Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
o college drop out gadi prema katha

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐ ఎ స్ పాస్

kittugadu inter fail ias pass

తెల్లవారింది

కిట్టు లేచి, బిగ్గరగా గొంతెత్తి పాడటం మొదలుపెట్టాడు.

తెల్లవారెను,

కోడికూసెను,

కోమటెంకం పేడకెళ్ళెను,

ఎద్దు తన్నెను

ఉట్టి పగిలెను

రమ్యమైనది రామనామము

రామనామము, రామనామము

రమ్యమైనది రామనామము...

జ్యోతిలక్ష్మీ, జయమాలిని...

రామనామము... రామనామము...

చూడా చక్కాని చిన్నాదున్నది... ఏమిసేతునో దైవమా...

రామనామము... రామనామము...

కమలాకర్ కి చిర్రెత్తుకొచ్చింది.

ఎహే! మూసుకో... పొద్దున్నే పెద్ద గొంతుకతో దరిద్రం మాటలూ, దరిద్రం పాటలూ... అన్నాడు.

అరే! నేను పాడేది రాముడి గురించేకదా! తప్పేముంది!

భక్తి, భక్తితో పాటు ముక్తి... అన్నాడు కిట్టు.

 ముక్తి కాదు, ఖచ్చితంగా నరకానికి పోతావ్. అన్నాడు కమలాకర్.

ఇద్దరూ కలిసి ఆఫీస్ కి వెళ్లారు. లంచ్ ఎప్పుడౌతుందా అని ఎదురు చూస్తున్నాడు కిట్టు.

లంచ్ తర్వాత రాధాకృష్ణ ఎప్పటిలాగే వచ్చాడు. సమయం వృధా చెయ్యకుండా కిట్టు వెంటనే అన్నాడు. సార్! నాకు కొన్ని సందేహాలున్నాయి మీరు తీర్చాలి సార్...

ఫరవాలేదు అడగండి... నాకు తెల్సినంత వరకూ చెపుతాను అన్నారాయన.

మీరు ఎం.బీ.బి.యస్ డాక్టర్ కదా! ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఎలా వచ్చారు?

"డాక్టరయితే చేసేది ప్రజాసేవ. ఈ డిపార్ట్ మెంట్ కూడా గవర్నమెంటే... గవర్నమెంట్ అంటేనే ప్రజాసేవ అదీ ఉద్యోగమే, ఇదీ ఉద్యోగమే మనిషికి జీతం కావాలి. అటు ప్రజాసేవ చేసిన తృప్తి కావాలి.

ఐతే మీ మనసులో ఉన్న మాట ఏమిటంటే రోగుల్ని నయం చేయవచ్చు కదా డాక్టరయ్యుండి అని....

అది కరెక్టే... కానీ, నా ఇష్ట ప్రకారం నేను ఈ వృత్తి ఎంచుకున్నాను" అన్నాడాయన.

మీరు అసిస్టెంట్ కమీషనర్ ఎలా అయ్యారు?

"సివిల్ సర్వీసెస్" పరీక్ష రాసాను, పాసయ్యాను.

మీరు ఇప్పుడు ఐ.ఆర్.ఎస్ కదా?

ఔను.

ఐ.ఆర్.ఎస్ పరీక్ష రాయలేదా?

ఐ.ఆర్.ఎస్ అనే పరీక్ష లేనేలేదు.

ఐ.ఎ.ఎస్ పరీక్ష రాయలేదా?

ఐ.ఎ.ఎస్ పరీక్ష లేనేలేదు.

"అదేంటి? మోహన్ బాబు, భానుచందర్ లు ఐ.ఎ.ఎస్ పరీక్ష పాసయ్యి కలెక్టర్ లయ్యారు. ఐ.పి.ఎస్ పరీక్ష రాసి విజయశాంతి 'పోలీసాఫీసర్' అయ్యి, అందరిని చితకబాదేసింది.

నాక్కూడా ఐ.పి.ఎస్ అయ్యి రౌడీలను తన్నుకుంటూ లాక్కెల్లాలని ఉంది...

మీరేమో అలాంటి పరీక్ష లెవీ లేవంటున్నారు"

ఎకసెక్కంగా కాకుండా చిన్నగా మృదువుగా మందహాసం చేశారు రాధాకృష్ణ.

ఆ తర్వాత అన్నారు.

మీరు తెలుగు చినిమాలు బాగా చూస్తారనుకుంటాను.

ఔను సర్, స్కూలు ఎగ్గొట్టి, కాలేజి ఎగ్గొట్టి మరీ చూసేవాడిని అన్నాడు కిట్టు.

అది అర్ధమౌతూనే ఉంది. కొంచెం జాగ్రత్తగా వినండి.

ఐ.ఏ.ఎస్ కో పరీక్ష, ఐ.పి.ఎస్ కో పరీక్ష, ఐ.ఆర్.ఎస్ కో పరీక్ష అంటూ ఏమీ స్పెషల్ గా లేవు. అన్నింటికీ కలిపి ఒకే ఒక పరీక్ష ఉంటుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే ఇరవైకి పైగా సర్వీసులకు కలిపి అంటే - పోలీసు, రెవెన్యూ, ఫారిన్, పోస్టల్, రైల్వే, డిఫెన్స్, ఆడిట్, అడ్మినిస్ట్రేషన్ (మీరనుకున్న ఐ.ఏ.ఎస్), అకౌంట్స్, ఇన్ఫర్మేషన్ - అన్నింటికీ ఒకే ఒక పరీక్ష ఉంటుంది. దానినే "సివిల్ సర్వీసెస్" బ్రాకెట్లో ఐ.ఏ.ఎస్ పరీక్ష అంటారు. తెలియని వాళ్లు తమకు తోచినట్లుగా ఏదేదో అంటుంటారు. తెలిసిన వాళ్లు సింపుల్ గా సివిల్ సర్వీస్ ఇంకా సింపుల్ గా "సివిల్స్" అంటారు. ఈ పరీక్షని నిర్వహించేది ఒక ప్రభుత్వ సంస్థ. దాని పేరు "యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్". ప్రతీ ఏడాది ఈ కమీషన్ దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తుంటుంది. ఈ కమీషన్ ను అంత పెద్ద పేరుతో పిలవకుండా "యూపీఎస్సీ" అంటారు. ఓపిగ్గా వివరించారు రాధాకృష్ణ.

మరి మీరు ఈ ఒకే ఒక పరీక్ష పాసయ్యారుగా కలెక్టరవలేదా? ప్రశ్నించాడు కిట్టు.

మంచి ప్రశ్నే అడిగారు.

ఈ 'సివిల్స్' పరీక్ష దేశవ్యాప్తంగా దరిదాపు 3 లక్షలమంది రాస్తారు. ఈ 3 లక్షల మందికి ఇచ్చేటన్ని కలెక్టర్ పోస్ట్ లు, ఎస్పీ పోస్టులు లేవు. అదీ కాక, ఇంతమంది రాస్తున్నారంటే పోటీ చాలా ముమ్మరంగా ఉంటుంది. అందుకని, అప్లికేషన్ పెట్టే సమయంలో నీకే సర్వీస్ ప్రధమంగా కావాలనుకుంటున్నావు? ఒకవేళ అది రాకపోతే తరువాత ఇంకేమి సర్వీసుకు వెళ్తావు? ఈ తర్వాత... ఆ తర్వాత... ఇలా అడిగుతారు. అందరికంటే ఎక్కువ మార్కులు సాధించిన విజేతకు అతను కోరుకున్న సర్వీసు వస్తుంది. అలా మన మార్కులను బట్టి, మనం కోరుకున్న సర్వీసులు లభిస్తాయి. తక్కువ మార్కులు తెచ్చుకుని, కాదూ, కూడదూ, నాకు ఐ.ఏ.ఎస్ కావాలి, ఐ.పీ.ఎస్ కావాలి ఇంకేమీ వద్దు అంటే నీ మార్కులను బట్టి నీ కోరిక మేరకు వచ్చే సర్వీసు వేరే వాళ్లకి ఇచ్చేసి, నిన్ను మరుసటి సంవత్సరం రాసుకోండి 'ఆల్ ది బెస్ట్' అంటారు.

అర్ధం కాలేదు సార్.

సరే!

మీరు పరీక్ష పాసయ్యారని, ఒక ర్యాంకు తెచ్చుకున్నారని అనుకుందాం, మీకు ఏ  పోస్టు కావాలి?

"కలెక్టర్..."

మీకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నవాడు అది పట్టుకుపోయాడు...

మీకివ్వడం కుదరదు ఇంకేమన్నా పోస్టు కావాలా?

"ఎస్పీ..."

'అదీ కుదరదు. వేరే వాడు ఎత్తుకెళ్లిపోయాడు"

"ఫారిన్ సర్వీస్ ఇప్పించండి. రాయబారిగా అమెరికా వెళ్లి న్యూయార్క్ చూడొచ్చు, ఫ్రాన్స్ వెళ్లి, ఈఫిల్ టవర్ చూడొచ్చు. స్విట్జర్లాండ్ అందమైన నగరమంట అది చూడొచ్చు.

ఆపు... ఆపు... నీలిస్ట్... కెన్యా వెళ్లొచ్చు, నైజీరియా వెళ్లొచ్చు" ఇధియోపయా కూడా వెళ్ళచ్చు.

అక్కడ బతికున్న మనుషుల్ని పీక్కుతినే వాళ్లని కలవచ్చు. ఆఫ్ఘనిస్థాన్ లో బాంబు పెట్టి మనుషుల్ని ముక్కలు ముక్కలు చేసే వాళ్లని చూడవచ్చు. "ఫారిన్ సర్వీస్ కూడా నీకు రాదు"

తర్వాత?

సరే సార్! మీకు లాగా ఇన్ కమ్ టాక్స్ కమీషనర్ ని చేసేయండి.

కుదరదు.

ఏదడిగినా రాదంటున్నారు. ఇది చాలా అన్యాయం! ఏం లేదు, మీకు అర్ధం కావాలని చెబుతున్నాను. ఈ సివిల్స్ పరీక్ష రాసే వాళ్లలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇంకాపైకి పోతే జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, బెంగాల్, అస్సాం, మేఘాలయ... ఇలా ప్రతీ రాష్ట్రం నుండి 'మేకుల్లాంటి' వాళ్ళుంటారు. వాళ్ళందరితో పోటీ పడి, ఈ సివిల్స్ పరీక్షలో నెగ్గి, ఏదో ఒక పోస్ట్ సంపాదించడం, ఎంతో కష్టమైన విషయం. ఈ పోటీలో మనకు వచ్చిన మార్కుల్ని బట్టి, మనం కోరుకున్న సర్వీస్ వస్తుందో, రాదో నిర్ణయించబడుతుంది...

తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడుంటాడు. అలాగని పాసుకావడం అసంభవం కాదు.

అసంభవం ఐతే ప్రతిఏటా కొన్ని వందలమంది (వేలమంది కాదు) ఎలా పాసౌతారు?

ఐ.ఏ.ఎస్ రావడం అసంభవమైతే మన రాష్ట్రంలో ఇంతమంది ఐ.ఏ.ఎస్ లు ఎలా ఉన్నారు? ఏదీ అసంభవం కాదు. కొంచెం చెమటోడ్చాలి అంతే!

సార్! ఏమనుకోనంటే ఒక మాట అడుగుతాను....

అడగండి....

ఈ పరీచ్చలు,ఇంటర్వ్యూలు అంతా బోగస్ సార్! ఉద్యోగాలు అమ్మేసుకుంటారు. యాభై లచ్చలకి ఐ.ఏ.ఎస్ అమ్ముతారని విన్నాను. మీ ఐ.ఆర్.ఎస్ కి పాతిక లచ్చలు ఇచ్చుకుంటారు మీరు.

హ్హ... హ్హ... హ్హ... ఈసారి కొంచెం పెద్దగా నవ్వారు రాధాకృష్ణ ఇలా చాలా మంది అనుకుంటారని నాకూ తెలుసు. మిగిలిన సంస్థల గురించి నాకు తెలియదు గానీ, ఈ యూపీయస్సీ ఎంత గొప్ప రికమెండేషన్ అయినా తీసి పక్కన పడేస్తుంది. డబ్బు అనే ప్రశ్నే లేదు.

ఈ యూపీయస్సీ ఎవరు సార్?

ఇందాక నేను చెప్పినప్పుడు సరిగ్గా వినలేదు మీరు. 'యూపీయస్సీ' అనే ప్రభుత్వ సంస్థ మీరు అనుకునే 'ఐ.ఏ.ఎస్' పరీక్ష నిర్వహిస్తుంది.

ఔనౌను సార్ గుర్తొచ్చింది... 'యూపీయస్సీ' 'సివిల్స్' నిర్వహిస్తుంది...

కరెక్ట్... ఇప్పుడు సరైన మార్గంలోకి వచ్చారు మీరు! ఇక నా విషయానికొస్తే "అర్ధరూపాయి" కూడా నేను ఎవరికీ ఇవ్వలేదు. నేనే కాదు ఈ 'సివిల్స్' నెగ్గిన వాళ్ళెవరూ ఎవరికీ 10 పైసలు కూడా ఇవ్వలేదని ఖచ్చితంగా చెప్పగలను.

"సార్ మీ నాన్నగారు మినిస్టరో... కలెక్టరో, లేదా ఏదో గొప్ప మనిషై ఉంటారు. అందుకనే మీరు సెలెక్టయ్యారు. చిన్న చిన్న వాళ్ల పిల్లల్ని పాస్ చెయ్యరంట కదా? ఏదో వంకతో ఇంటికి పంపిచేస్తారంట. ఎంత తెలివైనవారయినా సరే!"

"చాలా మంచిమాట చెప్పారు... మా నాన్నగారు కాలేజీ ప్రిన్సిపాల్... ఉన్నతమైన వ్యక్తి...

కానీ మీరనుకుంటున్నట్టుగా మినిష్టర్ లెవల్ కాదు ఒక సాధారణమైన వ్యక్తే" "నాకు చాలామంది మిత్రులున్నారు 'సివిల్స్'పాసైన వాళ్లు. వాళ్ల తండ్రుల్లో రాళ్లు కొట్టేవాళ్లు, కూలీపని చేసుకునే వాళ్లు, ఇలా అతి చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్లున్నారు" దీనికి మీరేమంటారు?

ఔనా సార్? నిజంగానా?

మీకు అబద్ధం చెబితే నాకేమొస్తుంది చెప్పండి?

"సార్... సార్ మీరు గోల్డ్ మెడలిస్టా?"

"గోల్డ్ మెడలిస్ట్ లకూ, కాలేజి టాపర్ లకు చిన్నప్పట్నుంచీ ఇంగ్లీష్ లో గడగడా మాట్లాడుతూ, ఒకటో తరగతి నుండి చివరిదాకా, వందకు వంద మార్కులు తెచ్చుకున్న వాళ్లకు మాత్రమే సర్వీసులొస్తాయంట, తెలుగు మీడియం వాళ్లని మెడబట్టి గెంటేస్తారంట, కాన్వెంటు వాళ్లు మాత్రమే నెగ్గుతారంట"

నేను గోల్డ్ మెడలిస్ట్ ని కాదు... కాలేజి టాపర్ ని కాదు... గోల్డ్ మెడలిస్ట్ అయివుండి 'సివిల్స్ లో ఫెయిల్ అయిన వాళ్లున్నారు. ఇంగ్లీషు లో గడగడా మాట్లాడుతూ, అమెరికా, ఇంగ్లాండు దేశాల్లో చదువుకుని మళ్లీ మనదేశం వచ్చి 'సివిల్స్' రాసి ఫెయిల్ అయిన వాళ్ళున్నారు. వందకి వంద మార్కులు చదువుల్లో సంపాదించిన వాళ్లు 'సివిల్స్' రాసి ఫెయిల్ అయిన వాళ్లున్నారు. వందకి వంద మార్కులు చదువుల్లో సంపాదించిన వాళ్లు 'సివిల్స్'లో సున్నాలు తెచ్చుకున్నారు. యూపీయస్సీ తెలుగు వాడిని తక్కువగా చూడదు. కాన్వెంటు వాడిని ఎక్కువగా చూడదు. యూపీయస్సీ ముందు అందరూ సమానమే. అది పెట్టే పరీక్షలో సరియైన సమాధానమిచ్చిన ప్రతివాడినీ అక్కున చేర్చుకుంటుంది. కావాలంటే తెలుగు మీడియంలో కూడా పరీక్ష రాయవచ్చు. తెలుగు మీడియంలో పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) కూడా చేయవచ్చు. నీలో ఉన్న సత్తా చూస్తుంది యూపీయస్సీ. తెలుగు మీడియం లో రాసి, పాసైన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. వర్షమొస్తే మునిగిపోయే ప్రభుత్వ ప్రాధమిక, ప్రభుత్వ ఉన్నత, పాఠశాల విధ్యార్ధులు ఎంతో మంది సివిల్స్ పాసయ్యారు. అలాగని గొప్పవాళ్ల బిడ్డలు పాస్ కారని కాదు. సత్తా చూపిన ప్రతివాడినీ "గొప్పవాడినీ, గొప్పవాడు కాని వాడినీ 'యూపీయస్సీ' గుర్తిస్తుంది."

సార్... ఈ కుంటోళ్లు, గుడ్డోళ్ళని 'సివిల్స్' లోకి రానివ్వరు కదా... సార్... కుంటుకుంటూ, గెంటుకుంటూ, కళ్ళు కనబడక, తడుముకుంటున్న వాళ్ళందరూ కలెక్టర్లు, కమీషనర్లు అయిపోతే అందరూ నవ్విపోతారు కదా... సార్...

వెంటనే రాధాకృష్ణ... కుంటోళ్లు, గుడ్డోళ్లు అనకూడదండీ... అన్నారు.

అదేనండీ... హ్యాండిక్రాఫ్ట్

హ్యాండిక్రాఫ్ట్... అంటే చేనేత వస్తువులు

అదేనండీ... హ్యాండి కేఫ్డ్...

హ్యాండీ కేఫ్డ్ అనకూడదండీ...

అరే! ఇంకేమంటాం... సార్...

ఫిజికల్లీ చాలెంజ్డ్... అనాలి.

ఎందుకలా?....

"ఎందుకంటే శారీరకంగా ఏదో ఒక రకమైన సవాలుని ఎదుర్కొంటున్నారు వాళ్లు. వాళ్లు ఆ శారీరక లోపాన్ని ఒక సవాలుగా అంటే ఛాలెంజ్ గా భావించి, కుంగిపోకుండా ముందుకు సాగాలి."

ఇక సివిల్స్ విషయానికొస్తే... వాళ్లూ మనుషులే కదా... వాళ్లకూ తెలివితేటలుంటాయి కదా... వాళ్ళూ రాయవచ్చు... పాసవ్వచ్చు... ఆఫీసర్లు కావచ్చు... ఎవ్వరూ వాళ్లని కాదనలేరు... ఆపలేరు సాక్షాత్తూ సుప్రీం కోర్టే చెప్పింది. 'బ్లైండ్' ఐనా సరే మంచి మార్కులొస్తే కలక్టర్ని చేసేయండి అని.

"అయితే ఇంకో విషయం ఉంది. రెండు కాళ్ళూ లేని వాడిని పోలీస్ ఆఫీసర్ చేసేస్తే, వాళ్లకీ ఇబ్బంది, పోలీసు పనికీ ఇబ్బంది.

అందుకని విధ్యార్ధి అంగవైకల్యాన్ని బట్టి ఏ పోస్ట్ ఇవ్వాలో కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు"

సార్... "ఈ గోల అంతా ఎందుకు? ఎంచక్కా ఎస్సీ, ఎస్టీ ఐతే ఏదో తూతూ మంత్రం మార్కులతో ఆఫీసరైపోవచ్చు కదా?

మీ మాటలు ఎస్సీ, ఎస్టీలకు అవమానకరంగా ఉన్నాయి.

అదే విధంగా యూపీఎస్సీకి కూడా అవమానకరంగా ఉన్నాయి.

ఏమీరానివాడు అని ఒక ఎస్సీ, ఎస్టీ ని అవమానిస్తున్నారు.

ఏమీ రాని వాడిని యూపీఎస్సీ ఆఫీసర్ చేసేస్తోందని, యూపీఎస్సీని అవమానిస్తున్నారు.

వెంటనే లెంపలు వేసుకున్నాడు కిట్టు.

మీరు లెంపలు వేసుకోవాల్సిందే... కానీ నేను చెప్పేది పూర్తిగా విన్నాక, అప్పుడు మనస్ఫూర్తిగా లెంపలు వేసుకోండి అన్నారు... రాధాకృష్ణ"

చెప్పండి సార్...

ఒక పల్లెటూరులో 'చెట్లు' ఎక్కే పోటీ పెట్టారనుకోండి... ఒకడు వంద చెట్లు ఎక్కాడు... వాడికి ఫస్ట్ ఫ్రైజ్... ఇంకొకడు తొంభై తొమ్మిది చెట్లు ఎక్కాడు... వాడికి సెకండ్ ఫ్రైజ్... ఇంకొకడు తొంభై ఎనిమిది చెట్లు ఎక్కాడు... వాడికి మూడో ఫ్రైజ్... మూడు ఫ్రైజులూ వెళ్ళిపోయాయి... ఆఖరిగా కన్సోలేషన్ ఫ్రైజ్ ఇస్తారు... అంటే బాధపడకు నాయనా నువ్వు కూడా బాగానే చేసావు అని ఇచ్చే ఫ్రైజ్ అది

'ఈ ఫ్రైజ్ మీరు అయితే ఎవరికి ఇస్తారు?'

'తొంభై ఏడు చెట్లు ఎక్కినవాడికి'

'ఎస్సీ, ఎస్టీ కదా అని మూడు చెట్లు ఎక్కినవాడికి ఇస్తారా?'

'ఇవ్వను'

'ఇదీ అంతే'

'పోటీ తీవ్రత చాలా బలంగా ఉంటుంది కాబట్టి, ఎస్సీ ఎస్టీ వాళ్లు కూడా 100 చెట్లు ఎక్కడానికే ప్రయత్నిస్తారు. ఒకవేళ 100 చెట్లు ఎక్కలేకపోయినా ఆ రేంజ్ లో తొంభై ఎనిమిది దాకా వస్తేనే ఎస్సీ ఎస్టీ వాడికి మోక్షం. లేకపోతే వాడిని కూడా 'మూటా, ముల్లే' సర్దుకుని పోరా బాబూ అంటారు.

అలాగే కొంతమంది ఎస్సీ, ఎస్టీకి చెందిన మూర్ఖులు... నాకేమిటిలే 'రిజర్వేషన్' ఉంది కదా! అనే ధీమాతో ఐ.ఐ.టీ అనే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసి, మెడబట్టి గెంటబడ్డారు. ఎస్సీ ఎస్సీల రిజర్వేషన్ సీట్లు వాళ్ళకే ఇవ్వాలి. వేరే వాళ్లకు ఇవ్వకూడదు సరే! అలాగని మంచి మార్కులు తెచ్చుకోనివాడిని మేము చేర్చుకోము 'చచ్చినా సరే' అన్నాయి ఐ.ఐ.టీ సంస్థలు'

మరేం చేస్తారు?

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
ajent ekambar