Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

agent ekamber

"పిలవకూడదా?!" కొంటెగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఏకాంబరం.

"అలా అనుకుంటే ఇలా రాను కదా!" చురుగ్గా ఏకాంబరం కళ్ళల్లోకి చూస్తూ అంది.

"థేంక్స్!" అన్నాడు ఏకాంబరం.

"ఎందుకు?" అంది నూకరత్నం.

"నా మీద నమ్మకంతో వచ్చినందుకు!" అన్నాడు అతను.

"పరోపకారులు అపకారులు కాలేరు" అంది ఆమె.

"వేమన శతకం బట్టీ పట్టేసారే" నవ్వుతూ అన్నాడు ఏకాంబరం.

"మీరు వేమన అవతారం ఎత్తేసారు కదా!" చిలిపిగా నవ్వుతూ అంది.

ఆమె అలా అనేసరికి ఉలిక్కిపడ్డాడు ఏకాంబరం . తనని తాను ఓసారి ఎగాదిగా చూసుకున్నాడు. గబాలున నిలబడి ఫేంట్ జిప్ ఉందో లేదో చూసుకున్నాడు. బాగానే ఉంది. షర్టు ఫేంటు ఎక్కడన్నా చిరిగిందేమోనని కిస్తా గిస్తా చెక్ చేసుకున్నాడు. ఎక్కడా ఎలాంటి లోపం లేదు.

"అదేంటి రత్నంగారూ! అలా అన్నారేమిటి? కొంపదీసి నా 'అవతారం' అలా లేదు కదా!" తనలో ఎక్కడ తేడా ఉందోనని కంగారుతో బెగిలిపోతూ అన్నాడు ఏకాంబర్.

"మీరు కాదు మీ మనసు. 'పరోపకారాయ ఇదం శరీరం' అని కనిపించిన వాళ్ళందరికీ సహాయపడుతుంటారు కదా! 'వేమన' శతకాన్ని ఒంటబట్టించుకుని ఆ సూత్రాల్ని అమలు చేస్తున్నారుగా!" ఓరగా ఏకాంబరం కళ్ళల్లోకి చూస్తూ అంది నూకరత్నం.

'హమ్మయ్య! బ్రతికించింది' మనసులోనే కుదుటపడ్డాడు ఏకాంబర్.

'అమ్మో! ఈ అమ్మాయి అమాయకురాలు కాదు. తెలివైనది. సమయస్ఫూర్తి కలది' మనసులోనే నూకరత్నాన్ని మెచ్చుకున్నాడు ఏకాంబరం. నూకరత్నంతో మాట్లాడుతుంటే ఆమెలో దాగివున్న సహజసిద్ధమైన తెలివి, తెగింపు, చమత్కారం, సమయస్ఫూర్తి ఒకొక్కటిగా అర్ధమౌతున్నాయి ఏకాంబరానికి.

"ఇంత తెలివైన వారు, తిన్నగా వెళ్ళి బట్టల షాపులో సేల్స్ గర్ల్ గా జాయిన్ అయ్యారెందుకు?" సూటిగా అడిగాడు ఏకాంబర్.

ఉన్నట్టుండి ఏకాంబర్ ఆ ప్రశ్న వేస్తాడని ఊహించలేకపోయింది నూకరత్నం. హొటల్ లో కూడా ఇదే ప్రశ్న అడిగాడు. సమాధానం చెప్పింది. అయినా మళ్ళీ అదే ప్రశ్న. ఇతనికి మతి గాని పోలేదు కదా' మనసులోనే తర్కించుకుంది నూకరత్నం.

"మీరేమంటున్నారో... నాకర్ధం కాలేదు" ఏకాంబర్ కేసి చూస్తూ అంది.

"డిగ్రీ చదువుకుని ఇంత చురుకైన మీరు పోయి పోయి ఎదుగు బొదుగు లేని కూపస్థమండూకం లాంటి బట్టల షాపులో 'కొలువు'కు చేరాలంటే నాకు బాధగా ఉంది." అన్నాడు ఏకాంబర్.

"మొన్నే చెప్పాను కదా సార్ మా ఇంటి పరిస్థితి. అవసరం కోసం ఏదో ఒకటి" బాధగా కళ్ళల్లో నీళ్ళు దించుకుంటూ అంది నూకరత్నం.

"ప్లీజ్ ఏడవకండి రత్నం గారూ! ప్లీజ్ మిమ్మల్ని ఇక్కడకు పిలిచింది ఏడిపించడానిక్కాదు... నవ్వించడానికి" భయం... భయంగా ఆమె చేతిని తాకుతూ బుదిరించడానికి ప్రయత్నిస్తూ అన్నాడు ఏకాంబర్.

ఏకాంబర్ అలా తాకేసరికి చటుక్కున తల ఎత్తి చూసింది రత్నం.

"మీరు అలా కన్నీళ్లు దించుకుంటూ... ఉంటే... చూసిన వాళ్లెవరైనా నేను మిమ్మల్ని ఏదో చేసేసానని వచ్చి నాలుగు బాదినా బాదేస్తారండీ బాబూ! కనీసం ఏమైందని కూడా అడగరు. ప్లీజ్ ఆపండి బాబోయ్!" నూకరత్నం కళ్ళు తుడవబోయాడు ఏకాంబర్.

"ఆగండి! నా దగ్గర కర్చీఫ్ ఉంది" అంటూ కర్చీఫ్ తీసి కళ్ళు తుడుచుకుంది ఆమె.

"మీకు అభ్యంతరం లేకపోతే నేను నా కస్టమర్ల కోసం 'పాలసీ సర్వీస్ సెంటర్' ప్రారంభిస్తున్నాను. అందులోనే మీరు సొంతంగా నిర్వహించేలా "ఆల్ ఇన్ వన్ సర్వీస్ సెంటర్" స్టార్ట్ చేద్దాం. దానికి మీరే ఓనర్. మీరే క్లీనర్." తన ఆలోచన నూకరత్నానికి చెప్పాడు ఏకాంబర్.

"ఆల్ ఇన్ వన్" సర్వీస్ సెంటర్ అంటే...?! పైగా నేనే ఓనరు... నేనే క్లీనరా...?! నాకర్ధం కాలేద్సార్!" కళ్ళింత చేసుకుని ఏకాంబర్ కేసి చూస్తూ అంది నూకరత్నం.

"ఏం చేయాలో... ఎలా చేయాలో... నేను చెప్తా కదా! బ్యాంకులకు, ఇన్స్యూరెన్స్ కంపెనీ' లకు మీరు 'కార్పోరేట్ ఏజెంట్' గా చేరతారు. బ్యాంకు రుణాల వాయిదాలు వసూలు చేయడం, అలాగే ఇన్స్యూరెన్స్ కంపెనీల ప్రీమియం వసూలు చేయడం ఇంకా మీరు చేయగలిగితే సెల్ ఫోన్ కంపెనీల కస్టమర్ల సర్వీసు కూడా ఫ్రాంచైజీ తీసుకుందాం!" విడమర్చి చెప్పాడు ఏకాంబర్.

"మొన్నే చెప్పారుగా. దీనివలన మనకేంటి లాభం! నేనే ఓనర్ అది కరెక్ట్. కాని నేనే క్లీనర్ అంటున్నారే?" ఆశ్చర్యంగా అంది నూకరత్నం.

"అయ్యో! అది ఏదో వేళాకోళానికి మాటవరసకి అన్నాను. అయినా, మొదట అన్ని పనులూ మనమే చేసుకోవాలి కదా! షాపు తియ్యడం, ముయ్యడం, గచ్చులు తుడవడం వగైరా 'క్లీనర్' జాబ్. అందుకే అలా అన్నాను" నవ్వుతూ అన్నాడు ఏకాంబర్.

"సరి సరే. మీకంతా నవ్వులాటగానే ఉంటుంది. పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణసంకటంలాగా వుంది నా పరిస్థితి" బాధతో అలిగి మొహం తిప్పుకుంటూ అంది నూకరత్నం.

"సారీ! సారీ! సరదాకి అన్నాను" రత్నానికి క్షమాపణలు చెప్తున్నట్లు బుగ్గలమీద కొట్టుకుని చెవులు పట్టుకుని గుంజీలు తీస్తున్నట్టు నటించాడు ఏకాంబర్.

"ఈ వేషాలేం అక్కరలేదు. ఆ సంస్థలన్నీంటికీ వాయిదాలు, బిల్లులు, రుణాలు వసూలు చేయడం వల్ల నాకేంటండీ లాభం!?! నేనొక్కదాన్నే అన్ని పనులూ చెయ్యగలనా?!" అమాయకంగా అడిగింది నూకరత్నం.

"మీరొక్కరే కాదు. మీ క్రింద నలుగురైదుగురు కుర్రాళ్ళని కలెక్షన్ బోయ్స్ గా వేసుకుంటాం. వాళ్ళు వసూలు చేస్తారు" చెప్పాడు ఏకాంబర్.

"సరిపోయింది. తినడానికి తిండి లేదు గాని మీసాలకి సంపెంగనూనె కావాలన్నాడట వెనకటికి మీలాంటివాడు. సరైన ఉద్యోగం దొరక్క బట్టల షాపులో చేరితే తిడుతున్నారు మీరే. ఇప్పుడు నేను నా క్రింద నలుగురైదుగురు కలక్షన్ బోయ్ లు! బావుందండీ! తడి తక్కువ తమాషా ఎక్కువలా వుంది. నాకేమొస్తుందో తెలీదు. ఎలా చెయ్యాలో తెలీదు. అసలు ఇంతకీ వాళ్ళంతా 'ఫ్రాంచైజీ'లు నాకిస్తారో లేదో తెలీదు. నెల జీతాలకి బోయ్ లు. వాళ్ళకి ఎలా చెల్లిస్తామండీ జీతాలు? బావుందండీ భాగోతం" వెటకారంగా నవ్వుతూ అంది ఆమె.

"మీకు 'కమీషన్' వస్తుందండి. మీరు నెలనెలా వసూలు చేసే మొత్తం మీద నెలకి నూటికి పది రూపాయల వరకు కమీషన్ రావచ్చు. కొన్ని కంపెనీలు ఇంకా ఎక్కువ ఇస్తాయి. కొన్ని తక్కువ ఇస్తాయి. సపోజ్! మీరు అన్ని కంపెనీలని కలుపుకుని ఓ ఇరవై లక్షలు వసూలు చేసారనుకోండి. రెండు లక్షల వరకూ రావచ్చు మీ కమీషన్"

"ఆ!..." అంటూ ఆశ్చర్యంతో వెనక్కి పడిపోబోయింది నూకరత్నం. వెంటనే ఆమెని రెండు చేతుల్తో పట్టుకున్నాడు ఏకాంబర్.

"మీరు జోకులు బాగా చెప్తారండి!" తేరుకుంటూ అంది నూకరత్నం.

"నేను వస్తాయనలేదండి. రావచ్చు అన్నాను. మనం బాగా అన్ని 'కంపెనీ'లతో టై అప్ అయి, కుర్రాళ్ళని పెట్టి నెల వాయిదాలు సక్రమంగా సక్సెస్ ఫుల్ గా వసూలు చేస్తే నెలకి ఇరవై లక్షలు చెయ్యగలిగితే అంత కమీషన్ వస్తుందని అంచనా చెప్తున్నాను" అన్నాడు ఏకాంబర్.

"నాయనా! నేను మీకులా పగటి కలలు కనలేను. ఇన్ని వేషాలు వెయ్యలేను. గంతకు తగ్గ బొంత లాగా నామొహానికి  ఆ బట్టల షాప్ కరెక్ట్! దయచేసి నాకు రంగుల కలలు చూపించి నన్ను రోడ్డు మీదకి లాగెయ్యకండి! ప్లీజ్" ఏకాంబరానికి రెండు చేతుల్తో దండం పెడుతూ అంది నూకరత్నం.

"నిజమే రత్నంగారూ! మీ ఆవేదన నాకు అర్ధమైంది. తీవ్రమైన మనస్థాపానికి గురైన వారికి ఆత్మస్థైర్యం దెబ్బ తినడమేకాదు, చుట్టూ గాడాంధకారమే గోచరిస్తుంది కాదనను. ఒక్కమాట! ఒకప్పుడు మీకులాగే నేనూ 'ఏం చేయగలననుకునేవాడ్ని. నేను చదివిన అట్టెసరు చదువుకి పనే దొరకదు అనుకునేవాడ్ని. మా ఇంట్లో కూడా నన్ను ఓ పురుగును చూసినట్టు చూసేవారు. నిజంగా... నాకు నేనే గడిచిన గతాన్ని నెమరు వేసుకూంటుంటే ఆశ్చర్యం కలుగుతుంది" తీవ్రమైన ఆందోళనతో ఆత్మస్థైర్యం కోల్పోయి విచారవదనంతో తల దించుకున్న నూకరత్నం కేసి చూస్తూ లాలనగా అన్నాడు ఏకాంబర్.

ఏకాంబర్ చెప్తున్న విషయం వింటూనే దిగ్గున తల ఎత్తి ఆశ్చర్యంగా అతని కళ్లలోకి చూసింది నూకరత్నం.

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ గడిపే ఏకాంబర్ కళ్ళల్లో కన్నీటి తెర లీలగా కదలడం గమనించిన నూకరత్నం మరింత అబ్బురంగా చూస్తూ గబాలున ఏకాంబర్ చెయ్యి పట్టుకుని అభిమానంగా అంది.

"ఏయ్! అంబర్ సాబ్! క్యాకరో! మీ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ఆనందమా?! ఆవేదనా?!" ఏకాంబరాన్ని నవ్వించడానికి ప్రయత్నిస్తూ అంది నూకరత్నం.

"ఛ! ఛ! ఆవేదనెందుకు? ఆనందభాష్పాలే! ఛీత్కారాలు పొందిన చోటే సత్కారాలు అందుకుంటున్నాను. తలచుకుంటేనే అంతా గమ్మత్తుగా అనిపిస్తోంది" చిన్నగా నవ్వుతూ అన్నాడు ఏకాంబర్.

"ఆ గమ్మత్తేదో నాకూ చూపించరా! ప్లీజ్! ప్లీజ్!" ఏకాంబరాన్ని మామూలు మూడ్ లోకి రప్పించాలని అల్లరిగా అంది నూకరత్నం.

చిన్నగా నవ్వుతూ తనని పట్టి కుదుపుతూ తన గతాన్ని... దాని గమ్మత్తుని చెప్పమని అడుగుతున్న నూకరత్నం కళ్ళల్లోకి సూటిగా చూసాడు ఏకాంబరం. ఆ కళ్ళల్లో ఏదో తెలియని అనిర్వచనీయమైన ఆకర్షణ... ఆదరణ... ఆప్యాయత... ఇంకా... ఏదో... మరేదో తెలీని 'వశీకరణజాలం' ఏకాంబరాన్ని వశపరచుకుంటోంది.

ఆత్మనూన్యతతో బాధపడుతున్న 'నూకరత్నాన్ని' కార్యోన్ముఖురాలిని చేసి తన మార్గంలో పయనించేలా చేయాలంటే తన అనుభవాలు... అపచారాలు... అవమానాలు... అన్నీ విడమర్చి చెప్పాలి. మనిషి తలచుకుంటే దేన్నైనా సాధించగలడనే నమ్మకాన్ని రగిలించాలి. ఆమెలో ఆత్మ విశ్వాసాన్ని కలిగించాలి' మనసులోనే అనుకున్నాడు ఏకాంబర్. మౌనంగా తల దించుకుని అయిదేళ్ళ క్రితం తాను ఎలా ఉండేవాడో వెనక్కి తిరిగి చూసుకున్నాడు.

అల్లరి చిల్లరగా ఆకతాయిగా... ఆటా పాటా తప్ప చదువూ సంధ్యలు అబ్బని మొద్దబ్బాయిగా... ఇంట్లోనూ వీధిలోనూ ఎందుకూ కొరగాని గడుగ్గాయిగా... ఊరంతా తననో 'వూక'లా వూదేసినప్పుడు... ఇంట్లో అమ్మనాన్న అన్నలు కూడా తననో 'డస్ట్ బిన్'లా చూసినప్పుడు... ఆ రోజుల్లో... ఆ క్షణాల్లో... గతం బ్లాక్ అండ్ వైట్ సినిమాలా కనిపించేసరికి ఏకాంబర్ కళ్ళల్లో ఒక్కసారే జలపాతంలా నీళ్ళూరాయి. టపటపా కన్నీటి బొట్లు రాలి క్రింద పడుతూంటే చూసిన నూకరత్నం చటుక్కున ఏకాంబర్ భుజం మీద చెయ్యి వెయ్యబోయింది. సున్నితంగా ఆమె చేతిని అడ్డుకుంటూ చెప్పడం ప్రారంభించాడు ఏకాంబర్.

ఆ రోజు - డోలా పౌర్ణమి.

అసలే స్థిరవారం. దానికి తోడు డోలా పౌర్ణమి. సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడానికి ఉత్తరాంధ్రా ప్రాంతాలనుండి గ్రామాలు గ్రామాలు మూకుమ్మడిగా తరలి వచ్చేసాయా అన్నట్టు యాత్రీకులు కుమ్మేసారు. లక్షల్లో వచ్చిన భక్తులు క్రింద వూరంతా ఆక్రమించేసారు. సింహాచలం వూర్లో తోటల్లోనూ, పొలాల్లోనూ, ఎక్కడ ఖాళీగా వుంటే అక్కడ బస చేసి వంటలు వండుకుంటున్నారు. చాలామంది ఎడ్ల బళ్ళలో వచ్చారు. తోటల్లో చెట్ల కింద మకాం వేసారు.

శుక్రవారం రాత్రి నుండి భక్తుల రాక ప్రారంభమయింది. గుంపులు గుంపులుగా భక్తులు దర్శనానికి వస్తున్నారు. ఒకో గుంపులో చిన్నా, పెద్దా, ముసలి, ముతకా, ఆడామగా అంతా కలిసి రెండొందల నుండి మూడొందల మంది కూడా ఉన్నారు. చిన్న చిన్న గుంపుల్లో కూడా పాతిక ముఫ్ఫై మందికి తగ్గి లేరు.

డోలా పౌర్ణమి అంటే 'సింహాద్రి అప్పన్న' తీర్ధ మహోత్సవాల్లో ముఖ్యమైనది. ఏడాదికోమారు జరిగే చందనోత్సవం తర్వాత అంత రద్దీ డోలా పౌర్ణమి రోజే ఉంటుంది. అదే రోజు అప్పన్నకి బొట్టినడిగే రోజు. స్వామి కళ్యాణోత్సవానికి ముందు సోదరి పైడి తల్లమ్మని కలిసి 'బొట్టిని' అడిగే తంతు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా ఉద్యానమంటపంలో పానకం పంచుతారు. ఆ తర్వాత నెలలోనే కళ్యాణోత్సవం నిర్వహిస్తారు.

యాత్రకు వచ్చిన యాత్రీకులంతా పల్లెటూర్లనుండి వచ్చిన వాళ్ళే. తమ ఇలవేల్పయిన సింహాద్రి అప్పన్నకి ఏడాది పొడవునా ఇళ్ళల్లోనే పూజలు జరిపి మొక్కుకున్న మొక్కులు, కట్టుకున్న 'ముడుపులు' తీసుకువచ్చి అప్పన్న హుండీలో వేస్తారు. ఇదే తరుణంగా భావించి ఎంతోమంది తమ ఇలవేల్పుకి 'తలనీలాలు' కూడా సమర్పించుకుని భక్తిని చాటుకుంటారు.

ఒకో గ్రామంలో అయితే వూరంతా ఒకే మాటపై ఇంటికి ఇంతా అని కొంత మొత్తం ఎత్తుకుని గ్రామ పెద్దల నేతృత్వంలో అందరూ ఒకే కుటుంబంగా కలిసి దేవుడి దర్శనానికి వస్తూంటారు.

శుక్రవారం రాత్రే ఎక్కువమంది వచ్చి ఆ రాత్రి సింహాచలం పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ 'బిచాణాలు' పరుచుకుని వంట వార్పూ చేసుకుని భోజనాలు చేసి పడుకుంటారు. అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటగానే నిద్రలేచి దేవుడి దర్శనానికి బయలుదేరుతారు. ముందుగా దేవుడి కోనేరులో స్నానమాచరించి గాని కొండ పైకి బయలుదేరరు.

కొండ దిగువనే ఉన్న 'వరాహ పుష్కరిణి'కి (దేవుడి కోనేరు) వెళ్ళి తలారా స్నానాలు చేసి కాలి నడకనే మెట్ల మార్గంలో నడుచుకుంటూ కొండ పైకి చేరుకుంటారు. నడవలేని ముసలివాళ్లు సైతం ఓపిగ్గా మెట్లెక్కడానికి ఇష్టపడతారు.

మెట్ల మార్గంలో ఉన్న పన్నెండు దారల్లో మునుగుతూ తడిబట్టలతోనే అంత చలిలోనూ 'గోవిందా గోవింద' అని గొంతెత్తి స్వామివారిని స్మరించుకుంటూ భక్తి పారవశ్యంతో కొండపైకి చేరుకుంటారు.

మెట్ల మార్గం మధ్యలో ఉన్న 'ఆంజనేయస్వామి' ని దర్శించుకుంటారు.

ఆ రోజు -

విశాఖపట్నంలో ఉన్న పోలీసు బెటాలియనంతా సింహాచలంలోనే మకాం వేసింది. యాత్రీకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు గస్తీకి వస్తారు. వూర్లో వున్న లాడ్జీలు, సత్రాలు అన్నీ నిండిపోయి ఇంకా చాలక వూర్లో వున్న తోటలు, పొలాల్లో సైతం భక్తులు 'బిచాణాలు' పరుచుకుని ఆ రాత్రి కాలక్షేపం చేసేస్తారు. సింహాచలం పుణ్యక్షేత్రానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి ఎడ్లబండ్ల మీద వచ్చిన భక్తులు తమతోపాటు దేవునికి సమర్పించడానికి కోడి దూడలను తీసుకువచ్చి దేవాలయానికి అప్పగిస్తూంటారు.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kittugadu inter fail ias pass