Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
agent ekamber

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐఏఎస్ పాస్

kittugadu inter fail ias pass

నిన్ను బాధపెట్టాలని కాదు మా ఉద్దేశం... ర్యాగింగ్ ఎందుకంటే... జూనియర్లు, సీనియర్లు ఒకళ్లకొకళ్లు పరిచయమౌతారని, ఒకరికి చేతనైన సాయం మరొకరికి చేసుకోవాలని, నిన్నేమన్నా బాధపెట్టి ఉంటే "వెరీ సారీ".

జూనియర్లకు ఇదొక వింత ఆటలాగా ఉంది... తమాషాగా ఉంది.

శ్రీదేవికి ముద్దు పెట్టడం చాలా మంది జూనియర్లకి నచ్చింది...

కొంతమందికి లేటెస్ట్ ఫాషన్ చెయ్యాలన్పించి తమ్మెలు తీసేశారు... వీళ్లని చూసి మిగిలిన వాళ్లు తీసేశారు...

కంభం పట్టణంలో మిధున్ చక్రవర్తులు కన్పించడం మొదలుపెట్టారు...

డ్యాన్స్ చేసిన వాళ్లకి చాలా ఎంకరేజింగ్ గా ఉంది...

పాటపాడిన వాళ్లకి మెచ్చుకోలు దొరికింది... వాళ్ళెంతో ఆనందానికి గురయ్యారు...

కంభంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నారు...

కొంతమంది వచ్చి నోట్సులు తీసుకున్నారు... దాన్ని కాపీ చేసుకుని థ్యాంక్స్ చెప్పేవారు...

సిగరెట్టు తాగేవాడు ఆనంద పడిపోయాడు... సిగరెట్ ఇచ్చారని, మందు తాగని వాడికి 'థమ్స్ అప్'... వాడు ఊహించనే లేదు.

మందు కొట్టేవాడికి ఆహ్వానం... వాడు హేపీ...

ఈ "మందు" కు ఒకే అన్నవాళ్లు సాధారణంగా, డిగ్రీలు చేసి వచ్చినవాళ్లు...

ఎవర్నీ బాధపెట్టలేదు... ఇరుకున పెట్టే రెండు మూడు ప్రశ్నలు తప్ప... వాటికి కూడా చివర్లో 'సారీ' చెప్పారు... ఏదయినా హెల్ప్ అవసరమైతే చేస్తామన్నారు... చాలా విచిత్రంగా ఎంజాయ్ చేసేలా ఉందీ ర్యాగింగ్...

ఇంకేముందీ?

ఈ తర్వాత కొద్దిరోజుల్లో కిట్టు వాళ్ళ గ్యాంగ్ కు జూనియర్లలో అభిమానులు పెరిగిపోయారు. సాయంత్రం కాగానే వీళ్ల రూముకి చేరుకుని, వాళ్ల అనుభవాలు పంచుకునేవారు. జూనియర్లకు గొడవలు వస్తే కిట్టు వాళ్ల గ్యాంగ్ సర్దుబాటు చేసేది...

ఒకడు ఇంకొకడికి అప్పుఇచ్చి, అసలు తీరిస్తే ఊరుకోకుండా, వడ్డీ కూడా అడిగాడంట.

కిట్టు వాళ్ల గ్యాంగ్ వెళ్లి...

ఇదేమన్నా వడ్డీ వ్యాపారం అనుకున్నావా? స్టూడెంట్స్ మనం... అలాంటివి చేస్తే పరువుపోతుంది... అందరూ నవ్వుతారు... మాస్టార్లకి తెలిస్తే... ఇంకా చిన్నతనం... అని చెప్పారు.

వాడు దారికొచ్చాడు.

ఇలా చిన్న చిన్న తగాదాలు తీర్చేవారు.

నూతన సంవత్సరం జరుపుకోవాలంటే జూనియర్లకి వేరే ప్లేస్ గుర్తుకురాదు... కిట్టు వాళ్ల రూమ్ నిండిపోయేది...

అందరూ కేరింతలతో సెలబ్రేట్ చేసుకునేవారు.

*****

అలా ఆటపాటలతో చూస్తుండగానే, మూడేళ్లు గడిచిపోయాయి.

ఫైనల్ రిజల్ట్ వచ్చింది. కిట్టు ఫెయిల్ అయ్యాడు...

మళ్లీ సప్లిమెంటరీ రాసి అయ్యిందన్పించాడు...

కిట్టుకి అప్పటికి ఒక అవగాహన వచ్చింది. తను చదివింది పాలిటెక్నిక్... గట్టిగా మాట్లాడితే అది డిగ్రీ కాదు... డిగ్రీ సంపాదించాలి.

ఎలా?

మళ్లీ మూడేళ్లు కాలేజిలో చేరి చదవాలా?

అబ్బే... అంత బాలేదు...

మరెలా?

"ఎక్స్ టర్నల్, ఒన్ సిట్టింగ్ బి.ఎ." ఉస్మానియా యూనివర్సిటీ వారు అవకాశం కల్పిస్తున్నారు.

ఈ ఎక్స్ టర్నల్ ఏమిటి?

ఒన్ సిట్టింగ్ ఏమిటి?

ఎక్స్ టర్నల్ అంటే కాలేజికి వెళ్ళాల్సిన పనిలేదు. యూనివర్సిటీ ఎలాంటి మెటీరియల్ ఇవ్వదు.

వట్టి సిలబస్ ఇస్తుంది... సిలబస్ ని బట్టి మార్కెట్లో దొరికే గైడ్లు కొని, చదవాలి.

ఇది కరస్పాండెన్స్ కోర్సు కాదు...

ఇక ఒన్ సిట్టింగ్ అంటే...

మూడు సంవత్సరాల పరీక్షలు ఒకేసారి రాయాలి.

కిట్టు వాళ్ల నాన్నగారన్నారు. 'బియ్యేకి విలువ ఏముంది? అది చదివిన వాళ్లకే ఉద్యోగాలు లేక 'పాలిటెక్నిక్'కో, 'లాబ్ టెక్నీషియన్', 'హెల్త్ ఇన్స్ పెక్టర్ కోర్సుకో వెళ్లిపోతున్నారు'. పరీక్ష ఫీజు కట్టడం కూడా దండగే! ఈ బియ్యే ఎవరికంటే, మిలటరీలో పనిచేస్తున్న వాళ్లకి, వేరే ఉద్యోగాలు చేస్తున్నవాళ్లకి ప్రమోషన్ కోసం!

ఏదో తూతూ మంత్రం లాంటి బియ్యే అది! ఎందుకూ పనికిరాదు.

ఆ పనికిరాని, పనికిమాలిన 'బియ్యే'తో కలెక్టర్ అవ్వచ్చని కిట్టు వాళ్ల నాన్నగారికి గానీ, కిట్టుకి గానీ తెలియదు.

కిట్టుకి మాత్రం అప్పట్లో బియ్యే చెయ్యాలనే పట్టుదల అంతే!

కిట్టు వాళ్ళ నాన్నగారు చిరాకు పడుతూనే డబ్బులిచ్చారు. కిట్టు పరీక్ష ఫీజు కట్టాడు.

కొంచెం శ్రద్ధగా చదివి ఒకేసారి మూడు సంవత్సరాల పరీక్షలు పాసయ్యాడు.

ఆ తర్వాత ఎల్.ఐ.సి క్లర్క్ పరీక్షలు, బ్యాంక్ క్లర్క్ పరీక్షలు, గ్రూపు ఫోర్ పరీక్షలు ఇలా ఏది పడితే అది వరుసగా రాస్తూ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఏమీ పాస్ కాలేదు.

కిట్టు జీవితాశయం ఒకటే!

ఏదో క్లర్కు ఉద్యోగం లాంటిది వస్తే చాలు! అంత కంటే ఏం అవసరం లేదు!

ఈలోపు సెంట్రల్ గవర్నమెంట్ లో డిప్లొమా వాళ్లకు అవకాశం ఉన్న 'బుల్లి ఇంజనీర్' ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు.

'ఖన్నా' రాసిన పుస్తకాన్ని చదివితే మంచిదని ఎవరో చెప్పారు. అది కొనుక్కొని, జాగ్రత్తగా ఆ ఒక్క పుస్తకాన్నే బట్టీపట్టాడు. అదృష్టవశాత్తు పరీక్షలో అవే ప్రశ్నలు వచ్చాయి...

బాగానే రాసాననుకున్నాడు...

ఆ విషయం మరిచిపోయాడు.

సడన్ గా ఒకరోజు అపాయింట్ మెంట్ లెటర్ పోస్టులో వచ్చింది.

ఇంటర్వ్యూ లేదూ, పాడూ లేదు... డైరెక్టుగా వచ్చి 'ముంబాయి'లో ఉద్యోగంలో చేరిపోమని. బొంబాయిలో, చర్చిగేటు దగ్గర ఉన్న ఒక బిల్డింగ్ లో పదహారో అంతస్థులో రిపోర్ట్ చేయాలి.

కిట్టు ఆశ్చర్యానికీ, ఆనందానికీ అవధులు లేవు.

ఉద్యోగాల గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పుకుంటారు.

డబ్బులిస్తేగానీ పని జరగదనీ, ఈ పరీక్షలన్నీ నామమాత్రమే అనీ, రికమండేషన్ లేకపోతే పని జరగదనీ, అంతా ఒక బూటకమని, జగన్నాటకమనీ కథలు కథలుగా చెప్పుకుంటారు.

ఎటువంటిదీ లేకుండానే కిట్టుకి ఉద్యోగం వచ్చేసింది.

కిట్టు వాళ్ళ ఫ్యామిలీ, చుట్టాలు, స్నేహితులు, అందరూ ఆశ్చర్య చకితులయ్యారు.

బొంబాయిలో పదహారో అంతస్తులో 'బుల్లి ఇంజనీర్' ఉద్యోగం అంట!

నెలకి మూడువేలకు పైగా జీతమంట!

అంత డబ్బు ఏం చేసుకుంటావురా?

ఈ ఆశ్చర్యానందాల నుండి, గందరగోళం నుండి తేరుకున్న తర్వాత, కిట్టు, వాళ్ల నాన్న బొంబాయి రైలు ఎక్కారు.

***

కిట్టు వాళ్ల నాన్నగారికి 'బొంబాయి'లో సుందరంగారనే స్నేహితుడు ఉన్నాడు.

ఆయన ఇంట్లో కిట్టు ఉండేలా ఏర్పాటు చేసిన తర్వాత, కిట్టు వాళ్ల నాన్నగారు వెళ్లిపోయారు.

కిట్టు డ్యూటీకి వెళ్లాల్సిన ప్రదేశం 'చర్చిగేట్'

సుందరం గారు ఉండేది 'జోగీశ్వరి'. జోగీశ్వరికీ, చర్చిగేట్ కీ '45 నిమిషాల పైనే ప్రయాణం పడుతుంది' లోకల్ ట్రైన్ లో వెళ్లడం, రావడం...

ఈ జోగీశ్వరిలో సుందరం గారుండే ప్రదేశాన్ని బొంబాయిలో 'చాల్' అంటారు. 'చాల్' అంటే ఐదారు పోర్షన్లు వరుసగా ఉంటాయి. ఈ పోర్షన్లకి ఎదురుగా ఇంకో ఐదారు పోర్షన్లు ఉంటాయి. ఈ రెండు వరుసల పోర్షన్లకి మధ్యలో సన్నటి దారి. ఆ దారి దాటి ముందుకు వెళ్తే, వీళ్ళందరూ ఉపయోగించుకునే టాయిలెట్లు ఐదారు వరుసగా ఉంటాయి.

పొద్దున్నే లేచి, చిన్న బకెట్ లో నీళ్లు నింపుకుని, టాయిలెట్ దగ్గరకి వెళ్లాలి. అక్కడ అప్పటికే 'క్యూ' ఉంటుంది. ఆ 'క్యూలో' నిలబడి తన వంతు వచ్చినప్పుడు టాయిలెట్ ని ఉపయోగించుకోవాలి.

కిట్టు 'క్యూ'లో నిలబడ్డాడు.

వెనక, ముందు కిట్టు వయసులో ఉన్న అమ్మాయిలు నిలబడి ఉన్నారు.

కిట్టుకి చాలా సిగ్గుగా ఉంది.

ఇదేమిట్రా బాబూ... అనుకుంటున్నాడు. ఈలోపు ఒక టాయిలెట్ ఖాళీ అయింది. కిట్టు రాయి లాగా నిలబడ్డాడు. కిట్టు వెనకున్న అమ్మాయి 'హిందీ'లో కిట్టుకి, మిగిలిన వాళ్లకు కూడా వినబడేలా, గట్టి గొంతుతో అంది "నువ్వు వెళ్తావా... నన్ను వెళ్లమంటావా?" గబుక్కున లోపలి వెళ్లి తలుపేసుకున్నాడు కిట్టు.

ఇక ఆఫీసుకి వెళ్ళాలి. సుందరం గారు, కిట్టు కలిసి జోగీశ్వరి స్టేషనుకు వెళ్ళారు. స్టేషనంతా గోలగోలగా, గందరగోళంగా ఉంది. సర్రు సర్రుమని, దడ దడమని వచ్చేరైలు, పోయే రైలు... ఏ ట్రైన్ ఎక్కాలో ఎలా తెలుస్తుంది? ఇన్ని వందల రైళ్లు ఎలా నడుపుతున్నారు? ఇంతమంది జనాభా ఎక్కడ నుండి వచ్చారు. కొందరు వేగంగా వెళ్లే రైళ్ల కిటికీలు పట్టుకుని వేలాడుతున్నారు. కొందరు పెట్టెకీ పెట్టెకీ మధ్య స్థలంలో నిలబడి ప్రయాణం చేస్తున్నారు. పైన ఎలక్ట్రికల్ వైరు కనబడుతుంది. పెట్టెలన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయి.

ఎలా ఎక్కాలి? ఈ వ్రేళ్ళాడేవాళ్లు పొరపాటున క్రిందపడితే ఎముకలైనా మిగులుతాయా?

సుందరం గారు కిట్టు చెయ్యి గట్టిగా పట్టుకుని ఉన్నారు.

రైళ్లు శరవేగంగా వస్తున్నాయి. ఆగుతున్నాయి.

రైలు బయల్దేరడం కూడా శరవేగమే!

రెండు మూడు రైళ్లు మనకొద్దులే అని వదిలేశారు సుందరం గారు.

ఆ తర్వాతి రైలును ఎంచుకున్నారు.

ఒక డబ్బా సరిగ్గా వీళ్ల దగ్గరగా వచ్చి, ఆగింది.

పొలోమని హిమపాతం కూలినట్లుగానూ, సునామీ నీళ్ళల్లో కొంపా, గూడు కొట్టుకు పోతున్నట్లుగానూ ఎక్కేవాళ్ళూ, దిగేవాళ్ళూ...

కిట్టుకి కంగారు ఎక్కువైంది.

సుందరంగారు కిట్టు చేయి పట్టుకుని, ఒకచోట నిలబడ్డారు.

ఒక పెద్ద కెరటంలాగా కిట్టు వెనుక... జనాలు ఒక్క తోపు తోసారు. ఒక్క దెబ్బతో కంపార్ట్ మెంట్ లో పడ్డాడు కిట్టు. కంగారుగా అటూ ఇటూ చూశాడు... బల్లిలాగా ఒక గోడకు అంటుకుపోయి ఉన్నారు సుందరంగారు.

కిట్టువైపు చూసి కంగారు పడవద్దని సైగ చేసారు. తర్వాతెప్పుడో కిట్టుకి చెప్పారు సుందరం గారు. ఎక్కీ ఎక్కగానే బల్లిలాగా గోడకు అంటుకుపోవడం ఒక అమోఘమైన టెక్నిక్. మనమెవరికీ అడ్డం ఉండం, మనల్నెవరూ డిస్టర్బ్ చెయ్యరు.

కిట్టుకి ముందూ, వెనకా జనం.

నిలబడ్డవాళ్లు తూలిపోకుండా పట్టుకోవడానికి త్రికోణాకృతిలో వ్రేల్లాడుతున్న ఇనుప గొల్లాలు ఉన్నాయి.

కొద్దిగా కూడా కదలడానికి వీలులేని పరిస్థితి.

కిట్టుకి కొద్దిగా అనుమానమొచ్చింది.

నా ముక్కుతో నేను గాలి పీలుస్తున్నట్లుగా లేదే?

ఎవడో ముక్కుతో నేను గాలి పీలుస్తున్నట్లుగా ఉందే?

కిట్టు అనుమానం నిజమే అంతగా ఇరుక్కుని ఉన్నారు జనం.

ఈలోపు సుందరంగారు కిట్టుకి చెప్పారు పర్స్ జాగ్రత్త!

నిలబడటమే కష్టంగా ఉంది. పడిపోకుండా రెండు చేతులతో పైన సపోర్ట్ పట్టుకోవాలి.

ఈ గోలలో పర్సేకాదు, పాంటు, చొక్కా ఎవడెత్తుకెళ్లిపోయినా ఏమీ చేయలేని పరిస్థితి. ఎవడైనా ఆయువుపట్టు కూడా నిరభ్యంతరంగా కోసుకెళ్ళిపోవచ్చు... పర్సు జాగ్రత్తా! వాపోయాడు కిట్టు.

ఈలోపు కంపార్ట్ మెంట్ లో ఉన్న ఒక గ్రూపు 'భజన'లు మొదలుపెట్టింది. మేళాలు, తాళాల్లాంటి చిన్న చిన్న వాయిద్యాలు కూడా ఉన్నాయి వాళ్ల దగ్గర.

ఇదేమన్నా బొంబాయి లోకల్ ట్రైనా? లేక తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి వెళ్తున్న బండా? వీళ్లు పొరపాటున బండెక్కెయ్యలేదు కదా? కిట్టు ముఖం చూసిన సుందరం గారన్నారు.

"వీళ్లు ఎక్కడో పూణే నుంచి, థానే నుంచి ఉదయం మూడింటికో, నాలుగింటికో బండెక్కి, తొమ్మిదింటికి బొంబాయి చేరుకుంటారు. వీళ్ళందరూ ఉద్యోగస్తులో, వ్యాపారస్తులో లేక ఏదైనా పని చేసుకునే వాళ్ళే!

రోజూ వీళ్ళ కార్యక్రమం ఇదే! బోరుకొట్టకుండానూ ఉంటుంది, పుణ్యమూ వస్తుంది"

కిట్టు ఎదురుగా ఒకడు నిలబడే నిద్రపోతున్నాడు.

ఇంత భయంకరంగా, ఒకడి నెత్తి మీద ఇంకొకడు, ఇరుకిరుగ్గా నిలబడి వ్రేళ్ళాడుతూ ఉంటే, వీడికి నిద్రెలా వస్తుంది? అప్పుడెప్పుడో మునీశ్వరులు ఒంటికాలి మీద, తలకిందులుగానూ చెట్టు కొమ్మకి వేళ్లాడుతూ తపస్సు చేసుకునేవారంట. ఈ పక్కనున్న వాడిని చూస్తుంటే ఆ మునీశ్వరులకంటే గొప్పోడేమో అనిపిస్తుంది.

'చర్చిగేట్' స్టేషన్ వచ్చింది.

లోకల్ ట్రైన్ ఆగింది.

జనాల్లో కదలిక వచ్చింది.

మళ్లీ ఇంకోసారి పెద్ద కెరటంలాగా జన సముద్రం ఎగసిపడింది.

ఎలా వచ్చాడో తెలీకుండానే కిట్టు ఫ్లాట్ ఫాం మీద ఉన్నాడు.

సుందరంగారు చేయి పట్టుకుని ఒక పెద్ద భూతం లాంటి ఫ్యాను దగ్గరకు తీసుకువెళ్లారు.

కొద్దిసేపు ఇక్కడ నిలబడు, అలసట తగ్గుతుంది! అన్నారు.

అంత పెద్ద ఫ్యాన్ గాలి, చెమట, అలసట తగ్గించింది.

అయ్ బాబోయ్! నలభై నిమిషాల్లో నరకం కనిపించింది అంకుల్! అన్నాడు కిట్టు.

సుందరం గారు చిద్విలాసంగా నవ్వి, ఇప్పుడు నువ్వు ప్రయాణించింది ఫస్ట్ క్లాస్ లో, ఇది చాలా నయం, జనరల్ కంపార్ట్ మెంట్ లో అయితే ఇంతకు మూడింతల మంది ఉంటారు, అన్నారు.

గుండాగినంత పనైంది కిట్టుకి. తలచుకోగానే స్పృహ తప్పినట్లయింది.

ఇంతలో ఇంకో ట్రైన్, ఆ తర్వాత ఇంకో ట్రైన్ వస్తున్నాయి, వెళ్తున్నాయి.

మందలు మందలుగా జనాలు దిగుతున్నారు.

ఆడవాళ్లు రకరకాల స్కర్టులు, పంజాబీ డ్రెస్సులు, ప్యాంట్లు, జీన్స్ ఇలా అన్ని విధాలయిన ఫ్యాషన్ లతో ఉత్సాహంగా, హడావుడిగా వెళ్తున్నారు. ఎప్పుడూ నెమ్మదిగా నడిచి వెళ్లేవాడు లేడు. అందరూ ఉరుకులూ, పరుగులూ, ఎవడి తొందర వాడిది. ఒకడు ఇంకొకణ్ణి పట్టించుకోడు ఎవడి హడావుడి వాడిది. అసలు వీళ్లంతా ఎక్కడికి పరుగులు పెడుతున్నారు.

ఆడవాళ్లు ఎవర్నీ పట్టించుకోవడం లేదు. ఎవడైనా నన్ను చూస్తున్నాడా? లేదా? అన్న ఆలోచన మచ్చుకైనా లేదు. ఎవడైనా వాళ్లవేపు చూసినా పట్టించుకునే తీరిక లేదు.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్