Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

agent ekamber

"ఇంకా గార్లు, బూర్లు ఎందుకండీ! రత్నం అని పిలవండి" ఓరగా ఏకాంబరం కళ్ళల్లోకి చూస్తూ అంది నూకరత్నం.

"మీరు కూడా నన్ను అండి పొండి అనకండి! అంబర్ సాబ్ అని పిలవండి! సరేనా?!" గోముగా అన్నాడు ఏకాంబర్.

"అంబర్ అంటే పోలా! మళ్ళీ ఆ 'సాబ్' ఎందుకండీ. సాయిబులాగా" అంది నవ్వుతూ.

"మీరు నన్ను 'అంబర్' అని ఏకవచనంలో పిలిస్తే చూసేవాళ్ళు మీ కంటే నేను 'గుంటడ్ని' అనుకుంటారు. అందుకే అందంగా 'అంబర్ సాబ్' అనండి బావుంటుంది."
హొటల్ లో నుండి బయటకు వస్తూ అన్నాడు ఏకాంబరం.

"అలాగే స్వామీ! అలాగే! ఇక నన్ను వదిలిపెడతారా అంబర్ సాబ్" నవ్వుతూ అంది నూకరత్నం.

"ఇప్పటికి ఓకే! మీకు రేపు వచ్చే 'మంగళవారం' షాపు సెలవుకదా! మనం ఇద్దరం కలుసుకోవాలి. తప్పదు. వస్తారు కదా!" ఆర్డర్ వేస్తూ అన్నాడు ఏకాంబరం.

"అలాగే! అమ్మతో చెప్పి వస్తాను. రోజులసలే బాగాలేవు ఒంటరిగానే తిరుగుగాని, ఎవరినీ నమ్మి వారితో తిరక్కు అంటూ అమ్మ చెప్తూంటుంది." అంది రత్నం ఓరగా ఏకాంబరాన్ని చూస్తూ.

"అదేంటి!?! నేనుంటాగా నీకు తోడుగా" అమాయకంగా అన్నాడు ఏకాంబర్.

"అదేగా అమ్మ భయం. తోడున్నవాళ్ళే తోడేళ్ళు అయిపోతారట. పేపర్లు చదివి చదివి అమ్మ బుర్ర అలా మారిపోయింది... మంగళవారం కదా!... మీ నెంబరివ్వండి. వీలునుబట్టి మీకు ఫోన్ చేస్తాను" అంది నూకరత్నం.

నూకరత్నం ఫోన్ నెంబరు అడిగేసరికి ఉత్సాహంతో గబగబా తన జేబులో ఉన్న విజిటింగ్ కార్డు తీసి ఇచ్చాడు ఏకాంబర్.

"వస్తా! అంబర్ సాబ్!" కళ్ళల్లో ఆనందం నింపుకుంటూ ఏకాంబరాన్ని చూసింది నూకరత్నం.

ఇతను తనని వంటరిగా విడిచిపెట్టడు. తన నీడను కూడా లాలనగా చూస్తున్నాడు. ఇలా జీవితాంతం తనని అక్కున చేర్చుకోగలుగుతాడా? ఆస్తులు, అంతస్థులు, కులాలు మతాలు ఇతని మనసుని మార్చేయవు కదా! తనే లేనిపోని ఆశలకు పోతోందా?! పరిపరివిధాల ఆలోచిస్తూ ఏకాంబరం సాన్నిహిత్యాన్ని సంబరంగా ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోయింది నూకరత్నం.

వడివడిగా నడుచుకుంటూ తల దించుకు సాగిపోతున్న 'నూకరత్నాన్ని' చూస్తూ క్షణం నిస్తేజంగా నిలబడిపోయాడు ఏకాంబర్. తన గుండెల్లో నుండి 'ఆనందం' ఆవిరైపోతున్నభావనతో ఆమెనే కన్నార్పకుండా చూస్తుండిపోయాడు.

***

ఆ నాలుగురోజులూ ఏకాంబరం ఏకాగ్రతగా గడపలేకపోయాడు. పాలసీ హోల్డర్ లని కలవలేకపోయాడు. ఏ పని చేద్దామన్నా నూకరత్నమే కళ్ళల్లో మెదులుతోంది. మనసంతా కల్లోలమైపోతుంది. తన మాట మన్నించి వస్తుందా? రానంటుందా? ఏకాంబరానికీ ఏదీ నిర్ధారణ కావటంలేదు. 'పోనీ, ఒకసారి రాజమండ్రి సిల్క్ హౌస్ కి వెళ్ళి కలుద్దామంటే షాపు యజమాని దృష్టిలో పడితే తను ఇన్నాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న పరువు పోతుందేమోనని భయం... భయం కాదు, సంస్కారంతో కూడిన విచక్షణ మాత్రమే.

రోజూ ఉదయం లేస్తూనే ఆ రోజు కలవాల్సిన వాళ్ళ పేర్లు రాసుకోవడం, ఆ రోజు వసూలు చేయాల్సిన పాలసీల వాయిదాలు ఎవరు కడతారో వారి పేర్లు రాసుకోవడం, కొత్తగా పాలసీల వేట కోసం మరో జాబితా... ఇలా రోజూ కనీసం ఓ ఏభైమందినన్నా కలుస్తాడు ఏకాంబర్.

అయితే, ఈ నాలుగు రోజులూ బైక్ తో ఊరి మీద పడ్డా అటూ, ఇటూ అన్ని వీధులూ, అన్ని ప్రాంతాలు, అన్ని వార్డులూ తిరిగినా ఒకరి కోసం వెళ్ళాల్సింది... మరొకరిని కలవడం... వెళ్ళాల్సిన ఏరియా బదులు వేరే ఏరియా వెళ్ళడం... అలా అంతా అయోమయంగా గడిపేసాడు ఏకాంబరం.

ప్రతి పదిహేను రోజులకి ఏజెంటు కమీషన్ బ్యాంకు పాస్ బుక్ లో జమ అవుతుంది. కనీసం ఎంత కమీషన్ వచ్చిందో చూసుకోవడానికి కూడా సమయం కేటాయించలేకపోయాడు ఏకాంబర్.

ఆ రోజు మధ్యాహ్నం సెల్ ఫోన్ లో మెసేజ్ వచ్చింది. మెసేజ్ రాగానే అన్యమనస్కంగానే చూసి బ్యాంకు మెసేజ్ లే అని చూసీ చూడనట్టు వదిలేసాడు.

ఆ సాయంత్రమే ఇన్స్యూరెన్స్ బ్రాంచి మేనేజర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది ఏకాంబరానికి.

"కంగ్రాట్స్ ఏకాంబర్! హార్టీ కంగ్రాట్యులేషన్స్" ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ ఫోన్ చేసాడతను.

బ్రాంచి మేనేజర్ అంతలా ఎందుకు ఆనందపడిపోతున్నాడో అర్ధం కాలేదు. ఈ మధ్య బ్రాంచి లెవల్ లో గాని,, డివిజన్ లెవల్ లో గాని, జోనల్ లెవల్ లో గాని ఎలాంటి వ్యాపార పోటీలు జరగలేదు. అందులో తను ఎక్కువ ఇన్స్యూరెన్స్ వ్యాపారం చేసానని చెప్పి ఆనందించడానికి! మరెందుకు ఈయన ఇంత ఇదిగా ఎగిరి
గంతేస్తున్నాడు! అనుకుంటూనే సెల్ చెవి దగ్గర పెట్టుకుని నిరాశక్తిగా అన్నాడు ఏకాంబరం.

"చెప్పండి సార్! ఏమిటి విశేషం?"

"నా అదృష్టం కొద్దీ ఈ బ్రాంచి మేనేజర్ ని అయ్యాను. నేనెప్పుడో పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకోబట్టి నువ్వు నేను పని చేస్తున్న బ్రాంచిలో ఏజెంటుగా చేరావు. నీ మేలు మర్చిపోలేను. నీ ఋణం తీర్చుకోలేను... గడగడా 'మార్కెటింగ్ మోటివేషన్ థాట్' తో గుక్క తిప్పుకోకుండా మాట్లాడేస్తున్నాడు బ్రాంచి మేనేజర్.

"సార్... సార్... ఆగండాగండి! నేను కొత్త ఏజెంట్ ని కాదు. నేను వ్యాపారం చేయకుండా పడుకునే బద్ధకస్తుడ్నికూడా కాదు మీరు నాకు ఎందుకింత ఎంకరేజ్ మెంట్ ఇస్తున్నారు?" విసుగ్గా అనకపోయినా వూకదంపుడు పొగడ్తలకు చిరాగ్గా అనేసాడు ఏకాంబర్.

"యూ ఆరే గ్రేట్ ఏకాంబర్! యూ ఆరే జీనియస్... యువర్ ఫెర్మార్మెన్స్ మార్వలెస్. మెమరబుల్ ఎచీవ్ మెంట్. మైండ్ బ్లోయింగ్!" తెలుగు మర్చిపోయి ఆంగ్లం లో అదరగొట్టేస్తున్నాడు బ్రాంచి మేనేజర్.

"సార్ మీరేం చెప్తున్నారో నాకర్ధం కావడంలేదు. నేనేం చేసానో నాకే అంతుచిక్కడం లేదు" అయోమయంగా అన్నాడు ఏకాంబర్.

"అంతా నువ్వే చేసావు ఏకాంబర్! ఈ నెల నీ కమీషన్ ఎంత వచ్చిందో తెలుసా! బాప్ రే! మన జోన్ మొత్తంలో 'టాప్' కమీషన్ తీసుకున్నది నువ్వే. యూ ఆరే టాపర్! మన జోనల్ మేనేజర్ గారు నీకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందిస్తామన్నారు" చెప్పాడు బ్రాంచి మేనేజర్.

'హమ్మయ్యా అదా విషయం' అని అనుకుంటూ ఛటుక్కున తన దగ్గరున్న సెల్ లో బ్యాంకు వాళ్ళిచ్చిన మెసేజ్ చూసాడు. ఇన్ కంటాక్స్ కట్ చేసి మిగతాది అకౌంట్ లో జమ అయింది. అంత మొత్తం తను జాయిన్ అయిన తర్వాత ఇదే చూడ్డం. ఆశ్చర్యం... ఆనందం కలగాపులగమైపోయాయి. అయినా, మనసులో ఇంకా ఏదో వెలితి. మనస్ఫూర్తిగా సంతోషపడలేకపోతున్నాడు.

ఇదే ఇంకో సమయంలో అయితే ఎగిరి గంతేసి వెళ్ళి అమ్మకి చెప్పేసేవాడు. డిపార్ట్ మెంటల్ స్టోర్స్ కి వెళ్ళి తండ్రికి చెప్పేవాడు.

కానీ, ఎందుకో ఈ క్షణం బ్రతుకంతా శూన్యంగానూ, మనసంతా వెలితిగానూ, గుండెంతా బరువుగానూ ఉంది.

'ఈ రోజు వరకూ నూకరత్నం నుండి ఫోన్ రాలేదు. వస్తుందా! రాదా?! తనంటే ఆమెకు ఇష్టం లేదా?! లేదా వేరే ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా'

పరిపరివిధాల ఆలోచిస్తున్నాడు ఏకాంబర్.

ఇంతలో సెల్ రింగయింది. ఎవరో తెలియని వ్యక్తి నెంబరు. పేరు రావడం లేదు. ఎవరో కొత్త వ్యక్తి. పాలసీ కోసం... ఏదో ఎంక్వయిరీ కోసం చేస్తూ ఉండి ఉండాలి. ఎత్తి మాట్లాడాక ఒకంతట వదిలిపెట్టరు. తను కూడా ఆప్యాయంగా పలకరించి వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు లాగేస్తాడు. అడ్రస్ తో సహా అంతా తెలుసుకున్నాక చివర అతనికి కావలసిన సమాచారం ఇస్తాడు. అప్పటికప్పుడు అతని పేరు, అడ్రస్ సెల్ లో ఫీడ్ చేసుకుంటాడు. అందుకే ప్రతీ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటాడు ఏకాంబర్.

'ఎత్తాలా వద్దా' అని క్షణం ఆలోచిస్తూ అప్రయత్నంగానే ఫోన్ తీసాడు ఏకాంబర్. అవతల వ్యక్తితో మాట్లాడే లోపల 'నూకరత్నం చేస్తుందేమో... ఫోన్ ఎంగేజ్ అని విసుక్కుని అసలు చెయ్యడమే మానేస్తుందేమోనని 'ఏకాంబరం' ఆలోచన... ఆందోళన.

"హలో ఏజెంట్ ఏకాంబర్ స్పీకింగ్..." అలవాటు ప్రకారం అవతల వ్యక్తిని పలకరించాడు ఏకాంబర్.

"నేనండి..." అని అవతలనుండి తియ్యని గొంతు వినిపించేసరికి ఏకాంబరం గుండె లబ్ డబ్ మని వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.

"మీరు..." ఆనందం... ఆశ్చర్యం... ఆతృత... అణుచుకోలేకపోతున్నాడు ఏకాంబర్.

"నేను రత్నాన్నండి! మీరు కలుద్దామన్నారుగా..." నెమ్మదిగా, తియ్యగా, మృదుమధురంగా అంటోంది నూకరత్నం.

"ఆ... అవును... అవును... ఎక్కడ...?!" గాబరాగా అన్నాడు ఏకాంబర్.

"నాకేం తెలుసు?! మీరే చెప్పండి. నాకసలే ఈ పట్నం కొత్త కదా!" ఎవరైనా వింటారేమోనని నసిగి నసిగి మాట్లాడుతోంది రత్నం.

"అవును కదా! మీకు ఉడా పార్కు తెలుసా... అమ్మో అంత దూరం మీరొక్కరూ ఎలా రాగలరు. ఒక పని చెయ్యండి. మీరు ఇంటి దగ్గర నుండి బయలుదేరి ఎన్ ఏ డి కొత్తరోడ్ దగ్గరుండండి. నేను వస్తాను. నా బైక్ మీద వెళ్దాం." అన్నాడు ఏకాంబర్.

"అమ్మో! ఎవరైనా చూస్తేనో?" అవతలనుండి భయంగా అంది నూకరత్నం.

"ఎవర్ని నన్నా? మిమ్మల్నా?" అడిగాడు ఏకాంబరం.

"నన్ను... నన్నెవరైనా గుర్తు పడతారేమో?" అనుమానంగా అంది.

"మీదీవూరే కాదన్నారు కదా? మిమ్మల్నెవరు గుర్తిస్తారు! ఈ మహానగరంలో నన్నే ఎవడూ పట్టించుకోడు" తేలిగ్గా అన్నాడు ఏకాంబర్.

"సరిసరి! అమ్మ వస్తున్నట్టుంది ఫోన్ పెట్టేస్తాను. సరిగ్గా పది గంటలకి ఎన్.ఏ.డి జంక్షన్ లో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర మీకోసం వెయిట్ చేస్తాను" అంటూ ఫోన్ కట్ చేసేసింది నూకరత్నం.

నూకరత్నం తో ఫోన్ మాట్లాడగానే వెయ్యేనుగుల బలం వచ్చింది ఏకాంబరానికి. గుండెల్నిండా వూపిరి పీల్చుకున్నాడు. ఒక్క నిమిషం తనూ నూకరత్నం కలవబోయే ఆనంద క్షణాల కోసం ఊహించుకున్నాడు.

చటుక్కున లేచి వాచీ కేసి చూసుకుని ఆతృతగా బాత్ రూమ్ లోకి పరుగందుకున్నాడు ఏకాంబర్.

ఆ క్షణం -

జోన్ లోనే 'టాపర్'నని గాని, ఆ వార్త అమ్మా నాన్నలకి చెప్పాలన్న విషయమే విస్మరించాడు. మరికొద్ది నిమిషాల్లో నూకరత్నంతో కలిసే ఆనందకర సన్నివేశాన్ని తలచుకుంటూ బాత్ రూమ్ లోకి దూరాడు ఏకాంబర్.

***

టంచన్ గా పదో గంటకి ఎన్.ఏ.డి కొత్త రోడ్ దగ్గరకు చేరుకున్నాడు ఏకాంబరం. అప్పటికే అక్కడ కాచుకుని కూర్చుంది నూకరత్నం. బైక్ మీద హీరోలా వచ్చిన ఏకాంబరాన్ని చూస్తూనే ఆనందంతో గంతు వేసింది ఆమె హృదయం. అయితే, బయటకు ఎలాంటి భావన ప్రకటించకుండా మౌనంగా ఏకాంబరాన్నే చూస్తూ నిలబడింది.

బైక్ ని నేరుగా నూకరత్నం నిలబడి ఎదురు చూస్తున్న పెట్రోల్ బంక్ ప్రక్కకు తీసుకెళ్ళి ఆపాడు.

బైక్ తన ముందాగినా ఎక్కడానికి తటపటాయిస్తూ అటూ ఇటూ చూస్తూ నిలబడింది నూకరత్నం.

తలకి పెట్టుకున్న హెల్మెట్ తీసి 'రత్నం గారూ! నేనే! కిడ్నాపర్ ని కాదు. నన్ను దూరం నుండే గుర్తు పట్టారు కదా!" నూకరత్నాన్ని బైక్ ఎక్కమని సైగ చేస్తూ అన్నాడు ఏకాంబర్.

"మీ బైక్ చూసే గుర్తుపట్టాను. హెల్మెట్ పెట్టుకుని ఉంటే దొంగెవరో, దొరెవరో ఎలా తెలుస్తుంది" అంటూ నవ్వి ఏకాంబరం వెనుకే నాజూగ్గా ఎక్కి ప్రక్కనున్న హుక్కు గట్టిగా పట్టుకుంటూ కూర్చుంది నూకరత్నం.

"ఇది ఆటో కాదు. బైక్. బాగా కూర్చోండి. బెదిరిపోనక్కరలేదు. బాగానే డ్రైవ్ చేస్తాను" అంటూ ఒక్కసారే బైక్ ని ముందుకురికించాడు ఏకాంబరం. ఆ దూకుడికి నూకరత్నం ఒక్కసారే తూలి ఏకాంబరం మీద వాలిపోయింది. హఠాత్తుగా బైక్ వేగం పుంజుకునేసరికి అమాంతం, ఏకాంబరం మీద పడుతూ గబాలున వెనుకనుండి ఏకాంబరం నడుము చుట్టూ రెండు చేతుల్తో చుట్టి గట్టిగా వాటేసుకుంది నూకరత్నం.

అలా నూకరత్నం వాటేసుకోగానే ఒళ్లు జలదరించి మనసు పులకించి బైక్ ని మరింత స్పీడుగా ముందుకు ఉరికించాడు ఏకాంబర్.

"అంబర్ గారూ! మనం అంబరంలో లేము. అందరి మధ్యా ఉన్నాము. కొంచెం స్పీడు తగ్గించండి. బ్రేకులు ఫెయిలయితే బ్రతుకులు బూడిదైపోతాయి" ఏకాంబరాన్ని గట్టిగా గిల్లుతూ చెప్పింది నూకరత్నం.

"బైకు మీదున్నాను. మీరలా కితకితలు పెడితే నేనే కాదు. మీరూ క్రింద పడతారు" స్పీడు తగ్గిస్తూ అన్నాడు ఏకాంబర్.

"అందుకేగా కొంచెం స్లోగా వెళ్ళమంటున్నది." ఏకాంబరం నడుంచుట్టూ బిగుసుకున్న చేతులు విడదీసి వెనక్కి జరిగి మళ్ళీ బైకు ప్రక్కనే ఉన్న హుక్కుని గట్టిగా పట్టుకుంది నూకరత్నం.

"గాల్లో తేలినట్టుందే..." అంటూ హుషారైన పాటని హమ్ చేసుకుంటూ బైక్ ని డ్రైవ్ చేస్తున్నాడు ఏకాంబరం.

"సార్!... మీరు గాల్లో తేల్తే నేను భూమ్మీద వాల్తాను. మందు కొట్టినట్టు నడపకుండా ముందు చూస్తూ నడపండి" అనేసరికి పాట ఆపేసి ముసిముసిగా నవ్వుకున్నాడు ఏకాంబర్.

నేషనల్ హైవే లో నేరుగా వెళ్ళి పెదవాల్తేరు రోడ్డులోనుండి ఉడాపార్క్ దగ్గర ఆగాడు ఏకాంబర్.

"అమ్మో! ఇక్కడ చాలామందున్నారే! ఎవరైనా చూస్తేనో?!" టక్కున అంది నూకరత్నం.

"చూస్తే ఏమైంది?! భయపడితే బ్రతకలేరు. అయినా, మనం ఇలా కలిసి తిరగడం తప్పా?! భలేవారే! మీ ఊరి జ్ఞాపకాలు,... కట్టుబాట్లు వదిలి ఒక్కసారి 'నగరం'లో నాల్రోజులు తిరిగి చూడండి! తెలుస్తుంది" అంటూ బైక్ ని ఓ ప్రక్క పార్క్ చేసి పార్క్ లోపలకు వెళ్ళడానికి ఎంట్రన్స్ టిక్కెట్లు తీసుకున్నాడు ఏకాంబర్.

ఇద్దరూ పార్క్ లో అన్ని మూలలూ తిరిగి తిరిగి ఎక్కడైనా ఏకాంతం దొరుకుతుందేమోనని వెదికి చివరికి స్కేటింగ్ పార్క్ ప్రక్కనే గుబురుగా ఉన్న చోట సిమ్మెంటు బల్ల మీద కూర్చున్నారు.

"మా ఊరు ఎలా ఉంది?" నూకరత్నం మొహంకేసి చూస్తూ అన్నాడు ఏకాంబరం. ఉలిక్కిపడి ఏకాంబరం కేసి చురుగ్గా చూసింది నూకరత్నం.

"ఇది ఊరా?! నన్నెగతాళి చేస్తున్నారా? ఎన్నో వందల ఊర్లు కలిసిన మహా సముద్రంలాంటి నగరం..." తన్మయంగా తన సంతోషం వ్యక్తపరుస్తూ హుషారుగా అంది.

"కదా! ఇది మహా సముద్రం. 'ఎవరికి వారే యమునా తీరే' అన్నట్టు ప్రక్కవాళ్ళ గురించి పట్టించుకునేంత ఓపిక, తీరిక లేని జనం. మీరిక రిలాక్స్ డ్ గా కూర్చోండి" బల్లమీద వెనక్కి సర్దుకు కూర్చుంటూ అన్నాడు ఏకాంబర్.

"అలాగే! చెప్పండి! ఎందుకు పిలిచారు?" గోముగా అంది.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kittugadu inter fail ias pass