Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
agent ekamber

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

o college drop out gadi prema katha

''మీ అందరికీ చెప్తున్నాను. ఆయన.... మిస్టర్‌ వినోద్‌! అసమాన ప్రతిభావంతుడట. ఫారెన్‌రిటన్‌డ్‌. బాస్‌ చెప్పిందాన్నిబట్టి వినోద్‌ అంటే మన కంపెనీ సన్‌ ఆటోమొబైల్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ మిస్టర్‌ సుధాకర్‌ నాయుడుగారికి ఈ వినోద్‌ అంటే ఎంతో అభిమానం. వినోద్‌ కూడా చాలా సింపుల్‌గా, ఉత్సాహంగా వుంటాడట. మీరు ఆఫీసులో కబుర్లు చెప్పుకున్నంత సులువుగా ఆయన ముందు మాట్లాడి మన పరువులు తీయకండి. అసలే మనబ్రాంచి సేల్సు పెరక్కపోవటం పైనా, ఇక్కడ పనితీరుపైనా సుధాకర్‌ నాయుడుగారు అసంతృప్తిగా వున్నారు. అంచేత మీరంతా వస్తున్న వినోద్‌ ముందు రిజర్వుడుగానూ, పద్దతిగానూ వుండండి. ఇదిగో కళ్యాణీ! ఇలా రామ్మా'' అంటూ ఒక యువతిని పిలిచాడాయన.

''యస్సార్‌'' అంటూ ముందుకొచ్చిందామె.

''ఇది.............''

''ఏది సార్‌?''

''అబ్బా....... ఇదేనమ్మా! నా కూతురు మమత.... ఇది మన వి. ఐ. పి. ముందు పిచ్చిగా మాట్లాడి ఎక్కడ రసాభాస చేస్తుందోనని నాకు భయంగా వుంది. దీన్ని మాట్లాడకుండా చూసేభాద్యత నీది'' అంటూ తన కూతురు మమత అనే ఆ గుండుమల్లిని కళ్యాణికి అప్పగించాడాయన.

''ఇది అన్యాయం, అక్రమం, డాడీ! ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ వాక్‌ స్వాతంత్య్రం వుంది. మీరు నా నోరు కట్టేయలేరు. నేను మనోజ్‌తో మాట్లాడాలి అంతే'' అనరిచింది మమత.

''హక్కుల గురించి మాట్లాడితే నోరు కట్టేస్తాను. బిఏ గుడ్‌గర్ల్‌! నీకు పెళ్ళిచేసి అత్తారింటికి పంపించకుండా వుంచటం పొరబాటయిపోయింది. మీ అందరికి చెప్తున్నాను. ..... మిస్టర్‌ వినోద్‌ ఇక్కడుండే రోజులూ మీరంతా జాగ్రత్తగా వుండాలి. పద్దతిగా పనిచేయాలి. మన బ్రాంచి పరువు కాపాడాల్సిన బాధ్యత మీ...... మనందరిమీద వుంది.'' అంటూ మరోమారు అందర్నీ హెచ్చరించాడు.

స్టాఫ్‌ అంతా చప్పట్లుకొట్టి అభినందించారు.

''థాంక్యూ'' అంటూ టై సర్దుకున్నాడు మధుసూదనరావు.

అంతలో దూరంగా వినవచ్చింది రైలు కూత.

సరిగ్గా అయిదు పది నిమిషాలకు త్రివిక్రమ్‌ నిద్రలేచాడు. రైలు వేగంగా పరుగు తీస్తోంది. ఎదురు బెర్త్‌ ఖాళీగావుంది. ఎ.సి. కంపార్టుమెంట్‌ గదా ప్రయాణీకులంతా ఇంచుమించు హైసొసైటీకి చెందినవాళ్ళే. అంతా గాఢనిద్రలో వున్నారు. త్రివిక్రమ్‌కి ఇక నిద్రపట్టలేదు.

రాత్రి కడుపునిండా తిని కంటినిండా నిద్రపోయాడు. డబ్బు గురించి బెంగలేదు. ఇక చింతేముంది? అందుకే చాలా ఉత్సాహంగా వున్నాడు. ఇంకో నలభై నిముషాల్లో రైలు విశాఖ చేరుకుంటుంది. ఈ లోపలే తను రెడీ అవ్వాలి.

లేచి సూట్‌కేస్‌ ఓపెన్‌చేసాడు.

అందులో షేవింగ్‌ సెట్‌ వుంది.

చక్కగా షేవ్‌ చేసుకుని బ్రష్‌చేసి ముఖం కడుకున్నాడు.

సూట్‌కేస్‌లోంచి వినోద్‌ దుస్తుల్లో ఒక జత తీసాడు తన వంటి మీద పాంటు షర్టు తీసేసాడు వినోద్‌ డ్రస్‌ ధరించాడు. క్రీంకలర్‌ పాంటు మీద  బ్లూకలర్‌ చెక్స్‌ ఫుల్‌హేండ్‌ షర్టు. వాడు అంటే సదరు వినోద్‌ కూడా తన వయసు, తనంత ఒడ్డు పొడవుగల యువకుడుగావటంతో ఆ డ్రసు త్రివిక్రమ్‌కి అతికినట్లు సరిపోయింది. ఇన్‌షర్ట్‌చేసి టై కట్టేసరికి తన రూపురేఖలే మారిపోయాయి అనిపించింది.

అరె వినోద్‌ భాయ్‌. ప్రయాణానికి ఎసి టిక్కెటిచ్చావ్‌. ఖర్చులకి జేబునిండా డబ్బిచ్చావ్‌. తొడుక్కోవటానికి బట్టలిచ్చావ్‌. బాప్‌రే, నీ ఋణం తీర్చుకోలేనిది బ్రదర్‌. ఒక వారం ఓపికపట్టు. హైదరాబాద్‌ తిరిగి రాగానే నీ దగ్గర తీసుకున్న వన్నీ తిరిగి నీకిచ్చేస్తాను. థ్యాంక్యూ బ్రదర్‌ అనుకున్నాడు మనసులో.

ఇంతలో కాఫీవాలా వచ్చాడు. ఉదయపువేళ చక్కని వాతావరణంలో అలా వెచ్చగా కాఫీ తాగుతుంటే ఆహా అన్పించింది.

''ఇదిగోబాబూ.....'' అంటూ పక్కన ఎవరో పిలుస్తుంటే ఆలోచనలు చెదిరిపోయాయి. తలతిప్పి చూశాడు త్రివిక్రమ్‌.

ఎవరో పెద్దావిడ అవతల సీట్లో కూర్చుంటూ పలకరిస్తోంది.

''చెప్పండమ్మా... ఏమిటి? అడిగాడు.

''స్టేషన్‌ రావటానికి ఇంకా ఎంతటైముంది బాబూ?''

''ఇంకో అరగంటలో స్టేషన్‌లో వుంటామండి. ఒక్కరే వస్తున్నారేమిటి?''

''అవును బాబూ.... మా అల్లుడు, కూతురు ఇక్కడ వుంటున్నారు. నేను ఇదే మొదటిసారి రావటం, మావాళ్ళు స్టేషన్‌కి కారు పంపిస్తారులే''

''సో ప్రాబ్లం ఏముంది? మీ వాళ్ళుఇక్కడే వున్నారు. హేపీ.''

''అవును బాబూ. దేవుడి దయవల్ల మా అమ్మాయికి మంచి భర్త దొరికాడు మీది ఏవూరు బాబూ?''

త్రివిక్రమ్‌ మౌనంగా ఉన్నాడు.

''నీకు పెళ్ళయిందా?''

ఖంగుతిన్నాడు త్రివిక్రమ్‌.

టాపిక్‌ తనకు తెలియకుండానే ఎటు వెళుతుందో అర్థమవుతుంది. కొంపదీసి సంబంధం చూస్తుందా ఏమిటి? ఇందుకే మరి. అనవసరంగా ఎవరితోనూ ఎక్కువసేపు మాట్లాడకూడదంటారు. ఇప్పుడేం చేయాలి? పెళ్ళి అయిందని చెప్పాలా, అవలేదని చెప్పాలా?

ఒక ఆడపిల్లను చూడగానే పెళ్ళి అయిందో కాలేదో చెప్పేయొచ్చు కాని అబ్బాయిని చూసి చెప్పలేం. అబ్బాయిలకి కూడా అలాంటి కొండగుర్తులేవన్నా ఏర్పాటు చేసుకుంటే ఎంత బాగుండేది? ఇలాంటి ముసలమ్మల బాదలు తప్పేవి.

''ఏమిటి నాయనా సందేహం? పెళ్ళయిందా?'' తన ప్రశ్నను రిపీట్‌చేసిందావిడ.

''ఇంకా లేదండి'' నిజమే చెప్పాడు.

''అలాగా బాబూ, నీ అడ్రస్‌ యివ్వకూడదూ, మేం వుండేది హైదరాబాద్‌లోనే మా పెద్దమ్మాయి కూతురు రంభలా  ఉంటుంది. నీకు చక్కనిజోడు అన్పిస్తోంది.......''

తను అడ్డుకట్ట వేయకపోతే ఆవిడ తన అడ్రసు యిచ్చేవరకు వదలదని అర్ధమైపోయింది త్రివిక్రమ్‌కి. తనకు నచ్చితే తన  మనవరాలికి నచ్చినట్టే అనుకుంటోందావిడ.

''చూడండి పిన్నిగారూ, పెళ్ళి కాలేదన్నానుగాని మేచ్‌ ఫిక్స్‌కాలేదని చెప్పలేదు. నాకో మరదలుంది. వచ్చే వేసవిలో మా పెళ్ళి జరుగుతుంది. అంచేత మీరు నా గురించి ఆలోచించకుండా వుంటే బాగుంటుంది.'' అంటూహెచ్చరించాడు.

అంతే

ఆవిడ ముఖంలో రంగులు మారిపోయాయి.

''అలాగా బాబూ, మంచిది'' అంటూ లేని తన సీట్లోకి వెళ్ళిపోయింది. చిన్నగా నవ్వుకుంటూ ముఖం తిప్పుకున్నాడు త్రివిక్రమ్‌ సరిగ్గా రైట్‌టైంకే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ ఒకటో నెంబరు  ఫ్లాట్‌ఫారానికి వచ్చి చేరుకుంది.

అప్పటికే తెల్లవారింది.

ప్లాట్‌ఫారం కోలాహలంగా వుంది.

ఎ.సి. కోచ్‌నుండి పాసింజర్స్‌ దిగుతున్నారు.

తన సూట్‌కేస్‌ అందుకుని లేచాడు త్రివిక్రమ్‌.

డోర్‌లోకి వచ్చేసరికి ఎదురుగా ఒక గుంపు ఎవరికోసమో ఎదురుచూస్తూ కన్పించింది. వాళ్ళచేతుల్లో పూలదండలు, ఫ్లవర్‌ బొకేలు వున్నాయి.

ఒక పెద్దాయనచేతిలో బొకేతో రైలు దిగుతున్న వాళ్ళని హడావుడిగా పరిశీలిస్తున్నాడు.

వాళ్ళంతా ఎవరు? ఎవరికోసం ఎదురు చూస్తున్నారో త్రివిక్రమ్‌కి తెలీదు. మూడు సెకన్లు మాత్రం డోర్‌లో నిలబడి బయటకు చూసాడు. తర్వాత ప్లాట్‌ఫాం మీదికి దిగాడు. ఇంతలో ఎవరో యువతి అరవటం విన్పించింది.

''డాడీ..... వచ్చేసాడు..... మనోజ్‌సార్‌ వచ్చేసాడు'' అంటూ. అలా అరిచింది ఎవరోకాదు.

సన్‌ ఆటోమొ బైల్స్‌ మేనేజర్‌ మధుసూధనరావు కూతురు మమత. కూతురు అరుపులకు ఉలిక్కిపడుతూ ఆమెను చూసాడాయన.

''ఎక్కడే ఆయన?'' అనరిచాడు.

ఆ అమ్మాయి సిగ్గుపడిపోతూ...

త్రివిక్రమ్‌ చేతిలోని సూట్‌కేస్‌ను వేలెత్తి చూపిందింది.

''అటు చూడండి డాడీ. ఆ సూట్‌కేస్‌కి మనకంపెనీ లోగో వేలాడుతోంది. ఆయనే మనోజ్‌....'' అంది.

అప్పుడు గమనించాడు ఆ పెద్దమనిషి విక్రమ్‌చేతిలో సూట్‌కేస్‌ని. వెంటనే కూతురుతో అన్నాడు. ''ఓసి పిచ్చిమొద్దు........ ఆయన మనోజ్‌కాదు. వినోద్‌, పిచ్చివాగుడు వాగి పరువుతీయకు'' అంటూ హెచ్చరించి, అప్పటికే తమని దాటిపోతున్న త్రివిక్రమ్‌వైపు పరుగుతీసాడు ''సార్‌ సార్‌'' అంటూ

నిజానికి

ఈ వెనక జరుగుతున్న గొడవ త్రివిక్రమ్‌కి తెలీదు.

తనను ఇక్కడ ఎవరన్నా పలకరిస్తారనిగాని, పిలుస్తారని గాని అస్సలు ఊహించలేదు. అందుకే దర్జాగా సూట్‌కేస్‌తో తన దారిన పోతున్నాడు. అంతలో మధుసూదనరావు పరుగెత్తుకుంటూవచ్చి అడ్డం వచ్చేసాడు.

''సార్‌..... ఏమిటిసార్‌ వెళ్ళిపోతున్నారు. మీ కోసమే మా వెయిటింగ్‌'' అంటూ దగ్గరకు రమ్మని తమ స్టాఫ్‌కి చేయి వూపాడు.

వాళ్ళంతా హడావిడిగా వచ్చేసారు.   

ఇదంతా ఏమిటో త్రివిక్రమ్‌కి అర్ధంకాలేదు.

''సారీ సర్‌. మీరు ఎవరో అనుకుని పొరబడుతున్నారు. వదిలితే వెళ్ళిపోతాను'' అన్నాడు.

''భలేవారేసర్‌. మీరు మిస్టర్‌ వినోద్‌కదూ.....? ఆ మీరు కాదన్నా మీ సూట్‌కేస్‌ నిజం చెపుతుంది చూసారా. మీ సూట్‌కేస్‌కున్న మన కంపెనీ లోగోనిచూసి మిమ్మల్ని గుర్తుపట్టేసాను. వెల్‌కం టు విశాఖట్నం సర్‌'' అంటూ బొకే చేతికిచ్చాడాయన.

ఆ వెంటనే మెళ్ళోదండలు

చేతినిండా బొకేలు

చప్పట్లతో అభినందన

చుట్టూ ప్లాట్‌ఫామ్‌మీద జనం ఈ సత్కారాన్నంతా వేడుకగా చూస్తున్నారు. ఇబ్బందిగా ఫీలయినా, అదేమీ ముఖంలో కన్పించకుండా జాగ్రత్తపడుతూ ''థ్యాంక్యు... థాంక్యూ'' అన్నాడు.

ఏం జరిగిందో ఊహించుకోవటం త్రివిక్రమ్‌కి అంత కష్టంఏమీ కాలేదు. వినోద్‌ సన్‌ ఆటోమొబైల్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. బహుషా చాలా పెద్దపోస్ట్‌ అయివుంటుంది.

వీళ్ళంతా సన్‌ ఆటోమొబైల్స్‌ స్టాఫ్‌. వినోద్‌ని రిసీవ్‌చేసుకోవడానికి స్టేషన్‌కొచ్చారు. ఇలా జరుగుతుందని తనకి ఆలోచన రాలేదు. ఏమాత్రం ముందుగా వూహించగలిగినా వీళ్ళకంట పడకుండా మరో దారిలో బయటికెళ్ళిపోయేవాడు.

ఓరి కంగారు వినోద్‌ నీకెంత స్టేటస్‌ వుందిరా? నీ పర్సు, సూట్‌కేస్‌ కొట్టేసానని నన్నిలా ఇరికించటం న్యాయంగా వుందా? ఫూల్‌..... ఇడియట్‌... ఈ పదాలు నీకు వర్తిస్తాయా. నాకు వర్తిస్తాయా అర్ధం గావటంలేదు. ఇదెక్కడికి తీసుకుపోతుందిరా దేవుడా అనుకుంటూ మనసులోనే లబలబలాడాడు.

పైకి మాత్రం గంభీరంగా నవ్వాడు.

''అయాం మధుసూదన్‌రావు, విశాఖబ్రాంచి మేనేజర్‌ని. ఇతను ఆఫీస్‌ ఇన్‌చార్జి. ఇతను అక్కౌంటెంట్‌...'' వరసగా ఎంప్లాయిస్‌ని పరిచయం చేసాడు మధుసూధనరావు.

''ఈ పరిచయ కార్యక్రమం ఇక్కడ అవసరమా? ఆఫీస్‌లో బెటర్‌ కదూ....? దండలు, బొకేలు అన్నీ తిరిగి యిచ్చేస్తూ అడిగాడు త్రివిక్రమ్‌.

''ఆఫ్‌కోర్స్‌ యు ఆర్‌ రైట్‌సర్‌? ఏదో ఫార్మాలిటీకోసం.....'' నవ్వాడు మధుసూదనరావు.

''నన్ను పరిచయం చేయలేదు ఎందుకని...?'' దబాయించింది మమత.

ఈ కొత్త క్యారెక్టర్‌ ఎవరో అర్ధంకాలేదు త్రివిక్రమ్‌కి. ఆమె మాత్రం సీరియస్‌గా చూస్తూ ''హలో మనోజ్‌సర్‌...'' అంటూ పలకరించింది.

ఈ మనోజ్‌ ఎవడ్రా బాబు. అనుకుంటూ చుట్టూ చూసాడు. త్రివిక్రమ్‌ మధుసూధనరావు కల్పించుకోడంతో విషయం అర్ధమైంది.

''సారీసర్‌. మిమ్మల్ని వినోద్‌ అని పిలవటం నోరు తిరక్క, మనోజ్‌ అంటోంది, ఇది నా కూతురు మమత. మన ఆఫీస్‌లోనే చిన్న జాబ్‌ చేస్తోంది'' అంటూ పరిచయంచేసాడు.

''ఐసీ.... మీ అమ్మాయికి చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు అంటే ఇష్టమా?'' అడిగాడు త్రివిక్రమ్‌.

''సార్‌ నాకు అవంటే ప్రాణంసార్‌'' అంది మమత.

''అర్జంటుగా అవి తినటం మానెయ్‌. అప్పుడు స్లిమ్‌గా, అందంగా వుంటావ్‌'' సలహా యిచ్చాడు.

ఆమె బోలెడు సిగ్గుపడిపోతూ మెలికలు తిరిగింది.

''హలో మిస్‌ మమతా! మీరు మల్లెతీగ కాదు, గుండుమల్లి మరీ మెలికలు తిరక్కండి నడుం పట్టేస్తుంది ఓ.కే..... థ్యాంక్యూ ఎవ్విరిబడి. తర్వాత కలుద్దాం. నేను వెళతాను'' అంటూ కదలబోయాడు త్రివిక్రమ్‌.

''అదేమిటి సార్‌! మీరెక్కడికి?'' ఆశ్చర్యంగా అడిగాడు మధుసూదనరావు.

''ఎక్కడికంటే..... హోటల్‌కి.....'' చెప్పాడు.

''భలేవారే సార్‌! హోటల్లో స్టేచేయాల్సిన అవసరం మీకేమిటి సార్‌. మన కంపెనీ గెస్ట్‌హౌస్‌ వుంది. మేమంతా వున్నాం ఇక్కడ మీకు ఎన్ని పనులున్నాయి? ఎంత వ్యవహారం వుంది. మీరు ఎంత సింపుల్‌గా వుండాలనుకుంటే మాత్రం హోటల్‌నుంచి ఆఫీసుకు తిరగటం మంచిదికాదు....''

''అదికాదు నేను సింపుల్‌గా ప్రశాంతంగా వుండాలనుకుంటున్నాను. నాకు హోటల్‌ బెస్ట్‌.''

''నోనో.... గెస్ట్‌హౌస్‌ బెస్ట్‌''

''అదికాదు మధుసూదనరావు గారూ....''

''ఇంకేం చెప్పకండి, మీరు హోటల్లో దిగారని తెలిస్తే బిగ్‌బాస్‌ హైదరాబాద్‌లో తుపాకి పేలిస్తే ఇక్కడ గుండె ఢాం అంటుంది. రండి ప్లీజ్‌. కాదనకండి. దిస్‌ వే.... ప్లీజ్‌.

అంటూ బయటికి దారితీసారు.

''తనుపూర్తిగా బుక్కయిపోయాడని. త్రివిక్రమ్‌కి అర్ధమైపోయింది. వీళ్ళంతా తననే మిస్టర్‌ వినోద్‌ అనుకుంటున్నారు కాదని తెలిస్తే తన మెడకి మరోకొత్తకేసు తగులుకుంటుంది. వెళ్ళినట్టే వెళ్ళి వీలుచూసుకొని జంప్‌ అయిపోవాలి అనుకుంటూ వాళ్ళని అనుసరించాడు. సూట్‌కేసు మధుసూదనరావు అందుకున్నాడు.

అంతా స్టేషన్‌ బయటికొచ్చారు. ఖరీదయిన కారులో మధుసూదనరావు, త్రివిక్రమ్‌లు కూర్చోగానే డ్రయివరు కారును పోనిచ్చాడు. ఆ వెనకే స్టాఫ్‌ తమ వాహనాల్లో బయలుదేరారు.

విశాఖ వీధుల్లో మెత్తగదా పరుగుతీస్తోంది ఎ.సి. కారు.

చూడ్డానికి సీట్లో రిలాక్స్‌గా కూర్చున్నాడు గాని

విపరీతమైన టెంక్షన్స్‌తో ముళ్ళమీద కూర్చున్నట్లుంది త్రివిక్రమ్‌కి. విపరీతంగా ఆలోచిస్తున్నాడు.

ఏమిటి తన పరిస్థితి?

అక్కడ పర్సు సూట్‌కేసు పోగొట్టుకొన్న ఒరిజినల్‌ వినోద్‌ కామ్‌గా వుండిపోతే ఫరవాలేదు. పోలీస్‌ కంప్లయింట్‌ యిస్తే, తను ఈ వ్యవహారంలో మరింతగా కూరుకుపోయే ప్రమాదం వుంది.

అంతేకాదు. మేనేజర్‌ మధుసూదనరావు మాటల్నిబట్టి ఈ వినోద్‌ హైదరాబాద్‌కి చెందిన సన్‌ ఆటోమొబైల్స్‌ కంపెనీలో చీఫ్‌ ఇంజనీర్‌ ఇక్కడ వారం రోజులపాటు వుండి ఇక్కడి బ్రాంచిని తనిఖీచేసి తగిన సూచనలు, సలహాలు యివ్వటంకోసం వస్తున్నాడు. తన తలరాత మారి వాడి స్థానంలోకి తను వచ్చాడు. ఎంత తొందరగా ఇక్కడినుంచి బయటపడితే అంత మంచిది. కాని ఎలా.... అదే ఆలోచిస్తున్నాడు.

తన పరిస్థితి చూస్తుంటే ఓ పిట్టకథ గుర్తుకొస్తొంది త్రివిక్రమ్‌కి. ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక యువకుడు వుండేవాడు. చదువుకున్నాడు. యుధ్దవిద్యలు వచ్చు. కాని పేదకుటుంబం. నా అనేవాళ్ళు ఎవరూలేరు. బామ్మ తప్ప. ఓ రోజు బామ్మ సలహా యిచ్చిందట.

''ఒరే శుంఠా! ఈ పల్లెటూళ్ళో ఇలా ఎంతకాలం కష్టపడతావ్‌రా, వెళ్ళి చేద్దామంటే? పనీపాటూ లేదని నీకు ఎవరూ పిల్లనివ్వటానిక్కూడా ముందకు రావటంలేదు. రేపు నేను గుటుక్కుమంటే నిన్నెవరు చూస్తారు. అంచేత నువ్వు నగరానికి వెళ్ళిపోరా. రాజుగారి దివాణంలో చిన్న ఉద్యోగం సంపాదించుకునిరా, అప్పుడు నీ గురించి నాకు ఏ దిగులూ వుండదు అని సలహా యిచ్చి రాజుగారు వుండే రాజధాని నగరానికి పంపించింది.

అదే విధంగా ఆ యువకుడు కొన్నిరోజులు ప్రయాణించి రాజధానికి చేరుకున్నాడు..... అయితే అక్కడా అతన్ని దురదృష్టం వెక్కిరించింది. మహామంత్రి చనిపోయి రాజుగారు దుఖఃంలో వున్నారట. నాలుగు రోజులయినా రాజదర్శనం కాలేదు. ఈ లోపల కొత్త మహామంత్రి ఎవరనే సమస్య వచ్చింది. మహామంత్రిని వెదికిపట్టుకునే భారాన్ని పట్టపుటేనుగుకు వదిలి, పూలమాల యిచ్చి, దాన్ని నగరంలో విడిచిపెట్టారు. అది అటుతిరిగి యిటుతిరిగి, వచ్చి పూటకూళ్ళ పెద్దమ్మ యింటిముందు నిలబడిన ఆ యువకుడి మెడలో పూలదండ వేసిందట. ఇంకేముంది? చిన్న ఉద్యోగం దొరికితే చాలని నగరానికి వచ్చిన యువకుడు కాస్తా రాజ్యానికి మహామంత్రి అయిపోయాడు. తర్వాత ఆ పదవిని అతగాడు ఎలా నిర్వహించాడో అనవసరంగాని ప్రస్తుతం తన పరిస్థితి చూస్తే ఈ కథలోని యువకుడికి, తనకు అట్టే తేడా లేదనిపిస్తుంది.

''ఏమిటి సార్‌ ఆలోచిస్తున్నారు?'' పక్కన కూర్చున్న మధుసూదనరావు పలకరింపుతో ఆలోచనలనుంచి బయటపడ్డాడు త్రివిక్రమ్‌.

''ఏంలేదు'' అన్నాడు పొడిగా.

''సుధాకర్‌ నాయుడుగారు మీ గురించి అంతా చెప్పారు.....''

''నా గురించి చెప్పటానికి ఆయన ఎవరు?''

ఆ ప్రశ్న విని గొప్పగా ఆశ్చర్యపోతూ షాకయి, ఆ వెంటనే పెద్దగా నవ్వేసాడాయన.

''అర్ధమైంది.... ఈ విషయం కూడా ఆయన నాతో చెప్పాడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ మీరు పరధ్యానంలో వుంటారని... మర్చిపోతుంటారని, చెప్పి గుర్తుచేస్తుండాలని నాకు వివరంగా చెప్పారు ఛైర్మన్‌ సుధాకర్‌ నాయుడుగారు మన బాస్‌ సార్‌, సన్‌ ఆటోమొబైల్స్‌ ఛైర్మన్‌ గారు'' అన్నాడు.

తనకంతా తెలిసినట్టు ఫోజు కొడుతూ

సీరియస్‌గా చూసాడు త్రివిక్రమ్‌.

''సారీ మేనేజరుగారూ! నా ప్రశ్న మీకు అర్ధమైనట్లు లేదు. సుధాకర్‌ నాయుడుగారు మన బాస్‌ కాదనటంలేదు. కాని నా గురించి అంతగా చెప్పటానికి ఆయన ఎవరు అంటున్నాను. నా పర్సనల్‌ విషయాలు మాట్లాడే వాళ్ళంటే చెట్టెక్కె కప్పలు, గాల్లో ఎగిరే చేపలూ గుర్తొస్తాయి'' అంటూ సమర్ధించుకున్నాడు.

''అవునవును. నాకూ గుర్తొస్తాయి'' అంటూ వంతపాడాడు మధుసూదనరావు.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్