Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐఏఎస్ పాస్

kittugadu inter fail ias pass

కవేళ ఎవడైనా కావాలని కాలో చెయ్యోతగిలిస్తే, ముందుగా వాళ్లే 'సారీ' చెప్పేసి, గబగబా పరిగెత్తుకుని వెళ్లిపోతున్నారు.

అదేదో 'రూలు' పెట్టినట్లుగా ఆడవాళ్లందరూ 'లిప్ స్టిక్' వేసుకున్నారు. కనుబొమలు దిద్దుకున్నారు. బయల్దేరే ముందే ఓపిగ్గా తల చక్కగా దువ్వుకుని, రకరకాల హెయిర్ స్టైల్స్ తో తిరుగుతున్నారు. 'మేకప్' లేకుండా కనబడే ఆడవాళ్లు చాలా అరుదు. స్కర్టులు వేసుకుని, హై హీల్స్ వేసుకుని చకచకా పరిగెత్తుతున్నారు కొందరు.

వాళ్ల కాలి పిక్కలు ప్రస్ఫుటంగా, బలంగా కన్పిస్తున్నాయి.

కిట్టుకి ఆశ్చర్యమనిపించింది.

పల్లెటూరి ఆడవాళ్లు కాయ, కష్టం చేసి ధాన్యం బరువుల్ని ఎత్తి, పొలం పనులు చేస్తారు.

వాళ్లని వర్ణిస్తూ ఒకాయన "పిక్కల పైదాకా చుక్కల చీరకట్టి" అని పాట రాసాడు.

ఈ సిటీ వారు, పల్లెటూరి ఆడవాళ్లకు పోటీగా ఉన్నారేమిటి? అనుకుంటున్నాడు కిట్టు.

అలా వెర్రి మొహం వేసుకుని తేరిపార చూడకు.

ఇదేమన్నా పెన్నాడ, భీమవరం అనుకుంటున్నావా?

బొంబాయి... ఇది.

ఇంట్లోంచి బయలుదేరి, దూరం నడిచి, బస్టాపుకెళ్లాలి. ఆ తర్వాత బస్సెక్కి, రైల్వేస్టేషనుకు రావాలి. స్టేషన్లో కనీసం ఆరు బ్రిడ్జిలుంటాయి. ఏదో ఒక బ్రిడ్జి ఎక్కి దిగాలి. నువ్వు బ్రిడ్జి దిగిన ఫ్లాట్ ఫాంకి, నువ్వు ఎక్కాల్సిన రైలు ఆలస్యం అవుతుందని తెలిస్తే, వెంటనే వేరే బ్రిడ్జి ఎక్కి, దిగి పరిగెత్తాలి. ట్రైన్ లో కూర్చోవడానికి ఖాళీ ఉంటే ఉంటుంది. లేకపోతే లేదు. గంటసేపు నిలబడాలి. దిగిన తర్వాత మళ్లీ బ్రిడ్జి ఎక్కి దిగాలి. ఆ తర్వాత మళ్లీ బస్టాపు వరకు నడిచి, బస్సెక్కి, ఆఫీసు దగ్గర స్టాపులో దిగి
మళ్లీ నడిచి ఆఫీస్ దగ్గరకు వెళ్లాలి. ఈ విధంగా ఆఫీసుకెళ్ళడం, మళ్లీ సాయంత్రం తిరిగి రావడం. ఏదో స్కూటరో, సైకిలో వేసుకెళ్ళడానికి ఇది పల్లెటూరు కాదు. ట్రాఫిక్ లో ఇరుక్కుంటే తెల్లవారిపోతుంది. కారున్నవాళ్లు దగ్గరగా ఉన్న స్టేషను దగ్గర కారు పెట్టుకుని లోకల్ ట్రైన్ ఎక్కి ఆఫీసుకు వెళ్తారు. వాళ్లకీ నడక తప్పదు, ట్రైన్ లో నిలబడటం తప్పదు.

నడిచీ, నడిచీ ఆడవాళ్లకు కాళ్లు కదుములు కట్టేస్తాయి.

ఎదవ చూపులు మానేసి, బయల్దేరింక అన్నారు సుందరంగారు.

ఈ ముసలోడు సామాన్యుడు కాదురా బాబూ, మాట మాట్లాడకుండానే మనసులోనివన్నీ కనిపెట్టేస్తున్నాడు. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో! అనుకున్నాడు కిట్టు.

ఇద్దరూ కలిసి స్టేషన్ బయటకు వచ్చారు.

అక్కడొక కానిస్టేబుల్ నిలబడ్డాడు.

జనాలు వెళ్లకుండా, ఒక పెద్ద 'మోకు' లాంటి తాడు దారికి అడ్డంగా కట్టి లాగి పట్టుకున్నాడు.

అవతల కార్లు, బస్సులు వెళ్తున్నాయి.

ఇదేమిటి.........?

గేదెల్ని, ఆవుల్ని పెద్ద పెద్ద పలుపు తాళ్ళతో ఆపినట్లు, మనుషుల్ని ఆపుతున్నాడేమిటి? అనుకున్నాడు కిట్టు. కాసేపటికి తాడు దించాడు పోలీసాయన. బిలబిలమంటూ అందరూ రోడ్డు దాటారు.

అక్కణ్ణుంచి ఒక మైలు దూరం నడిచి, ఆఫీసుకు చేరుకున్నాడు కిట్టు. అదొక పంతొమ్మిది అంతస్తుల పెద్ద ఆకాశ హార్మ్యం. కిట్టు వెళ్లాల్సింది పదహారో అంతస్తు. కిట్టు తను ఎంతో గొప్పవాడైపోయినట్లు, ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినట్లు ఫీలైపోయాడు. లిఫ్టు ఎక్కి పదహారో అంతస్తుకి చేరుకున్నాడు.

***

కిట్టూ డ్యూటీలో చేరడం, ఆఫీసుకి వెళ్లి, రావడం జరుగుతూ ఉంది. ఇరవై రోజులలా గడిచాయి.

ఒకరోజు కిట్టూ దగ్గరకు హిందీ ఆఫీసరు వచ్చాడు. హిందీ ఆఫీసరు అందరితో కలుపుగోలుగా ఉంటాడు.

కిట్టూతో........ హిందీలో చెప్పాడు.

"మీ ఆంధ్రావాలా ఒకతను "బుల్లి ఇంజనీరు" గా ఇదే ఆఫీసులో చేరాడు."

"మీరూ మీరూ ఫ్రెండ్స్ అయిపోయి నాతో మాట్లాడటం మానేయవద్దు" అన్నాడు.

ఈలోపు కిట్టుని వెతుక్కుంటూ ఆ ఆంధ్రా అతనే వచ్చాడు.

తనను తాను పరిచయం చేసుకున్నాడు.

పేరు కమలాకర్. మనిషి కొంచెం నలుపు, కావలి వాస్తవ్యుడు. కానీ ముఖ కవళికలు చక్కగా ఉన్నాయి.

పొడవూ కాదు, పొట్టి కాదు. ధృడంగా ఉన్నాడు. ముఖంలో గంభీరత కన్పిస్తోంది.

కొత్తవాళ్ళు కమలాకర్ తో మాట్లాడాల్సి వస్తే, చాలా సీరియస్ మనిషి అనుకుంటారు.

కానీ లోపలికి తొంగి చూస్తే కమలాకర్ అంత సరదా మనిషి ఇంకొకరు ఉండరు.

లంచ్ టైం లో ఇద్దరూ కలిసి, ఆరో అంతస్తులో ఉన్న క్యాంటీన్ కి వెళ్లారు.

మీరెక్కడుంటున్నారు అని కమలాకర్ ని అడిగాడు కిట్టు.

"విక్టోరియా జూబిలీ టెక్నలాజికల్ ఇన్ స్టిట్యూట్ లో నా ఫ్రెండ్ ఎమ్.టెక్ చదువుతున్నాడు.

అందాకా అతని హాస్టల్ రూమ్ లో ఉంటున్నాను" అన్నాడు కమలాకర్.

కిట్టుకి కూడా ఎక్కువ కాలం సుందరం అంకుల్ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. వాళ్లని ఇబ్బంది పెట్టకూడదనుకున్నాడు.

"ఐతే, దగ్గర్లో ఏదన్నా రూమ్ దొరికితే మనమిద్దరం షేర్ చేసుకోచ్చుగా" అన్నాడు కిట్టు.

"నేను కూడా అదే అనుకుంటున్నాను" అన్నాడు కమలాకర్.

అప్పట్లో 'బుల్లి ఇంజనీర్' జీతం, తిప్పి తిప్పి కొడితే మూడు వేలు ఉండేది.

ఆ మూడువేల జీతంతో చర్చిగేటు దగ్గర రూము దొరకడం, అందులో ఉండడమనేది కల్ల. అదంతా కాస్ట్ లీ ఏరియా.

వెతకగా, వెతకగా, "అంటాప్ హిల్" అనే ప్రాంతంలో "సెక్టార్ సెవెన్" లో ఒక రూమ్ అద్దెకు దొరికింది.

నిజానికి అది గవర్నమెంట్ వారి క్వార్టర్. అవి తరాల్ అనే ఫ్యూన్ కు ఇవ్వబడిన క్వార్టర్. 'తరాల్', అతని తమ్ముడు 'హాల్'లో ఉండేవారు. హాల్ అందరికీ కామన్... ఒక వంటగది, ఒక బెడ్ రూమ్ ఉన్నాయి. ఈ బెడ్ రూమ్ కిట్టు, కమలాకర్ లకు అద్దెకివ్వబడింది.

అయితే అందులో ఒక లొసుగు ఉంది.

ఒకళ్లకిచ్చిన క్వార్టరు ఇంకొకరికి అద్దెకు ఇవ్వకూడదు. కానీ, ఇది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడూ చెకింగ్ లకు వచ్చేవారు. వచ్చేముందు ముందుగానే చెప్పి వచ్చేవారు. ఆ సమయానికి అద్దెకున్న బాచిలర్ లు, ఫ్యామిలీలు, కాలనీలో బయట తిరుగుతూ, కాలనీ పార్కులో కాలక్షేపం చేసేవారు. ఈ చెకింగ్ ఐపోగానే మళ్లీ గూళ్ళకి చేరేవారు. ఇదంతా ఒక 'తంతు'. తప్పని సరియై, గత్యంతరం లేక, తప్పని తెల్సినా, అందరూ చేసేపని ఇది. కొంతమంది ఓనర్లు అయితే, ఇల్లు మొత్తం అద్దె కిచ్చి, వేరే చోట ఉండేవారు. వాళ్లు కూడా ఆ సమయానికి జాగ్రత్త పడేవారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కిట్టు అంతకు ముందెప్పుడూ కనీవినీ ఎరుగడు.

అదేమిటంటే.......

పగిడీ....

ఏదన్నా ఇల్లు అద్దెకు తీసుకుంటే, నెలనెలా అద్దె ఇవ్వడం మాత్రమే తెలుసు కిట్టుకి.

బొంబాయిలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది.

సంవత్సరానికి మొత్తం అద్దె ఒకేసారి ఇచ్చెయ్యాలి.

కొన్ని చోట్ల రెండు సంవత్సరాలకు సరిపడా అద్దె ముందుగానే ఇచ్చెయ్యాలి.

నెలనెలా ఇస్తామంటే కుదరదు.

అలా అద్దెకు అడిగితే పొమ్మంటారు.

ఒకవేళ మధ్యలో వెళ్లిపోవాల్సి వస్తే? ఇంకొకన్ని వెదుక్కుని, వాణ్ణి మన స్థానంలో ఉంచి, వాడి దగ్గర మనం డబ్బు తీసుకుని పోవాలి.

ఓనర్ కి ఇచ్చిన డబ్బులు గోడకు కొట్టిన సున్నంతో సమానం.

ఇదో షాక్ కిట్టుకి.

ఈ తరాల్ గాడు ఉదార మనస్సుతో ఒక్క సంవత్సరానికే అడిగాడు. రెండేళ్ళకి అడిగుంటే గుండె బద్దలయ్యుండేది. ఏదో విధంగా తిప్పలు పడి, ఆ పగిడీ కట్టేసి, రూములో చేరిపోయారు కిట్టు, కమలాకర్ లు.

వంటకు కావాల్సిన సామాగ్రి, కుండలు, మండలు కొన్నారు.

కిర్సనాయిల్ స్టవ్ పై వంట... దానికి పుటుకూ పుటుకూ మని గాలి కొడుతూ ఉండాలి మధ్య మధ్యలో.

.... లేకపోతే మంట మండి చావదు.... కేవలం సాయంత్రం పూటే వంట.... ఒకరోజు కమలాకర్ వండుతాడు.... కిట్లు అంట్లుతోమాలి... ఇంకొకరోజు కిట్టు వండితే, కమలాకర్ అంట్లు తోమాలి.... ఈ అంట్లు తోమే కార్యక్రమమే కష్టంగా ఉండేది. వంట చేయడం కష్టం అన్పించేది కాదు.

***

బొంబాయిలోని అంటాపు హిల్ ప్రదేశం.

ఈ అంటాపు హిల్ ని పన్నెండు సెక్టార్లుగా విభజించారు. అన్నీ గవర్నమెంట్ క్వార్టర్లే. ఎక్కడో ఒకటి, రెండు ప్రైవేటు ఇళ్లు. మొదటి మూడు సెక్టార్లు బాగానే ఉండి, పద్ధతిగా ఉంటాయి. కిట్టు వాళ్లు ఉండేది ఏడవ సెక్టార్ లో. ఈ 'అంటాపు హిల్' పేరు మీద ఒక క్రైమ్ సినిమా కూడా తీశారు.

ఈ ఏడో సెక్టార్ కొంచెం తేడా.

ఎప్పుడన్నా కిట్టు సెకండ్ షో సినిమాకి వెళ్లి, తిరిగి వచ్చేటప్పుడు, టాక్సీ బేరమాడబోతే 'అంటాపు హిల్' కా 'నేను రాను' అనేవాడు టాక్సీ డ్రైవర్.

కిట్టు ఉండే ఫ్లాట్ కి ఎదురుగా ఒక ముచ్చటైన ఫ్యామిలీ ఉండేది.

'భర్త జర్నలిజం ఫీల్డులో ఉండేవాడు. సమాజసేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనీ, నాయకుడు కావాలనీ అనుకునేవాడు. ఉత్తర ప్రదేశ్ కు చెందినవాడు. ఒకప్పుడు కుస్తీ యోధుడంట. ఆరడగుల పొడవుతో బలంగా కన్పించేవాడు. అతని భార్య ఒరిజినల్ గా పార్శీ అట. భర్త ముస్లిం కనుక అతని కోరిక మేరకు బురఖా ధరించేది. ఇద్దరు చిన్న చిన్న ముద్దులొలికే కొడుకులు.'

ఇక కిట్టు వాళ్ల పై పోర్షన్ లో స్మగ్లర్ ఒకడుండేవాడు. తమిళనాడు నుండి వచ్చాడతను. త్రిబుల్ ఫైవ్ సిగరెట్ తాగుతూ, మారుతీ కారు నడిపించేవాడు. ఎప్పుడొస్తాడో తెలియదు. ఎప్పుడు పోతాడో తెలియదు.

ఈ స్మగ్లర్ కి మంచి ఫాలోయింగ్ ఉండేది కాలనీలో. అందరూ గౌరవంగా చూసేవారు.

బొంబాయిలో డబ్బులున్న వాడికే గౌరవం. వాడు ఏ పని చేస్తున్నాడనేది అనవసరమైన విషయం.

ఈ స్మగ్లింగ్ లాంటి యవ్వారాల్ని 'దూసరా దందా' అంటారు.

'దందా' అంటే వ్యాపారం.

'దూసరా' అంటే రెండోది అని అర్ధం.

మొదటి వ్యాపారం అందరూ మామూలుగా చేసేది. ఈ రెండో వ్యాపారం చట్ట వ్యతిరేఖంగా చేసేది. అది ఏదన్నా కావచ్చు.

బొంబాయి వాళ్లు చాలా సాధారణంగా మాట్లాడుకునే మాటల్లో ఈ "దూసరా దందా" అనే పదం అలవోకగా చోటు చేసుకుంటుంది.

ఎదుటివాడిని 'దూసరా దందా' చేస్తున్నావా? అని మంచినీళ్ల ప్రాయంగా అడగవచ్చు.

ఇక ఉద్యోగస్తులను జాలిగా చూస్తారు. గవర్నమెంట్ సర్వెంట్ వా! ఏదో చాలీచాలని జీతం!

ఎప్పుడు బాగుపడతావో అనేభావం కనబడుతుంది.

అవతలి పక్క ఉన్న ప్లాట్ లో డాన్స్ చేసే అమ్మాయిలుండేవారు.

పగటి పూట కన్పించేవారు కాదు.

రాత్రి ఏడు దాటగానే జిగేల్ జిగేల్ మనే దుస్తులు వేసుకుని, మేకప్ వేసుకుని మెరిసిపోతూ ట్యాక్సీలో బయటకు వెళ్లేవారు.

కిట్టు వాళ్ల బిల్డింగ్ కు కొంచెం దూరంలో బిల్డింగులున్నాయి.

వాటిలో అన్ని ఫ్లాట్లలోనూ వ్యభిచారిణులే ఉండేవారు.

ఇంతేకాక దొంగపాస్ పోర్టులు తయారు చేసేవారు, కేడీలు, గల్ఫ్ దేశాలకు మనుషులను తరలించే వాళ్లూ ఇలా అన్ని రంగాల్లోని ప్రావీణ్యులతో అంటాపు హిల్ అలలారుతుంటుంది.

ఇదే ఏరియాలో ఉద్యోగస్తులు, లెక్చరర్లు, ఫ్యామిలీలు కూడా ఉంటారు. ఎవరూ ఎవర్నీ పట్టించుకోరు. ఒకరికొకరు అడ్డురారు. వేరేవాళ్ల వ్యవహారాల్లో ఇంకొకరు తలదూర్చరు. ప్రశాంత వాతావరణం ఉంటుంది.

ఎప్పుడో రాత్రి పన్నెండు గంటల తర్వాత పోలీసుల దాడి జరుగుతుంటుంది. తమకు కావాల్సిన చుట్టాలను పట్టుకెళ్లడానికి పోలీసులు ఎంచుకునే సమయం అది. పోలీసులు చాలా తెలివైన వాళ్లు....

వాళ్లకీ తెలుసు.... మిగిలిన ఫ్యాట్లల్లో ఫ్యామిలీలుంటాయి, వాళ్లని భయభ్రాంతులని చేయకూడదని.

కిట్టు, కమలాకర్ ప్రొద్దున్నే ఎనిమిది గంటలకు తయారయ్యి, ఒక అరమైలు నడిచి, దగ్గర్లోని బస్టాపు చేరుకునేవారు.

బస్సెక్కి 'కింగ్స్ సర్కిల్' స్టేషన్ దగ్గర దిగేవారు.

అక్కడ లోకల్ ట్రైన్ ఎక్కి చర్చిగేట్ లో దిగి, నడుచుకుంటూ ఆఫీసుకి చేరుకునేవారు.

ఆఫీసు క్యాంటీన్ లో టిఫిన్, చాయ్ కానిచ్చి, బయటకు వచ్చి దమ్ము కొట్టేవారు.

వాళ్లు స్టాండర్డ్ గా తాగే సిగరెట్ - గోల్డ్ ఫ్లేక్....

ఆఫీసులోని బుల్లి ఇంజనీర్లు ఒకళ్లనొకళ్ళు పలకరించుకునేవారు.

కిట్టుని ఒకళ్ళిద్దరు అడిగారు... మీరు బీటెక్కా అని... కాదు డిప్లొమా అని చెప్పాడు కిట్టు...

ఆ తర్వాత వాళ్లు కిట్టుని పలకరించడం మానేశారు.... పలకరింపుగా నవ్వేవాళ్ళు అంతే!

దీని భావమేమి తిరుమలేశా! అనుకునేవాడు కిట్టు.

ఒకరోజు కమలాకర్ కుండ పగలకొట్టినట్లు చెప్పాడు కిట్టుకి.

"అవునయ్యా! వాళ్లు బీటెక్కు, నువ్వు పీటెక్కు. నీకంటే ఎక్కువ అనే భావం వాళ్లకుంటుంది. నీతో ఎందుకు ప్రెండ్ షిప్ చేస్తారు?"

ఈ బుల్లి ఇంజనీర్లలో ఎమ్ టెక్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు.

వాళ్లు మింగలేక, కక్కలేక అన్నట్టు ఉండేవారు.

"బుల్లి ఇంజనీరు ఉద్యోగానికి డిప్లొమా ఉంటే చాలు మరి ఈ బీటెక్కులు, ఎమ్ టెక్కులు ఈ చిన్న ఉద్యోగం ఎందుకు చేస్తున్నట్లు?".... మళ్లీ కిట్టుకి సందేహం!

"వాళ్ల ఉద్యోగం వాళ్లు చేసుకుంటూ, వేరే దానికి ప్రయత్నిస్తుంటారు. చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకోవడానికి వాళ్లేమన్నా వీపీలా?" జ్ఞానబోధ చేసేవాడు కమలాకర్...

ఈ కమలాకర్ కిట్టు కంటే నాలుగాకులు ఎక్కువ చదివాడు, లోకజ్ఞానంలోనూ, చదువులోనూ...

వెంకటేశ్వర యూనివర్సిటీ కేంపస్ లో బీటెక్ చేసి వచ్చాడు కమలాకర్. సంస్కృత భాషలో కిట్టు కంటే ఎక్కువ పట్టుగలవాడు.

వీపీ అంటే? వివరణ కోరాడు కిట్టు.

అది కూడా తెలీదా 'ఎర్రి పప్ప' అని... వివరించాడు కమలాకర్.

ఎప్పుడన్నా హొటలుకు వెళ్లి దోసె తినేటప్పుడు చుట్టుపక్కల వాళ్లని చూసి కిట్టు ఫోర్కు స్పూన్ తో తినాలని ప్రయత్నించేవాడు. అది చూసి కమలాకర్ "మనకెందుకయ్యా లేనిపోని అలవాట్లు! చిన్నప్పట్నుంచి చేతితోనే కదా తినేవాళ్లం, బొంబాయిలో ఉంటే ఫోర్కు స్ఫూన్లతో తినాలా? పక్కన పడెయ్!" అనేవాడు.

కిట్టు మాత్రం ఎంతో ఆనందంగా ఉండేవాడు. అమ్మయ్య జీవితంలో ఒక ఉద్యోగం సంపాదించేసాం. అనుకుంటూ ఆనందంగా ఉండేవాడు. ప్రతి నెలా జీతం రాగానే ఒక చొక్కా గానీ, ఫ్యాంటు గానీ కొనుక్కునేవాడు. ఎప్పుడన్నా చికెన్ తెచ్చుకుని, వండుకుని, దానితో పాటు 100 రూపాయలకు వచ్చే వోడ్కా బాటిల్ తెచ్చుకుని, తాగుతూ, తింటూ, దమ్ముకొడుతూ ఎంజాయ్ చేసేవారు.

అప్పుడప్పుడూ కమలాకర్ తో పాటు విక్టోరియా జూబిలీ టెక్నలాజికల్ ఇన్ స్టిట్యూట్ కి వెళ్లేవాడు కిట్టు.

వాళ్లతో మందుకొట్టడం, వాళ్ల మెస్ లో భోజనాలు చేయడం జరిగేది.

ఒకోసారి ఈ ఎమ్ టెక్కుల్లో కొందరు చదువు నిమిత్తం అమెరికా వెళ్లేవారు. వాళ్లతో ఎయిర్ పోర్ట్ కి వెళ్లడం, వాళ్లకి బై చెప్పి రావడం జరిగేది.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
agent ekamber