Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

o college drop out gadi prema katha

''మూడు రోజుల్లో ఇక్కడి క్రికెట్‌ మేచ్‌ వుంది, అది గుర్తుందా?'' అడిగాడు త్రివిక్రమ్‌. ''గుర్తులేకపోవటం ఏమిటి సార్‌, నా ప్రాణం తీయటానికి లీవు కావాలంటున్నారు. నేను యివ్వనంటున్నాను. ఇస్తే బాస్‌తో తంటా ఇవ్వకపోతే స్టాఫ్‌తో తంటా. ఛ ఛ... ఆఫీసు అంతా ఒకటే క్రికెట్‌ పిచ్చోళ్ళు సార్‌'' అన్నాడు.

''నేనూ క్రికెట్‌ పిచ్చోడ్ని'' కూల్‌గా చెప్పాడు త్రివిక్రమ్‌.

అమ్మో చచ్చాను. ఇదేదో నా చావుకొచ్చినట్టుంది. విషయం తెలీకుండా టంగ్‌ స్లిప్ప్‌యిపోయింది. అని మనసులోనే కంగారుపడుతూ పైకి మాత్రం ఓ పిచ్చినవ్వు నవ్వాడు మధుసూదనరావు.

''ఎంత మాట సార్‌! మీది క్రికెట్‌ పిచ్చికాదు సార్‌. క్రికెట్‌ మీ హాబీ మా అమ్మాయి మమత కూడా ఇంతే క్రికెట్‌ అంటే దానికి ప్రాణం...''

''నాకు ప్రాణంకాదు, సరదా, నాకు టికెట్‌ కావాలి. సంపాదించగలరా?''

''భలేవారే సార్‌! ఆడగటం కాదు, అజ్ఞాపించండి. టిక్కెట్స్‌ రెడీ, మన ఆఫీస్‌ తరుఫున నలభై టిక్కెట్లు తెప్పించి వుంచాం. నోప్రాబ్లం''

''స్టాఫ్‌కి సెలవు ఇవ్వనంటున్నారు''

''ఇవ్వం సార్‌! కాని వాళ్ళు తీసుకుంటారు. ఇది ప్రతిఏటా వుండే సమస్యేగదా నో ప్రాబ్లం.

''ఆ రోజు ఆఫీసుకు సెలవు ఇచ్చేయండి. సమస్య వుండదు. అంతా హ్యాపీ''

''ఓ.కే మీరు చెప్పారుగదా, సెలవిచ్చేద్దాం సార్‌''

మాట్లాడుతూ వుండగానే కారు ఒక గేటు దాటి అధునాతన కట్టడం పోర్టికోలోకి వచ్చి ఆగింది.

''రండి సార్‌! ఇదే మన కంపెనీ గెస్ట్‌హౌస్‌. బాస్‌ సుధాకర్‌ నాయుడుగారు ఎప్పుడూ విశాఖ వచ్చినా ఇక్కడే బసచేస్తారు. మీకు కూడా ఇక్కడే ఏర్పాటుచేయమని ఆర్డరు. ప్లీజ్‌కం'' కారు దిగి డోర్‌ తెరిచి పట్టుకుంటూ రిక్వెస్ట్‌ చేసాడు. మధుసూదనరావు.   

''థ్యాంక్యూ'' అంటూ కారు దిగాడు త్రివిక్రమ్‌.

ఓసారి చుట్టూ చూసాడు.

గేటు దగ్గ వాచ్‌మెన్‌ వున్నాడు.

గెస్ట్‌హౌస్‌లో కొందరు నౌకర్లు కన్పిస్తున్నారు. అతి సుందరమైన ఆ గెస్ట్‌హౌస్‌ తన నివాసం కానుందంటే తనకే నమ్మబుద్దికావటం లేదు.

మౌనంగా మధుసూదనరావు వెంట లోనకు నడిచాడు. త్రివిక్రమ్‌కి చక్కటి ఎ.సి. రూం కేటాయించబడింది. డ్రయివరు సూట్‌కేస్‌ తెచ్చి లోన పెట్టాడు. ఎటుచూసినా ఖరీదైన ఫర్నీచర్‌, డబుల్‌కాట్‌ బెడ్‌ నేలంతా మెత్తని కార్పెట్‌ పరచబడి వుంది.

''సార్‌! మీరు స్నానంచేసి విశ్రాంతి తీసుకోండి మీకు టిఫిన్‌, మీల్స్‌ అంతా ఇక్కడే. బయటకు వెళ్ళాల్సిన పనిలేదు. మన ఆఫీస్‌లో పదకొండు గంటలకు కాన్ఫరెన్స్‌ వుంది. డ్రయివరు మిమ్మల్ని ఆఫీస్‌కు తీసుకొస్తాడు. అంటూ పనిలోపనిగా అక్కడి నౌకర్లను కూడా పరిచయంచేసి తను సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు మధుసూదనరావు.

నిండా మునిగాక చలేమిటని

ఇక ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించలేదు. త్రివిక్రమ్‌, హేపీగా స్నానంచేసి లుంగీలోకి మారిపోయాడు. పనివాళ్ళు అందించిన టిఫిన్‌చేసి, కాఫీ తాగాడు తను పారిపోడానికి అవకాశం ఉందేమో గమనించే ఉద్దేశంతో ఓసారి బయటకు వచ్చాడు.

''బయటకు వెళ్ళాలా సాబ్‌'' అక్కడే వున్న డ్రయివర్‌ వెంటనే అడిగాడు.

మధుసూదనరావు తాము వచ్చిన ఎ.సి. కారును, డ్రయివర్‌ను అక్కడే వదిలి ఆటోలో వెళ్ళిపోయాడు.

ఇప్పుడు వీళ్ళ కళ్ళుగప్పి తప్పించుకుపోవటం సాధ్యంకాదని త్రివిక్రమ్‌కి అర్ధమైంది. ఆదేదో రాత్రికి ప్రయత్నిస్తే మంచిదనిపించింది. అందుకే తిరిగి లోనకు వచ్చేసి హేపీగా రెండు గంటలు నిద్రపోయాడు. సరిగ్గా పదకొండు గంటలకు అతడ్ని తీసుకొని ఆఫీస్‌కు బయలుదేరింది ఎ.సి.కారు.

సన్‌ మొబైల్‌ ఆఫీస్‌.

చుట్టూ ఎత్తైన కాంపౌండ్‌వాల్‌, ఎత్తయిన గేటు, గేటు ముందు డ్యూటీలో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్‌.

గేటు దాటగానే సువిశాలమైన ఆవరణ.

గేటు ఎదురుగా మూడు అంతస్తుల ఆఫీసు కట్టడం దానికి కుడి పక్కన గోడౌన్‌, ఎడం పక్కన క్వార్టర్సు... పార్కింగ్‌లో అనేక వాహనాలు, అవతల గోడౌన్‌ దగ్గర లారీనుంచి పార్సిళ్ళను కొందరు అన్‌లోడ్‌చేస్తున్నారు. మరోపక్కన కొన్ని మినీవేన్‌లు మార్కెటింగ్‌ కోసం లోడ్‌తో నిలబడున్నాయి. అంతా బిజీ హడావుడి.

పార్కింగ్‌ దగ్గరే మేనేజరు మధుసూదనరావు త్రివిక్రమ్‌కోసం వెయిట్‌ చేస్తున్నాడు. కారు దిగిన అతడ్ని సాదరంగా ఆఫీస్‌కి వెంటబెట్టుకు నడిచాడు.


''ఆఫీసు స్టాఫ్‌లో మార్కెటింగ్‌కి సంబంధించిన ముఖ్యమైన వాళ్ళని మాత్రమే కూర్చొబెడుతున్నాం, రండి ఇటు లిఫ్ట్‌... మనం థర్డ్‌ఫ్లోర్‌కి వెళ్ళాలి, ప్లీజ్‌ కం'' అదే విధేయత, అదే వినయం.

ఇద్దరూ లిఫ్ట్‌రూం చేరేసరికి

అప్పుడే లిఫ్టు దిగివస్తూ ఎదురయింది మమత.

త్రివిక్రమ్‌ని చూడగానే

సంబరపడిపోయిందామె.

''హాయ్‌ మమతా బేబీ... నీ మనోజ్‌ నేనుకాదు, అయాం వినోద్‌'' అన్నాడు నవ్వుతూ త్రివిక్రమ్‌.

''మీ పేరు ఏదైనా గానీ మీరు మాత్రం సూపర్‌ సార్‌, సీయూ...'' అంటూ వెళ్ళిపోయిందామె.

నెత్తి కొట్టుకున్నాడు మధుసూదనరావు.

''ఆడపిల్లలకి చనువిచ్చి, గారాబంగా పెంచితే వచ్చిన చిక్కేయిది. చూసారా సార్‌, పక్కన తండ్రిని నేనొక్కడ్ని వున్నానని కూడా చూడకుండా ఎలా మాట్లాడుతుందో... ఇది నా కూతురని చెప్పుకోడానికే ఇబ్బందిగా వుంది. వట్టి అల్లరిపిల్ల సారీ సార్‌, ఏమీ అనుకోకండి'' అంటూ రిక్వెస్ట్‌ చేసాడు.

''నేనేమీ అనుకోనుగాని, నాకన్నా వయసులో పెద్దవారు, మాటి మాటికి మీరలా సార్‌ అంటూ పిలవటం ఇబ్బందిగా వుంది. మిస్టర్‌ వినోద్‌ అని పిలవండి. చాలు'' అంటూ సలహా ఇచ్చాడు త్రివిక్రమ్‌.

లిఫ్టులో ఇద్దరూ మూడో అంతస్తుకు చేరుకునేసరికి అక్కడ అప్పటికే స్టాఫ్‌ మెంబర్లు చాలామంది గుమిగూడి వున్నారు. వాళ్ళలో చాలా మంది ఉదయం రైల్వేస్టేషన్‌కు రాలేదు.

ఒక్కొక్కరినే పిలిచి పేరు పేరునా పరిచయం చేసాడు మధుసూదనరావు. ఇంతలో అటుగా వస్తున్న ఒక యువతిమీద త్రివిక్రమ్‌ చూపులు నిలిచిపోయాయి.

ఆమెకు ఇరవై నాలుగు సంవత్సరాలు మించదు వయసు, యావరేజ్‌ హైట్‌, కనుముక్కుతీరు చాలా బాగుంది బాడీ స్లిమ్‌గా, ఆకర్షణీయంగా వుంది. కొందరి అందం చూడగానే తెలీదు. అదే విచిత్రం.

ముందుగా చూడగానే యావరేజ్‌ ఫిగర్‌ అనుకున్నాడు, రెండో సారి చూడగానే అందంగా వుంది అనుకున్నాడు. మూడో సారి చూడగానే బాప్‌రే అనిపించింది. ఎందుకంటే

ఆమె నడకలో హుందాతనం, ముఖంలో ఆకర్షణ కలిసి ఆమెకు ఓ ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి. చురుకైన, విశాలమైన ఆమె కళ్ళు ఆమె అసాధారణ యువతి అని చెప్తున్నాయి ఆమెను చూడగానే ముందుగా మధుసూదనరావు ఆమెను పిలిచాడు.

''అమ్మాయ్‌ వరేణ్య, ఓసారిలా రామ్మా'' అంటూ

''చెప్పండి బాబాయ్‌'' అంటూ దగ్గరకొచ్చిందామె.

''వీరు మిస్టర్‌ వినోద్‌, మన హైదరాబాద్‌ మెయిన్‌ బ్రాంచి నుంచి వచ్చిన ఆటోమొబైల్‌ స్పెషల్‌ ఇంజనీర్‌. వారం రోజులపాటు ఇక్కడే వుండి, మన బ్రాంచి వ్యవహారాలు చూస్తారు. బైదిబై మిస్టర్‌ వినోద్‌.... మీట్‌ మిస్‌ వరేణ్య. ఇక్కడ జూనియర్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటీవ్‌'' అంటూ ఒకరినొకరికి పరిచయం చేసాడు.

వరేణ్య!

మనిషే కాదు, పేరు కూడా వెరైటీగా వుంది అనుకున్నాడు త్రివిక్రమ్‌.

''హలో'' అంటూ ఆమె షేక్‌హ్యాండ్‌ కోసం చేయి ముందుకు సాచింది. కాని తన చేయి అందించలేదు త్రివిక్రమ్‌ రెండు చేతులు జోడించి ''నమస్తే'' అన్నాడు, ఆమె వెంటనే నవ్వేస్తూ ''నమస్తే'' అంటూ తనూ నమస్కరించింది.

నవ్వితే ఆమె ఎంత అందంగా వుంది అన్పించింది.

''అంతా హాల్లోకి పదండి టైమైంది. కాన్ఫరెన్స్‌ స్టార్ట్‌ చేద్దాం'' అంటూ హాలువైపు దారితీసాడు మేనేజరు మధుసూదనరావు.

ఆ ఫ్లోర్‌ని కంపెనీ కాన్ఫరెన్స్‌లకోసమే కేటాయించారు. ఒక మినీ థియేటర్‌లా వుంది కాన్ఫరెన్స్‌ హాలు.

చక్కటి డయాస్‌, దానిమీద ప్రసంగించటానికి అనువుగా స్టాండింగ్‌ టేబుల్‌, మైక్‌, పక్కనే కొన్ని ఛేర్స్‌, ఎదురుగా మెంబర్స్‌ కూర్చోడానికి అనువుగా అనేక ఛేర్స్‌, పట్టపగల్లా లైట్లు వెలుగుతున్నాయి. హాలు మొత్తం ఎ.సి. మొదట వరుసలోనే త్రివిక్రమ్‌ పక్కనే కూర్చుంది వరేణ్య. చాలా సింపుల్‌గా వుంది. వంపులు తిరిగి ప్రశాంతంగా ప్రవహించే నదిలా ఆమె ఆకర్షిస్తోంది. సాదాచీర జాకెట్‌, మెడలో సన్నటి బంగారు గొలుసు, చేతికి రిస్ట్‌వాచీ వాలుజడ కరినాగులా పొడవుగా వుంది. కోవెల శిల్పంలా చూసేకొద్దీ ఆమె రూపలావణ్యం కన్ను చెదరగొడుతోంది.

'హలో' అంటూ వెక్కిరించింది త్రివిక్రమ్‌ అంతరాత్మ.

ఏంది బాసూ.... ఎప్పుడూలేంది ఇప్పుడు అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావ్‌? లవ్వా...? లవ్‌ ఎట్‌ ఫస్ట్‌సైటా...? ఉన్న సమస్య చాలదని కొత్త సమస్య అవసరమా నీకు? ఇంటర్‌ చదివిన నువ్వెక్కడ. ఎన్నో డిగ్రీలు చదివిన వీళ్ళెక్కడ. నీ నిజరూపం తెలిస్తే చితగ్గొట్టి వీధిలో పడేస్తారు నిన్ను. తప్పించుకునే మార్గం చూడు. అమ్మాయి గురించి ఆలోచిస్తే అన్యాయమైపోతావ్‌' అంటూ దారుణంగా హెచ్చరిస్తున్న అంతరాత్మని బలవంతంగా అదిమి కూర్చోబెడుతూ డయాస్‌వంక చూసాడు.

అప్పటికే డయాస్‌మీద మైక్‌ముందు రెడీగా వున్నాడు మధుసూదనరావు. ఆయన ఏంచేస్తాడో వినాలని కుతూహలంగా ఎదురుచూస్తున్నారు అంతా. ఆయన తన ప్రసంగాన్ని ఆరంభించాడు.

''ఈ ప్రత్యేకమైన కాన్ఫరెన్స్‌ ఎందుకు ఏర్పాటుచేసానో మీకందరికి తెలుసు. మనకిసమస్యలున్నాయి. మార్కెట్లో పోటీ పెరిగింది. సేల్స్‌ తగ్గుతున్నాయి. మన విశాఖబ్రాంచి పనితీరుమీద బాస్‌ అసంతృప్తిగా వున్నారు. అందుకే మనకి సరైన గైడ్‌లైన్స్‌ ఇవ్వడం కోసం మిస్టర్‌ వినోద్‌ని ఇక్కడికి పంపించారు. సో.... మీ సమస్యలన్ని వినోద్‌ గారికి చెప్పండి ముందుగా వినోద్‌గారిని డయాస్‌మీదికొచ్చి ప్రసంగించమని కోరుతున్నాను. మిస్టర్‌ వినోద్‌.... ప్లీజ్‌ అంటూ వినోద్‌ని ఆహ్వానించాడాయన.

త్రివిక్రమ్‌ ఊహించని మలుపు యిది.,

కాన్ఫరెన్స్‌ అంటే ఏదో వాళ్ళంతా చర్చిస్తారు. విని వెళ్ళిపోవచ్చు అనుకున్నాడుగాని కాన్ఫరెన్స్‌ సెంటర్‌ పాయింటే తనుఅని ముందుగా వూహించలేకపోయాడు. అసలే యిది మెటార్‌ ఫీల్డ్‌. ఆటోమొబైల్‌ స్పేర్‌ పార్ట్స్‌ కంపెనీ. తనకా... కారు నడపటం తప్ప ఏ పార్టు ఎలా పనిచేస్తుందో కూడా తెలీదు. ఏమిటి మాట్లాడేది... ఒరే త్రివిక్రమ్‌ బుక్కయిపోయావురా అనుకున్నాడు మనసులో.

స్టాఫ్‌ అంతా చప్పట్లతో అభినందిస్తున్నారు.

తను లేవాలో, వద్దో అర్ధంకాలేదు.

వరేణ్య తనూ చప్పట్లు చరుస్తూ అతడి ముఖంలోకి చూసింది వెళ్ళమన్నట్లు కళ్ళతోనే సూచించింది.

ఏం కళ్ళురా బాబూ! నూదంటురాళ్ళలా వున్నాయి. అనుకున్నాడు మనసులో.

ఏమీ మాట్లాడకుండా మౌనంగా వున్నా ప్రమాదమేనని తెలుసు, అందుకే తెగించి లేచాడు. కరతాళధ్వనులమధ్య డయాస్‌మీదకు వెళ్ళి మైక్‌ముందు నిలుచున్నాడు.

మధుసూదనరావు డయాస్‌ దిగి

తన సీట్లో కూర్చున్నాడు.

తిరిగి నిశ్శబ్దం అలుముకుంది హాల్లో

చిన్నగా గొంతు సవరించుకొని అందర్నీ చూసాడు.

ఏం మాట్లాడాలి...? ఆలోచిస్తున్నాడు... ఏదో ఒకటి మాట్లాడరా ఫూల్‌. లేదంటే నీ ముసుగు చినుగుతుంది అంటూ తొందరపెట్టింది అంతరాత్మ మరోసారి పొడిగా దగ్గాడు.

''నా మీద మీరుంచిన నమ్మకానికి... ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను. ఇక్కడికి బయలుదేరేముందు విశాఖపట్నం బ్రాంచి ఎలా వుంటుందో, ఇక్కడి స్టాఫ్‌ కోపరేట్‌ చేస్తారో లేదోనని చిన్ని సంశయం వుండేది. కాని ఇక్కడికివచ్చాక, మీ అందర్నీ చూసాక, మీలో ఒకడిగా నిలిచాక నా సంశయం తీరిపోయింది. యూనిటీఈజ్‌ ది బెస్ట్‌ వే టు విన్‌ ది మార్కెట్‌, మార్కెట్‌ను జయించాలంటే సంస్థలో అందరి మధ్య ఐక్యత, అవగాహన ఎంతో అవసరం, అది మనమధ్య పుష్కలంగా వుందని భావిస్తున్నాను. అంటూ క్షణం ఆగాడు.

అంతే

ఒక్కసారిగా హల్లో కరతాళధ్వనులు మారుమోగాయి. ఉత్సాహం పట్టలేక చివరిగా వున్న సభ్యుల్లో ముగ్గురు బిగ్గరగా వినోద్‌ సాబ్‌ జిందాబాద్‌ అనరిచారు.

''అంత వద్దు బ్రదర్స్‌, మీరు ప్రశాంతంగా వుంటే నా ప్రసంగం ముందుకు సాగుతోంది'' అన్నాడు నవ్వుతూ త్రివిక్రమ్‌.

ముందు వరసలోని వరేణ్య తనవంక ప్రత్యేకించి చూడటం గమనించాడు. అతడిలో ఉత్సాహం పొంగింది. తిరిగి తన స్పీచ్‌ని కంటిన్యూ చేసాడు.

''ఇంతకుముందే మన మేనేజరుగారు చెప్పారు. మనకి సమస్యలున్నాయి. మార్కెట్‌లో పోటి పెరిగింది. సేల్స్‌ తగ్గుతున్నాయి అవి. యస్‌... సమస్యల్ని మనం సవాళ్ళుగా తీసుకోవాలి. మార్కెట్‌తో పోటీ పడాలి. మన సేల్స్‌ను పెంచుకోవాలి. ఇవి జరగాలంటే చేతులు ముడుచుకూర్చుంటే జరగవు. శ్రమపడాలి. మేథస్సును వుపయోగించాలి. అందరూ అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతులు కాలేరు. కాబట్టి ఆయా రంగాల్లోని ప్రతిభావంతుల సేవలు మనం ఉపయోగించుకోవాలి.

మన్నికైన, నాణ్యమైన, శ్రేష్టమైన వస్తువును ఉత్పత్తిచేసినవాడు గొప్పవాడయితే, ఆ వస్తువును లాభానికి విక్రయించినవాడు అంతకన్నా గొప్పవాడు నా దృష్టిలో, కాబట్టి మన సేల్స్‌ ఎగ్జిక్యూటీవ్‌ సీనియర్‌ సేల్స్‌  గ్జిక్యూటీవ్‌ అంతా యిక్కడే వున్నారు. అవునో కాదో చెప్పమనండి. పనికిరాని వస్తువును కూడా పదిరూపాయలకు అమ్మగలిగిన వాడే సేల్స్‌మేన్‌, అంచేత ఇప్పుడు మన ముందున్న ప్రధాన సమస్యలు మూడింటిని అధిగమించాలంటే ఏం చేయాలో... ఏంచేస్తే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం'' అంటూ మరోసారి చెప్పటం ఆపాడు.

హాలు మొత్తం నిశ్శబ్దంగా వుంది.

అంతా కూతూహలంగా ఎదురుచూస్తున్నారు.

వెంటనే తిరిగి ఆరంభంచకుండా మరికొద్దిసేపు ఆగాడు, అతడి అంతరాత్మ మరోసారి సీన్‌లోకి వచ్చింది.

''ఏం కోస్తున్నావ్‌రా కోతలు... చిన్న చిన్న పందాలు కాచి డబ్బులు సంపాదించటం అనుకున్నావా? వ్యాపారం బాబూ. కోట్ల వ్యాపారం. నీకేం తెలుసని? ఓరల్‌గా  ఏవో నాలుగు మాటలు చెప్పేస్తే చాలదు. కుడితిలో పడ్డ ఎలకలా గింజుకోవటంకన్నా నైస్‌గా తప్పించుకొని నీ దారిన నువ్వు వెళ్ళిపోవటం బెటర్‌. జైల్లోంచి పారిపోయినవాడివి ఇక్కడినుంచి పారిపోవటం నీకో లెక్కా?'' అంటూ సూచించింది.

మరోసారి అంతరాత్మ పీక నొక్కేసాడు.   

తిరిగి తన స్పీచ్‌ కంటిన్యూ చేసాడు.

''మనదైనందిన జీవితంలో అయిదోనంబరుకు ఒక ప్రత్యేకతవుంది. అయిదు అంశములు కలిసినదిగాబట్టి పంచాంగం అన్నారు. అయిదుగురు పెద్దలచే నిర్వహించేది గాబట్టి పంచాయితీ అన్నారు. అయిదుచోట్ల వెలిసిన శివలింగాలను పంచారామమన్నారు. అయిదు ఒక విశిష్ఠమైన సంఖ్య అందుకే మన నవభారత నిర్మాత అయిన నెహ్రూగారు పంచశీలను అందించి శాంతిమార్గం చెప్పారు.

దేశ పురోగతి పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేసారు. కాబట్టి మన కంపెనీ పురోగతికి అయిదు మార్గదర్శక సూత్రాలను చెప్పాలనుకుంటున్నాను.

వీటిలో మూడు మార్కెటింగ్‌కి సంబంధించినవి. రెండు మన విశాఖ బ్రాంచి కోసం.

జలందర్‌, లూధియానా, ఢిల్లీ మొదలయిన ప్రాంతాలనుంచి క్వాలిటీ లేని తక్కువరకం ఆటో స్పేర్‌పార్ట్స్‌ మార్కెట్లోకి వచ్చి మన సేల్స్‌ను దెబ్బతీయటం మనకున్న ప్రధానసమస్య కాగా, ఇతర కంపెనీల నుంచి ఎదురయ్యే పోటీ మనకున్న రెండో సమస్య, అవునా కాదా...?'' సూటిగా సభ్యుల్ని ప్రశ్నించాడు.

''అవును'' అనరిచారు కొందరు.

''ఇప్పుడు మొదటిసూత్రం చెప్తాను. నాణ్యమైన ఒక వస్తువు ఖరీదు వందరూపాయలనుకుందాం. అదే నాణ్యతలేని, డూప్లికేట్‌ వస్తువు ధర ఏభై రూపాయలనుకుందాం. సహజంగా నాణ్యత గురించి ఆలోచించకుండా పనిజరిగితే చాలనుకునే వినియోగదారుడు ఏభైరూపాయల వస్తువునే కొంటాడు. ఎందుకంటే సగానికి సగం తేడా వుంది కాబట్టి.

అదే మరో ముప్పైరూపాయలు పెడితే అంటే, ఎనభైరూపాయలకే మంచి వస్తువు దొరుకుతున్నప్పుడు అతడి ఆలోచనల్లోమార్పు వస్తుంది. ఎలాగూ ఏభైరూపాయలు పెడుతున్నాం. మరో ముప్పై వేసుకుంటే మంచి వస్తువే వస్తుందికదాని మంచిదే కొంటాడు. ఇది మానవ స్వభావం.  సో... సెకండ్‌క్వాలిటీ సేల్స్‌ బెడదను వదిలించుకోవాలంటే మన లాభాల్లో కొంత తగ్గించుకుని రేటు తగ్గించాలి. దీనివల్ల మనపోటీదారులకూ గట్టి పోటీ యిచ్చినట్లుంటుంది. సేల్స్‌ గణనీయంగా పెరుగుతాయి. ఇది మొదటిసూత్రం.

ఇక రెండో సూత్రం వుంది. మన ప్రొడక్ట్స్‌ గురించి మనం యిచ్చే పబ్లిసిటీలున్నాయి. వాటిలో మన నాణ్యత ఒక్కటేచెప్తే చాలదు, నాణ్యతలోపించిన స్పేర్‌పార్ట్స్‌ వాడకం వలన ఇంజనుకు భద్రత, ప్రయాణంలో నిశ్చింత వుండవని తెలిపే స్లోగన్స్‌ వుండాలి. మంచి స్పేర్‌పార్ట్స్‌ ఇంజన్‌కు, వాహనానికి లాంగ్‌లైఫ్‌నిస్తాయని మన వినియోగదారులకు తెలియచెప్పాలి పబ్లిసిటీల్లో మార్పులు తీసుకురావాలి.

ఇక మూడో సూత్రం రోగులకు మందులకు మధ్యన అనుసంధానమైన వ్యక్తి డాక్టరు,  డాక్టర్‌ ఏ కంపెనీ మందులు వాడితే ఆ కంపెనీలు లాభపడతాయి. అలాగే ఆటో ఇండస్ట్రీస్‌లో కీలకమైనవాళ్ళు ఆటోగేరేజ్‌ వర్కర్లు, ఓనర్లు వాళ్ళకి మన ప్రొడక్ట్స్‌మీద సరయిన అవగాహనేకాదు, మన కంపెనీమీద గుడ్‌విల్‌ వుండేలా చర్యలు తీసుకుంటే వాళ్ళు మన స్పేర్‌పార్ట్స్‌నే రికమెండ్‌చేస్తారు. మన ప్రొడక్ట్స్‌నే వాడతారు. కాబట్టి అప్పుడప్పుడూ ఇక్కడిగారేజీ వర్కర్లు, ఓనర్లతో వర్క్‌షాప్స్‌ నిర్వహించి పారితోషికాలు అందించాలి. దీనికి ఖర్చవుతుంది, అలాగే లాభాలు వుంటాయి. ఈ మూడు సూత్రాలు మార్కెట్‌కి సంబంధించినవి.

ఇక చివరి రెండు సూత్రాలగురించి చెప్తాను. ఇవి మన విశాఖబ్రాంచి అంతర్గత వ్యవహారాలకు సంబంధించింది, వాటిలో మొదటిది కీలకమైన శాఖల్లో వుండి, సరిగా పనిచేయనివారిమీద తగినచర్యలు తీసుకోవటం.

ఇక రెండోది మార్కెటింగ్‌ లైన్‌లో చురుకయివాళ్ళని నియమించటం, ఇలా అయిదు సూత్రాల పథకాన్ని అమలుచేస్తే మనకున్న ప్రధాన సమస్యలనుంచి బయటపడి, లాభాల బాటలో ముందుకుపోవచ్చు. ఇక మీ డౌట్స్‌ ఏమన్నా వుంటే అడగండి రేపటి సమావేశంలో ఇప్పుడు నేను చెప్పిన పంచసూత్రాలను ఎలా ఇంప్లిమెంట్‌ చేయాలో చర్చిద్దాం'' అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు త్రివిక్రమ్‌.

అంతే

 

(... ఇంకా వుంది)

 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
agent ekamber