Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
o college drop out gadi prema katha

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

agent ekamber

"క వెళ్దామా రత్నంగారూ!" నెమ్మదిగా అన్నాడు ఏకాంబర్.

"బిల్లు రాలేదుగా!" సర్వర్ కేసి చూస్తూ అంది నూకరత్నం.

"ఇదిగో వచ్చేసింది" అంటూ తన ముందున్న బిల్ పేడ్ చూపించాడు ఏకాంబర్.

ఛటుక్కున బిల్లు తీసి చూసింది నూకరత్నం.

బిల్లు చూస్తూనే నోరు ఆవులించి "బాప్ రే! ఇంతయిందా?" ఆశ్చర్యంగా ఏకాంబర్ కళ్ళల్లోకి చూస్తూ అంది నూకరత్నం.

చిన్నగా నవ్వుతూ జేబులో వున్న డెబిట్ కార్డు తీసి బిల్లు ఉన్న ఫోల్డింగ్ పేడ్ లో పెట్టాడు ఏకాంబర్.

కేష్ కౌంటర్ దగ్గర నిలబడి వీళ్ళనే చూస్తున్న సర్వర్ బిల్లు ఫోల్డింగ్ పేడ్ లో ఏకాంబర్ 'కార్డు' పెట్టడం చూస్తూనే దగ్గరకు వచ్చి పట్టుకువెళ్ళాడు.

అయిదు నిమిషాల్లో డెబిట్ కార్డు ఇచ్చేసి 'బిల్లు' మీద సంతకం చేయించుకున్నాడు సర్వర్.

జేబులో నుండి ఇరవై రూపాయలు నోట్ తీసి సర్వర్ కి టిప్ గా ఇచ్చాడు ఏకాంబర్.

ఏకాంబర్ ప్రతిచర్య ఓరకంట గమనిస్తూనే ఉంది నూకరత్నం. హుందాగా బేరర్ కి టిప్ ఇవ్వడం చూసి మనసులోనే మురిసిపోయింది నూకరత్నం. పదే పదే ఏకాంబరాన్నే వెదుకుతున్న తన కళ్ళల్లో ఏదో తెలియని గమ్మత్తైన మత్తు ఆవహించేస్తోందని నూకరత్నం గ్రహించేసింది. రాను రాను ఏకాంబర్ మీద ఆరాధన పెరుగుతోంది.

"పదండి!..." అంటూ ఏకాంబర్ లేవగానే అతన్ని అనుసరించింది నూకరత్నం.

***

పామ్ బీచ్ హొటల్ లో నుండి బయటపడి ఉడాపార్క్ వైపు నడుస్తున్నారు ఇద్దరూ. ఒకర్నొకరు రాసుకుంటూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు.

"ఇంత ఆలస్యమైంది కదా! మీ ఇంట్లో వాళ్ళు ఏమీ అనరా?" ముభావంగా ఉన్న నూకరత్నం కేసి చూస్తూ అడిగాడు ఏకాంబర్.

"అమ్మేగా! అయినా, ఇప్పుడు నేనేగా ఇంటిని నెట్టుకొస్తున్నది. షాపులో కొత్త స్టాక్ వచ్చింది. బేల్స్ విప్పి వాటికి రేటు టేగ్ లు అతికించాలని అబద్ధమాడి వచ్చా! నేనింకా షాపులోనే ఉన్నాననుకుంటుంది అమ్మ!" నెమ్మదిగా అంటూనే ఓరగా ఏకాంబర్ కళ్ళల్లోకి చూసింది నూకరత్నం. తన కళ్ళలాగే అతని కళ్ళు కవ్వింతగా ఉన్నాయి.

"ఈ రోజంతా... ఇక్కడే... నాతోనే గడపాలి" చిన్నగా నవ్వుతూ అన్నాడు.

"ఆశ... దోశ... అప్పడం... వడ! అదేం కుదరదు. మీరు వేగంగా నాకేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి! ఇంటికెళ్ళి బట్టలు ఉతుక్కోవాలి. రేపట్నుండీ మళ్ళీ షాపులో పని తప్పదు కదా" అంది నూకరత్నం.

"మీకింకా నా మీద నమ్మకం కుదిరినట్టు లేదు" నిష్టూరంగా అన్నాడు.

"నమ్మకం లేకపోతే ఇలా ఎందుకొస్తానండి. ఇందాకే చెప్పా కదా!"

"రావడం వేరు, నమ్మడం వేరు. మీకు తోడు నేనుంటాను. ఈ బట్టల కొట్టు విషయం మర్చిపోండి" నడుస్తున్న వాడల్లా ఆగి నూకరత్నం కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఏకాంబర్.

"మహానుభావా! మంచి చేస్తానంటే ఎందుకొద్దంటాను. కానీ రోజు తప్పించి రోజు పస్తులుండే కుటుంబం మాది. అలాంటప్పుడు ఉన్న ఈ ఒక్క ఆధారం వదిలేస్తే ఎలా చెప్పండి?" అనునయంగా అంది నూకరత్నం.

"సరిసరి! ఈ వారంలోనే నేను మీ షాపు దగ్గర్లోనే 'కస్టమర్స్ సర్వీస్ సెంటర్' ఏర్పాటు కోసం ఓ అపార్ట్ మెంటు అద్దెకు తీసుకున్నాను. అందులో కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆరోజు తమరు తప్పక విచ్చేయండి" సీరియస్ గా మారిపోయి నిర్లప్తంగా అన్నాడు ఏకాంబర్.

"సార్! ఎందుకండి అంత కోపం? మీ ఆఫీసులో 'గుమస్తా'గా జాయిన్ చేసుకోవచ్చు కదా!" ఏకాంబర్ చెయ్యి పట్టి చిన్నగా గిల్లుతూ అంది నూకరత్నం.

నూకరత్నం అలా అనేసరికి ఒక్కసారే ఆనందంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు ఏకాంబర్.

"కరెక్టే కదా! ఈ విషయమే మర్చిపోయాను. ముందు మా ఆఫీసులో గుమస్తాగా చేరండి. ఆ తర్వాత మీకోసం నేను ఏం చేస్తానో చూద్దురుగాని..." సంతోషంగా అంటూ నూకరత్నం భుజంమీద చెయ్యి వెయ్యబోయాడు ఏకాంబర్.

"సార్! ఆనందంలో అన్నీ మర్చిపోతున్నారు" అంటూ గభాలున వెనక్కి జరిగింది నూకరత్నం.

"సారీ! అలవాటులో పొరపాటు" కొంటెగా చూస్తూ అన్నాడు ఏకాంబర్.

"ఏమిటీ? అమ్మాయిల మీద చెయ్యి వెయ్యడం అలవాటా?" ఏకాంబర్ కళ్ళల్లోకి కోపంగా చూస్తూ అంది నూకరత్నం.

"అయ్యో! అమ్మాయిలు కాదమ్మా తల్లీ! ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ వాళ్ళ భుజాల మీద చేతులు వేయడం ఆలవాటంటున్నాను" అన్నాడు ఏకాంబర్.

"ఇంతకీ మీరు ఇంత పెద్ద ఏజెంటు ఎలా అయ్యారో చెప్పారు కాదు" ఏకాంబర్ కేసి చూసి నవ్వుతూ అంది నూకరత్నం.

"అదే చెప్తూంటే ఆకలి ఆకలి అంటూ ఆపేసారు కదా" అన్నాడు ఏకాంబర్.

"అసలు విషయం చెప్పకుండా మీ సోదంతా చెప్పుకొచ్చారు. వినడానికి బావున్నా ఓపిక ఉండాలిగా!" అంది నూకరత్నం.

"ఇకనుండి తమరు మా అధీనంలోనే కదా... సారీ! మా ఆఫీసులోనే కదా ఉంటారు. ఖాళీ దొరికినప్పుడు బుర్ర తింటానులెండి" అన్నాడు ఏకాంబర్.

"ఆలూ లేదు చూలూ లేదు 'అయ్య' పేరు సోమలింగం అన్నాట్ట ఎవరో! మీరు ముందు ఆఫీసు ప్రారంభించండి. ఆ రోజే షాపులో మానేసి మీ దగ్గర జాయిన్ అవుతాను" అంది నూకరత్నం.

"థాంక్యూ! నా మీద నమ్మకంతో ఉన్నందుకు" అన్నాడు ఏకాంబర్.

"థేంక్స్ నేనే మీకు చెప్పాలి. నిలబడి ఉండి బట్టలు అమ్ముకోవల్సినదాన్ని కుర్చీలో కూర్చోబెడుతున్నందుకు" అంది.

"మిమ్మల్ని 'ఓనర్ని' చేసేదాకా నిద్రపోను. ఇదే ఈ ఏకాంబర్ చేస్తున్న భీష్మ శపథం' అన్నాడు ఏకాంబర్.

"నిద్ర లేకపోతే నీరసించిపోతారు సార్! ఆ తర్వాత ఆరోగ్యం చెడి మీరు ఆసుపత్రుల పాలైతే నా గతి 'రెంటికీ చెడ్డ రేవడి' బ్రతుకైపోతుంది అంత పని చెయ్యకండి!" బ్రతిమలాడుతున్నట్టు నటిస్తూ చిన్నగా నవ్వుతూ ఏకాంబర్ చెయ్యి పట్టుకుని అంది నూకరత్నం.

"అదేంటండీ బాబూ! నేను మీ బాగు కోరితే మీరు నా రోగాల సంగతి మాట్లాడతారు అలా అనకండి. పైన తథాస్తు దేవతలుంటారుట. మీరూ నేనూ కూడా రోడ్డునపడాల్సి వస్తుంది" అంటూనే గభాలున నూకరత్నం చెయ్యి పట్టుకుని ప్రక్కకు లాగేసాడు ఏకాంబర్.

వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ వస్తూ ఎదురుగా వస్తోన్న ఆటోని చూడలేదు నూకరత్నం. అనుకోకుండా మీద మీదకొస్తున్న ఆటోని చూస్తూనే నూకరత్నాన్ని చెయ్యి పట్టి ప్రక్కకు లాగేసాడు ఏకాంబర్.

ఏకాంబర్ అలా చెయ్యి పట్టి లాగేసరికి అమాంతం వెళ్ళి ఏకాంబర్ మీద పడిపోయింది నూకరత్నం. ఆమెని అలాగే ఒడిసి పట్టుకుని ఉడాపార్క్ ప్రక్కనే వున్న స్కూటర్ పార్కింగ్ దగ్గరకు తీసుకువెళ్ళాడు.

"చాలా థేంక్స్ అంబర్ గారూ! ఈ రోజు ఆ ఆటోవాడి దెబ్బకు నేను హాస్పిటల్ లో పడుదును" భయంగా అంది నూకరత్నం.

"నేనుండగా అలా జరగనిస్తానా రత్నం గారూ!" అంటూ నూకరత్నాన్ని మరింత గట్టిగా హత్తుకున్నాడు ఏకాంబర్.

"సార్! వదలండి! ఎవరైనా చూస్తే అసహ్యంగా అనుకుంటారు" అంటూ ఏకాంబర్ చేతులనుండి విడిపించుకుంటూ దూరంగా జరిగింది.

"ఇంకాస్సేపు కూర్చుందామా?!" నెమ్మదిగా అన్నాడు ఏకాంబర్.

"అమ్మో! వద్దండి! వెళ్దాం!" అంది నూకరత్నం.

"మీ ఇష్టం" అంటూనే స్కూటర్ స్టాండ్ దగ్గరకు వెళ్ళి తన బైక్ బయటకు తీసాడు ఏకాంబర్.

"నన్ను ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర దించెయ్యండి. బస్సెక్కి వెళ్ళిపోతాను" నెమ్మదిగా అంది నూకరత్నం.

"ఇద్దరం ఒక వైపే కదా! మిమ్మల్ని ఇందాకటిలా ఎన్.ఏ.డి. జంక్షన్ దగ్గర దించేస్తాను" అన్నాడు ఏకాంబర్.

"వద్దండి. మా మావయ్య తాలూకా వాళ్ళెవరు చూసినా బాగుండదు" అంది నూకరత్నం.

"ఎవరూ చూడకపోతే ఫరవాలేదా?" కొంటెగా చూస్తూ అన్నాడు ఏకాంబర్.

"ఈ వేషాలకి భయపడే వెళ్ళిపోదామంటున్నాను. పదండి! పదండి" అంటూ ఏకాంబర్ వెనుక అతని నడుం మీద చెయ్యి వేసి కూర్చుంటూ అంది నూకరత్నం.

ఆమె అంత చనువుగా, అనువుగా మీద మీదకు పడి రాసుకుంటూ కూర్చునేసరికి ఏకాంబర్ శరీరం జలదరించింది.

హాయిగా ఆనందంగా బైక్ ని ముందుకు ఉరికించాడు ఏకాంబర్.

***

ఆదివారం తిరక్కుండానే గోపాలపట్నం మౌర్య థియేటర్ ఎదురుగా ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో 'కస్టమర్ సర్వీస్ సెంటర్' ప్రారంభించాడు ఏకాంబర్. దాని ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే మేడిపండు అబద్ధాలరావు గారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించాడు. అలాగే సర్వీస్ కౌంటర్ ఓపెన్ చెయ్యడానికి ఇన్స్యూరెన్స్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ ని, ఇతర ఇన్స్యూరెన్స్ అధికారులను ఆహ్వానించాడు.

తాను అయిదేళ్ళుగా పాలసీలు చేయించిన పాలసీదారులనందర్నీ పేరుపేరున ఇళ్ళకు వెళ్ళి మరీ ఆహ్వానించాడు ఏకాంబర్. ఆహ్వానంతో పాటు ప్రతీ పాలసీదారుడికి 'శివరామ నేతిమిఠాయి' చిన్న చిన్న పేకట్లుగా తయారు చేయించి ఆహ్వానపత్రికతో పాటు ఇచ్చి మరీ పిలిచాడు.

ఎంతో ఆదరంగా ఏకాంబరం పిలవడంతో అందరూ ఆనందంగా వస్తామని చెప్పడమే కాకుండా ప్రారంభోత్సవం రోజున కొత్త పాలసీలు రాస్తామని ఏది మంచిదో ముందే చెప్పమని ఏకాంబరాన్ని అడిగి మరీకనుక్కున్నారు.

ఆరోజు -

ఆదివారం!

ఉదయాన్నే ఏకాంబరం మిత్రులందరూ వచ్చి చేరుకున్నారు. ముందు రోజు రాత్రే లోపల అలంకరణ అంతా కానిచ్చేసారు. బుడగలు, రంగురంగుల పేపర్లతో లోపలంతా అలంకరించారు.

అపార్ట్ మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ స్థలం లో 'కస్టమర్ సర్వీస్ సెంటర్' ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరూ కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేసారు. మొదటి అంతస్థులో ఉంది 'కస్టమర్ సర్వీస్ సెంటర్'.

వచ్చిన వాళ్ళందరికీ ఏకాంబర్ చెల్లెలు అలివేలుమంగ, నూకరత్నం ఆహ్వానం పలుకుతూ ఇన్స్యూరెన్స్ పాంప్లెట్ లతో పాటు ప్రతి ఒక్కరికి ఒక సంపంగి పువ్వు చేతిలో పెడుతున్నారు. వచ్చిన వాళ్ళల్లో కొందరు పువ్వు తీసుకుని 'చెవి'లో పెట్టుకోమంటారా, చేత్తో పట్టుకోమంటారా?" అని జోకులేస్తూ వెళ్తున్నారు.

ఏకాంబరం అంతా హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. అనిల్,రామకృష్ణ, ఆచారి, శంకర్రావులు నలుగురూ వచ్చిన అతిథులందరికీ సాదరంగా ఆహ్వానించడమే కాకుండా డ్రింకులు అందిస్తున్నారు.

సరిగ్గా -

సుముహూర్తానికే ఎమ్మెల్యే మేడిపండు అబద్ధాలరావు గారు మందీ మార్బలంతో విచ్చేసారు. ఏకాంబర్ ఆనందంగా ఎదురువెళ్ళి స్వాగతం పలికాడు.

ఏకాంబర్ అమ్మానాన్నలు అపార్ట్ మెంటులో ఆఫీసు రూమ్ లో అతిథులందరితో పాటూ కూర్చున్నారు.

ఎమ్మెల్యే అబద్ధాలరావుని లిఫ్ట్ లో మొదటి అంతస్థులో ఉన్న కార్యాలయానికి తీసుకువెళ్ళగానే లోపల ఉన్న అతిథులందరూ ఆయనకి నమస్కరిస్తూ బయటకు వచ్చేసారు.

అప్పటికే ద్వారానికి ప్రారంభోత్సవ రిబ్బన్ కట్టి ఉండడం వలన లోపలనుండి వచ్చిన వాళ్ళంతా ఒంగి ఒంగి రిబ్బన్ క్రిందనుండి దూరి వస్తుంటే అందరూ తనకి ఎంతో గౌరవమర్యాదలతో వంగిపోయి మరీ నమస్కరిస్తున్నారనుకుని ఎమ్మెల్యే అబద్ధాలరావు కూడా పదే పదే తనూ వంగి వంగి అందరికీ నమస్కారాలు చేస్తున్నాడు.

ఏకాంబర్ అమ్మానాన్నలు కూడా లోపలనుండి బయటకు రాగానే ఎమ్మెల్యే అబద్ధాలరావుకి వాళ్ళిద్దర్నీ పరిచయం చేసాడు ఏకాంబర్.

"సార్! ఈయన మా నాన్న పీతాంబరం గారు. ఇక్కడే డిపార్ట్ మెంటల్ స్టోర్స్ నడుపుతున్నారు. ఆమె మా అమ్మగారండి" ఎంతో వినయంగా ఎమ్మెల్యేకి తల్లితండ్రుల్ని పరిచయం చేసాడు ఏకాంబర్.

"బావున్నారా సార్! మీరు నా నియోజకవర్గంలోనే వ్యాపారం చేస్తున్నారన్నమాట. మీకేమైనా అవసరమైతే కలవండి. మా ఏకాంబరం నాన్నగారు కదా! ఏ పని కావాలన్నా చిటికెలో చేసి పెడతాను" నవ్వుతూ అన్నారు ఎమ్మెల్యే మేడిపండు అబద్ధాలరావు.

"అయ్యయ్యో! మీతో మాకు ఏం పనుంటుంది సార్, మీ దయ వలన ఏదో చిన్న వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నాం" నమ్రతగా అన్నాడు పీతాంబరం.

ఏకాంబరం తండ్రి పీతాంబరం అలా అనేసరికి ఎమ్మెల్యే మొహం ఒక్కసారే నల్లగా మాడిపోయింది. అది గమనించిన ఏకాంబరం రండి సార్ రండి" అంటూ రిబ్బన్ కట్ చేయడానికి తొందర చేసాడు.

వేద పండితులు వేదోచ్చారణ చేస్తూండగా పురోహితుడు మంత్రాలు చదువుతూ ఎమ్మెల్యే మేడిపండు అబద్ధాలరావు గారితో సముహూర్తానికి రిబ్బన్ ని రెండుముక్కలు చేయించాడు.

ఎమ్మెల్యే గారు వస్తున్నారనేసరికే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా విలేఖర్లు గుంపులుగుంపులుగా వచ్చి చేరుకున్నారు. ఏకాంబర్ కస్టమర్లు కూడా ఊహించనంతమంది వచ్చి చేరుకోవడంతో ఆ అపార్ట్ మెంట్ కారిడారంతా జనాలతో జాతరలా మారిపోయింది.

ఎమ్మెల్యే ప్రారంభోత్సవానికి అపార్టుమెంటుకు చేరుకోగానే గ్రౌండ్ ఫ్లోర్ లో అతిథులను ఆహ్వానిస్తూ రిసెప్షన్ కి కూర్చున్న ఏకాంబర్ చెల్లెలు అలివేలుమంగ, నూకరత్నం ఇద్దరూ అక్కడ దుకాణం కట్టేసి మొదటి అంతస్థుకి వచ్చి చేరుకున్నారు.

ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించినప్పుడు పళ్ళెంలో కత్తెర పట్టుకుని నిలబడింది నూకరత్నమే. ఆమెకి తోడుగా అలివేలుమంగ పూల బోకే చేత పట్టుకుని నిలబడి ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించగానే అతని చేతికి బొకే ఇచ్చి లోపలకు ఆహ్వానించింది.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kittugadu inter fail ias pass