్లకి మీరు లక్షల్లో కర్చు పెడతారు. ఈసారి నేను మీకో ఐడియా ఇస్తాను. దయచేసి సావధానంగా వినండి..." అని ప్రాధేయ పడ్డాను.

"సార్ ఇది తప్ప మా అమ్మని అతి తక్కువ టైమ్ లో కాపాడుకునే అవకాశం లేదు. అదేమిటంటే రెండు మూడు లక్షలు మీకు లెక్కలోనివి కావు. మా అమ్మ ఆపరేషన్ మీరు స్పాన్సర్ చేయండి. దాన్ని పబ్లిసిటి చేయండి. మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలివుంది. అందరూ జాలితో మీ కార్యక్రమాన్ని టీవీ లో చూస్తారు. మీ ప్రొడక్ట్ సేల్స్ కూడా పెరుగుతాయి. నామాట నమ్మండి. ప్లీజ్ మా అమ్మని కాపాడండి" అని కళ్ళ నీళ్ళతో చేతులు జోడించి అక్కడున్న గ్లాసుడు నీళ్ళు ఒక్క గుక్కలో తాగేశాను.

"అమ్మని కాపాడుకోవాలన్న మీ తపన అర్థమైంది. మీ ఐడియా కూడా బాగుంది. కాకపోతే నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో ఈ విషయం మాట్లాడాలి. లీగల్ గా ఏవన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో కూడా చూసుకోవాలి కదా! అందుచేత రేపు పొద్దున్న మీరొస్తే ఏ విషయం చెబుతాను. నెగటివ్ వస్తే మాత్రం మమ్మల్ని తిట్టుకోవద్దు. కాని కార్పొరేట్ ఫండ్ లోంచి కొంత సహాయం చేసే ప్రయత్నం చేస్తాను." అన్నాడాయన.

"ఏ సమస్య వచ్చినా పూచీకత్తుగా నేనుంటాను. ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతాను. నాకు అమ్మ దక్కాలి సార్... దక్కాలి." అన్నాను బాధాతప్త హృదయంతో బయల్దేరుతూ.


****    ****    ****    ****


మరుసటిరోజు నేను అధైర్యంగా వెళ్ళేసరికి ఆయన నవ్వుతూ ఎదురొచ్చి "ముందు మా వాళ్ళు ఒప్పుకోకపోయినా, తల్లిని బ్రతికించుకోవాలన్న మీ తపన అర్ధం చేసుకుని సరే అన్నారు. కంగ్రాట్స్" అన్నాడు.

హమ్మయ్య! ఒక గండం గట్టెక్కింది.

నా కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. ఆనందంతో ఆయన చేతులు పట్టుకుని ఊపేశాను. నాకెందుకో దేవుడు వరమిచ్చాడనిపించింది. అమ్మ బ్రతుకుతుందనిపించింది.

"రేపే ఆస్పత్రికి వచ్చి డాక్టర్లతో మాట్లాడతాము. ఇక ఏమాత్రం ఆలస్యం జరగదు." అన్నాడు.


****    ****    ****    ****


చెప్పినట్టుగానే ఆ సంస్థవాళ్ళే దగ్గరుండి డాక్టర్ గార్ని కన్సల్ట్ చేయడం... పరీక్షలు చేయించడం... మందులు ఇప్పించడం చేస్తున్నారు.

ఈ విషయం ఇప్పటికే పేపర్లలో, ఛానల్ టీవీల్లో ప్రచారాన్నందుకుంది. అమ్మకోసం నా తపనని అక్షర బద్ధం చేసి పేపర్లు... నా ఆక్రోశాన్నీ... బాధనీ దృశ్య రూపంగా మలచి టీవీలు తమ వంతు బాధ్యతని నెరవేర్చాయి. అందరూ అమ్మ ఆరోగ్యం కోసం పూజలు చేస్తున్నారు. పూజ చేసిన పసుపు... కుంకుమ... ప్రసాదం ఆస్పత్రికి పంపుతున్నారు. మొన్నటి దాకా అమ్మకి నేనొక్కన్నే... కానీ ఇప్పుడు... అందరూ అమ్మ బ్రతకాలని తపిస్తున్నారు. మానవత్వం ఉప్పెనై పెల్లుబుకుతోంది.

అమ్మ సెలబ్రిటీ కాదు. నాయకురాలు అంతకన్నా కాదు. కాని అందరూ ఈ విషయానికి అనూహ్య ప్రాధాన్యతనిచ్చారు.

అమ్మ అందరికీ అమ్మే. అదే అందర్నీ కలచివేసింది. కదిలించింది.


****    ****    ****    ****


అమ్మకి ఈ రోజు ఆపరేషన్.

ఈ ఒక్క రోజు గడిస్తే చాలు. ఈ గండం గట్టెక్కితే చాలు.

మనసున్న వాళ్ళు... టీవీ లవాళ్ళు... పేపర్ల వాళ్ళతో హాస్పిటల్ నిండిపోయింది.

అందరి కోరికా ఒక్కటే అమ్మ బ్రతకాలి.

ఆపరేషన్ ప్రారంభించారు. ప్రా..రం..భించా...రు.

ఒక గంట గడిచింది.

డాక్టర్ గారు బయటకి వచ్చారు. సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం. ఆపరేషన్ సక్సెస్. అమ్మ బ్రతికింది. మా అమ్మ బ్రతికింది. ఆ సంస్థ ఎండి అక్కడే వున్నారు. నేను ఉద్విజ్ఞతతో వెళ్ళి ఆయన పాదాలపై పడ్డాను. అక్కడే వున్న పిఆర్ వోను గట్టిగా ఆలింగనం చేసుకున్నాను. కన్నీళ్లు ఆనందబాష్పాలై కాల్వలు కట్టాయి.


****    ****    ****    ****


(మనిషి ప్రాణం చాలా విలువైంది. రక రకాల వ్యాధులతో తను క్షోభపడుతూ... తన వాళ్ళని బాధపెడుతూ ఈ లోకం దాటేస్తుంటారు చాలామంది. ఎన్నెన్నో సంస్థలు అడ్వర్టైజ్ మెంట్లకోసం లక్షలు... కోట్లు కర్చు పెడతాయి. అందులో కొంతైనా... ఇలాంటి వాటికోసం కర్చుచేస్తే... దాన్ని అడ్వర్టైజ్ మెంట్ గా ఉపయోగించుకున్నా సరే.  కొన్ని బంధాలకు ప్రాణం పోసినవాళ్ళవుతారు. మానవత్వానికి జీవంపోసిన వారవుతారు.)

మరిన్ని కథలు