Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Destiny Short Film

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీ యోధుడు శ్రీ ఆలూరి భుజంగరావు గారు - టీవీయస్. శాస్త్రి

sahithee yodhudu shree aaloori bhujangaraavu garu

శ్రీ రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ పురస్కారం లభించిన సందర్భంలో, ఆయనకు అత్యంత సన్నిహితుడు, గుంటూరులోనే నివసిస్తున్న శ్రీ ఆలూరి భుజంగరావు గారిని కలసి అనాటి జ్ఞాపకాలను గురించి అడిగాను. నాకున్న సందేహాన్ని ముందుగా శ్రీ ఆలూరిని నిర్మొహమాటంగా అడిగి తెలుసుకున్నాను. అదేమిటంటే, 'నిజానికి పాకుడురాళ్ళు నవలకు, అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించే అర్హత ఉందా? అంతకన్నా గొప్ప గ్రంధాలు తెలుగులో లేవా?´ అని. అందుకు శ్రీ ఆలూరి, ´ఆకలి, అవిద్య, అవమానాలు, దారిద్ర్యం లాంటి అష్ట కష్టాలు పడిన ఒక సామాన్యుడు అసమాన్యుడిగా ఎదిగాడు. కష్టాల కొలిమిలో నుంచి బయల్పడిన మేలిమి వజ్రం మా బావ భరద్వాజ. ఈ బూర్జువా ప్రభుత్వాలు, సంస్థలు అలాంటి వారిని కూడా సత్కరిస్తాయని నేను కలలో కూడా ఊహించలేదు. జీవితానుభావలను రంగరించి నెత్తురుతో,ధైర్యంగా వ్రాసిన నవల పాకుడురాళ్ళు. అటువంటి నవల, అది వ్రాసిన మహర్షి భరద్వాజ ఆ పురస్కారానికి పూర్తి అర్హులు. అందులో ఏమాత్రం సందేహం లేదు.´ అని ఆయన చాలా ఆనందంగా,గర్వంగా చెప్పారు. ఆ సత్కారం ఆయనకే లభించినంత ఆనందంగా ఉన్నారాయన! ఇంతలో చెన్నై నుండి శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు ఫోన్ చేసి, వారిని భరద్వాజ గారిని గురించిన కొన్ని విశేషాలను అడిగి తెలుసుకున్నారు.

ఒకే సమయంలో ముగ్గురు స్నేహితులు అయిన శ్రీ  ఆలూరి, ´శారద,´ భరద్వాజ గార్లు తెనాలిలో కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తు, అద్బుతమైన సాహితీసేవను కూడా చేసారు. వారిలో ఆలూరి,శారద (వీరిని గురించిన నా రచన తెలుగు వికీలో ప్రచురితమయ్యింది, దానిని మీ కోసం గతంలోనే అందచేసాను.) హోటల్ కార్మికులుగా పనిచేసారు. యజమానులు డబ్బులివ్వటం ఎగవేస్తే, తిరుగుబాటుచేసి - వారిచేతుల్లో తన్నులు తిన్నారు. శారద అతి చిన్నవయసులోనే దుర్భర దారిద్ర్యంతో, మూర్ఛ వ్యాధితో తన సాహితీయాత్రను ముగించి ఈ పాడులోకాన్ని వదలి వెళ్ళాడు. భరద్వాజ ఎన్నో పనులుచేసి(పొలంలో కూలీ పనులతోసహా), ఒకదశలో´ఆకాశవాణి´లో చేరి, జీవితంలో స్థిర పడ్డారు. శ్రీ ఆలూరి భుజంగరావు గారు మాత్రం తను నమ్మిన విప్లవ సిద్ధాంతాలకే కట్టుబడి, జీవితాంతం కష్టాలనే అనుభవించాడు. ఇద్దరు అల్లుళ్ళు encounter లో చనిపోయారు. ఈయన కూడా చాలాకాలం అజ్ఞాతంలోనే ఉన్నాడు. మరణించేటంతటి వరకు కూడా ´విరసం´సభ్యుడే! శ్రీ ఆలూరి భుజంగరావు గారిని గురించి, వారి సాహితీ యాత్రను గురించి తెలుసుకుందాం!

ఈయన 1928 లో గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర కొండముది గ్రామంలో పుట్టారు. తల్లి సీతారామమ్మ తండ్రి వెంకటప్పయ్య.ఆయన జీవితం ఎక్కువగా తెనాలి, గుడివాడలలో గడిచింది. వీరు అనువాద రచయితగా ప్రసిద్ధి చెందారు. భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్, సుఖదేవ్, మరెంతమందో దేశభక్తులతో కలసి పని చేసినటువంటి శ్రీ యశ్ పాల్ గారు రచించిన స్వాతంత్ర్య పోరాట గాధ 'సింహావలోకన్'ను తెలుగులో చక్కగా అనువదించారు. అంతేగాక, అనేక రాహుల్ సాంకృత్యాయన్ రచనలను తెలుగులోకి అనువదించారు. వీరు చాలాకాలం రాజకీయాల్లో ఉన్నారు. అనేకసార్లు అరెస్ట్ అయ్యారు. ఈయన గాంధీ వాదం - శవపరీక్ష అనే గ్రంధాన్ని వ్రాసారు. ఇది కమ్యూనిస్టు సిద్ధాంతం మీద, గాంధీయిజం మీద పూర్తి విమర్శనాత్మక గ్రంధం. శ్రీ ఆలూరి పారదర్శి, పెద్దన్న, చక్రధర్, జనార్దన్ కలం పేర్లతో చాలా రచనలను చేసారు. చాలా కథలు వ్రాసారు. అవన్నీకలిపి ´అరణ్యపర్వం´ పేరిట కథా సంకలనంగా వెలువడింది. ´సాహిత్యబాటసారి´ పేర శారద జీవిత చరిత్రను వ్రాసారు. అంతేగాక, ప్రేమ్ చంద్ ( రంగభూమి,గబన్), కిషన్ చందర్ (వాయుగుండం, పరాజయం) తెలుగులోకి అనువదించారు.

ప్రభాత్ అనే హిందీ పత్రికను 6 సంవత్సరాలు నడిపారు. హోటళ్ళలో వెట్టిచాకిరి చేసి ఉపాధ్యాయుడయ్యాడు. హోటల్ కార్మికుడిగా పనిచేసేటప్పుడే వీరికి శారదతో పరిచయం అయింది. ఆ పరిచయమే, తదుపరి రోజుల్లో, శారదను సుప్రసిద్ధ రచయితగా మార్చింది. శారద, భరద్వాజ, ధనికొండ హనుమంత రావు గార్లతోటి స్నేహాన్ని, పరిచయాలను నెమరువేసుకుంటూ, ´స్మృతి శకలాలు´ అనే గ్రంధాన్ని వ్రాసారు. రావూరి భరద్వాజ వీరిని ప్రేమగా ´బుజ్జీ´ అని పిలుస్తుంటారు. చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగాన్ని ముందస్తుగానే విరమించి అజ్ఞాతంలోకి వెళ్లారు. చాలాకాలం తర్వాత మళ్లీ జనజీవన స్రవంతిలోకి వచ్చేసారు. కొంతకాలం బెంగుళూరులో కుమారుడి వద్ద ఉన్నారు. జీవితమంతా విప్లవపోరాటాలు చేసి అలసిసొలసిపోయిన ఈ కమ్యూనిస్టు యోధుడు 20-06-2013న గుంటూరులో తుది శ్వాస వదిలాడు.
 

విప్లవమే జీవితంగా బతికిన ఈ సాహితీ యోధునికి నా ఘనమైన నివాళి! లాల్ సలాం!!

మరిన్ని శీర్షికలు
paryaatakam pattani prabhutvaalu