Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aditya hrudayam

సిరివెన్నెల పార్ట్ - 3

"ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన"

ఆడియో  క్యాసెట్ లో "సిరివెన్నెల" సినిమా పాట వింటుంటే, మయూరమంటే నెమలని తెలుసుగాని మయూఖమంటే ఏంటో తెలీలేదు. డిక్షనరీ  తిరిగేసాను.  కిరణమని తెలిసింది. అప్పుడు నేను ఏడు పూర్తయ్యి ఎనిమిదో క్లాసు లోకి ఎంటర్ అవుతున్నాను. మొదటి సారి "శంకరాభరణం" పాటలు రాసిన వేటూరి సుందరరామ్మూర్తి గారితో పాటూ సిరివెన్నెల సినిమా పాటలు రాసిన రచయితకి అభిమానినయ్యాను."ఈ గాలి, ఈ నేల. ఈ ఊరు, సెలయేరు.... నను గన్న నా వాళ్ళు... నా కళ్ళ లోగిళ్ళు....." ఈ పాట పాడుకుని, పాడుకుని పిచ్చెక్కి పోయాను. ఆ వేసవి సెలవుల్లో మా మేనత్తయ్య, మామగారు అనకాపల్లి తీసుకెళ్తే  వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళ పెద్దబ్బాయి మా సుబ్రమణ్యం బావ (నాకన్నా రెండేళ్ళు పెద్ద) వాళ్ళింటి ఎదురుగా టెలిఫోన్ ఎక్స్ చేంజ్  బైట నలుగురు నుంచుని సిగరెట్లు తాగుతూ కబుర్లు చెప్పుకుంటుంటే, నీ కాయన తెలుసా? అనడిగాడు బక్కగా, ఎక్కువ జుట్టున్న ఒక వ్యక్తిని చూపించి - తెలీదు అన్నాను. - సీతారామ శాస్త్రిగారని ఈ మధ్యే సిరివెన్నెల సినిమాకి పాటలు రాశారు. ఆయనదీ ఊరే. మా అమ్మకి, నాన్నగారికి ఫ్యామిలీ  ఫ్రెండ్స్ అన్నారు గర్వంగా. నా ఆనందానికి అవధుల్లేవు. వాళ్ళ గుమ్మం లోంచి కదల్లేదు నేను. శాస్త్రిగారు అక్కడ్నుంచి కదిలేదాకా. ఆయన వెళ్తుంటే చాలా దూరం ఆయన వెనకాలే పరుగులాంటి నడకతో అనుసరించాను. అప్పటిదాకే నేను సినిమాల్లోకి వెళ్ళాలని నిర్ణయం చేసుకోవడం వల్ల ఆయన్ని చూస్తే ఎవరో ఆత్మబంధువుని చూసినట్టు ఫీలింగ్.

మళ్ళీ చాలా ఏళ్ళ తరువాత చెన్నైలో భైరవద్వీపం సినిమా అప్పుడు ఆయన్ని కలవడమే. కానీ, నా ఎనిమిదోక్లాసుకి, డిగ్రీ అయ్యి సినిమాల్లోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చేనాటికి మధ్యలో శాస్త్రిగారు సినిమాల్లో చేసిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. త్రినేత్రులు, రుద్రవీణ, స్వాతికిరణం, శివ, గాయం, గులాబి, అనగనగాఒక రోజు, మనీ, క్షణక్షణం, అంకురం ఒకటేమిటి ఒక్కో సినిమాల్లో ప్రతీ పాట ఓ ఆణిముత్యం.- ప్రతీ పాట పాఠం లాగా కంఠస్థం - మనసంతా నువ్వే, నేనున్నాను, మనసు మాట వినదు, ఆట నా దర్షకత్వం లో శాస్త్రి గారు పాటలు రాసిన సినిమాలు "నేనున్నాను" రిలీజ్ అయిన తరువాత కొన్ని నెలలకి కావలిలో భామా కల్చరల్ అసోసియేషన్ నేషనల్ లెవల్ సింగింగ్ కాంపిటేషన్ పెడితే, ఫైనల్లో కొచ్చిన అమ్మాయిలందరూ  "నేనున్నాను" లో ని "ఏ శ్వాసలో చేరితే .." పాటనే పాడటం నేనిప్పటికీ  మరచిపోలేని థ్రిల్...

అనకాపల్లిలో ఓ చిరుద్యోగి కవితలు, కథలు రాసుకుంటూ తెలుగు సినిమా పాటల్లో మంచి సాహిత్యానికి చిరునామాగా మారిపోవడం ఒక రాత్రిలో జరగలేదు. ఆయన ఆత్మకథని ఆయన రాస్తే, చికెన్ సూప్ ఫర్  ది సోల్ కన్నా, పౌలో కోయిలో పుస్తకాలకన్నా, ఒక యోగి ఆత్మకథ కన్నా, సీక్రెట్ కన్నా,ఇన్ స్పైరింగ్ గా వుంటుంది. భాద్యతకి, భావజాలానికి మధ్య సంఘర్షణ  కుటుంబ జీవితానికి, క్రియేటివ్ ఫ్రీడంకి మధ్య సంఘర్షణ, ఆర్ధిక అవసరాలకి, ఆకలితో పెట్టే కవి వేడుకలకీ మధ్య సంఘర్షణ, మంచి పాటలు రాయడం కోసం త్యాగం చేసిన రాత్రులు, సుఖాలు, నిద్రలు, సరదాలు, ఆరోగ్యాలు, పండుగలు, పబ్బాలు, ఫంక్షన్లు.. .ఎన్నో వేలు.

ఐహికమైన చిరాకులోంచి బురదలో పుట్టిన పద్మం లాగా ఓ మంచి పాటని భావాత్మకంగా, నైతికవిలువలతో, కవితాత్మకంగా, గుత్తివంకాయలో కారం కూరినట్టూ, ప్రతీ పాట లోనూ కొంచెం కొంచెం  ఆత్మ కూరుకుంటూ వాటికి ఆయుష్షును పెంచే పనిచేస్తున్న మహానుభావులు శాస్త్రిగారు. ఒక స్థాయి వచ్చాక సిచ్యుయేషన్  డిమాండ్ ని బట్టి ఏదో ఓకటి ఇచ్చేసి నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు ఆయన. ఇవాళ్టికీ మొదటి పాట రాస్తున్నట్టే కష్టపడుతారు."మనసంతా నువ్వే" లో ప్రజావేదిక లాంటి సీను పరుచూరి వెంకటేశ్వర రావు గారితో డిస్కస్ చేసిన మేటరు వాయిస్ రికార్డ్ లో రికార్డ్ చేసి కాగితం మీద నేను, వీరూ పోట్ల, శ్రవణ్ రాస్తే పదిహేడు పేజీలు వచ్చింది. దాన్ని మళ్ళీ పరుచూరి వెంకటేశ్వర రావు గారు దిద్దితే పదకొండు పేజీలొచ్చింది. సీన్ చివర్లో ఉదయ్ కిరణ్ తూనీగా పాట పల్లవి హం చేసే ముందు శాస్త్రి గారితో మాట్లాడే మాటలే మూడు పేజీలొచ్చాయి. తన చిన్నప్పటి స్నేహితురాలు కనిపిస్తే ఎందుకు అతను చెప్పకుండా ఉంటాడో,ఎక్స్ ప్రే షన్  చిన్నప్పటినుంచి  అప్పటికే ప్రేక్షకులు చూసిన కథని మళ్ళీ డైలాగులో చెప్పడం. దీనికి పరుచూరి వెంకటేశ్వర రావుగారు ఎప్పుడూ వ్యతిరేకి. షూటింగ్ వైజాగులో జరుగుతోంది. చాలా స్పీడుగా ఆ ఎపిసోడ్ తీస్తున్నాను. వంకటేశ్వర్ రావు గారికి ఓ ఐడియా వచ్చింది. లంచ్ టైం లో సీతారామ శాస్త్రి గారిని కలిసి, ఈ ఉదయ్ కిరణ్ డైలాగే మూడు పేజీలు కలిపి ఒక పాటలో పల్లవిలో రావాలండీ... ఎలా రాస్తారు... అని పేపరిచ్చారు.

అరగంటలో ఆయన పల్లవి రాసిచ్చారు."ఆ చిన్నప్పటి స్నేహితుడిని ప్రేమికుడిగా మారుతాను.నా చిన్నప్పటి స్నేహితురాలని ప్రియురాలిగా మార్చుకుంటాను." ఇదేగా ఆ మొత్తాం డైలాగ్ మీ సాంగు... అన్నారు.పరుచూరి వెంకటేశ్వర రావు గారు ఆయనకి షేక్  హ్యాండ్ ఇచ్చి, నా వైపు తిరిగి అదే కవికి, రచయితకి తేడా. ఈయన కవి కాబట్టి అంత క్లుప్తం గా చెప్పారు.. అన్నారు.. ఇద్దరూ గొప్పవాళ్ళే .. కాని ఆ ఆరోగ్యకరమైన వాతావరణమే నా మొదటి సినిమానీ మీ అందరిచేతా అంత పెద్ద హిట్ చేయించిందని నేను నమ్ముతాను.

అప్పటికే పెద్ద రైటర్  అయ్యుండి కూడా శాస్త్రిగారు, ఆర్టిస్ట్ గా నేనెలా చెప్తే అలా చేసారు.. ఎంతో రెస్పెక్ట్ ఇచ్చారు నా ప్రొఫేషన్ కి. అది ఆయనలో ఇంకో సుగుణం. నా మనసంతా నువ్వే సినిమాకన్నా ముందే అమెరికా నుంచి ఒక ప్రొడ్యూసర్ నన్ను కో డైరెక్టర్ పెట్టుకున్నారని తెలిసి, సరైన నిర్ణయం.. ఏడాది తరువాత అతన్ని పెద్ద డైరెక్టర్ గా చూస్తావు..  అప్పుడు అతన్ని నువ్వు ఎఫర్ట్ చేయలేవు అని అభిమానం తో కూడిన జ్యోశ్యం పలికారట. బహుశా .. ఆయన నాలిక మీద నిత్యం  నడయాడే సరస్వతీ దేవే తధాస్తూ అని నన్ను ఏడాది లోపు దర్షకున్ని చేసినట్టుంది. ఆయన మరిన్ని మంచి పాటలతో పాటల పల్లకీ నగీషీలు దిద్దాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా జీవితాన్ని అనుభవించాలని, సంధర్భం లో విలువ లేకపోయిన, పాటతో సందర్భానికి విలువతెచ్చే మరెన్నో పాటలు ఆయన బాణీలో రాయాలని శిష్యుడిగా మానస పుత్రుడిగా మనస్పూర్తిగా భగవంతున్ని కోరుకుంటున్నాను...


మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
kotta sanniveshaalato may9th na sampoornesh mallee vastunnaadu