Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అనుబంధాలు - ఇరవై తొమ్మిదవ భాగం

anubandhalu telugu serial twenty ninth Part

హోటల్లో డ్యూటీ ముగించుకొని అనంతసాయి, శివానీలు ఇద్దరూ నడుచుకుంటూ వస్తూ కన్పించారు. శివానీ రూపురేఖలే మారిపోయాయంటే ఆశ్చర్యం లేదు. చక్కగా చీర, జాకెట్ లో సాంప్రదాయంగా తెలుగింటి అమ్మాయిలా మెరిసిపోతోంది. వాళ్ళిద్దరూ దగ్గరకు వచ్చేవరకు నవీన్, మహేశ్వరిలను గమనించలేదు. ముందుగా శివానీ నవీన్ ను చూసింది. చూడగానే ఆమె ముఖం చంద్రుడిని చూసిన కలువలా వికసించింది.

"బావా!" అంటూ వడివడిగా దగ్గరకు వచ్చేసింది.

మహేశ్వరిని చూసిన సంతోషంలో ఉక్కిరిబిక్కిరవుతూ అనంత్ కూడా దగ్గరకు వచ్చాడు.

"బావా! ఎంతసేపైంది మీరు వచ్చి?" అంటూ పలకరించాడు.

"ఆగండి" అంటూ నవీన్ కి అడ్డంగా నిలబడింది మహేశ్వరి. ఆమె ముఖంలో కోపం తొంగి చూస్తోంది.

"మీ అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ ఏమనుకుంటున్నారో మాకు తెలియాలి. మాకు చెప్పకుండా వచ్చేస్తారా? అంత పరాయి వాళ్లము అయిపోయామా? మిమ్మల్ని వెతుక్కుంటూ మేమిక్కడికి రావాలా? అసలేమనుకుంటున్నారు మీరు?" అంటూ నిలదీసింది.

"హలో! నాకు అర్ధమవుతోంది. నువ్వు అడుగుతోంది నన్ను కాదు. అన్నయ్యనేగా అడుగుతోంది. చెప్పన్నయ్యా!" అంది నవ్వుతూ శివానీ.

"నేను బావనే కాదు. మీ ఇద్దర్నీ కలిపి అడుగుతున్నాను." అంది అనంత్ నుంచి చూపులు తిప్పుకుంటూ మహేశ్వరి.

"అవును కానీ చూపులు అటేగా?"

"నన్నేం దబాయించక్కర్లేదు. మీ చూపుల సంగతి నాకు తెలీదా? రా బావా" అంటూ అనంత్ కి కొంచెం దూరం లాక్కుపోయింది మహేశ్వరి.

"నాకు అర్ధం కావడం లేదు శివానీ. ఏం జరుగుతోంది? వాళ్లేదో గొడవపడ్డం ఏమిటి? మీరిలా మీ డాడీతో వచ్చేయడం ఏమిటి? ఏం చేస్తున్నారిక్కడ?" అంటూ అడిగాడు నవీన్.

"ఉద్యోగం చేస్తున్నాం...!" అంది చిన్నగా శివానీ.

"ఉద్యోగమేమిటి?" అర్ధంకానట్టు అడిగాడు.

"అవును ఉద్యోగమే. హోటల్ డి.వి. మేనర్ లో అన్నయ్య సూపర్ వైజర్. నేను రిసెప్షన్ ప్లస్ కంప్యూటర్. మా ఇద్దరికీ పద్దెనిమిదివేలు జీతం. ఓవర్ టైం చేస్తే ఇంకొంచెం వస్తుంది. డాడీ దగ్గర డబ్బు లేదు. కొంతకాలం ఆయన్ని పోషించాలి. అమెరికా పంపించడానికి డబ్బు ఆదా చేయాలి."

"అందుకని ఉద్యోగమా?"

"తప్పదుగా బావా! అత్తయ్య మాటలు డాడీని బాగా కష్టపెట్టాయి. మిమ్మల్ని వలేసి పట్టి పెళ్లి చేసుకోవాలనే మమ్మల్ని తెచ్చి ఇంట్లో ఉంచాడంటూ మీ అమ్మ డాడీని నిందించిందంట." "అర్ధంలేని మాట. వదిలేయాల్సిన అవసరం ఏమిటి? బావామరదళ్ళ సంబంధం మామూలు సంబంధాలకు అతీతమైంది. మహేశ్వరికి అనంత్ అంటే ప్రాణం. అనంత్ ఇష్టపడితే చెయ్యకుండా ఉంటామా?"

"నేనిష్టపడితే నువ్వు చేసుకుంటావా?"

"చేసుకోనని ఎప్పుడన్నా చెప్పానా? అమ్మమ్మ ఆశ కూడా అదే కదా. మన పెళ్ళిళ్ళు మీ అన్నాచెల్లెళ్ళ నిర్ణయాల మీద ఆధారపడి వున్న విషయం. అలాగని మిమ్మల్ని బలవంతంగా ఒప్పించే ప్రయత్నం ఎవ్వరూ చేయరు. మధ్యలో ఈ పెద్దల గొడవ ఏమిటో అర్ధం కావడం లేదు. ఇంతకూ మీ డాడీ ఎక్కడ? ఫ్లాట్ కి తాళం వేసుంది."

"బయటకు వెళ్లుంటారు. రా బావా... లోనకెళ్ళి మాట్లాడుకుందాం..." అంటూ చూడు వాళ్ళిద్దర్నీ నవ్వుతూ అనంత్, మహేశ్వరిలను చూపించింది.

మహేశ్వరి దేనికో పేచీ పెడుతోంది. బహుశా ఏడుస్తుందేమో కూడా. ఆమె చెయ్యి పుచ్చుకొని బ్రతిమిలాడుకుంటున్నాడు అనంత్.

"డౌట్ లేదు. వాళ్ళిద్దరూ పడిపోయారు." అన్నాడు నవ్వుతూ.

"పడిపోవడం ఏమిటి...?"

"అదే ప్రేమలో పడిపోయారంటున్నాను."

"ఆ విషయం నాకు ముందే తెలుసు." అంది ముసిముసిగా నవ్వుతూ.

"నీ విషయమే నాకు ఇంకా తెలీదు."

"నిన్ను చూసి చాలా రోజులైనట్టుంది తెలుసా? ఇప్పట్లో నిన్ను చూడలేనని చాలా బాధపడ్డాను. మీరే వచ్చారు. చాలా ఆనందంగా ఉంది" అంటూ అతని చెయ్యి అందుకుంది.

"నాకైతే రాత్రి నిద్రపట్టలేదు తెల్సా? నీ గురించే ఆలోచన. పద లోనకు వెళ్దాం..." అంటూ అపార్ట్ మెంట్లోకి దారి తీస్తూ అనంత్ ని పిలిచాడు.

వాళ్ళిద్దరూ కూడా వచ్చారు.

రెండు జంటలు అపార్ట్ మెంట్ మెట్ల వైపు వెళ్తుండగా ఎటు నుంచి వచ్చాడో గానీ సడన్ గా వాళ్లముందు ప్రత్యక్షమయ్యాడు డాక్టర్ గోపాల్.

"ఆగండి... అక్కడే ఆగండి... ఒక్క అడుగు ముందుకు వేసినా ఊరుకోను" అంటూ కోపంగా అరిచాడు.

ఇంతసేపు ఆయనెక్కడున్నాడు? ఇంత ఆకస్మాత్తుగా ఎలా వచ్చాడో అర్ధం కాలేదు ఎవరికీ. మహేశ్వరి కంగారుపడి అనంత్ చెయ్యి వదిలేసి నవీన్ పక్కకి వచ్చేసింది. శివానీ అనంత్ పక్కకు జరిగింది. "ఏరా నవీన్! మీ అమ్మచేత మాటలు పడ్డాను చాలదా? ఇప్పుడు మీ చేత కూడా నేను మాటలు పడాలా? ఎందుకొచ్చావిక్కడికి? లోనకు అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇక్కడ్నుంచే వెనక్కి వెళ్లిపోండి. త్వరగా..." అంటూ హెచ్చరించాడు.

"మావయ్యా! నే చెప్పేది విను..." అని నవీన్ ముందుకు వస్తుంటే వారించాడు గోపాల్.

"ఇంకేం చెప్పకు. నా పిల్లలు బుద్ధిమంతులు. బుద్ధిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. బాధ్యతగా డబ్బు సంపాదిస్తూ, నా అవసరాలు తీరుస్తూ నన్ను పోషిస్తున్నారు. అంతేగానీ మీ అమ్మ అనుకుంటున్నట్టు మీ మీద వలేసి పెళ్లి చేసుకోవాల్సిన ఖర్మ నా బిడ్డలకి లేదు. వెళ్లి ఈ మాటే మీ అమ్మకి చెప్పండి. వెళ్లండి."

"మాకు తల్లి కావడానికి ముందే ఆవిడ మీకు చెల్లెలు. మర్చిపోయారా?" సూటిగా అడిగాడు నవీన్.

"అయితే?"

"మీ అన్నాచెల్లెళ్ళు తోడు దొంగలు. మీరు గొడవ పడడం ఏమిటి? మీకు పట్టింపులేమిటి? అంతా అబద్ధం. మీ మనసులో ఏదో ఉంచుకుని ఇదంతా చేస్తున్నారు."

"ఓ.కె. అలాగే అనుకో. ఇక నా పిల్లల్ని కలుసుకోవడానికి మీరు రావద్దు. మిమ్మల్ని కల్సుకోవడానికి మావాళ్ళూ రారు. ఇంకా చెప్పాలంటే మున్నలూరులోనే అడుగుపెట్టం. అటు మీ వాళ్లకు, ఇటు నాకు ఇష్టం లేదు కాబట్టి మీ రెండు జంటలు ఇష్టపడినా మీ పెళ్లిల్లు జరగవు. అర్ధమైందా? తరువాత ప్రేమా గీమా అంటూ తిరిగినా సహించను. వెళ్లిపోండి. ఏరా అనంత్ ఇంకా చూస్తావేమిటి? శివానీని తీసుకుని పైకి వెళ్లిపో. వెళ్లండి" అంటూ అరిచాడు గోపాల్.

"డాడీ..!' అంటూ ఏదో చెప్పాలని ముందుకు రాబోయిన శివాని ఆయన కన్నుల్లో కోపం చూసి వెనక్కి తగ్గి కళ్ళ నీళ్ళ పెట్టుకుంటూ వేగంగా మెట్లపైకి పరిగెత్తింది. వెనకే అనంత్ అనుసరించాడు. మహేశ్వరి దుఃఖం ఆపుకోలేక ఏడ్చేసింది. చెల్లెల్ని ఓదార్చాడు నవీన్.

"ఏమిట్రా? ఇంకా నిలబడే ఉన్నారు. నా పిల్లలు బుద్ధిమంతులు. నేను గీచిన గీత దాటరు. మీరు కూడా బుద్ధిమంతులైతే మీవాళ్ళు చెప్పినట్టు వినండి. వెళ్ళిపొండి. మీ అమ్మతో చెప్పండి. నా గురించో, మా పిల్లల గురించో భయపడనక్కర్లేదు. ఇష్టం వచ్చిన సంబంధం చూసుకొని మీ పెళ్లిళ్లు జరిపించుకోవచ్చని చెప్పండి. మీకు రోషం, అభిమానం లాంటివి ఏమన్నా ఉంటే ఇంకెప్పుడూ ఇటు రాకూడదు. మా వాళ్లను కల్సుకునే ప్రయత్నం చెయ్యకూడదు. వెళ్ళిపోండి..." అన్నాడు కటువుగా.

ఆ మాటలతో నవీన్ కి కూడా కోపం ముంచుకొచ్చింది.

"ఓ.కె. మీ పిల్లల్నే కాదు ఈ రోజునుంచీ మీరు మా మేనమామ అనే విషయాన్ని కూడా మర్చిపోతాం. వస్తాం..." అంటూ చెల్లెల్ని తీసుకొని వెనుతిరిగాడు. వాళ్ళిద్దరూ వెళ్లిపోయే వరకూ ఆగి, తరువాత వెనుదిరిగాడు డాక్టర్ గోపాల్.

ఇట్టే నెలగడిచింది. మున్నలూరు నుంచి ఎవరూ ఇటు తొంగి చూడలేదు. ఇటు నుంచి ఎవరూ అటు వెళ్లలేదు. నెల తిరిగేసరికి వాడకం పోను చేతికొచ్చిన డబ్బు తక్కువే. ఇద్దరి సంపాదన చాలడం లేదు. కాబట్టి ఓవర్ టైం చేసి సంపాదించాల్సి వస్తోంది. రోజూ ఖరీదైన మందు తాగడం, ఖరీదైన ఫుడ్ తినడం, ఏ.సి. గదిలో నిద్రపోవడం, సరదా పుడితే ఏదో థియేటర్లో సినిమా చూస్తూ సరదాగా కాలక్షేపం చేయడం ఇదీ ప్రస్తుతం డాక్టర్ గోపాల్ దినచర్య.

ఎంత తెచ్చినా చాలదని ఖర్చులు చూపిస్తూ పిల్లల్ని రాచిరంపాన పెడుతున్నాడంటే ఆశ్చర్యం లేదు. ఒక రోజు ఉదయం డ్యూటీకి వెళ్తే రాత్రి ఏ పదింటికో. ఇప్పుడు అన్నాచెల్లెల్లిద్దరికీ డబ్బు విలువ ఏమిటో, శ్రమ విలువ ఏమిటో? ముఖ్యంగా క్రమశిక్షణ విలువ ఏమిటో చాలా బాగా అర్ధమవుతోంది. తండ్రిని సంతోష పెట్టగల్గుతున్నామన్న తృప్తి ఉంది కాబట్టి పనికి సంబంధించిన శ్రమ వారిని అంతగా బాధించడం లేదు. కాని మానసికంగా చాలా నలిగిపోతున్నారు.

నెలరోజులుగా మహేశ్వరిని చూడలేకపోవడంతో విరహవేదన ఎలా ఉంటుందో అతడికి తెలిసివస్తోంది. ఆమెమీద ప్రేమ రెట్టింపు అయింది. రోజురోజుకీ మరదల్ని చూడాలన్న కోరిక పెరుగుతోంది. అమెరికా పద్ధతులకు అలవాటుపడి ఇంతకాలం ఆమెను పట్టించుకోలేదు.

తను ఆమెను ప్రేమించడం ఆరంభించి రెండు మాసాలు కాలేదు. ఈ మాత్రానికే తను ఇంత బాధపడుతున్నాను. చిన్నప్పట్నుంచి తనమీదే మనసు ఉంచుకొని తననే ఆరాధిస్తూ వచ్చిన మహేశ్వరి ఈ పరిస్థితిని ఎలా తట్టుకుంటుందో? ఆమెను తలచుకుంటేనే మనసు భారమైపోతోంది అనంత్ కు.

ఇక శివానీ విషయం కూడా అంతే. తను పూర్తిగా బావమీద ప్రేమలో మునిగిపోయిన విషయం అర్ధమైంది. బావను చూడాలన్న కోరిక ప్రతిక్షణం ఆమెను వేధిస్తోంది. నవీన్ మీద కోపం కూడా వస్తోంది. డాడీ వద్దంటే మాత్రం ఓసారి తనను చూడడానికి హోటల్ దగ్గరకు రావచ్చు కదా. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఫోనీ తను ఫోన్ చేద్దామంటే పొరపాటున అత్తయ్యో, మావయ్యో ఫోన్ లిఫ్ట్ చేస్తే తిరిగి అదో రాద్ధాంతం అయి కూర్చుంటుంది. ఏం చెయ్యాలి? ఈ సమస్య ఇలా ఉంటే మనసులో మరో విషయం కూడా వేధిస్తోంది శివానీని.

అమెరికాలో ఉన్న అమ్మ, నాయనమ్మలని చూడాలని, మాట్లాడాలన్న కోరిక. ఇప్పుడున్న పరిస్థితులు వాళ్లకి తెలియదు. తెలిస్తే నాయనమ్మ ఊరుకోదు. ఫోన్ చేద్దామంటే అక్కడ ఫోన్ నెంబర్లు మారిపోయాయి. ఆ నెంబర్లు తమకు తెలియదు. పెదనాన్న రామలింగేశ్వర్రావుకు తెలిసి ఉండాలి. కానీ చెప్పడు. డెట్రాయిట్ లోని ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చూసింది. కానీ ప్రయోజనం లేకపోయింది.

ఈ మధ్యనే ఓసారి తండ్రిని అడిగింగి శివానీ.

"అమెరికా ఫోన్ చెయ్ డాడీ! మమ్మీతో మాట్లాడతాను..." అని.

"వాళ్లు బాగానే ఉన్నారు. ప్రత్యేకించి మాట్లాడనక్కర్లేదు" అంటూ ఫోన్ చేయడానికి తిరస్కరించాడు ఆయన.

ఆ రాత్రి చాలాసేపు తనలో తాను ఏడుస్తూనే ఉంది శివానీ.

అక్కడ మున్నలూరులో నవీన్, మహేశ్వరిల పరిస్థితి కూడా ఇదే. విజయవాడ వచ్చి ఓసారి అనంత్, శివానీలను చూసి వెళ్లాలని ఇద్దరికీ ఉంది. కానీ ఆ రోజు రోషంగా మేనమామకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి, నవీన్ మౌనంగా ఉండక తప్పలేదు. కానీ చెల్లెల్ని చూస్తుంటే జాలేస్తోంది. ఆమెలో పూర్వపు చలాకీతనంగానీ, ఉత్సాహం గానీ లేవు. ఒంటరిగా పరధ్యానంగా ఉంటోంది. ఎవరికీ కన్పించకుండా ఏకాంతంలోకి పోయి కూర్చుంటుంది.

"మహీ! ఏమిట్రా ఇది... ఆశ వదులుకున్నట్టు ఎందుకలా అయిపోతున్నావ్? ఎంత కాలంరా ఇలా?" లాలనగా దగ్గర కూర్చుని అడిగాడు నవీన్.

"అదే ఎంతకాలం ఇలా? అదే నేనూ అడుగుతున్నాను అన్నయ్యా? ఎంతకాలమిలా?" అంటూ ఎదురు ప్రశ్నించింది మహేశ్వరి.

"నా వల్ల కావడం లేదు. బావను చూడకుండా ఉండలేను. నువ్వు తీసుకెళ్తావా? నన్నే వెళ్ళమంటావా?" అంది బాధగా.

"వద్దు. అలాంటి పిచ్చి ఆలోచనలు చేయకు." అంటూ వారించాడు.

"ఎందుకు చెయ్యకూడదు? శివానీని చూడకుండా నువ్వు ఉండగలవేమోగానీ, బావను చూడకుండా నేను ఉండలేను. ఇలానే నాకు పిచ్చి పడుతుంది. చూస్తుండు."

"చెల్లాయి ఫ్లీజ్. ఆ రోజు మావయ్య ఎంత నిష్టూరంగా మాట్లాడాడో నువ్వు చూశావుగా? రోషం, అభిమానం అనేవి వాళ్ళకే ఉన్నాయా? మనకు లేవా? ఇన్ని రోజులయ్యింది అన్నాచెల్లెళ్ళు ఇద్దరిలో ఒక్కరైనా మనకు ఫోన్ చేశారా? ఎలా ఉన్నారని అడిగారా? మన గురించి వాళ్లు ఆలోచించనప్పుడు వాళ్ల గురించి మనం ఎందుకు ఆలోచించాలి?"

"ఆలోచించడం లేదని ఎందుకు అనుకుంటున్నావు? మావయ్యకు భయపడి ఊరుకునుంటారు.

ఫ్లీజ్ అన్నయ్యా! ఓసారి హోటల్ కి ఫోన్ చేసి చూడు. నెంబర్ నీకు తెలుసుగా."

తెలుసునన్నట్టు తలూపాడు నవీన్.

తన సెల్ అందుకుని ఫోన్ చేసేలోపలే అనుకోకుండా సెల్ రింగయ్యింది.

సెల్ లో పడిన నెంబర్ చూసి ఆశ్చర్యపోయాడు.

"ఎవరన్నయ్యా?" అడిగింది మహేశ్వరి.

"వెయిట్. హోటల్ డి.వి. మేనర్ నుంచి ఎవరో ఫోన్ చేశారు. బహుశా అనంత్ కావచ్చు" అంటూ బటన్ అదిమి "హలో" అన్నాడు.

అవతల నుంచి జవాబు లేదు.

"హలో... నవీన్ హియర్... హలో..." మరోసారి పలికాడు.

అప్పుడు కూడా సమాధానం లేదు. క్షణం తరువాత అవతల ఎవరో దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు పెద్దగా ఊపిరి పీల్చుకోవడం వినబడింది. దాంతో అతడి అనుమానం బలపడింది.

"శివానీ..." అంటూ పిలిచాడు.

"ఊ..." అంది అవతల బలవంతంగా శివానీ.

"ఏ... ఏమిటే ఇది... ఎలా ఉన్నావ్? మృదువుగా అడిగాడు.

అవతల చిన్నగా ఏడుస్తున్న శబ్దం.

"ఏం బావా! మర్చిపోయావా? నన్ను పూర్తిగా మర్చిపోయావా?" రుద్ధ కంఠంతో అడిగింది శివానీ.

"అలా ఎందుకు అనుకుంటున్నావ్? నిన్ను మర్చిపోవడం అంత సులువనుకుంటున్నావా?"

"అందుకే కనీసం ఫోన్ కూడా చేయలేదు."

"జరిగింది తెలిసి కూడా నువ్వు ఇలా నిష్టూరంగా మాట్లాడడం బాగాలేదు. ఇప్పుడే మహీ, నేను ఆలోచించుకొని నీకు ఫోన్ చేద్దామని సెల్ తీశాను. ఇంతలో నువ్వే చేశావు. మహీ, అనంత్ ని చూడాలని గొడవ చేస్తోంది. ఏడుపు ఒక్కటే తక్కువ దానికి. నాకూ నిన్ను చూడాలని ఉంది. మేం బెజవాడ రావాలనుకుంటున్నాం."

"ఇంటికొస్తే డాడీ గొడవ చేస్తారు."

"ఓ.కె. పర్మిషన్ తీసుకుని మీరిద్దరూ ఒక గంట ముందు బయటకు రాగలరా?"

"రావచ్చు కానీ..."

(... ఇంకా వుంది)

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
duradrustapu dongalu