Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kittugadu inter fail ias pass

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

o college drop out gadi prema katha

ధావిధిగా అగరుధూపంవేసి దండం పెట్టుకుని తిరిగి చూసేసరికి అక్కడ ఎదురుగా అతి దిగాలుగా ముఖం పెట్టి నిలబడున్న త్రివిక్రమ్‌ కనిపించాడు.

సాధరణంగా ఉదయం టైంలో త్రివిక్రమ్‌ జైలు ఆఫీసు వైపు తొంగి చూడడు. అలాంటిది ఇప్పుడు తన వెనకే లోనకొచ్చి నిలబడ్డాడంటే ఖచ్చితంగా ఏదో విశేషం వుండే వుంటుందని వూహించాడు ఆంజనేయులు.

''ఏమిట్రా, ప్రొద్దుటే ఆముదం తాగినవాడిలా ఆ ఫేసు నువ్వూనూ ఏమైంది?'' వచ్చి తనసీట్లో కూర్చుంటూ అడిగాడాయన.

''జీవితంమీద విరక్తి పుడుతోంది సాబ్‌! చచ్చిపోవాలనుంది'' బాధగా బదులిచ్చాడు త్రివిక్రమ్‌.

''ఛస్తే చచ్చావ్‌గానీ అదేదో జైలునుంచి రీలీజయ్యాక చావు ఇప్పుడు ఛస్తే అది మా పీకలకి చుట్టుకుంటుంది.''

''అంతేగానీ ఇంత చిన్న వయసులోలే ఆ విరక్తి ఏమిట్రా? నీకొచ్చిన కష్టం ఏమిటి అనడిగారా? అడగరు సార్‌! ఎంతయినా తమరు పోలీసు ఆఫీసరుగదా?''

''స్టుపిడ్‌లా మాట్లాడకు. నీ మనసులో ఏముందో చెప్పిచావు. దానికింత బిల్డప్‌ ఇవ్వక్కరలేదు.''

''నా లైఫ్‌ ఆంబిషన్‌ ఒకటుంది సాబ్‌. మీరు దయతలచి మనసు పెడితే నా చిన్న ఆశ తీరుతుంది. కానీ మీరు చూస్తే చండశాసనులు అందుకే... ఇంత చిన్న కోరిక కూడా తీరని ఈ బ్రతుకు మీద నాకు విరక్తి పుట్టి చావాలనే నిర్ణయానికొచ్చాను.''

''ఏరా... పొద్దుటే నాకు మెంటల్‌ రప్పించే కార్యక్రమం పెట్టుకున్నావా? మర్యాదగా అసలు విషయం చెప్తావా నా లాఠీకి పని కల్పించనా?''

''వద్దు సార్‌! లాఠీ ఎత్తితే మీరు ఆంజనేయులుకాదు, వీరభద్రుడు ఆ సంగతి నాకు తెలుసుగా. అందుకే మనసులోమాట చెప్పేస్తాను... చెప్పమంటారా సార్‌!

''చెప్తావా... చితగ్గొట్టి చెత్తకుప్పలో పడేయమంటావా?''

''క్రికెట్‌ మేచ్‌ చూడాలి సార్‌!''

''చూడు. అదిగో టి.వి... అయినా ఇవాళ మేచ్‌ లేదుగదా?''

''లేదు సార్‌! రేపు కలకత్తా టెస్ట్‌ వుంది. సరిగ్గా ఇవాళకి పదో రోజున వైజాగ్‌లో మేచ్‌ వుంది... నేను చెప్పేది వైజాగ్‌ వన్‌డే మేచ్‌ గురించి.''

''ఆ మేచ్‌ చూడటానికి ఇవాళ నుంచే పర్మిషన్‌ అడుగుతున్నావా? ఓ.కె. ఆ మేచ్‌ కూడా చూడు. నేను వద్దని చెప్పను.''

''నేను చూడాలన్నది టి.వి.లో మేచ్‌కాదు సాబ్‌. నేను వెళ్ళి వైజాగ్‌లో మేచ్‌ను స్టేడియంలో కూర్చుని చూడాలని ఆశ. నేను వైజాగ్‌ వెళ్ళటానికి మీ పర్మిషన్‌ కావాలి'' చివరకు మనసులో మాటని టకటకా బయట పెట్టేసాడు విక్రమ్‌.

''ఇవ్వను. చచ్చినా పర్మిషనివ్వను. ఇక నువ్వు వెళ్ళొచ్చు'' సీరియస్‌గా కుండపగలగొట్టినట్టు చెప్పాడు ఆంజనేయులు.

''ఏరా? పర్మిషనివ్వటమంటే ఇదేమన్నా చిన్నపిల్లల దాగుడు మూతలాట అనుకున్నావా? ఏదో బుద్ధిమంతుడివని అప్పుడప్పుడూ టౌన్‌లోకిపోయి సినిమాచూసి వస్తున్నా పట్టించుకోవటంలేదు. అంతమాత్రాన వూరుదాటి వైజాగ్‌కు ఎలా పర్మిషనిస్తాననుకున్నావు...?'' తిరిగి తనే అడిగాడు.

''అదికాదు సార్‌...''

''షటప్‌! అమ్మా, నన్ను మరీ పిచ్చిపుల్లయ్యని చేద్దామనే. ఇక్కడ రూల్స్‌ ఒప్పుకోవని తెలీదా? వెళ్ళు ఈ క్రికెట్‌ సీజన్‌ అయ్యేంతవరకు నువ్వు టౌన్‌లోకి కూడా పోడానికి వీల్లేదు... వెళ్ళు... వెళ్ళి పనిచూసుకో... అవుట్‌'' అంటూ అరిచాడు.

ఆయన గురించి త్రివిక్రమ్‌కి బాగా తెలుసు.

ఒకసారి నో అన్నాడంటే...

ఇక అరిచి గీపెట్టినా...

ఆయన చేత యస్‌ అన్పించలేం.

తన ప్రయత్నం ఫెయిలయింది.

అందుకే ఆయన్ని మరింత ఇరిటేట్‌ చేయటం ఇష్టంలేక మౌనంగా బయటికొచ్చేసాడు త్రివిక్రమ్‌.

'అమ్మామ్మా... నా పీకలమీదకు తీసుకురావాలనే? చనువిస్తే చంకనెక్కటమంటే ఇదే... వీడసలే మొండిఘటం. ఆ పైన పిచ్చి. పొరబాటున టౌన్‌లోకి వెళ్ళనిచ్చినా అట్నుంచి అటే వైజాగ్‌ చెక్కేసే ప్రమాదం వుంది. లాభంలేదు, వీడ్ని కంట్రోల్లో వుంచాలి' అనుకుంటూ ఆలోచించి స్టాఫ్‌ని పిలిచి త్రివిక్రమ్‌ విషయంలో హూషారుగా వుండమని అందర్నీ హెచ్చరించి, తగిన సూచనలుచేసి పంపించాడు.

ఆయన జైలు స్టాఫ్‌నయితే హెచ్చరించగలిగాడుగానీ త్రివిక్రమ్‌ మనసులోని కోరికను మాత్రం తుడిచేయలేకపోయాడు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తను త్రివిక్రమ్‌ని ఆపలేడన్న సంగతి ఆ క్షణంలో ఆయనకు తెలీదు. తెలిసుంటే పరిస్థితి మరోలా వుండేదేమో!

***

వారం తిరిగిపోయింది.

త్రివిక్రమ్‌కి సంకటంగా వుంది.

అంతకముందు కనీసం బయట అలా టౌన్‌లోకెళ్ళి చక్కగా సినిమాచూసి సరదాగా తిరిగి రాగలిగేవాడు.

కానీ.....

ఇప్పుడా ఛాన్స్‌ కూడా పోయింది.

జైలునుంచి కాలు బయట పెట్టనివ్వటం లేదు జైలు సెంట్రీలు.

బ్రతిమాలుకున్నా లాభం లేకపోతోంది.

''కొన్ని సందర్భాల్లో చెప్పి చేయాలనుకోవటం కూడా ప్రమాదమేనోయ్‌. సిన్సియర్‌గా నువ్వు చెప్పివెళ్ళి క్రికెట్‌ చూసిరావాలనుకున్నావ్‌ ఏమైంది? అసలుకే మోసం వచ్చింది నిన్ను ఇరవైనాలుగు గంటలూ ఓ కంట కనిపెట్టి వుండమని జైలర్‌ సార్‌ ఆర్డర్‌. సారీ త్రివిక్రమ్‌ నేను నీకు రెండువేలు బాకీ వున్న మాట నిజమేగానీ, దానికీ దీనికి లింకు పెట్టకు. నా ఉద్యోగమే పోతుంది'' అంటూ త్రివిక్రమ్‌కి అత్యంత సన్నిహితుడయిన సెంట్రీ వెంకటసామి కూడా చేతులెత్తేయటంతో త్రివిక్రమ్‌కి ఎక్కడలేని నీరసం ముంచుకొచ్చేసింది.

మేచ్‌కి ఇక మూడురోజులే టైముంది.

''ఏం చేయాలి''?

ఇదే ఆలోచన త్రివిక్రమ్‌.

ఇలా వుండగా ఆరోజు ఉదయం త్రివిక్రమ్‌తో బాటు కొంతమంది ఖైదీలు పచ్చగడ్డికోస్తున్నారు. ఖైదీలచేత అక్కడ ఆదాయం సమకూర్చే అనేక పనులు చేయిస్తుంటారు సెంట్రీలు. అందులో పచ్చగడ్డి పెంచి అమ్మించటం ఒకటి.

అంతా పనిలో వున్న టైంలో జైలర్‌ ఆంజనేయులు అటుగా విజిట్‌ చేశాడు. ఆయన బోళాశంకరుడుకదా. అందుకే కాస్త నాలుక దురద కూడా ఎక్కువే. వచ్చినవాడు సైలెంట్‌గా వుండకుండా త్రివిక్రమ్‌ని చూసి ఎగతాలిగా నవ్వాడు.

''హలో మైడియర్‌ బోయ్‌. నువ్వింకా మేచ్‌ చూడాలనే భ్రమలోనే వున్నావా?'' అంటూ పలకరించాడు.

ఆ మాటలో చరుక్కుమంది త్రివిక్రమ్‌కి.

''భ్రమకాదు సార్‌... నిజం... నేను మేచ్‌ చూస్తాను. అరచేత్తో సూర్యుడ్ని ఆపలేరు. పొంగే వరదను ఆనకట్టలు ఆపలేవు, ఈ త్రివిక్రమ్‌ని కూడా మేచ్‌ చూడకుండా ఎవరూ ఆపలేరు. బెట్‌'' అంటూ ఛాలెంజ్‌ చేసాడు.

''సారీ మైబోయ్‌. డ్యూటీమీద మాత్రం నేను బెట్టింగ్‌ కాయను. నిన్ను మేచ్‌ చూడకుండా ఎవరూ ఆపలేరు. ఆమాట నిజమే.

ఎందుకంటే చివరకు నువ్వు చూసేది మా ఆఫీసు టి.వి.లోనేగదా'' అంటూ నవ్వి అక్కడినుండి వెళ్ళిపోయాడాయన.

త్రివిక్రమ్‌ ముఖం మాడ్చుకుని... అలాగే కూర్చుండిపోయాడు.

అతడి పరిస్థితి చూస్తే తోటి ఖైదీలకు బాధకలిగించింది. అక్కడ డ్యూటీలో వున్న సెంట్రీలు ముగ్గురు జైలర్‌ అక్కడ్నించి వెళ్ళిపోగానే దూరంగా వెళ్ళి చెట్టుకింద కూర్చున్నారు.

ఖైదీలు పదిమంది త్రివిక్రమ్‌ వద్దకొచ్చారు.

''త్రివిక్రమ్‌... నువ్వు బయటకెళ్ళిపోతే వైజాగ్‌ వెళ్ళి మేచ్‌ చూడగలవ్‌. అవునా?'' అనడిగాడు వరదయ్య అనే ఖైదీ.

''అవును. కాని బయటకు పోవటం ఎలా? అదే అర్థంకావటంలేదు'' అన్నాడు అందర్నీ చూస్తూ త్రివిక్రమ్‌.

ఎలాగో నేను చెప్తాను. కాని మేచ్‌ చూసాక బుద్ధిగా తిరిగి జైలుకు వచ్చేయాలి. మనమూలంగా జైలర్‌కి చెడ్డపేరు రాకూడదు.''

''వచ్చేస్తారా... పారిపోవాలని నాకు లేదు. అలా చేస్తే లాభంకన్నా నష్టమే ఎక్కువని నాకు తెలుసు.''

''అయితే నాతో రా చెప్తాను.''

''ఏం చేస్తావ్‌?''

''అబ్బా!.... చూస్తే నాకన్నా తెలివితక్కువవాడిలా వున్నావే. అదేదో చెప్తేగాని రావా?''

''అది కాదురా...''

''మాట్లాడకు... ఉదయం నుంచి మేం నీ గురించే ఆలోచించి ఒక పథకం సిద్ధంచేసాం. అది ఏమిటో తెలుసా?... అటు చూడు. ఆ ఎడ్లబండి, పచ్చగడ్డి మోపులు లోడ్‌ చేయగానే అది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలో నీకు చెప్పక్కర్లేదనుకుంటాను. మోపులు కట్టేసాం. పద'' అంటూ అసలు విషయం బయట పెట్టాడు వరదయ్య.

ఈ ప్లాన్‌ నచ్చింది త్రివిక్రమ్‌కి. ఆశలు చిగురించాయి. టైం బాగుంటే బయటకెళ్ళిపోతాడు. లేదంటే తిరిగి జైలుకి. నష్టంలేదు. అందుకే ఇక ఆలస్యం చేయలేదు. తలో పచ్చగడ్డి మోపు ఎత్తుకుని అంతా బండివద్దకి చేరుకున్నారు. బండివాడు దూరంగా వున్నాడు బండిమీద మోపులు సర్దుతున్నట్లు సర్దుతూ బోర్లాపడిపోయాడు త్రివిక్రమ్‌. అంతే... అతడి మీద మనిషి కనబడకుండా చకచకా మీదపడిపోయాయి. అరడజను పచ్చగడ్డి మోపులు, బండి రెడీ అయింది.

బండి వాడ్ని పిలిచారు ఖైదీలు.

బండి రెడీగానే కాపల సెంట్రీలు కూడా వచ్చారు. అంతా ఓ.కే. అనుకుని బండిని వెళ్ళిపోనిచ్చారు. ఈ బండి ఇలా వెళుతుండగానే అటు నుంచి మరో బండి లోనకు వచ్చింది లోడింగ్‌ కోసం.

ఖైదీలంతా తేలిగ్గా ఊపిరితీసుకున్నారు. సెంట్రీలు ఖైదీలు అంతా వున్నారా లేదాని చెక్‌ చేయకపోవటం ఆ క్షణంలో వాళ్ళకు కలిసొచ్చిన అదృష్టం.

త్రివిక్రమ్‌ను తీసుకుని ఆ ఎడ్లబండి జైలు ఆవరణదాటి బయటికి వెళ్ళిపోయింది.

సుమారు రెండు గంటల తర్వాత....

రెండో బండికి పచ్చగడ్డి మోపుల్ని లోడ్‌ చేస్తూండగా అప్పుడు.... అప్పుడు డౌటు వచ్చింది సెంట్రీలకి.

''ఎక్కడ?... ఎక్కడ్రావాడు? త్రివిక్రమ్‌ కనబడ్డంలేదు'' అనరిచాడో కానిస్టేబుల్‌.

''ఇక్కడే వుండాలిసార్‌... ఏరా. నువ్వు చూసావా? ఇంతసేపూ ఇక్కడే వున్నాడుగా?'' అంటూ మిగిలిన వాళ్ళ వంక చూసాడు వరదయ్య.

''అవున్రా. మనతోనే వుండాలిగదా. అలా చెట్లలోకి వెళ్ళాడేమో'' అన్నాడు మరొకడు.

అంతే....

ఒక్కసారిగా నెలకొంది అక్కడ టెన్షన్‌.

ఆ చుట్టుపక్కల ఎక్కడా త్రివిక్రమ్‌ కనబడలేదు. అటు యిటు పరుగులు తీసినా పోలీసులకు అతనిజాడ తెలీలేదు. తోటి ఖైదీలే అతడ్ని తప్పించి ఉంటారన్న డౌటుతో వాళ్ళని అక్కడే నిలబెట్టేసారు. సమాచారం అందగానే ఉరుకులు పరుగులుగా అక్కడికి వచ్చేసాడు జైలర్‌.

''చిలక్కిచెప్పినట్టు చెప్పాను. నువ్వు బయటికెళ్ళి మా ఉద్యోగాలకు ఎసరుపెట్టకురా మగడా అని, విన్నాడా. వినడు. వాడు మొండిఘటమని నాకు తెలుసు.

మీరు నిజం చెప్పాలి. వాడు ఎలా తప్పించుకున్నాడు?'' వస్తూనే ఖైదీలమీద గయ్‌మని అరిచాడు ఆంజనేయులు.

నేరస్తుడు ఎప్పుడూ తను నేరస్తుడని ఒప్పుకోడు. అందుకే ఖైదీలు కూడా ఒప్పుకోలేదు. తమకేమీ తెలియదన్నారు మూకుమ్మడిగా. దాంతో జుత్తుపీక్కున్నాడు ఆంజనేయులు.

ఇప్పుడీ విషయం బయటికి తెలిస్తే...

అంతా గందరగోళమైపోతుంది.

బుద్ధిమంతుడయిన త్రివిక్రమ్‌ని చిక్కుల్లో పడేయటానికి ఆంజనేయులుకి మనసు అంగీకరించలేదు. అలాగని వూరుకోవడం కూడా సాధ్యం కాదు, పై అధికారులు చెకింగ్‌కి వచ్చినప్పుడు సెల్‌లో ఖైదీ లేడంటే తమ పీకలమీదికొస్తుంది.

పచ్చగడ్డి బండిలోనే త్రివిక్రమ్‌ తప్పించుకున్నాడని అర్థమైపోయింది. అందుకే త్రివిక్రమ్‌ బస్సో, రైలో ఎక్కిచావకముందే వాడ్ని పట్టుకుని నచ్చచెప్పి వెనక్కి తీసుకురమ్మని అప్పటికప్పుడు బయట తనకు తెలిసిన పోలీసుల్ని టౌన్‌లోకి తరిమాడు.

కాని అప్పటికే ఆలస్యం జరిగిపోయిందన్న సంగతి ఆయనకు తెలీదు.

***

ఎడ్లబండి చకచకా నడుస్తోంది.

బండివాడు ఎదో లోల్లాయిపాట పాడుతూ...

 ఎడ్లను హుషారుగా అదిలిస్తున్నాడు.

 పచ్చగడ్డిలోని త్రివిక్రమ్‌ మోపుల్ని తప్పించుకుని ముందుకు జరిగి బయటకు చూసాడు. అప్పటికే జైలు దాటి వీధిలో చాలా దూరం వచ్చేసింది బండి.

 తను కన్పించడంలేదన్న సంగతి తెలిసి ఏ క్షణంలోనయినా పోలీసులు బండి వెనకే పరుగెత్తుకు రావచ్చు ఎక్కువ సేపు బండిలో వుండటం మంచిది కాదు. ఈసారి పట్టుకుంటే తనని సెల్‌లో పడేసి ఇక జైలు ఆవరణలో కూడా బయటికి వదలరు.

ఇక ఆలోచించలేదు త్రివిక్రమ్‌.

బండి రోడ్‌ మలుపు తిరుగుతోంది.

బలమంతా ఉపయోగించి తనమీద వున్న పచ్చగడ్డి మోపుల్ని తప్పించుకుంటూ బయటకొచ్చాడు త్రివిక్రమ్‌. బండి పైనుంచి పక్కనున్న పొదల్లోకి దూకేసాడు.

సరిగ్గా ఆ పొదలవెనకే....

ముగ్గురు బేవార్స్‌ కుర్రాళ్ళు తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకొంటూ గంజాయి దమ్ముకొడుతున్నారు. ఉన్నట్టుండి తమ పక్కనే ఏదో దబ్బున పొదల్లో పడిన చప్పుుడు వినగానే అదిరిపడి కెవ్వుమన్నారు. పోలీసులు వచ్చారనుకుని ఠారెత్తిపోతూ ఉన్నపళంగా లేచి ఒకటే దౌడు.

వాళ్ళు ఎందుకు పారిపోతున్నారో తెలియకపోయినా అక్కడ పిచ్చికుక్కో, పెద్ద పామో ఉందేమో అందుకే పారిపోతున్నారని భయపడి తను మరోపక్కగా దట్టమైన చెట్లతోపులోకి పరుగుతీసాడు త్రివిక్రమ్‌.

నిజానికి అతడలా పారిపోవటమే ఆ సమయంలో అతను పోలీసులకు చిక్కకుండా కాపాడింది. ఎందుకంటే, త్రివిక్రమ్‌ ఇక్కడ దట్టమైన చెట్లతోపులోకి పోతుండగానే, అలా ఒక పోలీస్‌జీప్‌ రివ్వున దూసుకొచ్చి వెళుతున్న ఎడ్లబండిని అడ్డంకొట్టి ఆపేసింది.

ఆ సంగతి త్రివిక్రమ్‌కి తెలీదు.

గుబురుగా పెరిగిన చెట్లతోపులో అడ్డంబడి నడుస్తూ, తీవ్రంగా ఆలోచిస్తున్నాడు త్రివిక్రమ్‌.

ఇప్పుడు ఏమి చేయాలి...? తన ముందున్న ప్రధాన సమస్య ఇది.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ చేరుకుంటే చాలు. వైజాగ్‌ వెళ్ళే ఏదో ఒక రైలు ఎక్కేస్తాడు. కాని, ఈ లోపల సమస్యలు చాలా వున్నాయి. అనుకున్నట్టు జైల్లోంచి అయితే తప్పించుకోగలిగాడు. కాని ఖర్చులకు డబ్బు ఏది?

తన జేబులో చిల్లిగవ్వ లేదు.

ఉన్నపళంగా జైలునుంచి తప్పించుకొచ్చేసాడు. పైగా జైలుదుస్తుల్లో వున్నాడు. నలిగిన, మాసిన జైలు దుస్తులు, ఆపైన ఖర్మకాలి తన నంబర్‌ కూడా ఫోర్‌ ట్వంటీ.

ఎవడు చూసినా తనని ఖైదీగా గుర్తించి పోలీసుల్ని పిలిచి పట్టిచ్చేస్తాడు. పచ్చగడ్డిలో పడుకోడంతో ఒళ్ళంతా చికాకుకితోడు కడుపులో ఆకలి. ఏం చేయాలి?

అన్నిటికన్నా ముందు....

ఈ జైలుడ్రసు వదిలించుకోవటం ముఖ్యం.

వడివడిగా నడుస్తూనే....

ఆలోచిస్తున్నాడు త్రివిక్రమ్‌.

ఆ చెట్లతోపులో అడ్డంగా ఒక నాటు దారి వుంది.

అవతలవున్న ఒక కాలనీనుంచి ఇటు మెయిన్‌రోడ్‌ను చేరుకోవటానికి అది షార్ట్‌రూట్‌ గావటంతో, కాలినడకన వచ్చేవాళ్ళు ఇటుతోపులో అడ్డంపడి వచ్చేస్తుంటారు.

త్రివిక్రమ్‌ ఆ బాటమీదకు చేరుకున్నాడు.

సరిగ్గా అదే టైంలో....

అటు కాలనీనుంచి ఒకతను మెయిన్‌రోడ్‌కి చేరుకోవాలని వడివడిగా వచ్చేస్తున్నాడు. అలా రావటంలో వూహించని విధంగా వచ్చి త్రివిక్రమ్‌ని గుద్దుకుని కెవ్వుమన్నాడు.

చేతిలో సూట్‌కేస్‌ ఎగిరి అవతల పడింది. కళ్ళజోడు జారి నేలమీద పడింది. బేలన్స్‌తప్పి తూలిపడబోతున్న వాడ్ని చివరిక్షణంలో భుజం పట్టుకుని లాగి నిలబెట్టాడు త్రివిక్రమ్‌.

అతడికి తనవయసే వుంటుంది.

ఒడ్డూ, పొడుగూ మనిషి బాగానే వున్నాడు.

ఖరీదైన కలర్‌పుల్‌ డ్రస్సు టక్‌చేసి, టైకట్టి, అంబాసిడర్‌ షూస్‌తో కుర్రాడు మోస్ట్‌కాస్ట్‌లీగా కన్పిస్తున్నాడు.

''ఓర్నీ... ఈ మాత్రం గుద్దుడుకే తూలిపడుతున్నావ్‌. నువ్వేంమగాడివి. మిష్టర్‌ ఉండు. పాపం చత్వారం కళ్ళజోడు వెదుక్కుంటున్నావ్‌?'' అంటూ వంగి కళ్ళజోడు తీసి అతని చేతికిచ్చాడు.

కళ్ళజోడు పెట్టుకుని కోపంగా చూశాడతను.

 

(... ఇంకా వుంది)

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
agent ekamber