Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
o college drop out gadi prema katha

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

agent ekamber

వాళ్ళంతా రకరకాల కాలేజీల్లో చదువుతున్నవాళ్ళు. ఒకే వయసువాళ్ళు కావడం వలన తొందరగానే 'ఏరా... పోరా' అనుకునేంత జిగిరీ దోస్తులు అయిపోయారు. అయితే, వాళ్ళంతా ఏకాంబర్ తో దుంపలబడిలో చదివినవాళ్ళే! ఇప్పుడు కలుసుకున్నాక చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరవేసుకుని ఒకటయ్యారు.

రోజూ బస్ స్టాండ్ కి ఎవరు ముందొచ్చినా మిగతా నలుగురి కోసం ఎదురు చూసే స్థాయికి ప్రాణ మిత్రులయిపోయారు. ఏకాంబరే అందరికంటే ముందుగా బస్సు దిగిపోతాడు. మిగతా నలుగురూ విశాఖపట్నంలో తలో దిక్కులో ఉన్న తమ తమ కాలేజీలకి వెళ్ళిపోతారు.

అనిల్ బుల్లయ్య కాలేజీలోనూ, రామకృష్ణ పూర్ణామార్కెట్ దగ్గరున్న ఏ.వి.యన్ కాలేజీలోనూ, శంకరరావు కాంప్లెక్స్ దగ్గరున్న బి.వి.కె. కాలేజీలోనూ, ఆచారి ఇసుకతోట దగ్గరున్న కృష్ణా కాలేజీలోనూ చదువుతున్నారు. ఈ అయిదుగురిలో అనిల్ ఒక్కడే డిగ్రీ చదువుతున్నాడు. మిగతావాళ్ళు ముగ్గురూ ఇంటర్ రెండో సంవత్సరంలో ఉన్నారు. ఏకాంబర్ ఒక్కడే మొదటి ఏడాదిలో జాయిన్ అయ్యాడు.

ఏకాంబరానికి కూడా అనిల్ ని చూడగానే నల్ల బెల్లం దిమ్మలాగా లావుగా, నల్లగా కనిపించగానే చిన్నతనంలో రోజూ తనకి బిళ్ళలో, బిస్కట్లో తెచ్చి ఇచ్చే అనిల్ గాడు గుర్తొచ్చాడు. వాడేనా వీడు అనుకుంటూ సిగ్గుతో తల దించుకున్నాడు. వాడే వీడని తెలిసి మురిసిపోతూ బలంగా వాటేసుకున్నాడు ఏకాంబర్.

"ఏరా! అయిదు వరకూ నాతోనే కదా చదివావ్! ఇప్పుడు ఇంకా ఇంటర్ లోనే ఉన్నావేంట్రా" మొదట్లో చనువుగా 'ఒరేయ్' అని సంబోధించింది అనిలే.

"మా బాబేరా! మార్కులు సరిగ్గా రావటం లేదని పదో తరగతి మూడుసార్లు పరీక్షలు రాయించాడు. లేకపోతే నీతోనే డిగ్రీలో ఉండేవాడిని" అని తెలివిగా నెపం తండ్రి మీదకు నెట్టేసాడు ఏకాంబర్.

"పోరా! నీ పోకిరీ కబుర్లు ఇంకా పోలేదు" అంటూ అనిల్ రివటలా ఉన్న ఏకాంబరాన్ని ఒక్క తోపు తోసాడు. ఆ వూపుకి ఎటో వెళ్ళి పడబోతూ నిలదొక్కుకుని పకపకా నవ్వేసాడు.

ఆ తర్వాత ఆ ప్రస్థావనే మర్చిపోయారు మిత్రులిద్దరూ.

ఆదివారం వస్తే చాలు అయిదుగురూ రామకృష్ణా బీచ్ కో, భీమిలి బీచ్ కో, ఏరాడ కొండకో, సముద్రం ఒడ్డున ఉన్న ఎర్రమట్టి దిబ్బ దగ్గరకో షికారుకు వెళ్లిపోయేవారు.

సెలవు దొరికితే చాలు సందడంతా వాళ్ళదే. సినిమాకి వెళ్ళాలన్నా, షికారుకి వెళ్ళాలన్నా అయిదుగురూ కలిస్తేనే వెళ్ళేవారు.

అయితే, అందరిలోకి అనిల్ మాత్రం చదువు మీద శ్రద్ధతో వీళ్ళ మాట కాదనలేక వచ్చినా అక్కడ కూడా కాలేజీ బుక్స్ తెచ్చుకుని చదువుకుంటూ ఉండేవాడు. మిగతావాళ్ళు అనిల్ ని ఆట పట్టించేవారు పుస్తకాల పురుగని, సరదా సందడి తెలీని మొద్దని ఎగతాళి చేస్తూ అల్లరి పెట్టేవారు.

అనిల్ కూడా ఎన్ని అన్నా ఆనందంగా స్వీకరించి నవ్వి ఊరుకునేవాడు. తన కోసం తెచ్చుకున్న తిను బండారాలు తీసి మిత్రులకు పంచేవాడు.

ఈ అయిదుగురిలో 'రామకృష్ణ' మాత్రం అమ్మాయిల్ని చూస్తే కళ్ళు మిటకరించేవాడు. శంకు మాత్రం అమ్మాయిలకేసి చూసీ చూడనట్టు నటించేవాడు కాని, రామకృష్ణ మాటలకి చేష్టలకి సై అనేవాడు. మిగతా ముగ్గురూ ఆ జోలికెళ్ళేవారు కాదు. 'అమ్మాయిలు ఆటంబాంబులు ఒకటిరా బాబూ! జాగ్రత్తగా 'డీల్' చెయ్యాలి. తేడా వస్తే శాల్తీలు గల్లంతయిపోతాయ్' అని జోకులేస్తూ తన మానాన తను పుస్తకాల్లో మునిగిపోయేవాడు అనిల్.

"తప్పురా! వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా! వాళ్ళని అల్లరి చేయడం సరికాదు" అనేవాడు అనిల్.

అనిల్ మాటలకి ఆచారి, ఏకాంబర్ వంత పాడేవారు. ఎందుకంటే అనిల్ బ్యాగ్ లో ఏమున్నాయో తడుముతూ 'అనిల్'ని పొగిడేవారు. వాడిచ్చే తినుబండారాల కోసం మద్దతు పలికేవారు. అలా కాలక్షేపంతో గడిపేశారు.

ఏకాంబర్ ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు రాసేసరికి అందరూ డిగ్రీల్లో ఉన్నారు. అనిల్ డిగ్రీ కాగానే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ లో జాయిన్ అయ్యాడు. మిగతా ముగ్గురూ డిగ్రీలు అత్తెసరు మార్కులతో ప్యాసయినా ఏకాంబర్ మాత్రం ఇంటర్ పూర్తి చేయడానికి మూడు సంవత్సరాలు ఒక్కటొక్కటీ పాసై చివరికి హమ్మయ్య అనుకున్నాడు.

ఏకాంబర్ ఇంటర్ పూర్తి చేసేసరికి మిగతా మిత్రులు నలుగురూ చదువులు పూర్తి చేసి ఉద్యోగాలు దొరక్క ఊర్లోనే బజార్లో కేంటీన్ల దగ్గర పకోడీ బళ్ల దగ్గర, చెరువు గట్టు దగ్గర బాతాఖానీ వేసుకుంటూ కాలక్షేపం చేసేవారు.

అందరిలో అనిల్ కి విశాఖలోనే నేవల్ సైంటిఫిక్ లేబోరేటిరీలో సైంటిస్ట్ గా ఉద్యోగం దొరికింది. శంకు మెడికల్ రిప్రజెంటేటివ్ గా జాయిన్ అయితే ఆచారి ప్రైవేట్ చిట్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా జాయిన్ అయ్యాడు.

ఏకాంబరానికి మాత్రం ఎక్కడా దారి తెన్నూ దొరకలేదు.

'తను చదివిన చదువుకి ఎవడిస్తాడులే ఉద్యోగం' అనుకుంటూ ఆ ప్రయత్నాలే మర్చిపోయాడు.

ఆదివారాలు, సెలవురోజుల్లో మాత్రం మిత్రులు అయిదుగురూ కలుసుకోవడం మానలేదు. అందరూ ఉండేది సింహాచలంలోనే కావడం వలన ఏ అపరాత్రికి వచ్చినా అందరూ బజార్లో కేంటీన్ దగ్గర కూర్చుని అరగంట అసుకేసుకోవడం పరిపాటయింది.

అయితే -

ఏకాంబర్ మాత్రం వీధిలో మిత్రులతో ఎంతసరదాగా సందడిగా గడిపినా ఇంటికెళ్ళేసరికి మాత్రం పిల్లిలా నక్కి నక్కి దాక్కుని తిరుగుతుంటాడు.

తండ్రి పీతాంబరం కళ్ళకు కనిపించకుండా ఇంట్లో జొరబడి తల్లి దగ్గరకు పిల్లిలా చేరుకుంటాడు ఏకాంబర్. దారితప్పి తండ్రి పీతాంబరం కళ్ళల్లో పడ్డాడా అంతే సంగతులు. తిట్లు, చీవాట్లు తప్పవు కాక తప్పవు.

ఏకాంబర్ అన్న నీలాంబర్ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం సంపాదించి పూనే వెళ్ళిపోయాడు. చెల్లెలు అలివేలుమంగ డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటూ తల్లికి వంటలో సహాయపడుతుంది.

ఎటొచ్చీ చదువుసంధ్యలు అబ్బని ఏకాంబర్ జులాయిగా తిరుగుతూ పోకిరీ వేషాలు వేస్తున్నాడని తండ్రి పీతాంబరానికి ఒళ్ళు మంట. షాపులో పెడదామని తీసుకువెళ్తే ఒక నెల్లో షాపంతా ఖాళీ చేసేసాడు. ఏకాంబర్ ఇంటర్ పాసవగానే ఏ పనీ పాటూ లేకుండా ఇంట్లో ఉంచితే బలాదూర్ గా తిరిగి పోరంబోకులా మారిపోతాడని భయపడి తనతో పాటు షాపుకు లాక్కుపోయాడు పీతాంబరం.

ఏపుగా ఎదుగొచ్చిన కొడుకు తన కంటే ఎత్తుగా ఎవరెస్ట్ శిఖరంలా కనిపించేసరికి షాపు బాధ్యతలు ఏకాంబరానికి అప్పగించి 'సరుకులు' తేవడానికి పూర్ణామార్కెట్ కు వెళ్ళేవాడు పీతాంబరం.

నెల రోజుల వరకూ ఏదీ గమనించలేదు పీతాంబరం. రోజూ బుద్ధిగా తనతోపాటు వస్తున్న కొడుకు రాత్రి పదయినా ఓపిగ్గా... బుద్ధిగా... బుద్ధిగా తనతో పాటు ఉండి షాపు కట్టేశాక ఇంటికి వచ్చే ఏకాంబరాన్ని చూసి పీతాంబరం సంబరపడిపోయేవాడు.

అయితే, ఆ నెల తర్వాత షాపులో సరుకులు అన్నీ ఖాళీ అయిపోయి గాని అమ్మకం కనిపించకపోయేసరికి అదిరిపడి ఆ నెలరోజులు అమ్మకాల్ని సరి చూసుకున్నాడు పీతాంబరం.

అన్నీ 'అరువు' ఖాతాలే. ఎవరూ డబ్బులు చెల్లించి సరుకులు కొనలేదు. దాంతో ఏకాంబర్ మీద అగ్గి మీద గుగ్గిలంలా ఎగిరిపడ్డాడు పీతాంబరం.

"ఏరా! షాపులో సరుకులన్నీ ఊరందరికీ ఇలా దారాదత్తం చేస్తే మళ్ళీ సరుకులు ఎలా తేగలనురా! రొక్కానికి అమ్మమంటే తొక్కలోది ఈ అరువు ఖాతాలేంట్రా" కోపంతో ఊగిపోయాడు పీతాంబరం.

"ఎవరో కాదు నాన్నా! మన ఊరి వాళ్ళే. అందరూ తెలిసినవాళ్ళేగా. ఇచ్చేస్తారు. ఎక్కడికి పోతారు" తండ్రికి ఎదురు చెప్పాడు ఏకాంబర్.

"ఎప్పుడిస్తార్రా!... ఏదీ నెలయింది. ఇచ్చారా! ఇప్పుడు షాపులో సరుకులు నిండుకున్నాయి. తిరిగి మదుపు ఎవడు పెడతాడ్రా?" చెట్టంత ఎదిగిన కొడుకుని చెయ్యెత్తి కొట్టలేక కోపంతో ఎగాదిగా చూస్తూ అరిచాడు పీతాంబరం.

అంతే! ఆ రోజు నుండి ఏకాంబరాన్ని షాపు దరిదాపులకు రానివ్వలేదు. 'అరువు'లన్నీ వసూలు చేసుకురమ్మని షాపులో నుండి తరిమేశాడు పీతాంబరం.

అప్పట్నుండీ ఏకాంబర్ పని తినడం, తిరగడం అంతే! ఉదయం లేస్తూనే తండ్రి పీతాంబరం కంట్లో పడకుండా తయారయి రోడ్డు మీదకు రావడం, బజార్లో ఉన్న దేవస్థానం కేంటీన్ సింహశైలలో కూర్చోవడం, బాతాఖానీ, మిత్రులతో సినిమాలు, షికార్లు. మధ్యమధ్యలో 'అరువులు' తీసుకున్న వాళ్ళింటికి బాకీల కోసం తిరగడం.

ఆ రోజు -

ఎప్పటిలాగే ఏకాంబర్ మిగతా నలుగురు మిత్రులూ ఉదయాన్నే కేంటీన్ దగ్గర కలుసుకున్నారు.

ఆదివారం!

సింహాద్రి అప్పన్నని దర్శించుకోవడానికి వస్తున్న యాత్రీకుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంది. కేంటీన్ లో ఓ మూలనున్న టేబుల్ దగ్గర మిత్రులు అయిదుగురితో పాటు కొత్తగా వచ్చేవారితో కలిసి గంటలు గంటలు అసుక్కొడుతూ కూర్చున్నారు. మధ్యమధ్యలో ఎవరో ఒకరు త్రీ బై సిక్స్ అనో, త్రీ బై ఫైవ్ అనో అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికీ 'టీ' లు ఆర్డరిస్తూ కాలక్షేపం చేసేస్తూ కూర్చున్నారు.

అయితే, ఆ రోజు యాత్రీకుల రద్దీ ఎక్కువగా ఉండడంతో కేంటీన్ కూడా ఎక్కడా ఖాళీ లేకుండా అయిపోయింది. సర్వర్ లు సప్లై చేయలేకపోతున్నారు. టేబుల్లన్నీ నిండుకుంటున్నాయి.

కేంటీన్ ఓనర్ ఉండుండీ ఏకాంబర్ వాళ్ళూ కూర్చున్న టేబుల్ కేసి గుర్రుగా చూస్తున్నాడు. కస్టమర్లు కూర్చోవడానికి 'టేబుల్'లు ఎక్కడా ఖాళీ లేవు.

సర్వర్ వచ్చి ఓనర్ కి మొరపెట్టాడు "సార్! ఆ మూలనున్న 'బేవార్స్ బేచ్'ని లేవమని చెప్పండి సార్! కస్టమర్స్ నిలబడిపోయారు." గుసగుసగా ఓనర్ చెవిలో చెప్పి వాళ్ళకేసి అదోలా చూస్తూ తన పనిలో పడ్డాడు సర్వర్.

కేంటీన్ ఓనర్ సర్వర్ ఇద్దరూ తమకేసి చూసి మాట్లాడుకునేసరికి వారికి విషయం అర్ధమైపోయింది.

"లేవండ్రా బాబూ! ఇంకా మనం ఇక్కడే కూర్చుంటే కేంటీన్ ఓనర్ వచ్చి చొక్కా పట్టుకుని బయటకు లాగేసినా లాగేస్తాడు. పరువు పోతే తిరిగి సంపాదించలేం. రేపట్నుండీ ఈ బల్ల దగ్గరకు రాలేం. లేవండి పోదాం" అంటూ అని లేచి నిలబడ్డారు. మిగతా అందరూ అనిల్ ని ఫాలో అయి కేంటీన్ లో నుండి బయటకి వచ్చారు.

కేంటీన్ ప్రక్కనే స్టేట్ బ్యాంక్ కు వెళ్ళే మెట్లు ఉన్నాయి. కేంటీన్ పైభాగంలో స్టేట్ బ్యాంక్ ఉంది. ఆ మెట్ల దగ్గర నిలబడి మిత్రులంతా ఆర్టీసీ బస్సు స్టాండ్ నుండి కొండ బస్సు  స్టాండ్ కు నడిచి వెళ్తున్న యాత్రీకుల్ని చూస్తూ నిలబడ్డారు.

అసలే ఆదివారం!

అంతా క్లాస్ భక్తులు. శనివారం అయితే మాస్ యాత్ర ఎక్కువ. ఆదివారం అందరికీ ఆఫీసులు సెలవు కావడం వలన ఎక్కువమంది నగరవాసులే దైవదర్శనానికి వస్తుంటారు. ఏదో కొద్దిమంది మాత్రం పల్లెలనుండి వస్తుంటారు.

రామకృష్ణ, శంకర్రావు ఓ మూలన నిలబడి దారి పొడవునా నడిచి వెళ్తున్న రంగురంగుల చీరలకేసి, చూడీదారులకేసి చూస్తూ చొంగలు కార్చుకుంటున్నారు.

"చూడరా! వాళ్ళు కళ్ళతోనే కోర్కెలు తీర్చేసుకుంటున్నారు" మిత్రులిద్దరికేసి చూస్తూ ఆచారి అన్నాడు.

"ఎవడి ఆనందం వాడిది. మనకెందుకులేరా?!" అన్నాడు ఏకాంబర్.

ఇంతలో సూటు బూటు తొడుక్కుని మెళ్ళో ఖరీదయిన లెదర్ బ్యాగ్ తగిలించుకుని టిప్ టాప్ గా ఉన్నతను వారి దగ్గరకు వచ్చాడు.

అతన్ని చూస్తూనే మిత్రులందరూ ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టేసారు.

"ఒరేయ్!... నువ్వు... నువ్వు..." ఆశ్చర్యంగా అన్నాడు ఆచారి. మిగతా నలుగురూ అతడినే చూస్తూ నిలబడిపోయారు.

"నేనేరా! రాజనాల రాజేంద్రని... గుర్తు పట్టలేదా?" తన ఎదురుగా ఉన్న అయిదుగురి మిత్రుల చేతులు లాక్కొని మరీ షేక్ హేండ్ ఇచ్చాడు అతను.

"రా... జ... నా... ల...?!" ఆశ్చర్యంగా కళ్ళింత చేసుకుని చూసాడు ఏకాంబర్.

"గుర్తుకు రాలేదురా!... మనతో దుంపలబడిలో ఆరోతరగతి నుండి ఏడు వరకే చదివి మానేసి వెళ్ళిపోయాడు కదరా! వాడే! రౌడీ రాజనాలగాడు. వాడే... వీడు!" ఏకాంబర్ బుర్రమీద ఒక చరుచు చరిచి అన్నాడు అనిల్.

"ఆ! గుర్తొచ్చిందిరా! రౌడీ... రాజనాల!... తెలుగు మేష్టారు గారి మీద తిరగబడిన... రాజనాలగాడేనా... సారీ! నువ్వు... రాజనాలవా?" ఆనందంగా రాజేంద్రని వాటేసుకుంటూ అన్నాడు ఏకాంబర్.

"అవున్రా! చిన్నప్పుడే వైజాగ్ వెళ్ళిపోయాం కదా! మీ అందరికీ నేను గుర్తుంటానో... లేదోనని మిమ్మల్ని వెదుక్కుంటూ ఇక్కడకు వచ్చాను" ఆనందంగా అన్నాడు రాజేంద్ర.

"ఏంట్రా! సూటూ బూటూ... మెళ్ళో తళతళా మెరుస్తున్న బ్యాగ్... ఏదైనా బ్యాంకులో పని చేస్తున్నావా?" రాజేంద్ర తొడుక్కున్న కోటు బటన్ లు చూసి ముట్టుకుని మురిసిపోతూ అన్నాడు ఆచారి.

"అలాంటిదేరా!! బ్యాంకు కాదు గాని... బ్యాంకులాంటిదే!" చిన్నగా నవ్వుతూ అన్నాడు రాజనాల రాజేంద్ర.

"బ్యాంకు కాదంటావ్!... బ్యాంకులాంటిదే అంటావ్! కొంపదీసి ఈ మధ్య కుదేలైపోతున్న ఫైనాన్స్ కంపెనీల్లాంటిది కాదు కదా!" భయంగా అన్నాడు అనిల్.

"అంత భయమెందుకురా! అలాంటిదేం కాదులే!" రాజేంద్ర మాటలు విని కొంచెం భయంగా రెండడుగులు వెనక్కి వేసిన అనిల్ భుజం మీద చెయ్యేసి అన్నాడు రాజనాల రాజేంద్ర.

"నీకు అలాగే ఉంటుందిరా బాబూ! ఈ మధ్య దివాళా తీసిన ఫైనాన్స్ కంపెనీ యజమానులే కాదు. అందులో పనిచేసిన ఉద్యోగుల్ని, వాళ్ళతో తిరిగిన స్నేహితుల్ని, అందులో పొరపాటున డబ్బు దాచుకుని మోసపోయిన బాధితుల్ని సైతం 'పోలీసులు' వదలటంలేదురా నాయనా. మా బాబు వూరికే ఊరి మీద పడి తిని తిరిగితే తిరుగు గాని అలాంటి 'బోగస్'ల జోలికి వెల్లొద్దని తిట్టాడ్రా!" అన్నాడు ఏకాంబర్.

"ఓరి నాయనో! నేను అలాంటివాడ్ని కాదు. మా ఇన్స్యూరెన్స్ కంపెనీ అలాంటిది కాదు. పక్కా గవర్నమెంట్ సంస్థ మాది." మిత్రులందరి వాలకం చూసి తల మీద చెయ్యేసుకుని ప్రమాణం చేస్తున్నట్టు చెప్పాడు రాజేంద్ర.

"ఆ! నువ్వు ఇన్స్యూరెన్స్ వాడివా!!" అంటూ మిత్రులందరూ అవాక్కయి రాజేంద్రకి కాస్త దూరంగా జరిగారు.

"ఇన్స్యూరెన్స్ అంటే భయపడతారేమిట్రా! ఈ రోజు మనల్ని, మన కుటుంబాల్ని ఆదుకుని ఆసరాగా నిలబడేది ఇన్స్యూరెన్స్ కంపెనీయేరా బాబూ! మీకెవరికీ ఇంకా పెళ్ళి, పెళ్ళాం, పిల్లలు ఉన్నట్టూ లేదు" నిష్ఠూరంగా అన్నాడు రాజనాల రాజేంద్ర.

 

(... ఇంకా వుంది)
 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్