Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

అంద‌రిలాంటి క‌థానాయిక‌ను కానునేను! - అమ‌లాపాల్‌

Interview with Amala Paul

క‌థానాయిక అన్నాక‌... గ్లామ‌ర్ సూత్రాన్ని న‌మ్ముకోవ‌ల‌సిందే. లేదంటే రాణించ‌డం చాలా కష్టం. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం... ద‌క్షిణాదిన ఎక్క‌డైనా స‌రే... గ్లామ‌రే నాయిక‌ల మంత్రం కావాలి. కానీ అమ‌లాపాల్ కెరీర్ గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో మొద‌ల‌వ్వ‌లేదు. అస‌లు... ఆ అవ‌కాశ‌మే ఎవ్వ‌రూ ఇవ్వలేదు. మైనా, నాన్న‌, లవ్ ఫెయిల్యూర్‌...  ఇలాంటి సినిమాల్లో ఆమె డీగ్లామ‌ర్‌గా క‌నిపించింది. కానీ జ‌నానికి అదే న‌చ్చింది! క‌థానాయిక కంటే..  ఆమెలో ప‌రిణితి చెందిన న‌టి క‌నిపించింది.  అయితే గ్లామ‌ర్‌డాళ్‌గానూ మెప్పించ‌గ‌ల‌న‌ని నాయ‌క్‌తో  నిరూపించింది. ఆ సినిమా హిట్ట‌యినా.. ఆమె కెరీర్‌కు ఉప‌యోగ‌ప‌డ‌లేక‌పోయింది. అయినా అమ‌లా నిరుత్సాహ‌ప‌డ‌లేదు. త‌న ప్ర‌యాణం ఎక్క‌డైతే మొద‌ల‌య్యిందో అక్క‌డికే వెళ్లింది. చిన్న సినిమాల‌ను ఒప్పుకొంటోంది. తెలుగు, మ‌ల‌యాళం భాష‌ల్లో ఆమె చేస్తున్న‌వి చిన్న సినిమాలే. ఆమె న‌టించిన జెండాపైక‌పిరాజు సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా అమ‌లాపాల్‌తో చిట్టి చిట్ చాట్‌..

* చిన్న సినిమా... పెద్ద సినిమా... ఈ రెండూ మీకు తెలుసు. వీటిలో ఉన్న తేడా ఏం గ‌మ‌నించారు?
- పెద్ద సినిమాలంటే హ‌డావుడి ఎక్కువ‌. స్టార్ కాస్టింగ్‌.. భారీ స్థాయి పాట‌లు.. ఆఖ‌రికి ప్ర‌చారం కూడా భారీ ఎత్తునే ఉంటుంది. ఆ సినిమా ఆడితే... పేరూ అదే సైజ్‌లో ల‌భిస్తుంది. చిన్న సినిమా అలా కాదు. గుట్టుచ‌ప్పుడు కాకుండా తీయొచ్చు. డ‌బ్బులు ఎక్కువ ఖర్చు చేయ‌లేం కాబ‌ట్టి.. ప‌రిమితులు కొన్నుంటాయి. అయితే న‌టిగా ఒక్క‌టి మాత్రం చెప్ప‌గ‌ల‌ను. అది చిన్న సినిమా అయినా,  పెద్ద సినిమా అయినా కెమెరా ముందుకొచ్చిన త‌ర‌వాత న‌ట‌న‌లో ఎలాంటి మార్పూ ఉండ‌దు. సేమ్ టూ సేమ్‌.

* మ‌రి మీ ప్రాధాన్య‌త దేనికి?
- నా కెరీర్ ఒక్క‌సారి గ‌మ‌నించి చూడండి. చిన్న సినిమాల‌తోనే ప్ర‌యాణం మొద‌లైంది. అయితే... నా ప్ర‌తిభ చూసి అగ్ర నిర్మాణ సంస్థ‌లు, పెద్ద ద‌ర్శ‌కులు అవ‌కాశాలిచ్చారు. అయితే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నేను చిన్న సినిమాల్ని వ‌దులుకోను. ఒక్క‌సారి పెద్ద క‌థానాయ‌కుల‌తో, పెద్ద సంస్థ‌ల‌తో సినిమాలు చేస్తే.. ఇక చిన్న‌వారిని ఎవ‌రూ ప‌ట్టించుకోరేమో. నేను మాత్రం అంద‌రిలాంటి క‌థానాయిక‌ను కాను. నేనెక్క‌డి నుంచి వ‌చ్చానో, నా మూలాలేంటో నాకు బాగా తెలుసు. వ‌స్తా నీ వెనుక సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకొన్నానంటే.. కార‌ణం అదే.

* నాయ‌క్ విజ‌యాన్ని మీరు క్యాష్ చేసుకోలేక‌పోయారా?
- ఆ సినిమా నాకు చక్క‌టి అనుభ‌వాన్ని ఇచ్చింది. ఆస్థాయి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో న‌టించ‌డం నాక‌దే తొలిసారి. ఆ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి విజ‌యం అందుకోవ‌డం ఆనందాన్నిచ్చింది. అయితే దాని వ‌ల్ల నాకు ప్ర‌త్యేకంగా వ‌చ్చిందేమిటి? అని నేనెప్పుడూ ఆలోచించుకోలేదు. రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న‌, అందులోనూ వినాయ‌క్ డైరెక్ష‌న్‌లో అవ‌కాశం రావ‌డ‌మే గొప్ప‌. నిజానికి ఆ స‌మ‌యంలో నాకు దొరికిన అద్భుత‌మైన అవ‌కాశం అది. అంత‌కంటే కోరుకొనేది ఏముంది?

* ఈ సినిమాలో న‌టించ‌డానికి కోటి రూపాయ‌ల పారితోషికం అందుకొన్నార‌ట‌. నిజ‌మేనా?
- పారితోషికం గురించి ఆశ‌ప‌డి సినిమాల్ని ఒప్పుకోలేం. అయినా నాకెంత పారితోషికం ఇవ్వాలో నిర్మాత‌లకు బాగా తెలుసు. ఎక్క‌డైనా ప‌నిని బ‌ట్టే పారితోషికం ఉంటుంది.

* పారితోషికాన్ని బ‌ట్టే క‌థానాయిక‌ల గ్రేడింగులు నిర్ణ‌యిస్తున్నారు. మ‌రి ఇందులో మీ గ్రేడ్ ఎంత‌?
- ఇది మ‌రీ అన్యాయ‌మండీ. క‌థానాయిక అందుకొన్న పారితోషికానికీ, ఆమె ప్ర‌తిభ‌కూ సంబంధం ఏమిటి? డ‌బ్బు ఎక్కువ తీసుకొంటే ఏ గ్రేడ్ ఇచ్చేస్తారా? అలా ఇస్తే... నాకు గ్రేడుల‌తో ప‌నిలేదు. అలాంటివి నేను ప‌ట్టించుకోను.

* తొలి రోజుల్లో డీ గ్రామ‌ర్ పాత్ర‌లు పోషించారు. ఇప్పుడు మీకు గ్లామ‌ర్ పాత్ర‌లు రాక‌పోవ‌డానికి అదీ ఓ కార‌ణ‌మేనా?
- నాకు గ్లామ‌ర్ పాత్ర‌లే కావాలి.. అని నేను అడిగితే క‌దా? నాకు ఈ సినిమాలో ఎన్ని పాట‌లున్నాయి? ఎన్ని కాస్టూమ్స్ మారుస్తా? విదేశాల్లో పాట‌లు తీస్తారా? కెమెరామెన్ న‌న్ను అందంగా చూపిస్తాడా? ఇలాంటి ప్ర‌శ్న‌లేం వేయ‌ను. నాక‌ది అన‌వ‌స‌రం కూడా. క‌థ న‌చ్చాలి. ఆ త‌ర‌వాత నా పాత్ర బాగుండాలి. ఆ పాత్ర‌కు నేను స‌రిపోతా.. అనే న‌మ్మ‌కం కుద‌రాలి. అప్పుడే ఓ సినిమా ఒప్పుకొంటా. ఇక నన్ను ఎలా చూపించాలి?? అన్న‌ది ద‌ర్శ‌కుల ప‌ని. అందులో నేను జోక్యం చేసుకోను. మైనా సినిమాని నా జీవితంలో మ‌ర్చిపోను. న‌టిగా నేనంటే ఏమిటో చెప్పిన సినిమా అది. అదేం.. గ్లామ‌ర్ పాత్ర కాదు. కానీ ప్రేక్ష‌కులు గుర్తుపెట్టుకొన్నారు. నన్ను ఆశీర్వ‌దించారు. దీన్ని బ‌ట్టి అర్థ‌మ‌య్యిందేంటంటే... ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సింది గ్లామ‌ర్ కాదు... న‌ట‌న అనే క‌దా?

* తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం.. మీకు సౌక‌ర్యంగా అనిపించిన ప‌రిశ్ర‌మ ఏది?
- సెట్లో ఉంటే సౌక‌ర్యంగా ఉంటా. అది ఏ సెట్లో అనేది అప్ర‌స్తుతం. క‌థ న‌చ్చి, అందులో చేస్తున్న పాత్ర‌పై ప్రేమ పెంచుకొంటే.. ఎప్పుడెప్పుడు షూటింగ్‌కి వెళ్దామా అని ఉంటుంది. అయితే... ఇక్క‌డ భాష‌కు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. నాకు తెలుగు అంత‌గా రాదు. ఇప్పుడు నేర్చేసుకొంటాన్నా లెండి. భాష తెలిస్తే.. ఎక్క‌డైనా స‌రే.. సౌక‌ర్యంగానే ఉంటుంది.

* చిత్ర‌సీమ‌లో క‌థానాయిక‌ల మ‌ధ్య పోటీ ఎక్కువ‌గా ఉంది క‌దా? దాన్ని త‌ట్టుకొనేందుకు ఏం చేస్తున్నారు?
- పోటీ లేనిది ఎక్క‌డ‌? ఇక్క‌డా ఉంది. అయితే... దాన్ని నేనేం ఛాలెంజ్‌గా తీసుకోవ‌డం లేదు. నేనిప్పుడు ఎవ‌రిపై పోటీకి వెళ్లాలి? ఇక్క‌డ అంద‌రికీ అవ‌కాశాలొస్తుంటాయి. అందులో నిరూపించుకొన్న‌వాళ్లే విన్న‌ర్స్‌. అంత‌కు మించిన కిటుకేం లేదు.

* ఫ‌లానా పాత్ర చేయాలి అని ఎప్పుడైనా అనిపించిందా?
- నా కెరీర్ మొద‌లై ఎంతో కాలం అవ్వ‌లేదు. నేనేం వంద‌ల సినిమాలూ చేయ‌లేదు. కాబ‌ట్టి.. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ప్ర‌తీ పాత్రా నాకు కొత్తే. అయితే ఒక్క‌టే ష‌ర‌తు.. ఆ పాత్ర ఇది వ‌ర‌కు నేను చేసిన పాత్ర‌ల‌కంటే భిన్నంగా ఉండాలి. నాలుగు పాట‌లు, ఆరు స‌న్నివేశాలు... అనే లెక్క‌తో క‌థానాయిక పాత్ర చేయ‌మంటే ఒప్పుకోను.

* సినిమా కాకుండా వేరే వ్యాప‌కాలేమైనా...?
- నాకు వ్యాపార‌రంగం అంటే చాలా ఇష్టం. అక్క‌డ పెట్టుబ‌డితోనే కాదు.. మేధ‌స్సుకూ చోటుంటుంది. నాకు ఓ బొటిక్ నిర్వ‌హించాల‌ని ఉంది. రెస్టారెంట్ పెట్టే ఆలోచ‌న కూడా ఉంది. అయితే... అవి ఎప్పుడో చెప్ప‌లేను.

* సొంతంగా సినిమా తీసే ఆలోచ‌న ఉందా?
- య‌స్‌... దాని గురించి కూడా ఆలోచిస్తున్నా. సినిమా తీయ‌డం అంటే అంత ఆషామాషీ కాదు. అనుభ‌వం ముఖ్యం. అందుకే ఇంకొన్నాళ్లు సినిమా తీరుతెన్నుల్ని నిశితంగా ప‌రిశీలిస్తా. అప్పుడు నిర్మాత అవ్వాలా? వ‌ద్దా? అని ఆలోచిస్తా.

* ఓకే.. ఆల్ దిబెస్ట్‌..
- థ్యాంక్యూ.

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
I AM NOT SACHIN