Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

కౌశల్య కృష్ణమూర్తి. చిత్రసమీక్ష

kousalya krishnamurthy movie review
చిత్రం: కౌశల్య కృష్ణమూర్తి 
నటీనటులు: ఐశ్వర్యా రాజేష్‌, రాజేంద్రప్రసాద్‌, శివ కార్తికేయన్‌, ఝాన్సీ, వెన్నెల కిషోర్‌, శశాంక్‌ రవి ప్రకాష్‌ తదితరులు 
సినిమాటోగ్రఫీ: బి.ఆండ్రూ 
సంగీతం: దిబు నిన్నాన్‌ థామస్‌ 
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు 
నిర్మాత: కె.ఎ. వల్లభ 
నిర్మాణం: క్రియేటివ్‌ కమర్షియల్స్‌ 
సమర్పణ: కె.ఎస్‌. రామారావు 
దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు 
విడుదల తేదీ: 23 ఆగస్ట్‌ 2019

క్లుప్తంగా చెప్పాలంటే..

ఓ రైతు కృష్ణమూర్తి (రాజేంద్రప్రసాద్‌)కి వ్యవసాయంతోపాటు క్రియేట్‌ అంటే చాలా చాలా ఇష్టం. క్రికెట్‌ పోటీల్లో ఇండియా ఓడిపోతే తట్టుకోలేంత అభిమానం అది. తాను క్రికెటర్‌ అయి, ఇండియా తరఫున ఆడి, కప్పు గెలిచి, తన తండ్రి కళ్ళలో ఆనందం చూడాలన్నది కౌశల్య (ఐశ్వర్య రాజేష్‌) కోరిక. ఈ క్రమంలో చిన్నప్పటినుంచే క్రికెట్‌ ఆడటం మొదలు పెడుతుంది. అమ్మాయిలు క్రికెట్‌ ఆడటమంటే మాటలు కాదు కదా.! అబ్బాయిలతో కలిసి తన కుమార్తె క్రికెట్‌ ఆడటం కౌశల్య తల్లి (ఝాన్సీ)కి నచ్చదు. మరి, కౌశల్య ఎలా తన కోరిక నెరవేర్చుకుంది.? తండ్రి కళ్ళల్లో కౌశల్య ఆనందం నింపగలిగిందా.? ఈ క్రమంలో కౌశల్య ఎదుర్కొన్న కష్టాలేంటి.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే..

ఐశ్వర్యా రాజేష్‌ చాలా బాగా చేసింది. భావోద్వేగాల్ని చాలా బాగా పండించింది. అచ్చం ప్రొఫెషనల్‌ క్రికెటర్‌లా ఆమె నటించిన తీరు, ఆమె బాడీ లాంగ్వేజ్‌.. అన్నీ ఆకట్టుకుంటాయి. తెలుగమ్మాయి అయిన ఐశ్వర్య రాజేష్‌, తమిళ సినిమాలతో పాపులర్‌ అయ్యి, తొలిసారిగా ఈ సినిమాతో తెలుగులో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఒరిజినల్‌ వెర్షన్‌లోనూ ఆమే నటించడంతో, తెలుగులో ఆమెకు మరింత తేలికయ్యింది. 
సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ మరోమారు తన అనుభవాన్నంతా రంగరించారు. తెరపై ఆయన్ని చూస్తున్నంతసేపూ, రాజేంద్రప్రసాద్‌ని మర్చిపోయి కృష్ణమూర్తితో కనెక్ట్‌ అయిపోతాం. ఎన్నిసార్లు ఆయన గురించి చెప్పుకున్నా, ఇలాంటి ప్రస్తావనే వస్తుంటుంది. ఆయనంతే, గొప్ప నటుడు.. జీవించేస్తాడు. ఇంకోసారి అది ఈ సినిమాతో నిరూపితమయ్యింది.

ఝాన్సీకి మంచి పాత్ర దక్కింది, ఆ పాత్రకి ఆమె పూర్తి న్యాయం చేసింది. శివ కార్తికేయన్‌ పాత్రని తమిళం నుంచి పూర్తిగా లాగేశారు. తన పాత్రలో బాగా చేశాడు శివ కార్తికేయన్‌. ఈ సినిమాకి అదో అదనపు హైలైట్‌ అని చెప్పుకోవచ్చు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.

క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో కథ బావుంది. కథనం కూడా ఆకట్టుకుంది. డైలాగ్స్‌ చాలా బావున్నాయి. ఎడిటింగ్‌ ఆకట్టుకుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సినిమాటోగ్రఫీ సినిమాకి అదనపు సొగసులద్దాయి. పాటలు వినడనికీ, తెరపై చూడ్డానికి కూడా అందంగా వున్నాయి. నిర్మాణపు విలువలకూ మంచి మార్కులే పడతాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్స్‌ తమ వర్క్‌ తాము బాగా చేశాయి.

క్రికెట్‌ నేపథ్యంలో సాగే సినిమాల ట్రెండ్‌ నడుస్తోందిప్పుడు. 'కణ' సినిమాని తెలుగులోకి 'కౌశల్య కృష్ణమూర్తి' పేరుతో రీమేక్‌ చేశారు. అయితే ఒరిజినల్‌ సన్నివేశాల్ని కొన్ని యధాతథంగా వాడేసుకోవడం గమనార్హం. కమర్షియల్‌ యాంగిల్‌లో వెళ్ళకుండా, కథకు లోబడి దర్శకుడు సినిమాని తెరకెక్కించిన తీరు అభినందనీయం. అక్కడక్కడా సినిమా కొంత స్లో అయినట్లుగా అనిపిస్తుంటుంది. అయితే, దాన్ని అర్థం పర్థం లేని కామెడీ సీన్స్‌తో నింపేయకపోవడం గమనించాల్సిన విషయం. ఓవరాల్‌గా ఓ మంచి సినిమా చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. ఫన్‌ కావాలనుకునేవారికి ఈ సినిమా కొంత నిరాశపర్చుతుందేమో.

అంకెల్లో చెప్పాలంటే..
3.25/5

ఒక్క మాటలో చెప్పాలంటే..
కౌశల్య కృష్ణమూర్తి.. నిజాయితీగా గెలిచింది 
మరిన్ని సినిమా కబుర్లు
churaka