Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> ఆత్మ బంధువు

aatmabhandhuvu

"మనిషిని నమ్ముకునే కంటే మొక్కని నమ్ముకుంటే మంచిదిరా !" అన్న తండ్రి మాటలు తు.చ. తప్పకుండా పాటించాడు రామయ్య. పుట్టిన రోజు సందర్భంగా తండ్రి బహుమతిగా ఇచ్చిన మామిడి మొక్కను ప్రాణ ప్రదంగా పెంచాడు.మొక్క పెరిగిన తరువాత కూడా ఇబ్బంది లేకుండా చెట్టుకు సరిపడా జాగా వదిలి మరీ ఇల్లు కట్టుకున్నాడు రామయ్య.ఆ చెట్టు పెరిగాక కొమ్మలకు ఊయల కట్టి , పిల్లాడిని అందులో నిదురపుచ్చే వాడు. పిట్టలతో ఊసులాడుతున్న కొడుకుని చూసి మురిసి పోయేవాడు. పిల్లడు పెద్దవాడై కొమ్మలెక్కి ఆడినపుడు, చెట్టుమీద కాయలు ఏరినపుడు మదినిండిన గర్వంతో ఉండేవాడు.

తండ్రి చనిపోయినప్పుడు చితిమీదకి పచ్చికర్ర అవసరమైనప్పటికీ చెట్టు కొమ్మని నరకడానికి ఇష్ట పెట్టుకోలేదు రామయ్య. ఆ చెట్టంటే అతడికి అంత ప్రేమ. భార్య మరణంతో అతని జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని పక్షుల అరుపులతో అలికిడితో  భర్తీ చేసింది. అలా ఆ చెట్టు అతని జీవితంలో విడదీయరాని భాగమయ్యింది.

తన అనుబంధాలన్నీ చెట్టుతోనే ముడిపెట్టుకున్న రామయ్య వ్యధా భరితుడై గుండెల్లో గూడు కట్టుకున్న భారాన్ని దించుకోడానికి ఒకరోజు చెట్టుదగ్గరికి వచ్చాడు. తన కష్టాన్ని చెప్పుకున్నాడు. అతనిని ఓదార్చి మనసును తేలిక పరిచేది ఆ చెట్టే కాబట్టి. అతని మనసెరిగిన మామిడిచెట్టు ఇలా అంది. ...

" ఇంకా ఎన్నాళ్ళు బాధపడతావు రామయ్యా! రెక్కలొచ్చాక గూటిలో పిట్టలు వయసొచ్చాక పిల్లలు వెళ్ళిపోవడం సహజమే కదా!" అంటూ ఓదార్చింది మామిడిచెట్టు.

"చెప్పడం సుళువే కాని" ....

"మనసు దిటవు చేసుకో "..

"నీకేం ఎన్నైనా చెప్తావు ! పెంచిన మమకారం నీకేం తెలుసు? కన్న బిడ్డలు దూరమైతే కలిగే బాధ నీకేం ఎరుక"..అన్నాడు రామయ్య
దు:ఖాన్ని దిగమింగుకుంటూ . ..

"పిచ్చి రామయ్యా! నీ కొడుకు బతుకు తెరువుకోసం బయటకి వెళ్తే ఏదో పోగొట్టుకున్నట్టు బాధ పడుతున్నావు. ప్రతీ ఏటా నేను ఇదే బాధని అనుభవిస్తున్నాను. పిట్టలు వస్తాయి గూళ్ళు కడతాయి గుడ్లుపెట్టి పొదుగుతాయి. కువకువలాడుతున్న పిల్లల్ని చూసి మురిసిపోతాయి.
ఆ పిల్లల అల్లరితో అరుపులతో నేనెంత ఆనందిస్తానో మాటల్లో చెప్పలేను. తెలతెలవారుతూనే వాటి కిలకిల రావాలతో నా తనువువంతా పులకించిపోతుంది. పిల్లలు కాస్త పెద్దవై రెక్కలోచ్చెసరికి స్వతంత్రంగా బ్రతకమంటూ తల్లి పిట్టలు పిల్లల్లని పొడిచి పొడిచి తరిమేస్తాయి.
ఆక్షణం నా గుండె తరుక్కుపోతుంది. మరికొన్నాళ్ళకి పెద్దపిట్టలు కూడా వేరొకచోటుకి వెళ్ళిపోతాయి. ఏమి చెయ్యగలం తల్చుకుని బాధపడటం తప్ప" అంది చెట్టు.

" గొప్పగా చెప్పావులే ! ఏడాది అంటే ఎంతకాలమని? అందు ఆర్నెల్లు అంటే ఏపాటని? పాతికేళ్ళు పెంచిన మమకారానికి తెలుస్తుంది దూరమైతే కలిగే క్షోభ ఏమిటన్నది.

"నిజమే అనుకో ..కాదనను వెళ్ళిపోయిన వాడిని తల్చుకుంటూ తిండీతిప్పలూ మానెయ్యడం సరికాదు" అంది చెట్టు బాధగా.

"భారంగా  నిట్టూరుస్తూ ఏమి చేస్తాం కొడుకు దగ్గరలేడన్న బాధకంటేకూడా వాడు తీసుకున్న నిర్ణయమే నా మనసుని కలచివేస్తోంది. దానిని జీర్ణించుకో లేకపోతున్నాను" అన్నాడు రామయ్య కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ..

"నేను ఎంతో కష్టబడి కట్టుకున్న ఇంటిని అమ్మేసాడు. వాడికంటే కంటే కూడా ఈ ఇంటితోనే అనుబంధం ఎక్కువ"అన్నాడు రామయ్య.

" ఆ విషయం నాకు తెలియదా చెప్పు నువ్వు వెళ్ళేది కొడుకుదగ్గరికే కదా ఎందుకంత బెంగ."

"అదే తట్టుకోలేక పోతున్నాను అంటూ చెట్టునిపట్టుకుని బావురుమన్నాడు."

"ఈమాత్రం దానికే అంత బాధ పడితే ఎలా...చిన్న పిల్లాడిలా ఏడవకు ..కళ్ళుతుడుచుకో ..ఎప్పుడుకావాలంటే అప్పుడు వచ్చి నన్ను చూద్దువుగాని." అంటూ ఓదార్చింది చెట్టు.

"అదికాదు నానోటితో నేను చెప్పలేకపోతున్నాను.

ఈ స్థలంలో అపార్టుమెంటు కడతారుట. దానికి అడ్డుగా ఉన్నావని నిన్ను నరికేస్తారుట. అదివిన్నప్పటినుంచి నామనసు మనసులా లేదు." అన్నాడు రామయ్య గద్గదస్వరంతో...

"ఆ మాటలు విన్న చెట్టు మౌనంగా ఉండిపోయింది." కన్నీళ్ళు కార్చిందా అన్నట్లు రెండు ఆకులు రాలిపడ్డాయి రామయ్యమీదకి.

అదే సమయంలో రెండు కన్నీటి బొట్లు జారిపడ్డాయి రామయ్య కళ్ళనుంచి. అలాగే చెట్టుకు ఆనుకుని కూలబడిపోయాడు రామయ్య.
ఇంకా  ఏమైనా మాట్లాడుతాడేమోనని ఎదురుచూస్తోంది చెట్టు ..దు:ఖంలో ఉన్నాడని చల్లగాలి వీచింది ....ధీర్ఘ నిశ్వాస వదిలాడు.

" అయ్యో! నన్ను నరికేస్తున్నారని తట్టుకోలేక నాకు దూరమయ్యావా రామయ్యా ! చిన్నప్పటినుంచి నీకు ఎన్నో ఇచ్చిన నాకు ఇప్పుడు ఆఖరి సేవ చేసుకునే అవకాశం కూడా ఇచ్చావా?. ఎంత పని చేసావయ్యా! నువ్వు లేకుండా ఉండలేనని తెలీదా? ...పోదాం పద మిత్రమా ..నీతోనే వస్తా ...అంది మామిడి చెట్టు దిగమింగుకోలేని దుఃఖం తో..

"మనసు లేని మనుషుల మధ్యనీవు కాంక్రీటు అడవుల్లో నేను బ్రతకలేము ఒకరికి ఒకరమై ఉన్నాం ఇన్నాళ్ళు ఇకపై కూడా అలాగే ఉందాం" అంటూ చితిపైకి చేరింది మామిడి కొమ్మ.కొడుకు స్వార్ధానికి నెలకొరిగింది ఒక వృక్షం. తట్టుకోలేక గాల్లో కలిసింది తండ్రి ప్రాణం.

బ్రతికి నన్నినాళ్ళు
ఫలములిచ్చుటె కాదు
చచ్చికూడ చీల్చి ఇచ్చు తనువు
త్యాగభావమునకు తరువులే గురువులు
లలితసుగుణజాల తెలుగుబాల
అన్న పద్యం దూరంగా వినిపిస్తోంది ..

మరిన్ని కథలు
padirojula anadha